సామాన్యుడు మూవీ రివ్యూ

విశాల్  `సామాన్యుడు’రివ్యూ
.Emotional Engagement Emoji (EEE)
 
👍

యాక్షన్ డ్రామాలు మంచి క‌మ‌ర్షియ‌ల్ ఎస్సెట్ ఉండే సినిమాలు. పైగా క్రింద వర్గాలని, బి,సి సెంటర్ల ని ఈజీగా టార్గెట్ చేయొచ్చు. యాక్షన్ అంటే.. క‌చ్చితంగా ఓ విలన్ ..హీరో…ఓ సమస్య వీటితో జరిగే  ప్ర‌యాణం. దాంతో  చాలా మంది ఇట్టే క‌నెక్ట్ అయిపోతారు. కాక‌పోతే… ఇలాంటి క‌థ‌ల్ని మెప్పించ‌డం ఆషామాషీ వ్య‌వ‌హారం కాదు. ఏ యాక్షన్ క‌థైనా ఒకేలా ఉంటుంది. ఆ గ్రాఫ్‌లో పెద్ద‌గా మార్పు ఉండ‌దు. అలాంటప్పుడు ప్ర‌తీ క‌థ‌నీ కొత్త‌గా చూపించ‌డం చాలా కష్టం. చేయితిరిగిన కథకులకు తప్పించి మిగతావారికి కత్తిమీద సామే. అందుకే యాక్షన్  డ్రామాలు అయితే సాలిడ్  హిట్ అవుతాయి, లేదంటే సోసోగా సర్దుకుంటాయి. ఇప్పుడు అలాంటి మ‌రో క‌థ వ‌చ్చింది. అదే   `సామాన్యుడు’. విశాల్  మెయిన్ లీడ్ కావ‌డం, ఇదో యాక్షన్ డ్రామా అవ్వ‌డంతో… అంద‌రి దృష్టీ ఈ సినిమాపై ప‌డింది. అయితే… ఎప్పుడో విడుద‌ల కావాల్సింది. అనుకోని అవాంత‌రాల్ని దాటుకుని, వాయిదాల ప‌డుతూ, లేస్తూ..చివ‌రికి ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మ‌రి ఈ   `సామాన్యుడు’ఎలా ఉన్నాడు? హిట్ కొడతాడా.?

స్టోరీ లైన్

తన తండ్రిలాగే పోలీస్ అవ్వాలనేది పోరస్ (విశాల్) జీవితాశయం. అందుకోసం ఫిజకల్ గా కష్టపడుతూ..పరీక్షలు రాసి రిజల్ట్ కోసం ఎదురుచూస్తూంటాడు. అయితే పోలీస్ అవ్వకముందే అతనో హత్య కేసుని సాల్వ్ చేయాల్సి వస్తుంది. అది మరెవరిదో కాదు తన చెల్లి(రవీనా రావి) దే. తన తండ్రి కానీ, పోలీస్ డిపార్టమెంట్ కానీ పలుకుబడి ఉన్నవాళ్ల తరుపునే ఉంటుందని కళ్ళారా చూసిన పోరస్ తనే స్వయంగా రంగంలోకి దిగుతాడు. తన చెల్లితో పాటు ఆమె ప్రియుడు కూడా హత్యకు గురి అయ్యాడని తెలుసుకుంటాడు. క్లూలతో ఈ మర్డర్ మిస్టరీలను ఛేదించే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో ఎంపీ అవ్వుదామని ప్రయత్నిస్తున్న నీలకంఠం (బాబురాజ్ జాకబ్) విషయం బయిటకు వస్తుంది. అతనికి ఈ మర్డర్స్ కు సంభందం ఏమిటి..అసలు ఈ మర్డర్స్ వెనక ఉన్న అసలు విషయం ఏమిటి…పోరస్ పోలిస్ అయ్యాడా..అతని లవర్  మైథిలి (డింపుల్ హయాతి) ఎవరు వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

స్క్రీన్ ప్లే  విశ్లేషణ

విశాల్  ట్రాక్ రికార్డ్ విచిత్రమైనది. `పందెంకోడి` తప్ప తన కెరీర్ లో పెద్ద హిట్ కొట్టిన ఘనత లేదు. కానీ వరసగా సినిమాలు చేస్తూనే ఉంటాడు. తన అదృష్టానికి పరీక్షలు పెడుతూనే ఉంటాడు. మాగ్జిమం ఎప్పుడూ యాక్షన్ డ్రామాలే  ఎంచుకుంటాడు… ఆ పాత్రలో విశాల్ క‌నిపింస్తున్నాడన‌గానే ఓ వర్గంలో  ఆస‌క్తి ఏర్ప‌డుతుంది. వాళ్లే అతని సినిమాలకు  మహారాజ పోషకులు. అందుకేనేమో అతను తన సినిమాల్లో కథ, స్క్రీన్ ప్లే వంటివేమీ పెట్టుకోవటం లేదు.  అయితే అలా తనను నమ్మి వచ్చిన వాళ్లని  కుర్చీల‌కు అతుక్కుని పోయేలా చేయ‌డు. అక్కడే విశాల్ మరోసారి … ఫెయిల్ అయ్యాడు. క‌థ చాలా సాదా సీదాగా, నీర‌సంగా మొద‌ల‌వుతుంది. ఇదంతా తుఫాను ముందుండే ప్ర‌శాంత‌త ఏమో… ఎదర ఏదైనా అద్భుతాలు జరుగుతాయోమో అని ప్రేక్ష‌కులు ఎదురు చూస్తుంటారు. కానీ.. శుభం కార్డు ప‌డేంత వ‌ర‌కూ అలాంటివేం జ‌ర‌గ‌వు. అప్పుడు అర్దమవుతుంది ఈ సినిమాకు సామాన్యుడు అనే టైటిల్ ఎందుకు పెట్టారో.

