మేక సూరి ఓటీటీ సిరీస్ ట్రైలర్ విడుదల

మేక సూరి  ట్రైలర్ విడుదల చేసిన నారా రోహిత్

తెలుగు ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా ‘జీ 5’ వినోదాత్మక కంటెంట్‌ను అందిస్తోంది. స్వచ్ఛమైన తెలుగు సిరీస్, డైరెక్ట్-టు-డిజిటల్ మూవీ రిలీజులు, ఒరిజినల్ కంటెంట్‌తో ‘జీ 5’ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ ప్రేక్షకులను మంత్రముగ్దులను చేస్తూనే ఉంది. ఇప్పుడు సరికొత్త సిరీస్ ‘మేక సూరి’తో వస్తోంది. సింబా ఎంటర్టైన్మెంట్, 1725 స్టూడియో నిర్మాణ సంస్థలపై తెరకెక్కిన ఈ సిరీస్‌కి కార్తీక్ కంచర్ల నిర్మాత. అతి త్వరలో ‘జీ 5’లో ప్రసారం కానున్న ఈ వెబ్ సిరీస్ ద్వారా థియేటర్ ఆర్టిస్టులు అభినయ్, సమయ మెయిన్ లీడ్ గా పరిచయం అవుతున్నారు.

‘మేక సూరి’ ట్రైలర్‌ను కంటెంట్‌కి ఇంపార్టెన్స్ ఇస్తూ సినిమాలు చేసే ప్రముఖ హీరో నారా రోహిత్ మంగళవారం సాయంత్రం విడుదల చేశారు. ఈ సిరీస్‌తో ‘మోసగాళ్లకు మోసగాడు’, ‘ఒక్క క్షణం’ చిత్రాలకు అసోసియేట్‌ డైరెక్టర్‌గా, ‘బ్రదర్‌ ఆఫ్‌ బొమ్మాళి’ చిత్రానికి అసిస్టెంట్‌ రైటర్‌గా పని చేసిన త్రినాధ్‌ వెలిసెల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ నెల 31న ‘జీ 5’లో ఈ సిరీస్ స్ట్రీమింగ్‌ కానుంది.

నారా రోహిత్ మాట్లాడుతూ “మోస్ట్ థ్రిల్లింగ్ అండ్ యాక్షన్ జానర్ ‘మేక సూరి’ ట్రైలర్‌ను విడుదల చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. దర్శకుడిగా పరిచయం అవుతున్న త్రినాధ్ వెలిసెల, జీ 5కి తెలుగు ఓటీటీకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు” అని అన్నారు.

కూటి కోసం కోటి విద్యలు అని పెద్దలు అన్నారు. అందులో సూరిది కసాయి (మేక తోలు వలిచి, మాంసం కొట్టే) వృత్తి. ఆరు అడుగుల మూడు అంగుళాల ఎత్తున్న సూరి, అవలీలగా నిమిషాల్లో మేక తోలు వలిచి ముక్కలు కొట్టేస్తాడు. దాంతో అతడి పేరు ‘మేక’ అయిపోయింది. అతడి ఊరిలో రాణి అని అందమైన అమ్మాయి ఉంటుంది. ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. ఆ ఊరిలో మూతి మీద మీసం వచ్చిన కుర్రాడి నుంచి మీసాలకు రంగు వేసుకునే ముసలోళ్ల వరకూ అందరి కన్ను రాణి మీదే! మగజాతి మనసు దోచిన రాణి ఓ రోజు హత్యకు గురవుతుంది. ఆమెను చంపింది ఎవరు? అందుకు కారణమైన వ్యక్తులపై సూరి ఎలా పగతీర్చుకున్నాడనేది ‘జీ 5’లో చూడాల్సిందే.

‘మేక సూరి’ బృందం మాట్లాడుతూ “ఎవరైనా ‘మేక సూరి’ నుండి తప్పించుకుని పరిగెత్తగలరు. కానీ, అతడికి కనిపించకుండా అజ్ఞాతంలోకి వెళ్ళలేరు. అతడు ప్రత్యర్థులు ఎక్కడ ఉన్నారో కనిపెట్టి మరీ ప్రతీకారం తీర్చుకుంటాడు. ప్రతి ఒక్కరూ చేసిన కర్మకు ఫలితాన్ని అనుభవిస్తారు. అతడి కోపం నుండి ఎవరూ తప్పించుకోలేరు” అని పేర్కొంది. 

*క్రైమ్‌ జానర్‌లో రూపొందిన యాక్షన్‌ థ్రిల్లర్‌ సిరీస్‌ ఇది! జూలై 31న ‘జీ 5’లో ఫస్ట్‌ పార్ట్‌ రిలీజ్‌ కానుంది.*

దీనికి పార్ధు సైనా ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వర్తించారు. ప్రజ్వల్‌ క్రిష్‌ సంగీతం అందించారు. ఇంతకు ముందు కన్నడలో ‘సరోజ’ చిత్రానికి ఆయన సంగీతం అందించారు.