దాస్ కా ధమ్కీ  మూవీ రివ్యూ

Published On: March 22, 2023   |   Posted By:

దాస్ కా ధమ్కీ  మూవీ రివ్యూ

Emotional Engagement Emoji

ఫలక్‌నుమా దాస్ సినిమాతో డైరెక్టర్‌గానూ, హీరోగానూ మెప్పించాడు విశ్వక్సేన్. ఆ ఉత్సాహంతో ఇప్పుడు దాస్ కా ధమ్కీతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సారి స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం, హీరో, నిర్మాత ఇలా అన్నింట్లోనూ విశ్వక్ సేన్‌ కనపడతాడు. విశ్వక్సేన్ విశ్వరూపం చూపించాడా..సినిమా హిట్ కొట్టాడా…అసలు కథేంటి ? అన్నది చూద్దాం.

స్టోరీ లైన్ :

ఒక స్టార్ హోటల్లో వెయిటర్ గా పని చేసే కృష్ణదాస్ (విశ్వక్ సేన్) కు డబ్బులేని జీవితం అంటే అసహ్యం . జీవితంలో ఒక్క రోజైనా డబ్బున్న వాడిగా బ్రతకాలనుకుంటాడు. అందుకోసం డబ్బున్న వాడిగా నటిస్తూ అదే హోటల్ లో రూమ్ తీసుకుంటాడుప. ఆ క్రమంలో అక్కడికి వచ్చిన  కీర్తి (నివేతా పేతురాజ్) అతనితో ప్రేమలో పడుతుంది. తనని ఒక పెద్ద కంపెనీకి సీయీవోగా చెప్పటంతో ఆమె డేటింగ్ షురూ అవుతుంది. అయితే అంతా హ్యాపీగా గడిచిపోతుందనుకునే టైమ్ లో ఓ ట్విస్ట్ పడుతుంది. అతని అసలు ఐడెంటిటీ బయిటకు వచ్చేస్తుంది. గర్ల్ ప్రెండ్ బై చెప్పేస్తుంది. ఉద్యోగం ఊడిపోతుంది. ఏం చేయాలో అర్దం కాని సిట్యువేషన్ లో ఓ ఆఫర్ వస్తుంది. అచ్చు కృష్ణ పోలికలతో వున్న సంజయ్ రుద్ర (విశ్వక్ డబుల్ యాక్షన్) లాగ అతన్ని నటించమని అడుగుతారు. సంజయ్ రుద్ర ఓ ఫార్మా కంపనీని సిఈవో. క్యాన్సర్ కి విరుగుడు మందు కనిపెడుతున్న సమయంలో ఒక రోడ్డు ప్రమాదంలో చనిపోతాడు. దీంతో సంజయ్ స్థానంలోకి  కృష్ణదాస్ ని తీసకువస్తారు. అలా సంజయ్ గా వచ్చిన కృష్ణ దాస్ కి ఎలాంటి ఎక్సపీరియన్స్ లు  ఎదురయ్యాయి ? నిజంగానే సంజయ్ చనిపోతాడా ? అసలు నిజం ఏమిటి అనేది మిగతా కథ.

ఎనాలసిస్:

ఇలాంటి ద్విపాత్రాభినయం కథలు కొత్తేమీ కాదు. ఎన్నో చూసి ఉన్నాం. దాంతో ఇలాంటి కథ విశ్వక్సేన్ తీసుకుని డైరక్ట్ చేసాడంటే ఖచ్చితంగా ఏదో అదిరిపోయే పాయింట్ ఉందనుకుంటాం. అయితే అంత సీన్ లేదని సినిమా ప్రారంభమైన కాసేపటికే అర్దమవుతుంది. ఏవో కొన్ని కమర్షియల్ ఎలివేషన్స్, ట్విస్ట్ లు నమ్ముకుని సినిమా చేసారని అర్దమవుతుంది. వాస్తవానికి  ఇలాంటి కథలు  స్క్రీన్ ప్లే బాగా కుదిరితేనే బాగుంటాయి. ఫస్టాఫ్ రెగ్యులర్ కమర్షియల్ కామెడీగా పరుగెడుతుంది. కొన్ని ద్వంద్వార్దాలు, కామెడీలు, ఫారిన్ లో పాటలు ఇలా సాగిపోతుంది. ఎప్పుడైతే రావు రమేష్ పాత్ర కథలోకి ఎంట్రి ఇస్తుందో అక్కడ నుంచి కథ మలుపు తిరుగుతుంది. ఏదో జరుగుతుంది అని ఆశిస్తాం. అయితే అంతా రొటీన్ గా ప్రెడిక్టబుల్ గా ఉంటుంది. ఇంటర్వెల్ దాకా ఓకే బాగానే ఉంది అనిపిస్తుంది. సెకండాఫ్ లో ఏదో కొత్తదనం ఆశిస్తాం. అది డైరక్టర్ ,రచయితకు తెలుసు. అందుకే ట్విస్ట్ లు పెట్టుకున్నారు. అయితే ఆ ట్విస్ట్ లు కథలోంచి వచ్చినట్లు అనిపించవు. ఇక్కడ ట్విస్ట్ లేక పోతే ఎలా ఎంతసేపు అని ప్లాట్ గా కథ నడుపుతాం అని డైరక్టర్ భావించి పెట్టుకున్నట్లు అనిపిస్తుంది. అద్బుతంగా పేలుతాయనుకున్న ట్విస్ట్ లు మిస్ ఫైర్ అయ్యి విసిగించటం మొదలెడతాయి. మనం కుర్చీల్లో భారంగా కదులుతాము. ఇక ఈ సినిమా కోర్ పాయింట్ ఫార్మా బిజినెస్ చుట్టూ తిరుగుతుంది. అదైనా సవ్యంగా ఉందా అంటే ఆ ప్లాట్ అంతా చాలా కృత్రిమంగా భారంగా ఉంటుంది. దాంతో ఈ చిత్రంలో అసలు కథేంటి ,మనం చూస్తున్నది ఏమిటి…అనేది క్లారిటీ రావటానికి సెకండాఫ్ సగం దాటిపోతుంది. దాంతో కాంప్లిక్ట్ పాయింట్ రైజ్ కాదు. ఎప్పుడైతే కాంప్లిక్ట్ లోకి కథ ప్రయాణించదో అక్కడ దాకా విసుగే కదా. కథలో కాంప్లిక్ట్ పాయింట్ ..కేవలం రెండో పాత్ర చచ్చిపోలేదు బ్రతికే ఉందని తెలిసినప్పుడు మాత్రమే వస్తుంది. అది  బాగా లేటుగా వస్తుంది. అన్నిటికన్నా బ్యాడ్ ఏంటంటే విశ్వక్ సేన్ ..సహజంగా నటిస్తూంటాడు. కథ అంతా చాలా కృత్రిమంగా ఉంటుంది. రెండింటికి నాన్ సింక్ నడుస్తుంది. అదొక్కటి చాలదూ మన సహన పరీక్ష పెట్టడానికి.

