ఎపిక్టైజ్ మీడియా హౌస్ ప్రారంభం

సాంప్రదాయ సంగీతాన్ని నేటి తరాలకు అందించే సంకల్పంతో ”’ఎపిక్టైజ్” మీడియా హౌస్ ప్రారంభం

భారతీయతకు బలమైన పునాది… మన సంస్కృతి, సంప్రదాయాలు… వాటిని కాపాడుకుంటూ నవ్యతను జోడించుకుంటూ… మన సంస్కృతిని ముందు తరాలకు అందించాలనే ఆకాంక్షతో మీడియా హౌస్ మొదలు పెట్టారు. అదే ‘ఎపిక్టైజ్’….మీడియా హౌస్ తో పాటు వెబ్ సైట్ కూడా ప్రారంభం అయింది. హరి దామెర, నాగరాజు తాళ్లూరి ఇద్దరు కలిసి మొదలు పెట్టిన అద్భుత కార్యక్రమం ‘ఎపిక్టైజ్’ మీడియా. ఈ మీడియా లాంచ్ కార్యక్రమం హైదరాబాద్ లో శుక్రవారం జరిగింది. ఈ వేడుకలో ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్, దర్శకుడు మారుతి, దర్శకుడు వి ఎన్ ఆదిత్య, రాజ్ మాదిరాజు తదితరులు పాల్గొన్నారు. ‘ఎపిక్టైజ్ మీడియా సంస్థ’ తన తొలి కార్యక్రమంగా ‘రాగరస… రీగరీసా’ అనే కార్యక్రమాన్ని నిర్విహిస్తోంది. శ్రీమతి మణి నాగరాజు దీనిని రూపకల్పన చేశారు. తొలి తెలుగు వాగ్గేయకారుడు తాళ్లపాక అన్నమాచార్య, త్యాగరాజు, పురందర దాసు, మీరా భజన్స్, మొదలైన కీర్తనలకు ఆధునిక వాద్యపరికరాలతో సప్తస్వరాలను జోడించి… సంస్కృతి, సాంప్ర‌దాయాల‌ను కాపాడుతూ.. తర్వాతి తరాలకు అందించే బాధ్యతలో రూపుదిద్దుకన్న ప్రోగ్రామే ఈ ‘రాగరస’… దేశంలో సంగీత సామ్రాజ్యంలో పేరు ప్రఖ్యాతులు గడించిన విద్యాంసులను, గానాలాపనచేసే ప్రావీణ్యులను ఓ వేదికపైకి తెచ్చే కార్యక్రమమే ‘రాగరస’ !!

ఈ సందర్బంగా నిర్మాత సి కళ్యాణ్ మాట్లాడుతూ .. నాగరాజు నాకు చాలా ఏళ్లుగా తెలుసు సంగీతకారులతో నాకు చాలా అనుబంధం ఉంది. నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పటినుండి వాళ్ళతోనే ఎక్కువగా ట్రావెల్ చేశాను. అలా చాలా ఎళ్ళ కిందటే నాగరాజు పరిచయం. తాను మంచి ఫ్లూట్ విద్వాంసుడు అన్న సంగతి అందరికి తెలుసు. ఎందుకంటే ఎంతోమంది మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర పనిచేసాడు. అయన ఫ్లూట్ వాయిస్తే ఎంత హాయిగా ఉంటుందో అందరికి తెలుసు. ఇప్పుడు చూశాం కూడా. నాగరాజు , హరి ఇద్దరు మిత్రులు కలిసి మన సాంప్రదాయ సంగీతాన్ని భావి తరాలకు అందించాలనే సంకల్పంతో ఈ ‘ఎపిక్టైజ్’ మీడియా ను మొదలుపెట్టి నందుకు వారిని అభినందిస్తున్నాను. మన సంగీతం అంటే ప్రపంచం అంత ఆసక్తిగా వింటుంది. మన సంస్కృతీ సంప్రదాయాల్లో సంగీతం ఉంది. ఈ ఇద్దరు మిత్రులు చేస్తున్న ప్రయత్నం సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.

దర్శకుడు మారుతి మాట్లాడుతూ .. నాగరాజు గారు నాకు బాగా తెలుసు. అయన మ్యూజిక్ నేను విన్నాను. నాగరాజు, హరి ఇద్దరు కలిసి ఓ గొప్ప ప్రయత్నానికి ప్రారంభం చేసారు. నిజంగా నేటి జనరేషన్ కు ఇలాంటి మ్యూజిక్ కావాలి. వీరిద్దరూ చేస్తున్న ప్రయత్నం మంచి విజయం అందుకోవాలని కోరుకుంటున్నాను అన్నారు.

దర్శకుడు వి ఎన్ ఆదిత్య మాట్లాడుతూ .. నాగరాజు, హరి నాకు బాగా తెలుసు. నాగరాజు ఫ్లూటిస్ట్ గా ఎన్నో అవార్డులు అందుకున్నాడు. అయన తన శిష్యుడు అనాలా, లేక ఫ్రెండ్ అనాలా తెలియదు హరి తో కలిసి చేస్తున్న ఈ ప్రయత్నం మంచి విజయం సాదించాలి అన్నారు. మరో దర్శకుడు రాజ్ మాదిరాజు మాట్లాతుడు. హరి, నాగరాజు ఇద్దరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను. వారిద్దరూ కలిసి చేస్తున్న మంచి ప్రయత్నం ఇది అన్నారు.

