అందరూ బాగుండాలి అందులో నేనుండాలి మూవీ రివ్యూ

image.png

అలీ  ‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’ OTT మూవీ రివ్యూ
Emotional Engagement Emoji
 
👍
చాలా కాలం క్రితమే షూటింగ్ పూర్తి చేసుకున్న చాలా సినిమాలు రిలీజ్ డేట్స్, థియోటర్స్ దొరక్క…ఓటిటిలను ఆశ్రయిస్తున్నాయి. ఆ క్రమంలో అలీ హీరోగా వచ్చిన చిత్రం ఒకటి ఈ రోజు ఆహాలో రిలీజైంది. మళయాళంలో రూపొందిన వికృతి చిత్రంకు రీమేక్ గా రూపొందిన ఈ చిత్రం ఓటిటి ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకుంది. అసలు రీమేక్ చేసేటంత కంటెంట్, కథ సినిమాలో ఏముంది చూద్దాం.

కథేంటి
మూగ వ్యక్తి శ్రీనివాస‌రావు (న‌రేష్‌) మిడిల్ క్లాస్ ఎంప్లాయి. తన కష్టంతో కుటుంబాన్ని లాగుతూంటాడు.  కూతురిని గొప్ప ఫుట్‌బాల్ ప్లేయ‌ర్ చేయాల‌న్న‌ది అత‌డి ఆశయం‌. అయితే ఓ సారి కొడుకు ఆరోగ్యం బాగా లేక‌పోతే అత‌డితో పాటు  రెండు రోజులు హాస్పటిల్ లో  నిద్ర‌లేకుండా లేకుండా గడిపి తిరిగి తన ఇంటికి వస్తూంటాడు. ఆ  క్ర‌మంలో అలిసిపోయి మెట్రో ట్రైన్‌లో గాఢంగా నిద్ర‌పోతాడు. అయితే అనతి నిద్రపోయిన తీరు చూసి శ్రీనివాస‌రావును తాగుబోతుగా పొర‌ప‌డిన స‌మీర్ (అలీ) అనే వ్య‌క్తి అత‌డు ట్రైన్‌లో నిద్ర‌పోయిన ఫొటోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తాడు. ఆ ఫొటో వైర‌ల్ కావ‌డంతో శ్రీనివాస‌రావు వ్య‌క్తిగ‌త జీవితం మొత్తం త‌ల‌క్రిందుల‌వుతుంది. అంద‌రూ అత‌డిని తాగుబోతు అంటూ అవ‌మానిస్తుంటారు, శ్రీనివాస‌రావు ఉద్యోగం పోవ‌డ‌మే కాకుండా కూతురు ఫుట్‌బాట్ ఆట‌కు దూరం అవ్వాల్సివ‌స్తోంది. తాను చేయ‌ని త‌ప్పుకు శ్రీనివాస‌రావు ఎందుకు శిక్ష‌ను అనుభ‌వించాడు? సోష‌ల్ మీడియా పిచ్చితో త‌ప్పొప్పుల గురించి ఆలోచించ‌కుండా స‌మీర్ చేసిన ప‌ని శ్రీనివాస‌రావు జీవితంలో ఎలాంటి ఇబ్బందులు తీసుకొచ్చింది? త‌న త‌ప్పును స‌మీర్ ఎలా స‌రిదిద్దుకున్నాడు?  వంటి విషయాలు చుట్టూ తిరిగుతుంది ఈ సినిమా క‌థ‌.