పాత్ర‌ల ప్ర‌వ‌ర్త‌న‌, వాటిని తీర్చిదిద్దిన విధానం.. ఇవ‌న్నీ పాత చింత‌కాయ ప‌చ్చ‌డి ఫార్ములాలా అనిపిస్తే అది విశాల్ త‌ప్పు కాదు. వాటినే అతను నమ్ముకున్నాడు. హీరో  గెలిచిన‌ప్పుడో, ఓడిన‌ప్పుడో ఆ గెలుపు – ఓట‌మి ప్రేక్ష‌కులు ఫీల‌వ్వాలి. కానీ అలాంటివేం జ‌ర‌గ‌వు. తెరపై హీరో విలన్ …అంతుచూసేస్తున్నా …థియేట‌ర్లో ప్రేక్ష‌కుడికి ఎలాంటి ఉద్వేగం రాదు. అలాంట‌ప్పుడు యాక్షన్  డ్రామాలు ఎందుకు పండుతాయి..? నిజానికి హిట్టైన ఏ యాక్షన్ డ్రామా అయినా.. వాటి చుట్టూ బ‌ల‌మైన ఎమోషన్స్ కాంపౌండ్ వాల్ గా పేర్చ‌డ‌ి కాపాడతాయి. ఈ సినిమాలో అదీ లేదు. ఓద‌శ‌లో నిజంగా ఈ క‌థ‌ని దర్శకుడు ఎలా రాశాడు? విశాల్  ఎందుకు ఒప్పుకుని నటిస్తూ ప్రొడ్యూస్ చేసాడు? అనిపిస్తుంది. ఏదైమైనా క్లైమాక్స్ వ‌ర‌కూ ప్రేక్ష‌కుడు ఓపిగ్గాకూర్చోవ‌డం కూడా క‌ష్ట‌మే.

టెక్నికల్ గా…

ఈ సినిమాలో ఒక్కటే పాట…అది  కూడా గుర్తు ఉండ‌దు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అలాగే ఉంది. కెమెరా వ‌ర్క్ ఎంత బాగున్నా, స్క్రీన్ పై పాత చింత‌కాయ్ ప‌చ్చ‌డి టైపు సీన్లు చూస్తుంటే ఎవ‌రికీ ఏమీ అనిపించలేదు.  స్క్రిప్టు వరంగా ఈ క‌థ‌పై పూర్తి స్థాయి క‌స‌ర‌త్తు చేయ‌లేద‌న్న‌ది నిజం. ప్ర‌తిభావంతులైన న‌టీన‌టులు, బ‌ల‌మైన సాంకేతిక నిపుణుల్ని.. ద‌ర్శ‌కుడు స‌రైన రీతిలో వాడుకోలేక‌పోయాడు. డైరక్షనా్ సోసోగా ఉంది.

నటీనటుల్లో ..

నిజానికి ఈ పాత్ర‌లో విశాల్  స్పెషల్ గా చేసిందేం లేదు. `సినిమా అంతా నేనే క‌నిపిస్తా. ఫైట్స్ చేస్తా…అది చాలు` అనుకుని చేసినట్లుంది. విలన్  పాత్ర మ‌రీ రొటీన్ అనే ప‌దానికి కేరాఫ్ అడ్ర‌స్స్ గా మారిపోయింది. యోగిబాబు కి ఇది కొత్త త‌ర‌హా పాత్రే. కానీ చివ‌రి వ‌ర‌కూ… నవ్వించలేకపోయాడు. డింపుల్ హయాతి  హీరో లవర్ గా ఏదో ఉందంటే ఉందనిపించింది.

చూడచ్చా

ఈ మధ్యకాలంలో పాత సినిమాలు చూడటం లేదని ఫీలింగ్ ఉంటే ఈ పాత కథతో వచ్చిన కొత్త సినిమా చూడచ్చు

తెర ముందు…వెనక

నటీనటులు: విశాల్, డింపుల్ హయతి, యోగిబాబు, మారిముత్తు, తులసి, రాజా, బాబూరాజ్, ఇలంగో కుమారవేల్, రవీనా రాజ్
సంగీతం: యువన్ శంకర్ రాజా
సినిమాటోగ్రఫీ: కావిన్ రాజ్
ఎడిటర్: ఎన్ బి శ్రీకాంత్;
కళ: ఎస్ఎస్ మూర్తి
రచన, దర్శకత్వం: తు.పా. శరవణన్
నిర్మాత: విశాల్;
రన్ టైమ్: 2 hours and 47 minutes.
విడుదల తేదీ:ఫిబ్రవరి 4, 2022.