అంటే సుందరానికీ మూవీ రివ్యూ

Published On: June 10, 2022   |   Posted By:

అంటే సుందరానికీ మూవీ రివ్యూ

Ante Sundaraniki : నాని ‘అంటే సుందరానికీ’ రివ్యూ

Emotional Engagement Emoji
👍

నాని ‘అంటే సుందరనికీ’ థియేటర్స్ లోకి వచ్చేసింది. టీజర్ , ట్రైలర్ ప్రామిసింగ్ అనిపించుకున్నాయి. సినిమాలో కూడా కంటెంట్ ఉందని నాని మళ్ళీ సీట్లో కూర్చుబెట్టి హిలేరియస్ గా ఎంటర్టైన్ చేయబోతున్నాడని అర్థమైంది. దర్శకుడు కూడా టాలెంటెడ్ కావటం కలిసొచ్చే అంశం. బ్రోచేవారెవరురా వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత మళ్ళీ ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ఇలా ఎటు చూసిన అంటే కి అంతా పాజిటివ్ గానే ఉంది. ఫ్యామిలీలు కూడా ఈ వేసవిలో వరస యాక్షన్ చూసి ఫన్ తో రిలాక్స్ అయ్యే మూడ్ లో ఉన్నారు. ఈ క్రమంలో మన ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎక్సపెక్టేషన్స్ అందుకుందా లేదా..అసలు కథేంటి…నాని మరో హిట్ కొట్టాడా లేదా అనేది చూద్దాం.

స్టోరీ లైన్

చిన్నప్పటి నుంచీ సుందర్ ప్రసాద్ (నాని), లీలా థామస్ (నజ్రియా నజీమ్) ప్రెండ్స్, క్లాస్‌మేట్స్‌. సుందర్‌ది సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం .లీలాది సంప్రదాయ క్రిష్టియన్ కుటుంబం. ఇద్దరూ తమ మత విశ్వాసాలను చాలా ఛాదస్తం స్దాయిలో అనుసరిస్తూంటారు. అలాంటి కుటుంబాల నుంచి వచ్చిన వీళ్లిద్దరూ పెద్దై ప్రేమలో పడితే వాళ్ల పెద్దలు ఏక్సెప్ట్ చేస్తారా…? ఇదే డౌట్ వాళ్లకు వస్తుంది. కానీ తమ ప్రేమను గెలిపించుకోవటానికి ఇద్దరూ తమ ఇళ్లల్లో రెండు అబద్దాలు ఆడతారు. అదేమిటంటే సుందర్ తనకు ఇక పిల్లలు పుట్టరని టెస్ట్ లో తేలిందని, ఆ విషయం తెలిసిన తన స్నేహితురాలు తనను పెళ్లి చేసుకోవాటనికి ముందుకు వచ్చిందని తన ఇంట్లో చెప్తాడు. మరో ప్రక్క లీలా తన ఇంట్లో తను గర్బవతి అయ్యానని, తను ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవటం తప్ప వేరే ఆప్షన్ లేరు అంటుంది. మొదటి ఇద్దరి ఇళ్లల్లో విభేధించినా వీళ్ల అబద్దాలు నమ్మి ఓకే చేస్తారు. కానీ అబద్దాలు ఎంతో కాలం నిలబడవు కదా. దాంతో ఒక టైమ్ వచ్చేసరికి ఇద్దరి కుటుంబ సభ్యులకు వీళ్ళిద్దరూ చెప్పింది అబద్ధమని తెలిసి పోతుంది. దాంతో కాస్త తీవ్రంగానే స్పందిస్తారు? వారి ఆగ్రహాలు చల్చార్చి…చివరకు, సుందర్ – లీలా ఎలా పెళ్లి చేసుకున్నారు? అనేది మిగతా సినిమా.

