సత్తి గాని రెండెకరాలు మూవీ రివ్యూ

Published On: May 26, 2023   |   Posted By:

సత్తి గాని రెండెకరాలు మూవీ రివ్యూ

Emotional Engagement Emoji

మైత్రీమూవీస్ ప్రొడక్షన్ హౌస్ మొన్న సంక్రాంతికి రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చింది. వారు ఇప్పుడు ఓటిటి స్పేస్ లోకి కూడా ప్రవేశిస్తూ  సత్తి గాని రెండెకరాలు అనే బ్లాక్ కామెడీని అందించారు. ఆహా ఒరిజనల్ గా వచ్చిన ఈ ఫిల్మ్ లో పుష్ప ఫేమ్ జగదీష్ బంఢారీ ని లీడ్ రోల్ కి తీసుకున్నారు. దాంతో సహజంగానే ఈ ప్రాజెక్టుపై అందరి దృష్టీ పడింది. దానికి తోడు ప్రోమోలు, పబ్లిసిటి మెటిరీయల్ సైతం ఆకట్టుకునేలా ఉన్నాయి. మరి అందుకు తగ్గ కంటెంట్ కూడా ఈ ఓటిటి సినిమాలో ఉందా లేకపోతే లైట్ తీసుకోవాల్సిన సినిమానా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

కథ:

సత్తి (జగదీష్‌ ప్రతాప్‌) ఉన్నవి రెండు ఎకరాలే. అదీ తగలెట్టద్దు అని తాత మాట తీసుకున్నాడు. కానీ ఇంటినిండా కష్టాలే. తను ఆటో నడుపుతూ వాటిని లాగేద్దామనుకున్నా తన వల్ల కాదు. మరీ ముఖ్యంగా తన చిన్న బిడ్డకు గుండెలో చిల్లు ఉండటంతో  ఆపరేషన్ అవసరం 25 లక్షలు కావాలి. కానీ ఆటో అమ్మినా అంత డబ్బు రాదు. ఏం చేయాలి పొలం అమ్మేయాలా వద్దా అనే డైలమా ఈ టైమ్ లో ఓ రోజు అదే ఆలోచనలో ఉండి సైకిల్ పై వెళ్తూంటే తన ఎదురుగా వెళ్లే ఓ కారు చెట్టుని గుద్దుకుంటుంది. వెనకే వెళ్లి కారులోకి చూసిన సత్తికు అక్కడో సూటుకేసు కనపడుతుంది. దాంతో తన కష్టాలు తీర్చటానికి భగవంతుడే పంపినట్లుగా ఆ సూటుకేసుని తీసుకుని సైలెంట్ గా వచ్చేస్తాడు. అయితే అసలు కష్టాలు అక్కడ నుంచి మొదలవుతాయి. ఇంతకీ ఆ కారు ఎవరిది. ఆ సూటుకేసులో ఏముంది తన బిడ్డకు ఆపరేషన్ చేయించుకున్నాడా ఏమైంది వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎనాలసిస్:

