వాల్తేరు వీరయ్య మూవీ రివ్యూ

Published On: January 13, 2023   |   Posted By:

వాల్తేరు వీరయ్య  మూవీ రివ్యూ

 

చిరు, రవితేజల ‘వాల్తేరు వీరయ్య’ రివ్యూ

Emotional Engagement Emoji

టాలీవుడ్ లో సంక్రాంతి పండగ సంబరం పీక్స్ కు వెళ్లింది.మెగాస్టార్ నటించిన వాల్తేరు వీరయ్య ఈ  సంక్రాంతి బరిలోకి ఈ రోజు దూకింది.ఈ సినిమాకు ఓ ప్రత్యేకత ఉంది. అదేమిటంటే….ఓ ఫ్యాన్ గా మెగాస్టార్ ని  డైరెక్ట్ చేశా… బాస్ ను ఎలా చూపించాలో తెలుసు అంటూ.. మెుదటి నుంచి చెప్పుకొస్తున్నాడు బాబీ. మరోవైపు ఈ సినిమాలో థమాకా సక్సెస్ తో దూకుడు మీద ఉన్న రవితేజ కూడా నటించారు. వీరిద్దరి కాంబినేషన్ లో అన్నయ్య సినిమా తర్వాత రిలీజైన చిత్రం ఇది.  ఈ క్రమంలో పెరిగిన అంచనాలకు తగినట్లు ఈ సినిమా ఉందా…అసలు ఈ చిత్రం కథేంటి…వర్కవుట్ అవుతుందా..సంక్రాంతి విన్నర్ గా నిలుస్తుందా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

స్టోరీ లైన్:

వైజాగ్ లోని జాలర్లపేట లో ఉండే  వాల్తేరు వీరయ్య(చిరంజీవి) మామూలోడు కాదు. మంచికి మంచి ..చెడు..చెడు అన్నట్లు దూసుకుపోతూంటాడు. అలాంటివాడు ఓ ఇంటర్నేషనల్ డ్రగ్ డీలర్ సోలొమాన్ సీజర్ (బాబీ సింహా) ని పట్టుకుని మట్టుపెట్టమని  సీతాపతి (రాజేంద్ర ప్రసాద్) అనే  పోలీస్ పెద్దమనిషి అడుగుతాడు. అందుకు డబ్బు ఇస్తానంటాడు. ఆ ఆఫర్ ఒప్పుకుని మలేషియా బయిలుదేరి వెళ్తాడు. అక్కడ తనదైన స్టైల్ లో లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ…ఆ డాన్ ని వెతుకుతూంటారు. అయితే ఇక్కడో ట్విస్ట్.. వీరయ్య మలేషియా వచ్చింది.. సోలోమన్ ను పట్టుకునేందుకు కాదు. మరి ఎవరి కోసం అంటే…. అతడి అన్నయ్య కాలా అలియాస్ మైఖేల్ సీజర్(ప్రకాశ్ రాజ్) ను అని రివీల్ అవుతుంది. ఇంతకి మైఖేల్ ఎవరు..అతనికు, వీరయ్యకి ఉన్న సంబంధం ఏంటి?ఈ కథలో  విక్రమ్ సాగర్(రవి తేజ) పాత్ర ఏంటి? వాల్తేరు వీరయ్య గతమేంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే..

