ఓరి దేవుడా మూవీ రివ్యూ

Published On: October 21, 2022   |   Posted By:

ఓరి దేవుడా మూవీ రివ్యూ

విశ్వక్‌సేన్  ‘ఓరి దేవుడా’ మూవీ రివ్యూ

Emotional Engagement Emoji

👍

మనందరి జీవితాల్లో తట్టుకోలేని  బాధ ఎదురైనప్పుడు ‘ఓరి దేవుడా’ అంటూ నిట్టూర్చడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఆ పై వాడిని తిడుతూంటాం.  జీవితంలో తెలిసో,తెలియకో  జరిగిన పొరపాట్లు సరిచేసుకోవడానికి భగవంతుడు ఇంకో ఛాన్స్  ఇస్తే బాగుంటుందని అనుకుంటాం. నిజంగానే దేవుడు విని అలాంటి అవకాసం ఇచ్చేస్తే … ఏం జరుగుతుంది..మన తప్పు,ఒప్పులను సర్దుకుంటామా…. అనే కాన్సెప్టు తో వచ్చి  తమిళంలో సూపర్ హిట్ అయిన చిత్రం “ఓ మై కడవులే”. ఈ  సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాని అదే దర్శకుడు తెలుగులోనూ చేసారు. అలాగే ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ దేవుడి పాత్రలో కనిపించారు. ట్రైలర్ తోనే ప్రేక్షకులను బాగా మెప్పించిన ఈ సినిమా దీపావళి కానుకగా థియేటర్లలో విడుదల అయింది. ఈ సినిమా ఎలా ఉంది..కథేంటి..తెలుగులో చేసిన మార్పులు ఏమిటి…ఎంతవరకు అంచనాలను అందుకుందో చూద్దాం.

స్టోరీ లైన్

చిన్ననాటి స్నేహితులు ,  స్కూల్ మేట్స్ …అర్జున్ (విశ్వక్ సేన్), మణి (వెంకటేశ్ కాకుమాను), అను (మిథిలా పార్కర్). అను, మణిల కంటే కాస్తంత లేటుగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన పట్టా పుచ్చుకున్న అర్జున్ ఓ నైట్ వీళ్ళకు పబ్ లో పార్టీ ఇస్తాడు. అప్పుడు ఏదో ఫ్లోలో .. ‘ముక్కూముఖం తెలియని అమ్మాయిని పెళ్ళి చేసుకోవడం  ఇష్టం లేదు’అని చెబుతాడు. వెంటనే ప్రక్కనే ఉన్న అను… ‘మరి నన్ను పెళ్ళి చేసుకుంటావా?’ అని అడిగేస్తుంది. ఆమె ప్రపోజల్ ను తిరస్కరించడానికి ఎలాంటి కారణాలు అతని దగ్గర లేకపోవడంతో, పెళ్ళికి ఓకే చెప్పేస్తాడు. పెద్దల అంగీకారంతో అర్జున్, అను పెళ్ళి జరిగిపోతుంది.  అనూ తండ్రి తన సంస్థలోనే అర్జున్ కి జాబ్ కూడా ఇస్తాడు. అయితే అర్జున్ కి ఆ జాబ్ చేయడం ఇష్టం ఉండదు. తనకి ఇష్టమైన యాక్టింగ్ వైపు వెళ్లాలని అతను అనుకుంటూ ఉంటాడు.

అదే సమయంలో స్కూల్ రోజుల్లో తనకి సీనియర్ అయిన మీరా ( ఆషా భట్) అతనికి తారసపడుతుంది. పూరి జగన్నాథ్ దగ్గర డైరెక్షన్ డిపార్టుమెంటులో ఆమె పనిచేస్తూ ఉంటుంది. నటన దిశగా ఆమె అర్జున్ ను ప్రోత్సహిస్తుంది. ఈ క్రమంలో అతను మీరాతో చనువుగా ఉండటం పట్ల అనూ అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తుంది. ఈ కారణంపైనే ఇద్దరి మధ్య మాటామాట పెరిగి విడాకుల వరకూ వెళతారు.

