వీరసింహారెడ్డి మూవీ రివ్యూ

Published On: January 12, 2023   |   Posted By:

వీరసింహారెడ్డి మూవీ రివ్యూ

బాలయ్య ‘వీరసింహారెడ్డి’రివ్యూ

 Emotional Engagement Emoji

సంక్రాంతి పండుగ, బాలయ్య ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ సినిమా.. ఈ రెండూ ఎప్పుడూ పే చేసే ఎలిమెంట్సే. అవే  ఈ సినిమాకి ప్రధాన బలం అవుతాయని.. కలెక్షన్స్ పరంగా బాలయ్య బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతాయని భావించటం లో తప్పుకూడా లేదు. అలాగని గతంలో బాలయ్య నటించిన ఓ నాలుగైదు సినిమాలను మిక్స్ చేసి..  సినిమా తెరకెక్కిస్తే వర్కవుట్ అవుతుందా…గోపీచంద్ మలినేని ఈ సారి ఏం మ్యాజిక్ చేసాడు. క్రాక్ వంటి హిట్ సినిమా ఇచ్చిన ఈ దర్శకుడు అంతకు మించి తన అభిమాన హీరోను ప్రొజెక్ట్ చేసాడా…అసలు కథేంటి వంటి వివరాలు రివ్యూలో చూద్దాం.

స్టోరీ లైన్

జయ సింహా రెడ్డి (బాలకృష్ణ) ఎక్కడో దేశం కానీ దేశం ఇస్తాంబుల్ లో తన తల్లితో కలిసి అక్కడ హోటల్, ఆటోమొబైల్ లు బిజినెస్ లు చేస్తూ హ్యాపీగా ఉంటూంటాడు. ఖాళీగా ఉండటం ఎందుకని…ఈష (శ్రుతిహాసన్)తో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనేస్తాడు. ఆమెకు సరే అని పాటలు అవీ పాడేసాక పెద్దలకు తెలుస్తుంది. వాళ్లు  మన జై ని మీ నాయనను తీసుకొస్తే పెళ్లి మాటలు మాట్లాడుకుందాం అంటారు. అప్పుడు కర్నూలు లోని పులిచర్ల గ్రామ పెద్ద, తండ్రి అయిన వీర సింహా రెడ్డి (రెండో బాలకృష్ణ) ఇస్తాంబుల్ లో దిగుతాడు. అంతా సెట్ అయ్యిపోయిందనుకున్న టైమ్ లో ఓ గ్యాంగ్ వారిపై ఎటాక్ చేస్తుంది. ఇస్తాంబుల్ లో ఫ్యాక్షన్ గ్యాంగ్ ఎటాక్ చేసింది ఎవరా అని విచారిస్తే…మరెవరో కాదు. ..చాలా కాలం నుంచి…వీరసింహారెడ్డిని చంపడం కోసం ప్లాన్ చేస్తున్న ప్రతాప్ రెడ్డి (దునియా విజయ్) అని తెలుస్తుంది. అతని భార్య భానుమతి (వరలక్ష్మి శరత్ కుమార్) ప్రధాన పాత్ర అని తెలుస్తుంది. ఇంతకీ తన గ్యాంగ్ తో ఇస్తాంబుల్ వచ్చి మరీ   వీరసింహారెడ్డితో తలపడతున్న వీళ్లు ఒకరికి మరొకరు ఏమౌతారు అంటే…వీర సింహా రెడ్డికు భానుమతి సొంత చెల్లి అని తెలుస్తుంది. అసలు తన సొంత చెల్లితో , వీరసింహా రెడ్డికు గొడవ ఎందుకు వచ్చింది. జయి సింహా రెడ్డి తన తల్లితో దేశం వదిలి ఇస్తాంబుల్ వచ్చి ఎందుకు బ్రతుకుతున్నాడు.   వీరసింహారెడ్డిపై ప్రతాప్ రెడ్డి పై చేయి సాధించాడా? వంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే  “వీరసింహారెడ్డి” చూడాల్సిందే.

