శ్రీధర్‌ సీపాన బర్త్‌డే ఇంటర్వ్యూ

Published On: July 29, 2020   |   Posted By:

శ్రీధర్‌ సీపాన బర్త్‌డే ఇంటర్వ్య

మెగాస్టార్‌ కాంప్లిమెంట్‌తో ఆస్కార్‌ వచ్చినంత సంబరపడ్డా– శ్రీధర్‌ సీపాన బర్త్‌డే ఇంటర్వ్యూ

‘లౌక్యం’ తెలిసిన రచయిత శ్రీధర్‌ సీపాన. ఏకకాలంలో ఐదారు చిత్రాలకు పని చేయగల సమర్ధుడు. ఆయన మాటల ‘పూలరంగడు’. వినోదంతో పాటు విలువైన విషయాలను చక్కగా చెప్పగలడు. కమర్షియల్‌ కథలకు కత్తిలాంటి మాటలు రాసి, కామెడీతో ప్రేక్షకులను మెప్పించగల రైటర్‌.. ‘లౌక్యం’, ‘పూలరంగడు’, ‘ఆహనా పెళ్ళంట’ తదితర విజయవంతమైన చిత్రాలకు ఆయన రచయితగా పని చేశారు. జూలై 29న శ్రీధర్‌ సీపాన పుట్టినరోజు.

ఈ సందర్భంగా ఆయనతో ఇంటర్వ్యూ…

హలో శ్రీధర్‌ సీపాన గారు… హ్యాపీ బర్త్‌డే.

థ్యాంకూ సో మచ్‌

బర్త్‌డేను ఎలా సెలబ్రేట్‌ చేసుకున్నారు

స్పెషల్‌ సెలబ్రేషన్స్‌ ఏమీ లేవు. ఫ్యామిలీ మెంబర్స్‌ మధ్య ఇంట్లో సెలబ్రేట్‌ చేసుకున్నా. ప్రజెంట్‌ కరోనా వల్ల అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్ళడం లేదు. ఇల్లు, ఆఫీసు, పని అంతే!

రైటర్‌గా ఈ ఇయర్‌ ఎలా ఉంది?

నేను అయితే ఎప్పటికీ మరువలేను. మెగాస్టార్‌ చిరంజీవిగారు, చక్కటి సందేశాత్మక కథలకు కమర్షియల్‌ విలువలు మేళవించి సినిమాలు రూపొందించే దర్శకుడు కొరటాలశివగారి కాంబినేషన్‌లో ఫస్ట్‌టైమ్‌ వస్తున్న ‘ఆచార్య’ సినిమా స్ర్కిప్ట్‌ వర్క్‌లో పాలు పంచుకున్నా. వాళ్ళిద్దరితో మంచి రిలేషన్‌ ఏర్పడింది. అలాగే, దర్శకుడిగా నా మొదటి సినిమా స్ర్కిప్ట్‌ వర్క్‌ కంప్లీట్‌ చేశా. చిరంజీవిగారి అల్లుడు కల్యాణ్‌దేవ్‌ హీరోగా జీఏ2 పిక్చర్స్‌ సమర్పణలో పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ టీజీ విశ్వప్రసాద్‌గారు, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ అభిషేక్‌గారు నిర్మిస్తారు.

దర్శకులుగా మారుతున్న రచయితల జాబితాలో మీరు చేరుతున్నారన్నమాట

తన ఊహలకు అనుగుణంగా తన కథను తెరపై ఆవిష్కరించుకున్నప్పుడు రచయితలకు కిక్‌ వస్తుంది. సంతృప్తి దొరుకుతుంది. ఆ కిక్‌ కోసమే రచయితలందరూ దర్శకులు అవుతారు. నేనూ అలాగే ఆలోచించి మెగాఫోన్‌ పట్టాను.

దర్శకుడు అవుతున్నారు. రచన పరంగా ఇతర దర్శకుల సినిమాలకు దూరంగా ఉంటారా?

అటువంటిది ఏమీ లేదు. రచన, దర్శకత్వం  రెండూ నాకు రెండు కళ్ళు వంటివి. ఓ కన్ను కోసం మరో కన్నును వదులుకోలేను. రచయితగా ఒక్కోసారి ఐదారు చిత్రాలకు పని చేసిన సందర్భాలు ఉన్నాయి. అందువల్ల, దర్శకత్వంతో పాటు అవకాశాలు వస్తే రచయితగా కూడా కొనసాగుతా. రైటింగ్‌కి దూరం కాను. కేవలం నా సినిమాలు మాత్రమే కాకుండా…. ఇతరుల సినిమాలకు కూడా రాస్తా. దర్శకుడినైనా రచయితగా నా ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది.

కల్యాణ్‌దేవ్‌తో మీ సినిమా ఎలా ఉండబోతుంది?

కంప్లీట్‌ ఎంటర్‌టైనర్‌ అది. ప్రేక్షకులను పూర్తిగా నవ్విస్తుంది. అలాగే, మధ్య మధ్యలో మంచి ఎమోషనల్‌ సీన్స్‌ కూడా ఉంటాయి.

చిరంజీవిగారికి ఆ సినిమా కథ చెప్పారా?

‘ఆచార్య’ స్ర్కిప్ట్‌ వర్క్‌లో పాలు పంచుకున్నానని చెప్పాను కదా! అలా చిరంజీవిగారితో పరిచయం ఏర్పడింది. ఆయన దగ్గరకు కథ చెప్పడానికి కల్యాణ్‌దేవ్‌గారు నన్ను తీసుకువెళ్ళారు. కథంతా విన్నాక ‘సుదీర్ఘంగా కథ వింటున్నప్పుడు మధ్యలో రెప్పలు పడతాయి. నువ్వు కథ చెబుతుంటే రెప్ప వేయకుండా విన్నాను. ఆద్యంతం నవ్వుతూ విన్నాను’ అని చిరంజీవిగారు చెప్పారు. ఆ మాట ఆస్కార్‌ అవార్డు వచ్చినంత సంతృప్తినిచ్చింది. అలాగే, రాఘవేంద్రరావుగారు, కొరటాల శివగారు విని బావుందని మెచ్చుకున్నారు. ప్రోత్సహించారు.

రచయితగా, దర్శకుడిగా మీ లక్ష్యం ఏంటి?

ప్రతి సినిమాతో ప్రేక్షకులకు చక్కటి వినోదాన్ని అందించడమే నా లక్ష్యం. హెల్డీ కామెడీ అందిస్తా.

మీ ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌?

కల్యాణ్‌దేవ్‌ సినిమా చేస్తున్నా. అలాగే, రాఘవేంద్రరావుగారు దర్శకత్వం వహించనున్న ఓ సినిమాకి సంభాషణలు రాస్తున్నా. అనిల్‌ సుంకర నిర్మాణంలో మరో సినిమా చేయాలి. శ్రీనివాస్‌ వంగాల నిర్మాణంలో నేను దర్శకత్వం వహించిన ‘బృందావనమది అందరిదీ’ షూటింగ్‌ కంప్లీట్‌ చేశా. కల్యాణ్‌దేవ్‌ సినిమా తర్వాత ఓటీటీలో ఆ సినిమా రిలీజవుతుంది.