అనుభవించు రాజా మూవీ రివ్యూ

Published On: November 26, 2021   |   Posted By:

అనుభవించు రాజా మూవీ రివ్యూ

రాజ్ తరుణ్  ‘అనుభవించు రాజా’ రివ్యూ

 Emotional Engagement Emoji (EEE) 

👍

 రాజ్ తరుణ్ సినిమాలంటే కాస్తంత ఫన్, ఎమోషన్ తో సరదా సరదాగా ఉంటాయని లెక్కేస్తూంటాం. అతని కెరీర్ తొలి రోజుల్లో వచ్చిన సినిమాలు ఆ ముద్ర వేసాయి. అయితే గత కొంతకాలంగా ఆ ఫన్ …అతని సినిమాల్లో ఫసక్ అయ్యింది. కమర్షియల్ సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నాడు. తన బాడీ లాంగ్వేజ్ కి తగ్గ కథ,కథనం అని నమ్మి చేసిన చిత్రం ఇది. ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. అందులోనూ అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై ఈ చిత్రం నిర్మించారంటే అందులో ఖచ్చితంగా మంచి కంటెంట్ ఉందని భావిస్తాము. దానికి తోడు  ట్రైలర్‌ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.  మరి ఈ అంచనాలకు తగ్గట్లే ఈ సినిమా ఉందా…రాజ్ తరుణ్ కెరీర్ ని మళ్లీ లేపి నిలబెట్టే ప్రయత్నం ఈ సినిమా చేసిందా..అసలు ఈ చిత్రం కథేంటి వంటి సంగతులు ఈ రివ్యూలో చూద్దాం.

స్టోరీ లైన్

పశ్చిమగోదావరి జిల్లాలో  యండగండి గ్రామం. అక్కడ పెద్ద కోటీశ్వరల ప్యామిలీ బంగారం అలియాస్ రాజు (రాజ్‌త‌రుణ్‌)ది. చిన్నప్పుడే తల్లి,తండ్రి,తాత తో సహా అందరినీ యాక్సిడెంట్ లో పోగొట్టుకుంటాడు. తన తాత చనిపోయేటప్పుడు నేను కష్టపడి సంపాదించాను కానీ ఇష్టపడి ఖర్చుపెట్టలేదు…నువ్వైనా అనుభవించు అని చెప్తాడు. దాంతో రాజు విచ్చలవిడిగా డబ్బుని ఖర్చు పెడుతూ లైఫ్ ని చిన్నతనంనుంచి ఎంజాయ్ చేయటం మొదలెటడతాడు. అలాంటివాడు కొన్ని అనుకోని పరిస్దితుల్లో జైలుకు వెళ్లాల్సి వస్తుంది. అలాగే ఆ తర్వాత హైదరాబాద్ లో ఓ చిన్న సెక్యూరిటీ గార్డ్ గా జీవితం మొదలెట్టాల్సి వస్తుంది. అక్కడే ఐటీ కంపెనీలో పరిచయం అయ్యిన  శ్రుతి (క‌శిష్‌ఖాన్‌)తో అత‌డి ప్రేమాయ‌ణం మొదలెడతాడు. కానీ తను సెక్యూరిటీ గార్డ్ కావటంతో ఆమె రిజెక్ట్ చేస్తుంది. ఈ లోగా అతన్ని చంపేందుకు ఓ కిల్లర్ గ్యాంగ్ కు ఒకరు సుపారి ఇస్తారు. వాళ్లు రాజు వెంటపడుతూంటారు. అసలు  రాజు ని చంపడానికి సుపారీ ఇచ్చిన వ్యక్తి ఎవరు?అంత పెద్ద ఆస్దిపరుడైన రాజు.. సెక్యూరిటీ గార్డ్‌ ఉద్యోగం ఎందుకు చేస్తన్నాడు? జైలుకు వెళ్లాల్సిన పరిస్దితలు ఏమొచ్చాయి. అతని లవ్ స్టోరీ చివవ గ్రామం నుంచి పారిపోవడానికి గల కారణాలేంటి? వంటి విషయాలు చుట్టూ  మిగతా కథ తిరుగుతుంది.

