అన్నీ మంచి శకునములే మూవీ రివ్యూ

Published On: May 18, 2023   |   Posted By:

అన్నీ మంచి శకునములే మూవీ రివ్యూ

Emotional Engagement Emoji

ఓటిటిలు వచ్చాక కంటెంట్ ఈజ్ కింగ్ అన్నది నిజమవుతోంది. అయితే ఆ కంటెంట్ మాత్రం మామూలుగా ఉండకూడదు. అప్పుడు చిన్నా, పెద్దా లేకుండా సినిమాకు వస్తున్నారు. అలా లేకపోతే ఎంత పెద్ద సినిమా అయినా భాక్స్ లు మొదటి రోజే ఇంటికి పంపేస్తున్నారు. సంతోష్ శోభన్ కు ఈ మధ్యన విజయం మొహం చాటేసింది. చెప్పుకోవటానికి ఒక్క హిట్ లేదు. ఈ నేపధ్యంలో ఎవడే సుబ్రమణ్యం, మహానటి, సీతా రామం లాంటి సినిమాలతో దూసుకుపోతున్న స్వప్న సినిమా బ్యానర్, సక్సెస్ ఫుల్ దర్శకురాలు నందినీ రెడ్డి కాంబినేషన్ అంటే అంచనాలు ఏర్పడతాయి. వాటిని ట్రైలర్, టీజర్ రెట్టింపు చేసాయి. మరి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేలా ఈ సినిమా ఉందా కథేంటి?

కథాంశం :

విక్టోరియాపురం అనే ఊళ్లో ఓ కాఫీ ఎస్టేట్ కోసం 100 సంవత్సరాలుగా కోర్టులో గొడవలు పడుతున్న రెండు కుటుంబాలు సుధాక‌ర్ (న‌రేష్‌), ప్ర‌సాద్ (రాజేంద్ర ప్ర‌సాద్‌) . మూడు తరాలుగా కోర్టుకు ఎక్కి కొట్టుకోవటమే తప్ప రాజీ పడటం అనే ఆలోచన చేయటానికి కూడా ఇష్టపడరు. ఈ రెండు ఫ్యామిలీలకు ఇద్దరు పిల్లలు రిషి (సంతోష్ శోభ‌న్‌), ఆర్య (మాళ‌విక నాయ‌ర్‌). ఇద్దరూ ఒకే రోజున ఒకే హాస్పటిల్ లో పుట్టడంతో వాళ్ల అబ్బాయి వీళ్లకు, వీళ్ల అమ్మాయి వాళ్లకి వెళ్తారు. ఆ విషయాలు ఇద్దరికి తెలియక పెంచుకుంటూంటారు. ఇక ఈ ఇద్దరు పిల్లలు క్లాస్ మేట్స్, మంచి ప్రెండ్స్. పెరిగిపెద్దయ్యి వ్యక్తిత్వాలు వచ్చాక ఆర్య (మాళ‌విక నాయ‌ర్‌)తన కుటుంబ వ్యాపారం భుజాన వేసుకుని అప్పులు తీరుస్తూ బిజీగా ఉంటుంది. రిషీ తన తండ్రి సంపాదించిన ఆస్దిని అనుభవిస్తూ భాధ్యత లేకుండా తిరుగుతూంటారు. ఈ లోగా ఆర్యకు పెళ్లి కుదురుతుంది. అప్పుడు ఆమెకు ఓ విషయం తెలుస్తుంది. అదేమిటంటే చిన్నప్పటి నుంచీ రిషీ తనను ఇష్టపడి ప్రేమించాడని ఆ విషయం చెప్పలేదని. అప్పుడు ఆమె ఏ నిర్ణయం తీసుకుంది. రెండు కుటుంబాల కేసు విషయం ఏమైంది చివరకు కథ ఎలాంటి మలుపు తీసుకుంది అనేది మిగతా సినిమా.

