ఛత్రపతి (హిందీ) మూవీ రివ్యూ

Emotional Engagement Emoji

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ చిత్రం ఛత్రపతి. మదర్ సెంటిమెంట్ తో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచిన ఈ సినిమాని బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా హిందీలో రీమేక్ అయింది. అయితే టాలీవుడ్ టాప్ డైరెక్టర్ వి.వి వినాయక్ ఈ చిత్రాన్ని హిందీలో తెరకెక్కించారు. బాలీవుడ్ నటి నుష్రత్ భరుచ్చా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. మాస్ సినిమాలు తీయడంలో సిద్ధహస్తుడైన వి.వి.వినాయక్‌కు దర్శకత్వ వహించటంతో సినిమాపై ఎక్సపెక్టేషన్స్ బాగానే ఉన్నాయి. టీజర్లు, ట్రైలర్లు యాక్షన్ ప్యాక్డ్‌గా కట్ చేసి బజ్ క్రియేట్ చేసారు. ఈ నేపధ్యంలో రిలీజైన ఈ సినిమా ఎలా ఉంది?

 కథ :

శివ (బెల్లంకొండ శ్రీనివాస్) తన తల్లి, తమ్ముడితో కలిసి పాకిస్తాన్‌లో ఉంటాడు. అక్కడ జరిగిన గొడవల కారణంగా శివ తన కుటుంబానికి దూరమై.. గుజరాత్ తీరప్రాంతానికి చేరుకుంటాడు. శివతో పాటు అక్కడకు వచ్చిన శరణార్థులను గుజరాత్‌లోని లోకల్ రౌడీ భైరవ్ బానిసల్లా చూస్తూ ఉంటాడు. దాంతో.. భైరవ్‌ పై తిరగబడ్డ శివ అతన్ని చంపేసి ఛత్రపతిగా మారతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? భైరవ్ అన్న భవాని ఏం చేశాడు? తన తల్లిని, తమ్ముడిని శివ ఎలా కలుసుకున్నాడు? అనేది మిగతా కథ.

విశ్లేషణ :

తెలుగులో ఎన్నో సూపర్ హిట్స్ ఇచ్చిన మాస్ డైరెక్టర్ వి.వి.వినాయక్‌కు దర్శకత్వం వహించటంతో ఈ ప్రాజెక్టుపై మంచి నమ్మకాలే ఉన్నాయి. అయితే వినాయిక్ అవుట్ డేటెడ్ దర్శకుడుని అనిపించుకన్నారు. చాలా ఎపిసోడ్స్ పరమ బోరింగ్ గా తీసారు. ఎక్కడా పాయింటాఫ్ ఇంట్రస్ట్ కూడా లేదు. సీన్స్ అలా వచ్చి ఇలా వెళ్లిపోతూంటాయి. సాధారణంగా ఒక హిట్ సినిమాను రీమేక్ చేసినప్పుడు అందులో ఉన్న ప్లస్ పాయింట్లను హైలెట్ చేస్తూ, మైనస్ పాయింట్లను తగ్గించడానికి ప్రయత్నిస్తారు. కానీ ఛత్రపతి విషయంలో మొత్తం రివర్స్ అయింది. సినిమాకి హైలెట్ అనిపించే కొన్ని సీన్లను పూర్తిగా తీసివేయటమే అందుకు కారణం.

అయినా ఇలాంటి కల్ట్ క్లాసిక్ మూవీ రీమేక్ అంటే ఎప్పుడూ కత్తిమీద సామే. సరిగ్గా ఛత్రపతి రీమేక్ లో కూడా అదే జరిగింది. ఒరిజినల్ ఛత్రపతి ఏవైతే హైలెట్ అనుకున్నామో ఆ సీన్స్ మొత్తం లేపేశారని చెప్తున్నారు. సినిమా ప్రారంభంలో షార్క్‌తో ఫైట్ ఆడియన్స్ కి గూస్ బంప్స్ తెప్పిస్తుంది. . కానీ అది తీసేసారు. ఇక మదర్ సెంటిమెంట్ కూడా అస్సలు వర్కవుట్ కాలేదు. అయితే యాక్షన్ సీక్వెన్స్ ని మాత్రం ఫ్రేమ్ టు ఫ్రేమ్ దించేశారు. ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా జస్ట్ ఓకే గా హిందీలోఅనిపిస్తుంది. ప్రీ క్లైమ్యాక్స్, క్లైమ్యాక్స్‌లను కూడా ఎవరో తరుముకు వస్తున్నట్లు వెళ్లిపోతాయి. ఇలా సినిమాలో ఒక్కటంటే ఒక్కటి కూడా కిక్ ఇచ్చే ఎలిమెంట్ లేదు.

టెక్నికల్ గా చూస్తే :

రీమేక్ కాబట్టి స్క్రిప్టు గురించి మాట్లాడేదేమీ లేదు. డైలాగులు చాలా భాగం అనువాదం చేసినట్లు యాజటీజ్ దింపేసారు. దర్శకత్వం ఈ కాలానికి తగినట్లు లేదు. తనిష్క్ బగ్చి ఇచ్చిన పాటలు అస్సలు బాలేవు. రవి బస్రూర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా తేలిపోయింది. సినిమాలో ఒక్క పాట కూడా ఆకట్టుకోదు. కెమెరా వర్క్ బాగుంది. ఎడిటింగ్ మరీ షార్ప్ గా కాకుండా కాస్తంత ఎమోషన్స్ రిజిస్టర్ అయ్యే టైమ్ ఇచ్చి ఉంటే బాగుండేది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

నటీనటుల్లో :

యాక్టింగ్ పరంగా బెల్లంకొండ శ్రీనివాస్ యాక్షన్ ఎపిసోడ్స్, డాన్స్ లు బాగా చేసాడు. ఎమోషనల్ సీన్స్‌లో మాత్రం వర్కవుట్ కాలేదు. నుష్రత్ బరుచ లో నటన కన్నా గ్లామర్ హైలెట్ అయ్యింది. తల్లిగా భాగ్యశ్రీకి జస్ట్ ఓకే ఇక మిగిలిన పాత్రలు కూడా ఫరవాలేదు.

చూడచ్చా ?

ఛత్రపతి రీమేక్ ఇది పెద్ద మేకే, ఆల్రెడీ హిందీలో చూసేస్తే యూట్యూబ్ లో వెతుక్కుని తెలుగు వెర్షన్ చూడాల్సిన పరిస్దితి.

నటీనటులు:

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నుష్రత్ బరుచ, శరద్ ఖేల్కర్, భాగ్యశ్రీ తదితరులు

సాంకేతికవర్గం :

కథ : వి.విజయేంద్ర ప్రసాద్
స్క్రీన్‌ప్లే: ఎ.మహాదేవ్
మాటలు : మయర్ పురి
ఛాయాగ్రహణం : నిజార్ షఫీ
పాటలు : తనిష్క్ బగ్చి
నేపథ్య సంగీతం : రవి బస్రూర్
నిర్మాత : జయంతిలాల్ గడ
రన్ టైమ్ : 130 మినిట్స్
దర్శకత్వం : వి.వి.వినాయక్
విడుదల తేదీ: మే 12, 2023