స్క్రిప్టు ఎనాలసిస్ …

చిరంజీవిని మాస్ గా చూపెట్టడానికి దర్శకుడు బాబి రాసుకున్న కథ అది. అది జై చిరంజీవిలాగ మరో సినిమాలాగ అనిపిస్తే అది మన తప్పు. అతను రవితేజ, చిరంజీవిలను ఎలా ఎలివేట్ చేయాలి…వారి ఇంట్రడక్షన్స్ ని ఎలా దుమ్ము రేపాలి. ఫ్యాన్స్ చేత ఎలా జై కొట్టించుకోవావలనే పనిలో బిజీగా ఉన్నాడు. మిగతా విషయాలు ఏమి పట్టించుకోలేదు. సెకండాఫ్ లో అన్న,తమ్ముడు సెంటిమెంట్ ప్లే చేసారు. తెరపై కన్నీరు పెడుతూంటే చిరంజీవి మనకు ఏడవాలి అనిపిస్తుంది. సరే అవన్ని ప్రక్కన పెడితే చిరంజీవి  స్దాయికి తగ్గ కథ కాదు. కానీ ఆయన మాస్ క్యారక్టర్ గా వింటేజ్ లుక్ లో అలరించాలని ఫిక్స్ అయ్యినప్పుడు ఇంతకు మించిన కథ దొరికి ఉండదు.

ఎగురుతున్న హెలికాప్టర్ ని ఎగిరి దూకి క్యాచ్ చేయటం సాధ్యమా…కోర్టులో జడ్జి ఎదురుగా విలన్ తల తెంచటం సాద్యమా అంటే…..అచ్చమైన కమర్షియల్ సినిమా అంటే అలాగే ఉంటుందని అంటూంటాం.ఓకే…కానీ కమర్షయాలిటీ పేరు చెప్పి సినిమా ఎలాగున్నా చూసేస్తారా అంటే పాటలు, ఫైట్స్, చిన్న స్టోరీలైన్ ఉంటే చాలు అంటారు. అదే నిర్మాతలు నమ్ముతున్నట్లు ఉంది. అయితే నిజమైన అభిమానులకు మాత్రం మెగాస్టార్ ని పెట్టి చీఫ్ కామెడీ చేయటం నచ్చదు. జంబలకడి జారు మిఠాయి అంటూ చిరంజీవి పాడుతూంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది.  అల్లరి నరేష్ కు స్పూఫ్ లు పెట్టినట్లు   మాస్ సినిమాలకి కేరాఫ్ అడ్రస్ అయిన చిరంజీవితో చేయించటం సబబా అని అడగాలనిపిస్తుంది. చిరంజీవి సినిమా అంటే అదిరిపోయే డ్యాన్సులు, సటిల్డ్  కామెడీ, క్రింద బెంచీవాడిని సైతం అలరించే యాక్షన్ సీన్స్…ఇదో ప్యాకేజీ. ఈ మధ్యన వరస తప్పింది ..ఆచార్య,గాఢ్ ఫాధర్ ఏదో చేద్దామని ..ఏదేదో అయ్యిపోయినవి. మరి ఆ ప్యాన్స్ కు పూనకాలు రప్పించాలంటే అప్పటి చిరంజీవిని ప్రెజెంట్ చేయాలని ఫిక్స్ అయ్యారు. వింటేజ్ చిరంజీవి అనే ఒకే ఒక్క ఎలిమెంట్ తో మొత్తం లాగేద్దామనుకున్నారు. అందుకు తగ్గ కథ ఎన్నుకున్నారు.

చిరు  హిట్ సినిమాల్లో డైలాగ్స్ ,మేనరిజమ్స్ గుర్తు చేసేలా సీన్స్ రాసుకున్నారు. ఈ కాలం జనాలని అలరించాలని మీమ్స్ టైపులో సోషల్ మీడియాలో పాపులరైన కొన్ని ఎలిమెంట్స్ తీసుకొచ్చారు.  అన్ని బాగున్నాయి కానీ వీటన్నటినీ గుది గుచ్చే కథాంశం లేదు. కాసేపు ఫన్, మరికాసేపు విలనిజం, ఫైట్స్, పాటలు  ఇలా సాగిపోతూనే ఉంటాయి. చిరంజీవి చేసిన జై చిరంజీవ గుర్తు వస్తూంటుంది. మధ్యలో గబ్బర్ సింగ్ లో పాటను చిరంజీవి,శృతిహాసన్ లను చూపెడుతూ ప్లే చేస్తారు. లైటర్ వీన్ లో నడుపుతున్నామనుకుంటూ స్ఫూఫ్ లు చేస్తూంటారు. అసలు కథలోకి వచ్చేసరికి ఇంటర్వెల్. ఆ తర్వాత రవితేజ ప్లాష్ బ్యాక్, క్లైమాక్స్. ఏముంది అంటే అన్నీ ఉన్నాయి. అన్నీ బాగున్నట్లే ఉంటాయి. కానీ సగటు ప్రేక్షకుడుకి ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్. అదే చిరంజీవి మ్యాజిక్ అని అర్దమయ్యేసరికి సినిమా ఎండ్ కార్డ్ పడుతుంది.  అదీ విషయం.