స్క్రీన్ ప్లే ఎనాలసిస్ :

ఇదేమీ కొత్త పాయింటూ కాదు కొత్త కథ అంతకన్నానూ కాదు. హాస్పటిల్ లో అనుకోకుండా పిల్లలు మారిపోవడం ఇంటి గుట్టు వంటి పాతకాలం సినిమాల నుంచి చూస్తున్న స్టోరీలైనే. కొంతకాలం క్రితమే అల వైకుంఠపురములోలో ఆ పాయింటునే టచ్ చేసి పెద్ద హిట్ కొట్టారు. ఆ పిల్లలు పెరిగి పెద్దవాళ్లయ్యాక రెండు కుటుంబాల్లో అసలు నిజం తెలిస్తే కలిగే భావోద్వేగాలతో ఎవ్వరైనా కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు మరోసారి అదే పాయింట్ తో ఈ సినిమాని తీసారు. అయితే అదే పాయింట్ చుట్టూ తిరిగే కథ అయితే ఎలా ఉండాదో కానీ కేవలం ప్రారంభానికి, క్లైమాక్స్ కు మాత్రమే ఈ పాయింట్ ని తీసుకుని నడిపారు. మిగతాదంతా రెండు కుటుంబాలు వాటి మధ్య ఆస్ది తగాదాలు వాళ్లి పిల్లలు స్నేహితులుగా ఉండటంవాళ్లకు కూడా తెలియకుండా మనస్సులు ఇచ్చి పుచ్చేసుకోవటం వంటి రెగ్యులర్ రొటీన్ నువ్వే కావాలి తరహా స్క్రీన్ ప్లే నడిపారు. పోనీ ఏది నడిపితే ఏమిటి ఎమోషన్ కనెక్ట్ చేయటం కదా అసలైన సినిమా అనుకుందామా అంటే ఆ అవకాసం ఈ సినిమా మనకు ఇవ్వదు. హీరో,హీరోయిన్ మధ్య లవ్ స్టోరీ అయినా సవ్యంగా నడిపారా అంటే అసలు ఆ ఫీలే మనకు ఎక్కడా రాదు. వాళ్లిద్దరూ కలవాలని ఆలచనే పుట్టదు. ఆస్ది గొడవలు, కోర్టు మేటర్స్ అంటూ పదే పదే అదే విషాయలు ప్రస్దావనకు తెస్తూ విసిగిస్తూంటారు.

ఇక పైనే చెప్పుకున్నట్లు కాస్త గందరగోళంతో నిండిన కథ ఇది. తెర నిండా లెక్కకు మించి పాత్రలు కృష్ణవంశీ సినిమాలను గుర్తు చేస్తూ తిరుగుతూంటాయి. వాటి మధ్య బంధుత్వం గుర్తు పెట్టుకోవటం కష్టమే. మరో ప్రక్క హీరో,హీరోయిన్స్ లవ్ స్టోరీ కూడా నిండుగా ఉండకఆ పాత్రల్లో ఒకటిగా కలిసిపోతారు. మరో ప్రక్క ఆస్తి గొడవు సినిమా అంతటా అదే నడుస్తూంటుంది. విసిగిస్తుంది. అసలు కథకు అడ్డం పడుతుంది. ఇక సినిమా ప్రారంంలో హీరో హీరోయిన్ల పుట్టుక వారి బాల్యం వచ్చే సీన్సే మొదటి 20 నిమిషాల పాటు సాగుతాయంటే అర్దం చేసుకోవాలి దర్శకురాలు ఏ టోన్ లో , ఎంత నెమ్మిదిగా ఈ కథను నరేట్ చేయబోతోందో అని. ముఖ్యంగా హీరో కు సంభందం లేకుండానే క‌థ‌లోని కీల‌క‌మైన విష‌యాలు,ఎమోషన్స్ జ‌రిగిపోతుంటాయి. అంత ప్యాసివ్ పాత్రను ప్రేక్షకుడు ఎలా అంగీకరిస్తాడు.అలాగని హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనూ క‌థ సాగ‌లేదు. కాసేపు డైరక్టర్ పాయింటాఫ్ వ్యూ తీసుకున్నా అదీ కొద్ది సేపే.