టెక్నికల్ గా :

దర్శకుడుగా విశ్వక్సేన్ కు వంక పెట్టేదేమీ లేదు కానీ… సరైన కథ అతని దగ్గరలేనప్పుడు గెలవటం కష్టం. గెలిచినా ఆ గెలుపు గాలివాటుతనమే కానీ శాశ్వతం కాదు. నమ్మదగినది అంతకన్నా కాదు.  సెకండాఫ్ లో వచ్చే ట్విస్ట్‌ల‌నే నమ్ముకుని సినిమా చేసారు. ఆ ట్విస్ట్ లేమో ఈజీగా  మన ఊహ‌ల‌కు అందేలా predictability  గా ఉంటాయి. అయితే కొంత కామెడీ ప్రెష్ గా ఉంది. కానీ థియేటర్ దద్దరిల్లి పోయేలా అయితే మాత్రం లేదు.  లియోన్ జేమ్స్ మ్యూజిక్‌ మాత్రం క్యాచీగా ఉంది. పాటలు బాగున్నాయి. నేపధ్య సంగీతం మాత్రం చెప్పుకోదగిన రీతిలో లేదు. దినేష్ కే బాబు, సినిమాటోగ్రఫి డీసెంట్ గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఎడిటింగ్ , డైలాగులు మరింత మెరుగ్గా ఉండాలి.

ఆర్టిస్ట్ ల ఫెరఫార్మెన్స్ విషయానికి వస్తే :

విశ్వక్ సేన్ రెండు పాత్రల మధ్య వేరియేషన్ బాగా చూపించారు. నెగిటివ్ షెడ్స్ పాత్రలో అయితే మరింత  బాగా చేశారు.నివేదా పేతురాజ్  గ్లామర్ డాల్ గా కనిపిస్తుంది. రావు రమేష్ క్యారక్టరైజేషన్స్ లో కూడా బోల్డు  వేరియేషన్స్ ఉన్నాయి. ‘హైపర్’ ఆది, రంగస్థలం మహేష్  కొంచెం కొత్తగా కామెడీ చేసే ప్రయత్నం చేశారు.  సక్సెస్ అయ్యారు. తరుణ్ భాస్కర్, మహేష్ మధ్య సీన్ బాగుంది. మిగతా వాళ్లకు పెద్దగా నటించే అవకాశం లభించలేదు.  ఫైనల్ గా చిన్న పాత్రే అయినా తల్లి గా  రోహిణి ఆకట్టుకున్నారు.

ప్లస్ పాయింట్స్ :

విశ్వక్సేన్ ద్విపాత్రాభినయం
వాణిజ్య విలువలు

మైనస్  పాయింట్స్ :

మనసుని హత్తుకునే కథ లేకపోవటం
బలమైన ఎమోషన్స్ రిజిస్టర్ చేయలేకపోవటం

చూడచ్చా :

అక్కడక్కడా నవ్విస్తూ, ట్విస్ట్ లతో థ్రిల్ చేద్దామనే ఈ చిత్రంపై జస్ట్ ఓ లుక్కేయవచ్చు..   అంతకు మించి ఎక్సపెక్ట్ చేయద్దు

నటీనటులు :

విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్, రావు రమేష్, తరుణ్ భాస్కర్, హైపర్ ఆది, అజయ్, రోహిణి, రజిత, రంగస్థలం మహేష్, పృథ్వీరాజ్, కాదంబరి కిరణ్

సాంకేతికవర్గం :

బ్యానర్: వాన్మయి క్రియేషన్స్, విశ్వక్ సేన్ క్రియేషన్స్
దర్శకత్వం: విశ్వక్ సేన్
నిర్మాత: కరాటే రాజు
సినిమాటోగ్రఫి: దినేష్ కే బాబు, జార్జ్ సి విలియమ్స్
ఎడిటింగ్: అన్వర్ అలీ
మ్యూజిక్: లియోన్ జేమ్స్
Runtime:151 Minutes
రిలీజ్ డేట్:22 -03-2023