విక్రాంత్ రోణ మూవీ రివ్యూ

Published On: July 28, 2022   |   Posted By:

విక్రాంత్ రోణ మూవీ రివ్యూ

Emotional Engagement Emoji (EEE)

👍

ఈగ తో తెలుగులో మంచి గుర్తింపు సంపాదించిన సుదీప్ ఆ పాపులారిటీని తర్వాత వాడుకోలేకపోయాడనే చెప్పారు. ఆ తర్వాత ఇక్కడ పెద్దగా సినిమాలు చేయలేదు. అత్యుత్సాహంతో రిలీజ్ చేసిన తన డబ్బింగ్ సినిమాలు అసలు వర్కవుట్ కాలేదు. ఈ క్రమంలో విక్రాంత్ రోణ తో పరిస్థితి మారుతుందని, తెలుగులో మళ్లీ తనదైన ముద్ర వేయగలనని ఆశిస్తున్నాడు సుదీప్. డైరెక్ట్ తెలుగు సినిమా తరహాలో రిలీజ్ గట్టిగానే చేసాడు. మరి ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఎంత మెప్పించింది, కథేంటి, తెలుగువారికి నచ్చే సినిమానేనా?

కథేంటి

ఇది అరవై, డబ్బైల్లో జరిగే పీరియడ్ డ్రామా. కర్ణాటకలోని కొమరట్టు అనే గ్రామం. అక్కడో పోలీస్ ఇన్‌స్పెక్టర్‌ అనుమానస్పదంగా మరణిస్తాడు. అలాగే మరికొంత మంది ఆ ఊరి పిల్లలు అనుమానస్పద పరిస్దితుల్లో చనిపోతారు. ఇదంతా అక్కడ ఉన్న ఓ బ్రహ్మరాక్షసుడు చేస్తున్నాడని అక్కడ అందరూ చెప్పుకుంటూంటారు. రాత్రి అయితే అందరికి భయం. ఆక్రమంలో చనిపోయిన పోలిస్ ప్లేస్‌లో ఆ గ్రామానికి ఇన్‌స్పెక్టర్‌గా వచ్చిన విక్రాంత్ రోణ (సుదీప్) ఇన్విస్టిగేషన్ ప్రారంభిస్తాడు. ఆ ఇన్‌స్పెక్టర్ ఎలా చనిపోయాడనే దానిపై ఇన్వెస్టిగేషన్ చేస్తూంటే మరో 16 మంది చిన్న పిల్లలు కూడా ఇదే తరహాలో అనుమానాస్పద స్థితిలో చనిపోయారని తెలిసి షాక్ అవుతారు. అసలు ఎవరు ఈ సీరియల్ కిల్లింగ్స్ చేస్తున్నారు. నిజంగా అతీత శక్తులు చేస్తున్నాయా ఉంటే వాటిని ఎలా డీల్ చేస్తాడు. వాటికి విక్రాంత్ రోణకు సంబంధం ఏమిటి ? చివరకు ఈ మర్డర్ మిస్టరీని విక్రాంత్ ఎలా చేధించాడనేదే మిగతా కథ.

స్క్రీన్ ప్లే విశ్లేషణ

నిజానికి ఇలాంటి కథలు పూర్తిగా స్క్రీన్ ప్లే బేస్ మీద నిలబడాలి. ఎప్పుడైతే కథనంలోకి హారర్ ఎలిమెంట్స్ తీసుకొచ్చి వాటిని నమ్మించలేక లాజిక్ అందని ఫాంటసీలోకి వెళ్ళిపోయి ఫాంటసీ హారర్ గా టర్న్ తీసుకోవడం ఇన్విస్టిగేషన్ యాంగిల్ కి దెబ్బకొట్టింది. దానికి తగ్గట్టే కథ కూడా ముందుకు వెళ్ళకుండా అక్కడిక్కడే తిరుగుతుంది. నిజానికి ఇన్విస్టిగేషన్ లో రివీలయ్యే నిజం వెన్నులో వణుకు పుట్టించేలా వుంటుంది. ఇలాంటి నేపధ్యం వున్నప్పుడు దాన్ని ఇంకా టెర్రిఫిక్ గా చూపించే అవకాశం వుంది. అయితే ఈ పాయింట్ ని అంత బలంగా వాడుకోలేదు దర్శకుకుడు. ఆ గతంతో చెప్పిన కథలో కూడా క్లారిటీ వుండదు. ఇలాంటి హారర్ టచ్ ఉన్న కథలు చెప్పేటప్పుడు వేసిన ముడులు ఒకొక్కటి విప్పుకుంటూ రావాలి. ఒకొక్క ముడి విప్పడంలో ప్రేక్షకుడు థ్రిల్ ఫీలవ్వాలి. అది అంతగా జరగలేదు. కేవలం క్లైమాక్స్ లో వచ్చే చిన్న ట్విస్ట్ పై ఆధారపడిపోయారు.