టెక్నికల్ గా :

నువ్వు నా అమ్మ‌వే నువ్వు నా అక్క‌వే ఇది నా ఇల్లే మీరంతా నా వాళ్లు వంటి డైలాగులు బాగున్నాయి. తండ్రి తాక‌ట్టు పెట్టిన ఇంటిని కూతురు త‌న క‌ష్టార్జీతంతో తిరిగి సాధించి, నాన్న‌కు కానుక‌గా ఇవ్వటం వంటి సీన్స్ హార్ట్ టచ్చింగ్ గా ఉన్నాయి. అయితే దర్శకురాలు మిగతా స్క్రిప్టుని అంత బాగా చేసుకోలేదు. ఇక . అలాంటి హార్ట్ ట‌చింగ్ విష‌యాల్ని ద‌ర్శ‌కురాలు ఇంకొన్ని ప‌ట్టుకొంటే బాగుండేది. సన్నీ కూరపాటి రిచర్డ్ ప్రసాద్ ఛాయాగ్రహణం కూడా ఆకట్టుకుంటుంది. విజువల్స్ ప్లెజెంట్ గా ఉన్నాయి. హిల్ స్టేషన్ నేపథ్యం సీన్స్ కలిసి వచ్చాయి. దావూద్ లక్ష్మీభూపాల్ రచన జస్ట్ ఓకే. మిక్కీ జె మేయర్ సంగీతం జస్ట్ ఓకే. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సోసో. ఎడిటింగ్ కూడా అంత గా లేదు. నిర్మాతలు మాత్రం బాగా ఖర్చుపెట్టారని అర్దమవుతోంది.

ఫెరఫార్మెన్స్ వైజ్ :

సంతోష్ శోభన్ మంచి ఆర్టిస్ట్. అయితే అతనికి సరైన సినిమాలు పడటంలేదని మరోసారి ప్రూవ్ అయ్యింది. ఇలా అయితే ఓటిటి నడుడుగా ఫిక్సైపోతాడు. మాళవిక నాయర్ టాలెంటెడ్ ఆర్టిస్ట్. నరేష్, రావు రమేష్, రాజేంద్రప్రసాద్, గౌతమి వంటి ఆర్టిస్ట్ లు రెగ్యులర్ గా చేసుకుంటూ పోయారు. వాసుకి భర్తగా వెన్నెల కిశోర్ కొన్ని సీన్లలో కనిపించారు. ఉర్వశి, రంగస్థలం మహేష్ పాత్రల పరిధి కూడా కథలో తక్కువే.

చూడచ్చా:

పార్టులు పార్టులుగా చూస్తే సినిమా ఓకే అనిపిస్తుంది. కానీ, కథగా చూస్తే కనెక్ట్ కావడం కష్టం. ఓటిటి స్టఫ్ లా అనిపించే ఈ సినిమాకు ఈ వేసవిలో పనిగట్టుకుని థియేటర్ కు వెళ్లి చూడటమంటే ఏసి కోసం వెళ్తున్నట్లే.

నటీనటులు :

సంతోష్ శోభన్, మాళవిక నాయర్, రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, నరేష్, గౌతమి, షావుకారు జానకి, వాసుకి, వెన్నెల కిషోర్, రమ్య సుబ్రమణియన్, అంజు అల్వా నాయక్, అశ్విన్ కుమార్ తదితరులు

సాంకేతికవర్గం :

మాటలు : లక్ష్మీ భూపాల
ఛాయాగ్రహణం : సన్నీ కూరపాటి, రిచర్డ్ ప్రసాద్
సంగీతం : మిక్కీ జె. మేయర్
నిర్మాణ సంస్థలు : స్వప్న సినిమా, మిత్ర విందా మూవీస్
నిర్మాత : ప్రియాంకా దత్
దర్శకత్వం : బీవీ నందినీ రెడ్డి
రన్ టైమ్ : 154 మినిట్స్
విడుదల తేదీ: మే 18, 2023