ఇలాంటి సింగిల్ లైన్ కాన్సెప్టు చుట్టూ తిరిగే కథలు ఎక్కువగా హాలీవుడ్ లో వస్తూంటాయి. ఓటిటి విభిన్న కథా వేదిక కాబట్టి ఇక్కడ కూడా అలాంటివి ట్రై చేయవచ్చు అని దర్శకుడు ఈ పాయింట్ ని భుజాన వేసుకున్నాడు. అయితే ఈ కథలో విస్తరణ జరగలేదు. కష్టాల్లో ఉన్న ప్రధాన పాత్రకు సూటుకేసు దొరుకుతుందనే పాయింట్ నుంచి కథ పరుగెత్తాల్సి ఉండగా అక్కడే ఆగిపోయింది. ముందుకు వెళ్లకుండా దోబూచిలాడుతుంది. దాంతో స్క్రీన్ టైమ్ ముందుకు వెళ్లేకొలిగి మనలో అసహనం పెరగటం తప్పించి ఏమీ ఉండదు. ఇలాంటి క్రైమ్ కామెడీలుకు కథ పరుగెడుతూ,ట్విస్ట్ లు రివీల్ అయితేనే సినిమాలో బ్యూటీ వస్తుంది. అలాగే సూటుకేసు కు సంభందించిన వాళ్లు కథలోకి వచ్చి  హీరోని, అతని స్నేహితుడుని బెదిరిస్తేనే కాంప్లిక్ట్స్ పుట్టి డ్రామా వస్తుంది. అదేమీ ఈ సినిమాలో జరగలేదు.అలాగే టైటిల్ ని జస్టిఫై చేస్తూ ఆ రెండు ఎకరాలను అతను అమ్మాల్సిన తప్పని సరి పరిస్దితులు ఏర్పడవు. అంతా కథా రచయిత తను అనుకున్నట్లే పాత్రలను ముందుకు తీసుకెళ్తాడు. దాంతో సగటు ప్రేక్షకుడుకి ఈ సినిమా ఎదర ఏం జరగుతోందో ఊహించటం కష్టం అనిపించదు. ఇక బిత్తిరి సత్తి, వెన్నెల కిషోర్ కామెడీ సీన్స్ రిపీట్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది. క్లైమాక్స్ లో ట్విస్ట్ ఏమీ గొప్పగా లేదు. అయితే సినిమాలో మిగతా పార్ట్ లో అసలేమీ లేకపోవటం వల్ల ఉన్నంతలో క్లైమాక్స్ పార్ట్ కాస్త ఇంట్రస్టింగ్ గా అనిపిస్తే అది మీ తప్పు కాదు.

ఫెరఫార్మెన్స్ లు :

సత్తిగా జగదీష్ ప్రతాప్ బండారి ది నాచరుల్ నటన తెలంగాణా పల్లెలో ఉండే చాలా మంది గుర్తుకు వస్తారు.!  వెన్నెల కిశోర్ క్యారక్టర్ ఇంకా బాగా రాసుకోవాల్సింది. బిత్తిరి సత్తి చేత కాస్త కొత్తగా ట్రై చేసారు. హీరో ప్రెండ్ పాత్రలో రాజ్ తిరందాసు బాగా నటించారు. గల్లీ బాయ్స్ రియాజ్ చిన్న పాత్రలో కనిపించారు. ఊరి సర్పంచ్ పాత్రలో మురళీధర్ గౌడ్బాగా చేసారు.

టెక్నికల్ గా :

కెమెరామెన్ సహజంగా ఉండేలా లొకేషన్స్ ఎంచుకుని  తెలంగాణ పల్లెని అద్బుతంగా చూపించారు. జై క్రిష్ సాంగ్స్ లో గుర్తుండేవి ఏమీ లేవు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ జస్ట్ ఓకే. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. . డైలాగులు బాగున్నాయి. చాలా చోట్ల పేలాయి. దర్శకుడు తొలి సారి అయనా ఎక్కడా ఆ తడబాటు లేదు. స్క్రిప్టు మంచిది తీసుకుంటే మంచి సక్సెస్ కొడతారు.

చూడచ్చా:

కామెడీ కోసం అని కాకుండా కాలక్షేపానికి ఓటిటిలోనే కదా అనుకుని ఓ సారి ట్రై చేయచ్చు. ఎక్సపెక్టేషన్స్ పెట్టుకుంటే మాత్రం నిరాశ ఖాయం.

సాంకేతికవర్గం :

బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్, ఆహా
నటీనటులు: జగదీష్ ప్రతాప్ బండారి, అనీషా దామ, వంశీధర్ గౌడ్, మోహన శ్రీ సురాగ, రాజ్ తీరందాస్, బిత్తిరి సత్తి, వెన్నెల కిషోర్ తదితరులు
సినిమాటోగ్రఫీ: విశ్వనాథ్ రెడ్డి
సంగీతం: జై క్రిష్
ఆర్ట్ : జి ఎమ్ శేఖర్
సాహిత్యం: కాసర్ల శ్యామ్, నిఖిలేష్
రచన, దర్శకత్వం, ఎడిటింగ్: అభినవ్ రెడ్డి దండ
నిర్మాత: వై. రవి శంకర్, నవీన్ ఏర్నేని
రన్ టైమ్ :111 నిముషాలు
ఓ టి టి స్ట్రీమింగ్ : ఆహా తెలుగు
విడుదల తేదీ: మే 26, 2023