ఖచ్చితంగా చెప్పాలంటే ఈ సినిమాకు రొటీన్ కథే మిగతా బెస్ట్ అనుకున్న ఎలిమెంట్స్ అన్నింటిని చంపుకుంటూ పోయింది లేకపోతే టెక్నికల్ గా ఇంత హై స్టాండర్డ్ గా ఉన్న చిత్రం డబ్బులు బాగా ఖర్చు పెట్టిన చిత్రం ఓ రేంజిలో ఉండాలి. అయితే అందుకు తగ్గ కథ పడలేదు. రెగ్యులర్ క్రైమ్ థ్రిల్లర్ కు ఉండే అవలక్షణాలు అన్నీ ఈ సినిమాలో ఉన్నాయి. మర్డర్స్ ఎవరు చేస్తున్నారో ఇన్విస్టిగేషన్ ప్రాసెస్ లో చాలా మందిమీద అనుమానం రప్పించటం, చివర్లో అనుమానం అసలు రాకుండా ఓ క్యారక్టర్ ని చూపుతూ వాడే అని రివీల్ చేయటం. ఇది కృష్ణగారు అవేకళ్ళు సినిమా నాటి నుంచి అవలంభిస్తున్న విధానమే. అయితే మసి పూసి మారేడు కాయ చేద్దామనుకున్నట్లుగా ఈ సినిమాలో హారర్ ని కలిపి ఆ రొటీన్ ని దాటే ప్రయత్నం చేసారు. కానీ అది సెట్ కాలేదు స్క్రీన్ ప్లే లోనూ చాలా గందరగోళం ఉంది. అక్కర్లేని ఫన్ సినిమాకు అడగడుగునా అడ్డు పడింది. స్టార్ హీరో కదా అన్ని ఎలిమెంట్స్ కావాలనుకున్నారు అయితే అదే స్క్రిప్టుని ప్లాట్ గా మారుస్తుందని ఊహించి ఉండరు.

టెక్నికల్ గా

డైరక్టర్ క‌థ‌ను ప్రారంభించిన సీన్స్ ,విధానం చాలా ఇంట్రస్టింగ్ గా అనిపిస్తుంది. అయితే అదే స్టైల్ చివరి దాకా మేనేజ్ చేయలేకపోయారు. అక్కర్లేని సైడ్ ట్రాక్స్‌ను తీసేసి, ట్విస్ట్ లు పెట్టుకుంటే బాగుండేది. ఈ సినిమా కి మ్యూజిక్ చేసిన అజనీష్ లోక్‌నాథ్‌ని మెచ్చుకోవాలి. అతను అందించిన నేపధ్య సంగీతం చాలా చోట్ల భయపెట్టగలిగింది. సౌండ్ ఎఫ్ఫెక్ట్స్ అద్భుతంగా వున్నాయి. సౌండ్ డిజైన్ వారి కి కూడా మంచి మార్కులు పడతాయి. థ్రిల్లర్ కథ కదా ఎంత లాగ్ వున్నా పర్లేదనే పద్దతి చాలా సీన్స్ లో కనిపించింది. VFX సీన్స్ హై స్టాండర్డ్లో ఉన్నాయి. విలియం కెమెరా వర్క్ సినిమాకు మరో హైలెట్. పాటల్లో రా రా రక్కమ్మ సినిమా రిలిజ్ కు ముందే సూపర్ హిట్ మిగతా పాటలు జస్ట్ ఓకే. రైటింగ్ టీమ్ థ్రిల్లర్ ఫార్మేట్ పై మరింత కసరత్తు చేసి హారర్ తో పాటు సర్ ప్రైజ్, సస్పెన్స్, థ్రిల్, ట్విస్ట్ లు యాడ్ చేసివుంటే ‘విక్రాంత్ రోణ’ మరింత ఆసక్తికరంగా వుండేది.

నటీనటుల్లో

సుదీప్ యాక్షన్ సీక్వెన్స్ లలో దుమ్ము రేపాడు. ప్రతి సీన్, ఫైట్‌లో ఆయన ఎఫర్ట్ కనబడుతుంది. విక్రాంత్ రోణ పాత్రలో సుదీప్‌ను తప్ప మరొకరిని ఊహించుకోలేం. హాట్ లుక్‌లో ఉన్న జాక్వలైన్ విషయానికి వస్తే ఆమె నుంచి ఎక్కువ ఎక్సపెక్ట్ చేస్తే నిరాశే. రా రా రక్కమ్మ కు హాల్ కాసేపు ఊగింది. మిగతా వాళ్లలో అంత గుర్తు పెట్టుకుని మాట్లాడుకునే వాళ్లు లేరు

నచ్చినవి :
సుదీప్ తెరపై చూపిన విధానం
టెక్నికల్ స్టాండర్డ్స్

నచ్చనవి :
పాత కథ,పాత ట్విస్ట్ లు
ఎక్కువ చీకట్లోనే కథ నడపటం

 చూడచ్చా :

కథ పరంగా రొటీన్ గా అనిపించినా తెరపై కనపడే విజువల్స్ కోసం ఈ సినిమా చూడచ్చు. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు ఈ సినిమా మంచి ఛాయిస్ .

నటీనటులు :  కిచ్చా సుదీప్, నిరూప్ భండారి, నీతా అశోక్, జాక్వలిన్ ఫెర్నాండేజ్, రవిశంకర్ గౌడ, మధుసూదన్ రావు తదితరులు.
సినిమాటోగ్రఫీ :  విలియమ్ డేవిడ్
సంగీతం :  బి అజనీష్ లోక్‌నాథ్‌
సహ నిర్మాత :  అలంకార్ పాండియన్
నిర్మాతలు :  జాక్ మంజునాథ్‌‌, శాలిని మంజునాథ్
రన్ టైమ్  : 147 నిముషాలు
రచన, దర్శకత్వం :  అనూప్ భండారి
విడుదల తేదీ :  జూలై 28, 2022