ఫ్లూటిస్ట్ నాగరాజు గురించి..

ఆయన గురించి రెండు తెలుగు రాష్ట్రాలలోని వారికి, జాతీయ స్థాయిలో ఉన్న సంగీతాభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ పట్నంలో జన్మించిన నాగరాజు గారు పదేళ్ళ ప్రాయంలోనే వేణుగానంలో శిక్షణ తీసుకోవడం మొదలు పెట్టారు. ఇవాళ మనకున్న బెస్ట్ ఫ్లూటిస్టులలో ఆయన ప్రముఖులు. గడిచిన మూడు దశాబ్దాల కాలంలో జాతీయ అంతర్జాతీయ వేదికలపై వేలాది ప్రదర్శనలు ఇచ్చారు. ప్రముఖ సంగీత దర్శకులు, గాయనీ గాయకులు నిర్వహించిన ఇంటర్నేషనల్ మ్యూజిక్ కన్సర్ట్స్ లో ఆయన ఫ్లూటిస్ట్ గా తన ప్రతిభ చాటారు. సోలోగా ఎన్నో వందల పెర్ఫార్మెన్స్ లు చేశారు. ప్రముఖ రచయిత జె.కె. భారవి ‘జగద్గురు ఆది శంకర’ చిత్రానికి సంగీతం అందించారు. అలానే రామ్ గోపాల్ వర్మ ‘365’ మూవీకీ మ్యూజిక్ ఇచ్చారు. ఇక ప్రముఖ రచయిత, దర్శకులు, నటులు తనికెళ్ళ భరణి రాసిన ‘ఆటకదరాశివ’ తత్త్వాలకు వాద్య కళాకారుడిగా అద్భుతమైన పెర్ఫార్మ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి కళారత్న బిరుదును అందుకున్న వేణుగాన విశారద ఫ్లూటిస్ట్ నాగరాజు గారిలో గొప్ప ఇన్నోవేటర్ ఉన్నారు. అందుకు నిదర్శనం ఆయన జరిగిన ‘త్రివేణు యాత్ర’. కర్నాటిక్, హిందుస్తానీ, వెస్ట్రన్ క్లాసిక్స్ ను ఒకే వేదిక మీద ప్రదర్శిస్తూ నాగారాజు గారు చేసిన జుగల్ బందీకి అద్భుతమైన గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు లభించాయి. వారి శ్రీమతి మణి గురించి కూడా తెలుగువారు అందరికి తెలిసిందే! అత్యంత ప్రతిభావంతురాలైన గాయనీ ‘మణి’, స్వరకర్త ఆమె! వీరిద్దరూ కలిసి సాగిస్తున్న సంగీత ప్రయాణం ఇప్పుడు మరో మెట్టు పైకి ఎక్కబోతోంది.

హరి దామెర గురించి ..

ఉమ్మడి కుటుంబం నుండి పొందిన అనుభవాలు, బాల్యంలో ఎదుర్కొన్న కష్టాలు, ఉన్నత విద్య ద్వారా సముపార్జించిన తెలివితేటలు ఆయన్ని ఈ రోజున ఉన్నత శిఖరాలపైన కూర్చో పెట్టాయి. చెన్నయ్, బెంగళూరు నగరాల మీదుగా అమెరికా చేరి, రెండు దశాబ్దాలుగా అక్కడ ఉద్యోగిగా విజయం సాధించి, నేడు వ్యాపారవేత్తగా సత్తా చాటుతున్నారు. ఎంత ఎత్త ఎదిగినా తన సొంతవూరి మట్టి వాసనలను ఆయన మర్చిపోలేదు. ప్రకృతి ప్రేమికులైన హరి తన స్వస్థలం చిత్తూరు జిల్లా ఏర్పేడు మండంలోని చింతలపాలెం పరిసర ప్రాంతాలను హరిత వనాలుగా తీర్చిదిద్దుతున్నారు. గ్రామంలోని పాఠశాలలకు తనవంతు ఆర్థిక సాయం అందించారు. గత యేడాది వచ్చిన కరోనా మహమ్మారి ఎంతోమందిని పరీక్షకు గురిచేసింది. అయితే ఆ ప్రతి కూల పరిస్థితులను సైతం తనకు అనుకూలంగా మలచుకున్నారు హరి దామెర. చిన్నప్పుడు రేడియో, గ్రామ్ ఫోన్ రికార్డుల ద్వారా విన్న పాటలు, యుక్తవయసులో స్నేహితులతో కలిసి ఆలపించిన సినిమా గీతాలు ఆయన మదిలో నిబిడీకృతమై ఉన్నాయి. కరోనా కారణంగా లభించిన ఖాళీ సమయాన్ని సంగీతం పట్ల తనకున్న అభిరుచిని వెలికి తీయడానికి ఉపయోగించారు. ప్రముఖ ఫ్లూటిస్ట్ నాగరాజు దగ్గర యేడాదిన్నర క్రితం శిష్యరికం మొదలెట్టారు. ఈ గురుశిష్యుల సాంగత్యం వీరి సంగీత ప్రయాణాన్ని మరో మేలిమలుపు తిప్పింది. ‘ఎపిక్టైజ్’ మీడియా హౌస్ రూపంలో సరికొత్త చరిత్రకు నాంది పలుకబోతోంది.