నటీనటుల విషయానికి వస్తే…

ఈ సినిమా పూర్తిగా  చిరంజీవి ది, దేవిశ్రీ ప్రసాద్ ది. వీరిద్దరి కష్టం అడుగడుగునా కనిపిస్తుంది.చిరంజీవి బెస్ట్ లుక్స్, మ్యానరిజమ్స్ సినిమాలో ఆకట్టుకుంటారు. చాలా రోజుల తర్వాత మాస్ పాత్రలో అలరించాడు చిరు. రంగు రంగుల చొక్కలు వేసి ఫ్యాన్స్ కు పండగ చేసారు.  రవితేజ స్క్రీన్ ప్రెజన్స్, ఎనర్జీ సినిమాకు ప్లస్ పాయింట్ గా నిలిచింది.   చిరంజీవి, రవితేజ కనిపించినప్పుడల్లా స్క్రీన్ నిండుగా ఉంటుంది. మిగతా వాళ్లు  రొటీన్ గా చేసుకుంటూ పోయారు శృతి హాసన్ తో సహా.

టెక్నికల్ గా ..

హై  స్టాండర్డ్ లో ఉన్న చిత్రం ఇది. బాస్ పార్టీ, పూనకాల లోడింగ్, శ్రీదేవి, అందం ఎక్కువ వంటి పాటలతో దుమ్ము రేపాడు దేవి. ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ రూపొందించిన హార్బర్ సెట్ గురించి ఎంత చెప్పినా తక్కువే. రామ్ లక్ష్మణ్ ఫైట్స్ ఎప్పటిలాగే మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి…ఇంట్రవెల్ బ్లాక్ బాగుంది.  డైలాగ్స్ ఫన్ తో పండించారు. నిర్మాతలు నవీన్, రవిశంకర్  బాగా ఖర్చుపెట్టారు. ఎడిటింగ్ కూడా లాగ్ లు లేకుండా బాగుంది.

చూడచ్చా?

మరీ పూనకాలు ఎక్సపెక్ట్ చేస్తే కష్టం కానీ వింటేజ్ చిరంజీవిని చూడాలనుకుంటే మాత్రం మంచి ఆప్షన్

ఒక్క మాటలో …
ఫస్టాఫ్ పూనకాలు..సెకండాఫ్ పానకాలు

బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
నటీనటులు: చిరంజీవి, రవితేజ, శృతి హాసన్,  కేథరిన్ త్రెసా, బాబీ సింహా, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్, ఊర్వశి రౌతేలా తదితరులు
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
డీవోపీ: ఆర్థర్ ఎ విల్సన్
ఎడిటర్: నిరంజన్ దేవరమానే
ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్
స్క్రీన్ ప్లే: కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి
ఎడిషినల్ రైటింగ్: హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి
సిఈవో: చెర్రీ
కాస్ట్యూమ్ డిజైనర్: సుస్మిత కొణిదెల
కథ, మాటలు, దర్శకత్వం: కేఎస్ రవీంద్ర (బాబీ కొల్లి)
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్
సహ నిర్మాతలు: జీకే మోహన్, ప్రవీణ్ ఎం
Run Time: 2 గంటల 40 నిమిషాలు
విడుదల తేదీ: జనవరి 13 , 2023