కరోనా వైరస్ మూవీ రివ్యూ

Published On: December 12, 2020   |   Posted By:

కరోనా వైరస్ మూవీ రివ్యూ

సినిమాకే వైరస్ సోకింది: ‘కరోనా వైరస్’ రివ్యూ

Rating‍: 1/5

లాక్ డౌన్ తర్వాత ఎట్టకేలకు ఓ కొత్త తెలుగు సినిమాను ఈ శుక్రవారం థియేటర్లలోకి వదిలారు. కానీ ట్విస్ట్ ఏమిటంటే ఆ సినిమా రిలీజవుతున్న సంగతి కూడా జనాలకు తెలియలేదు. అక్కడికీ ఏ సోషల్ మీడియాలో అయినా దాని గురించి విన్న వాళ్లు  ధైర్యం చేసి సినిమాకు వెళ్దామంటే..  దానికి తోడు ఈ మధ్యన వరస పెట్టి అర్దం పర్దం లేని సినిమాలను ఓటీటిలో వదిలిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కంపెనీ నుంచి వచ్చిన సినిమా కావటంతో వాళ్లకు దానిపై ఎలాంటి ఆసక్తి కనిపించలేదు.  ఆ సినిమానే  ‘కరోనా వైరస్’. ప్రంపచాన్ని గత సంవత్సరకాలంగా భయపెడుతూ వస్తున్న ఈ చిత్రంపై వర్మ ఏమి కథ రాసారు..ఏమి తీయించారు..ఈ సినిమా చూసాక కరోనాకు ఫ్యాన్స్ ఏర్పడతారా లేక కరోనా అంటే మరింత భయం పెంచుకుంటారా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.


స్టోరీ లైన్…

ఓ మిడిల్ క్లాస్ కుటుంబం చుట్టూ అల్లబడ్డ ఈ కథ లాక్  కరోనా డౌన్ టైమ్ లో జరుగుతుంది. మద్యతరగతి వ్యక్తి కె. ఆనంద్ రావు(శ్రీకాంత్ అయ్యంగర్) కరోనా ప్రభంజనం మొదలైన నాటి నుంచీ ..టీవీలో వార్తలు,వాట్సప్ మెసేజ్ లు చూస్తూ ఆలోచనలో పడిపోతాడు. మరో ప్రక్క ప్రభుత్వం ఇచ్చే స్టేట్మెంట్స్ కూడా ఆయన్ను భయపెడుతూంటాయి. తన ఇంటిని కరోనా వైరస్ నుంచి ఎలా కాపాడుకోవాలనేదే ఆయన నిరంతర ఆలోచన. ఇంట్లో సోషల్ డిస్టెన్స్ పాటించటం తో సహా అన్ని జాగ్రత్తలు తీసుకుంటాడు.  అయితే అనుకోకుండా తన కుమార్తె  శాంతి (సోనియా ఆకుల) లోనే ఆ కరోనా లక్షణాలు కనపడటం మొదలవుతాయి. అప్పుడు ఆయనేం చేసాడు…ఎలా కరోనాను ఎదుర్కొన్నాడు..చివరకు ఏమైంది విషయాలతో జరిగేదే మిగతా కథ.