ఎలా ఉంది

కామెడీగా వినటానికి ఈ స్టోరీ లైన్ బాగానే ఉందనిపిస్తుంది.అలాగే కథా నేపధ్యం కూడా ఫన్ గా అనిపిస్తుంది. అయితే ఈ రోజుల్లో పిల్లలు పుట్టని లోపం ఉన్న కుటుంబాలు చాలా ఉన్నాయి.మగవాళ్లు చాలా ఉన్నాయి. అతనేమీ కాపురానికి పనికి రాడు అనటం లేదు కదా. అలాంటప్పుడు పెళ్లికి వచ్చే ఇబ్బంది ఏముంటుంది. పిల్లలను ఆర్టిఫిషల్ గా కంటున్నారు. దత్తత చేసుకుంటున్నారు. వేర్వేరు విధానాలు జనం అనుసరిస్తున్నారు. కాబట్టి ఈ కథా మెలికలోనే బలం లేదనిపిస్తుంది. అలాగే మరో అంశం..ఈ కథలో హీరో అమెరికా వెళ్తే ..ప్రాయశ్చిత్తం చేసుకోమని అంటారు..ఇంకా ఈ రోజుల్లో అలాంటి కుటుంబాలు ఉన్నాయా అనే డౌట్ వస్తుంది. బ్రాహ్మణుల్లో కులాంతర వివాహాలు కామన్ అయ్యిపోయాయి. అలాగే అమెరికా వెళ్లి రావటం, అక్కడ సెటిల్ అవటం అనేది మామూలు విషయం అయ్యిపోయింది.

ఈ వాస్తవాలను దృష్టిలో పెట్టుకోకుండా స్క్రిప్టు చేస్తే అది వాస్తవానికి చాలా దూరం అనిపిస్తుంది. ఇంకా డైరక్టర్ బారిస్టర్ ఫార్వతీసం రోజుల్లో ఉన్నాడని అనిపిస్తుంది. స్క్రిప్టులో రిపీట్ ఎక్కువైంది. ప్రతీ చిన్న విషయానికి వివరణ ఇవ్వటం..ఇంటర్వెల్ లో ట్విస్ట్ పెట్టుకుని అక్కడదాకా లాగటం విసిగిస్తుంది. ఫస్టాఫ్ అంతా ఓ సిరియల్ జరిగినట్లు అనిపిస్తుంది. సెకండాఫ్ లోనూ ఆ ఛాయిలు కాస్తంత ఎక్కువే అయినప్పటికీ కథ కాస్తంత గాడిలో పడి కాంప్లిక్ట్ లోకి ప్రవేశించటంతో అక్కడక్కడా నవ్వులు వస్తాయి. లీడ్ పెయిర్ తన ప్రేమను గెలుచుకోవటానికి పడే కష్టంగా సినిమా కథ ఓకే అనిపిస్తుంది కానీ ఓ రొమాంటిక్ కామిడీగా, రొమాన్స్, కామిడీ ఆశిస్తే మాత్రం దెబ్బతింటాం.

దానికి తోడు ఈ రోజు ల్లో ఏ సినిమాకైనా రం టైం అనేది ఇప్పుడు చాలా ముఖ్యం అయిపోయింది. రెండున్నర గంటలే ప్రేక్షకులకు థియేటర్స్ లో బోర్ కొట్టేస్తుంది. మధ్య మధ్యలో సెల్ ఫోన్స్ పట్టుకుంటూ కాలక్షేపం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ‘అర్జున్ రెడ్డి’,’మహానటి’,’రంగస్థలం’ ఇలా కొన్ని క్లాసిక్ హిట్స్ మాత్రమే రన్ టైం ఎక్కువ అన్న మాటే లేకుండా ఆడియన్స్ ని మెస్మరైజ్ చేశాయి. మరి ‘అంటే సుందరానికీ’ కూడా అదే కోవలోకి వస్తుందా ? లేదని చెప్పాలి. ఈ ఒక్క సమస్యను అధిగమించి ఉంటే బాగుండేది.