ఎలా ఉంది
మొదటే చెప్పుకున్నట్లు మళయాళంలో సక్సెస్ అయిన వికృతికి ఇది  మక్కీ టు మక్కీ రీమేక్. షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది.  ఫైనల్ గా డిజిటల్ డీల్ సెట్ చేసుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ కథ లో ఆలీ  సౌథీ నుంచి వచ్చి సోషల్  మీడియా అంటే బాగా క్రేజ్ తో ప్రతీది సోషల్ మీడియాలో  షేర్ చేసే పాత్రలో కనిపించాడు. అతని పాత్ర చుట్టూనే తిరుగుతుంది. నిజ జీవిత సంఘటనలు ఆధారంగా రూపొందిన కథ ఇది. మళయాళంలో హాఫ్ బీట్ చిత్రాలకు అలవాటు పడిన వాళ్లకు ఇది అద్బుతంగా కనపడింది. కానీ మనవాళ్లకు ఇది ప్లేట్ మీల్స్ లా కనపడింది. దానికి తోడు  ఆలీకి ఈ వయసులో పాటలు, రొమాన్స్ ట్రాక్ పెడితే బాగోదు అని డైరక్టర్ ఆలిచంచకుండా చేసుకుంటూ పోయాడు. దానకి తోడు ఒరిజనల్ లోని స్క్రీన్ ప్లేని మార్చి, అవసరం లేని సీన్లు, అనవసరమైన  సాగదీసిన స్క్రీన్ ప్లేతో బోర్ కొట్టించేసారు. ఉన్నంతలో ఈ మధ్య హాట్ టాపిక్ గా మారిన నరేష్ పవిత్ర జంటగా కనిపించడం ఒకటే  స్పెషల్ గా అనిపిస్తుంది. మళయాలంలో … సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ వీడియో వ‌ల్ల ఓ సామాన్యుడు ఎలాంటి ఇబ్బందులు ప‌డ్డాడో హృద‌యాల్ని హ‌త్తుకునేలా సినిమాలో చూపించారు. సోష‌ల్ మీడియాను మంచి కోస‌మే ఉప‌యోగించుకోవాలి గానీ చెడు కోసం కాద‌నే సందేశాన్నిఆవిష్క‌రించారు ద‌ర్శ‌కుడు.  కానీ తెలుగులో అలా జరగలేదు.

టెక్నికల్ గా…
ఈ సినిమాకు టెక్నికల్ టీమ్ తన వంతు కష్టపడ్డారు. కానీ కంటెంట్ బలంగా లేకపోవటం, ప్రెజెంటేషన్ సరిగ్గా లేకపోవటంతో ఇబ్బందిపడింది. రాకేష్, భాస్కర్ ల సంగీతం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయి. మోహన్ రెడ్డి సినిమాటోగ్రఫీ నీట్ గా  బాగుంది.  డైలాగ్స్ అక్కడక్కడా బాగానే పేలాయి. ఎడిటింగ్ క్రిస్ప్ గా  చెయ్యాల్సి ఉంది. డైరక్టర్ కిరణ్ విషయానికి వస్తే..  చెప్పుకోదగ్గ మెరుపులు ఏమీ లేవు.  సినిమా రన్ టైం కూడా తగ్గించాల్సింది. ప్రొడక్షన్ వాల్యూస్ ఓకే.

నటీనటుల్లో …
అలీ ..రొటీన్ గా చేసుకుంటూ వెళ్లిపోయారు. కొత్తగా చేసిందేమి లేదు. అంతా సినిమాటెక్ గా అనిపిస్తుంది. హీరోయిన్ కూడా సోసోగా ఉంది. నరేష్ నటన ఎప్పటిలాగే బాగుంది. పవిత్రా లోకేష్ కూడా సపోర్టింగ్ పాత్రలో తనదైన శైలిలో చేసుకుంటూ పోయింది. మిగతా ఆర్టిస్ట్ లు జస్ట్ ఓకే.

చూడచ్చా
మళయాళ ఒరిజనల్ చూడని వాళ్లు ఓ సారి చూడచ్చు.ఎక్కువ ఎక్సపెక్ట్ చేయకూడదు.

నటీనటులు : ఆలీ, నరేష్ విజయకృష్ణ, పవిత్రా లోకేష్, మౌర్యాని, సింగర్ మనో, భద్రం, సప్తగిరి, సనా తదితరులు
కథ : అజీష్ పి. థామస్
పాటలు : భాస్కరభట్ల రవికుమార్
ఛాయాగ్రహణం : ఎస్. మురళీరెడ్డి
సంగీతం: రాకేష్ పళిడం
నిర్మాతలు : అలీ బాబ, కొణతాల మోహన్, శ్రీచరణ్ .ఆర్
దర్శకత్వం : కిరణ్ శ్రీపురం
విడుదల తేదీ: అక్టోబర్ 28, 2022
ఓటీటీ వేదిక : ఆహా
రన్ టైమ్: రెండు గంటల 22 నిముషాలు