స్క్రీన్  ప్లే సంగతులు

అప్పట్లో బాగా పాపులర్ అయిన భాషా స్క్రీన్ ప్లే ఈ మధ్యన తెలుగు సినీ జనం వాడటం తగ్గించారు. ఫస్టాఫ్ లో ప్లాష్ బ్యాక్ దాచి పెట్టి..ఇంటర్వెల్ కు మీరెవరు బాబుగారు అనిపించి..సెకండాఫ్ ఓపెన్ చేసి చెప్పటం ఆ స్క్రీన్ ప్లే స్పెషాలిటీ. ఇన్నాళ్లకు మళ్లీ ఈ సినిమాకు వాడారు. అయితే అంత పవర్ ఫుల్ గా ట్రీట్మెంట్ చేయలేదు. దాంతో ఇతను ఎవరైనా, అతను ప్లాష్ బ్యాక్ ఏదైనా మనకెందుకులే అనిపిస్తుంది. అలాగే ఎంతో బిల్డప్ గా ప్లాష్ బ్యాక్ ఓపెన్ చేసి తుస్సుమనిపిస్తారు. ప్లాష్ బ్యాక్ సీన్స్ కూడా మరీ పాతికేళ్ల క్రితం వంశీ గారి సినిమాలను గుర్తు తెస్తాయి. ఈకాలం నాటి హీరో గతం అనిపించదు. దర్శకుడు ఇప్పటి గోదావరి నేటివిటిని  పట్టుకోలేకపోయారు. దానికి తోడు సినిమా ట్రైలర్ చూస్తే ఏదో కామెడీ సినిమా అన్నట్లు ఉంటుంది. సినిమాలో కామెడీ తక్కువ యాక్షన్ ఎక్కువ అన్నట్లు సాగుతుంది. అలాగే సినిమా ప్రీ క్లైమాక్స్  దాకా విలన్ ఎవరో తేల్చడు. అలాగని ఇదేమి థ్రిల్లర్ సినిమా కాదు. దాంతో కాంప్లిక్ట్ అనేది సినిమాలో పెద్దగా రైజ్ కాదు. హీరో క్యారక్టర్ ప్యాసివ్ గా మారిపోతుంది. ఇక  సినిమా మొత్తం సిచ్యువేషనల్ కామెడీ కోసం ట్రై చేసారు. కానీ కొన్ని సీన్స్ ప్రారంభంలో వర్కవుట్ అయ్యాయి కానీ తర్వాత నడవలేదు. సినిమా ఫస్ట్ హాఫ్ ఎంటర్టైన్మెంట్ బాగుంది. ఇంట్రస్టింగ్ గా ఇంటర్వెల్ వేసిన తర్వాత కథ బాగా స్లో అయిపోయినట్లు అనిపిస్తుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో కామెడీ అంతగా లేకపోవడం ఈ సినిమాకి అతి పెద్ద మైనస్ . ఇక క్లైమాక్స్ లో కూడా సన్నివేశాలని హడావిడి చేసినట్లు అనిపిస్తుంది.

టెక్నికల్ గా ..

ఉన్నంతలో   గోపీసుంద‌ర్ ఇచ్చిన పాటలతో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. న‌గేశ్ బానెల్‌ సినిమాటోగ్రఫీ కూడా సినిమాకు రిచ్ లుక్ తెచ్చింది . పల్లె విజువల్స్ ని తెరపై చక్కగా పరిచాడు. ప్రొడక్షన్ వాల్యూస్  సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. అన్నపూర్ణ బ్యానర్ స్దాయి మాత్రం కాదు. స్క్రిప్ట్ ఎంత వీకో ..దర్శకత్వం కూడా అంతే అన్నట్లుగా ఉంది. చెప్పుకోదగిన మెరుపులు ఏమీ సినిమాలో లేవు.

చూడచ్చా
ఫన్ సినిమా అని ఆశపడితే బోల్తా పడతాం. ఏదో కాలక్షేపం అనుకుంటే  ఒకసారి చూసేయొచ్చు.

 నటీనటుల విషయానికి వస్తే..

రాజ్ తరుణ్ ఫన్ టైమింగ్ చాలా వరకూ సినిమాని కాపాడంది.  హీరోయిన్ కశిష్‌ ఖాన్‌ ఫెరఫార్మెన్స్ పరంగా ఓకే. లుక్ పరంగా అంత ఎట్రాక్టివ్ గా లేదు . తమిళ నటుడు నరేష్ ..ఊరి ప్రెసిడెంట్ గా బాగా చేసారు. నెల్లూరు సుదర్శన్ పంచ్ లు అక్కడక్కడ బాగానే పేలాయి. అజయ్ విలేజ్ విలనీ కూడా నప్పింది.  

పాజిటివ్ లు
ఆర్టిస్ట్ ల ఫెరఫార్మెన్స్, రాజ్ తరుణ్ వెటాకరం ఫన్
మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్

నెగిటివ్ లు
హడావిడి క్లైమాక్స్
కథ,స్క్రీన్ ప్లే
అనుకున్న స్దాయిలో ఫన్ లేకపోవటం

తెర వెనక..ముందు

సంస్థ‌: అన్నపూర్ణ స్టూడియోస్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి;
న‌టీన‌టులు: రాజ్ తరుణ్, కశిష్ ఖాన్, పోసాని కృష్ణమురళి, నరేన్, అజయ్, సుదర్శన్, టెంపర్ వంశీ, ఆదర్శ్ బాలకృష్ణ, రవి కృష్ణ, భూపాల్ రాజు, అరియానా, త‌దిత‌రులు;
 సంగీతం: గోపీ సుందర్;
ఛాయాగ్రహ‌ణం: నాగేష్ బానెల్;
ఎడిటర్: ఛోటా కే ప్రసాద్;
 సాహిత్యం: భాస్కర భట్ల‌,
క‌ళ: సుప్రియ బట్టెపాటి, రామ్ కుమార్ ;
నిర్మాత: సుప్రియ యార్లగడ్డ;
దర్శకత్వం: శ్రీను గవిరెడ్డి;
రన్ టైమ్: 2h 11min
విడుద‌ల తేదీ‌: 26 న‌వంబ‌ర్ 2021