స్క్రిప్టు ఎనాలసిస్ …

బాలయ్య సినిమాకు స్క్రిప్టు ఏమిటి…నాలుగు ఫైట్స్, ఆరు పాటలు ఉంటే చాలవా అనేది ఒకప్పటి మాట. ఇప్పుడు మారుతున్న రోజుల్లో అభిమానులు కూడా ఆచి,తూచి చూస్తున్నారు. సినిమా బాగుంటేనే భుజాన మోస్తున్నారు. లేకపోతే మొదటి రోజునే బై చెప్పేస్తున్నారు. ఈ చిత్రం స్క్రిప్టు విషయంలో గోపీచంద్ మలినేని ..బాలయ్య ఇమేజ్ ని ఎలివేట్ చేసి క్యాష్ చేసుకోవాలనే తాపత్రయం కనపడుతుందే కానీ ఫెరఫెక్ట్ గా స్క్రిప్టు డిజైన్ చేసిన తీరు కనపడదు. లేకపోతే సినిమా ప్రారంభంలో వచ్చే యంగ్ బాలయ్య,శృతి హాసన్ సీన్స్  అంత బిలో యావరేజ్ గా ఉండటం ఏమిటి…సెకండాఫ్ నీరసంగా ఉండి…క్లైమాక్స్ ఇక చాల్లే బయిలుదేరదాం అని లేచి వెళ్లిపోయేలా అనిపించటం ఏమిటి…ఇదంతా మినిమం జాగ్రత్తలు కూడా తీసుకోకపోవటం వల్ల వచ్చిన సమస్య. బాలయ్య వంటి హీరోకు సరైన ప్రత్యర్దిని పెట్టాలి…ఏదో విలన్ ఉన్నాడంటే ఉన్నాడు అనుకుంటే చాలదు. అదే మిస్సైంది.

సినిమాకు వెళ్లిన జనం ఎప్పుడు వీర సింహా రెడ్డి వస్తాడా అని ఎదురూచూసి..రాగానే విజిల్స్ వేస్తారు. వాళ్లకు తెలుసు…ఈ కథ ఆ పాత్రదే అని. అయితే ఆ పాత్ర గెటప్ ,లుక్ ని బాలయ్య అదరకొట్టాడు. కానీ అందుకు తగ్గ కథని సప్లై చేయలేకపోయారు. అప్పటికీ తన మేనరిజంస్ తో, తన డైలాగ్ డెలవరీతో ఫస్టాఫ్ ని ఊపుగా లాక్కొచ్చేసాడు. కానీ సెకండాఫ్ లో చల్లబడ్డాడు. అసలు విషయంలేని ఫ్లాష్ బ్యాక్ తో సాగే ఆ ఎపిసోడ్స్ ని మోయలేక వదిలేసాడు. అంతే ఆ పడటం..పడటం క్లైమాక్స్ లో కూడా లేవలేదు. ఎప్పుడూ కత్తి పట్టుకుని ఫైట్ చేసేస్తే అదే మాసా…అందుకు తగ్గ ఎమోషన్ కూడా ఉండాలి కదా. బాలయ్య అభిమానిగా ఆయన సినిమాల్లో తనకు నచ్చిన ఎపిసోడ్స్ కొన్ని ఏరుకొచ్చి కలిపి  సీన్స్ గా మార్చేస్తే నడిచిపోతుందా… చెల్లి సెంటిమెంట్ అయితే దారుణం…వాళ్లిద్దరికి తగువు వచ్చిన ప్లాష్ బ్యాక్స్ సీన్స్…అసలు పండలేదు. ఆ సీన్స్ జస్టిఫై చేయలేకపోయాయి.