స్క్రీన్ ప్లే ఎనాలసిస్

నిజానికి ఇది సినిమాకు సరబడ కంటెంట్ కాదు. వర్మ గత ఓటీటి చిత్రాల్లాగే అరగంట లోపే తీసేయాల్సిన మ్యాటర్. కానీ సినిమా గా తీసి థియోటర్స్ లో రిలీజ్ చేసారు. వర్మ సినిమా మొదట్లో కోట్ చేసి చెప్పినట్లుగా.. ఏ ఎమోషన్ ని అయినా భయం సర్వ నాశనం చేస్తుంది. అదే బేస్ లైన్ గా పెట్టుకుని సినిమా ప్లాన్ చేసారు. అయితే ఎమోషన్స్ రిజిస్టర్ చేయటంలోనే తడబడ్డారు. పేజీలకు పేజీలకు డైలాగులు చెప్పటంతోనే సరిపుచ్చారు. అప్పట్లో వర్మ తీసిన ఐస్ క్రీమ్ సినిమా లాగ ఇది సాగుతుంది. సినిమా మొత్తం ఒకే చోట నడిపారు.సరైన డ్రామా ఉంటే ఒకే గదిలో కథ నడిపినా రక్తి కడుతుంది. కానీ ఈ సినిమాలో సరైన కాంప్లిక్ట్ ఎస్టాబ్లిష్ కాకపోవటంతో డ్రామా ఎలివేట్ కాలేదు. దాంతో సినిమా బోర్ కొట్టేసింది. దానికి తగినట్లు సబ్ ప్లాట్స్ కూడా లేవు. ఏం చూస్తూ అంతసేపు కూర్చోవాలో మనకు అర్దం కాదు. ఓటీటిలో అయితే సినిమాని ఫార్వార్డ్ చేయచ్చు. కానీ థియోటర్స్ లో స్క్రిప్ చేయాలంటే కూర్చుని నిద్రపోవటం తప్ప వేరే దారి లేదు. సినిమాలో యాక్షన్ కన్నా మాటలకే ఎక్కువ ప్రయారిటి ఇచ్చారు. కరోనా టైమ్ లో ఇంట్లోనే ఉంటూ భయపడుతూంటారు. అప్పుడు నిజానికి కొంత భయం జనాల్లో ఉంది. కానీ ఇప్పుడు రిలీజ్ నాటికి అది పూర్తి గా మాయమైంది. కాబట్టి ఆ సీన్స్ ఇప్పుడు చూస్తూంటే అబ్సర్డ్ అనిపించటంలో వింతలేదు. సినిమాలో మరో కామెడీ ఏమిటంటే…ఇంట్లో జనం సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూంటారు. పనిమనిషిని మాత్రం ఇంట్లోకి రానిస్తూంటారు. మరో ప్రక్క ప్రభుత్వాలని నిందిస్తూ ఓ క్యారక్టర్ సాగుతుంది. వాస్తవానికి ఇలాంటి మహమ్మారిని ఎదుర్కోవటం ప్రభుత్వాలకి కొత్తే..కాబట్టే కరోనా విషయంలో మన దేశంలో ప్రజా వ్యతిరేకత రాలేదు. ఇలా సినిమా కు దిశ,దశ లేదు..దానిష్టం వచ్చినట్లు ..సా………….గుతుంది.
 
 
డైరక్షన్..మిగతా డిపార్టమెంట్స్

నిజానికి ఈ సినిమాకు డైరక్షన్ అనే మాట వాడటం చాలా ఎక్కువ. ఏదో కెమెరా పెట్టి అలా చుట్టేసారని అనాలి. ఈ మాత్రం దానికి డైరక్టర్ కూడా అనవసరం అన్నట్లు అనిపిస్తుంది. శ్రీకాంత్ అయ్యంగార్ వాంటి నటుడు కూడా తేలిపోయాడంటే అర్దం చేసుకోవాలి. సోనియా ఆకుల చూడ్డానికి అందంగా ఉంది కానీ ప్రయోజనం ఏముంది. కెమెరా వర్క్ , బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ..హారర్ సినిమాకు అతి ముఖ్యం. కానీ ఆ రెండూ ఈ సినిమా ఫెయిలయ్యాయి. ప్రొడక్షన్ వ్యాల్యూస్ కూడా సోసోగా ఉన్నాయి.

చూడచ్చా…టైమ్ వేస్ట్ వ్యవహారం.
 
ఎవరెవరు..

బ్యానర్‍: కంపెనీ, సిఎం క్రియేషన్స్
తారాగణం: శ్రీకాంత్‍ అయ్యంగార్‍, వంశీ చాగంటి, సోనియా ఆకుల, కల్పలత గార్లపాటి, దక్షి గుత్తికొండ, దొర సాయితేజ తదితరులు
రచన: కళ్యాణ్‍ రాఘవ్‍ పసుపుల
సంగీతం: డి.ఎస్‍.ఆర్‍
కూర్పు: నాగేంద్ర
ఛాయాగ్రహణం: వి. మల్హభట్‍ జోషి
రన్ టైమ్: 1 గంట 24 నిముషాలు
నిర్మాతలు: రామ్‍ గోపాల్‍ వర్మ, నన్నపురెడ్డి, ఎల్లారెడ్డి
దర్శకత్వం: అగస్త్య మంజు
విడుదల తేదీ: డిసెంబరు 11, 2020