టెక్నికల్ గా …

డైరక్టర్ గా వివిక్ ఆత్రేయ కు కామెడీ మీద మంచి గ్రిప్ ఉందనేది అర్దమవుతుంది. అయితే అందుకోసం అనవసరమైన సీన్స్ సృష్టించటం మాత్రం ఇబ్బందే. స్క్రిప్టు లోనే చాలా ఎడిటింగ్ జరగాల్సిన కథ ఇది. అలాగే స్క్రీన్ ప్లే కూడా బోరింగ్ గా ఉంటుంది. వరస సీన్స్ పేర్చుకుంటూ వెళ్లిపోయాడు. నాని ఉన్నాడు కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే ఆ మాత్రం కూడా భరించటం కష్టం అనిపిస్తుంది. అలాగే, హీరోయిన్ క్యారెక్టర్‌కు అంత ఇంట్రడక్షన్, హీరో కంటే ముందు ఒక లవ్ ట్రాక్ అవసరం లేదని అర్దమవుతుంది.అది కేవలం లెంగ్త్ పెంచటానికే. పాటలు కథలో భాగంగా వచ్చాయి కానీ వినటానికి బాగోలేవు. ప్రేమ కథా చిత్రాలకు కావాల్సిన లవ్ సాంగ్స్ లేవు. అలాగే పాటల కంటే నేపథ్య సంగీతం చాలా బావుంది. సినిమాటోగ్రఫీ కూడా నీట్ గా ప్రెజెంట్ గా ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడక్షన్ వేల్యూస్ హైగా ఉన్నాయి. అక్కడక్కాడాడైలాగులు బాగున్నాయి. ‘ప్రెగ్నెన్సీ అనేది ఛాయస్ కానీ… కంపల్షన్ కాదు’ అని చెప్పే మాట హృదయాన్ని తాకుతుంది.

నటీనటుల్లో …

సుందర్ పాత్రలో నాని చాలా బాగా చేసారు. అలాగే, నజ్రియా వయస్సు ఎక్కువ అనిపించింది కానీ సహజంగా నటించింది. అనుపమా పరమేశ్వరన్ పాత్ర చెప్పుకోవటానికి ఏమీ లేదు! నరేష్, రోహిణి, నదియా, అళగమ్ పెరుమాళ్… అందరూ బాగా చేశారు. హర్షవర్ధన్ చాలా కాలం తర్వాత మంచి క్యారక్టర్ చేసారు. హీరో చైల్డ్ హుడ్ రోల్ చేసిన శేఖర్ మాస్టర్ కుమారుడు విన్నీ స్క్రీన్ ప్రజెన్స్ బావుంది.ఆ మధ్య వచ్చిన ‘స్టాండప్ రాహుల్’లో నటించిన ‘కేరాఫ్ కంచరపాలెం’ దర్శకుడు వెంకటేశ్ మహా ఇందులోనూ ఓ పాత్రలో మెరిశాడు.

చూడచ్చా….

ఎక్కువ కామెడీని ఎక్సపెక్ట్ చేయకుండా చూస్తే ఓకే అనిపిస్తుంది.

————–
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
నటీనటులు: నాని, నజ్రియా ఫహద్, నదియా, నరేష్, హర్షవర్ధన్, రాహుల్ రామకృష్ణ తదితరులు.
సంగీతం: వివేక్ సాగర్
సినిమాటోగ్రాఫర్: నికేత్ బొమ్మి
ఎడిటర్: రవితేజ గిరిజాల
ప్రొడక్షన్ డిజైన్: లతా నాయుడు
పబ్లిసిటీ డిజైన్: అనిల్ & భాను
రన్ టైమ్: 2 గంటల 56 నిముషాలు
రచయిత, దర్శకుడు: వివేక్ ఆత్రేయ
నిర్మాతలు: నవీన్ యెర్నేని & రవిశంకర్ వై