టెక్నికల్ గా చూస్తే …

థమన్ కు ఎక్కువ మార్కులు పడతాయి. మాస్ జనాలకు ఏం కావాలో ఆ జాగ్రత్తలు అన్నీ తీసుకుని . పాటలు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్.. థమన్ ప్రాణం పెట్టే చేశాడు. కొన్ని యాక్షన్ బ్లాక్ లు కేవలం థమన్ మ్యూజిక్ వల్లే ఎలివేట్ అయ్యాయంటే ఆతిశయోక్తి కాదు. సాంగ్స్ఇంకొంచెం బాగుండాల్సి అనిపిస్తుంది.  “జై బాలయ్యా…” అంటూ సాగే పాట అభిమానులను అలరిస్తుంది. మిగిలిన వాటిలో “సుగుణసుందరీ…”, “మా బావ మనో భావాలు…”, “మాస్ మొగుడు…” అనే పాటలూ మాస్ ను ఆకట్టుకుంటాయి. అయితే అఖండ స్థాయిలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం లేదు.  సినిమా నిర్మాణ విలువలు పర్వాలేదు. కెమెరా వర్క్ బాగుంది. సినిమా రన్‌ టైమ్ ఇంకాస్త తగ్గించి ఉంటే బాగుండేది.  ఎడిటర్ చాలా చోట్ల లాగ్ లు వదిలేసారు.   సాయిమాధవ్ బుర్రా డైలాగులు కొన్ని చోట్ల బాగా పేలాయి. ముఖ్యంగా పొలిటికల్ పంచ్   డైలాగులకు మాత్రం థియేటర్ రెస్పాన్స్ అదిరింది.

నటీనటుల్లో…

వీర సింహారెడ్డిగా బాలకృష్ణ మరెవ్వరూ ఆ పాత్ర చేయలేరన్న స్దాయిలో ఒదిగి పోయారు.  బాలకృష్ణ మాస్ లుక్ లో.. విలేజ్ కు  చెందిన పెద్ద మనిషి గా చాలా నాచురల్‌ గా కనిపించాడు.  మాస్ డైలాగ్స్ తో అలరించాడు.శృతి హాసన్‌ గురించి చెప్పుకోవటానికి పెద్దగా ఏమీ లేదు.  లుక్స్ పరంగా అలరించింది.  కానీ ఆమెకు నటనపరంగా పెద్దగా స్కోప్‌ దక్కలేదు. శృతీ  కామెడీ సీన్స్  బోర్ . డాన్స్ లతో శృతి హాసన్‌ ఆకట్టుకుంది.సినిమాలోని హనీ రోజ్‌ పాత్ర నిజంగా ఆశ్చర్యకరంగా ఉంది.  కన్నడ నటుడు దునియా రూపం సెట్ అయినా..ఎక్సప్రెషన్స్ ఇవ్వలేకపోయాడు.

ఎలా ఉంది

ఫస్టాఫ్ జై…సెకండాఫ్ నై…ఓవరాల్ గా ఫ్యాన్స్ కు సై…మిగతావాళ్లుకు ఓ సారి ట్రైయ్

నటీనటులు & సాంకేతికవర్గం :

బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
నటీనటులు: నందమూరి బాలకృష్ణ, శృతిహాసన్, వరలక్ష్మీ శరత్ కుమార్, హానీ రోజ్, దునియా విజయ్, నవీన్ చంద్ర, పీ రవిశంకర్, అజయ్ ఘోష్, మురళీ శర్మ, చంద్రిక రవి, సప్తగిరి తదితరులు
సినిమాటోగ్రఫి: రిషి పంజాబీ
ఎడిటింగ్: నవీన్ నూలి
మ్యూజిక్: ఎస్ థమన్
రన్ టైమ్ : 169 మినిట్స్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: గోపిచంద్ మలినేని
నిర్మాతలు: నవీన్ యెర్నీని, రవిశంకర్ వై
విడుదల తేదీ :12, జనవరి 2023