అయితే ఏడాది తిరిగేసరికీ ఇద్దరు ఒకరికొకరు శత్రువుల్లా కనపడతారు.  అర్జున్‌ని అను ఎప్పుడూ  అనుమానిస్తూనే ఉంటుంది. మరో ప్రక్క  అర్జునేమో ఆమె ప్రేమను అర్థం చేసుకోకుండా తన స్వేచ్ఛ కోల్పోయినట్లు భావిస్తూంటాడు. దాంతో తాము కలిసి కాపురం చెయ్యలేమని, ఇద్దరూ విడాకులకు సిద్ధం అవుతారు.  జీవితంలో భార్య స్నేహితురాలిగా ఉండొచ్చు కానీ, స్నేహితురాలే భార్యగా రాకూడదంటూ ఓ థీరిని కూడా తయారు చేసుకుంటాడు అర్జున్‌.వీళ్ళిద్దరూ డైవర్స్ కోసం ఫ్యామిలీ కోర్టులో అడుగు పెడతారు.ఆ డిప్రెషన్ లో …ప్రేమ పెళ్లి విషయంలో తనకి సెకండ్ ఛాన్స్ ఇవ్వమని దేవుడుని (వెంకటేష్)ని  కోరుకుంటాడు. దేవుడు కొన్ని కండిషన్స్‌తో అందుకు ఓకే అంటాడు. మరి, సెకండ్ ఛాన్స్ తీసుకున్న అర్జున్ తనకి స్కూల్ డేస్ నుంచి ఇష్టమైన మీరా (ఆశా భట్) ప్రేమని పొందాడా? అను-అర్జున్‌ విడిపోయారా?  దాని వల్ల అర్జున్ జీవితం ఎలా మలుపు తిరిగింది.. చివరికి అనుతో అతడి ప్రయాణం ఏ మజిలీకి చేరింది అన్నది మిగతా కథ. అలాగే ఈ కథలో దేవుడు (వెంకటేష్) కథ ఏమిటి? ఆయన ఎలా వచ్చాడనేది మిగతా కథ.

ఎనాలసిస్ ..

తమిళ ఒరిజనల్ …ఓ మై కడవులే చూసిన వారికి ఓరి దేవుడా చూడటం పెద్దగా కలిసివచ్చే అంశం అయితే కాదు. ఓ రకంగా  ఇది సీన్-బై-సీన్..మక్కీకి మక్కీ రీమేక్.  ఇది కొత్త ఎక్సపీరియన్స్  ఏ మాత్రం ఇవ్వదు, తెలుగు వాతావరణానికి తగినట్లుగా పెద్దగా మార్పులు చేయలేదు.  అలాగే అసలు ఒరిజనల్ లోని  సినిమాలోని తప్పులను సరిదిద్దే ప్రయత్నాలు జరగకపోవడం కొంత నిరాశే. హీరోయిన్ పాత్ర అను..తన భర్తపై అంత పొసిసీవ్ గా ఎందుకు మారింది. అలాగే అర్జున్ పాత్ర వైపు ఒక్కసారి కూడా ఎందుకు ఆలోచించలేకపోయింది వంటివి రీమేక్ లో కూడా చెప్పలేదు. అలాగే మీరా పాత్ర ఆర్క్ అసంపూర్తిగా వదిలేయటం కూడా రిపీట్ అయ్యింది. అలాగే  అనూతో కలిసి జీవించడం ఇష్టం లేని అర్జున్, దేవుడు ఇచ్చిన ఛాన్స్ వలన, ఆమెకి దూరంగా బ్రతకాలనుకుంటాడు. ఆ సమయంలో అర్జున్ కి ఎదురయ్యే అనుభవాలతో సెకండాఫ్ ఆసక్తికరంగా నడుస్తుంది. కానీ ఫస్టాఫ్ బాగా నీరసంగా నడిపారు.

ఏదైమైనా జీవితంలో సెకండ్  ఛాన్స్  అనేది ఎప్పుడూ ఆనందపరిచే విషయమే. కాకపోతే అది ఎప్పుడో కానీ దొరకదు. అలాగే  గడిచి పోయిన కాలం కూడా వెనక్కి తిరిగి వస్తే చాలా బాగుంటుంది. చాలా తప్పులు సరిచేసుకోవచ్చు. కానీ అదీ జరగదు.  ‘టైమ్-రివైండ్’అనేది చాలా అందమైన ఊహ. అయితే ఈ సినిమా డైరక్టర్ కు అలాంటి అవకాసం వచ్చింది. తమిళంలో ఓ మై కడవులే అని చెప్పిన కథను, తెలుగులో ఓరి దేవుడా అని రీమేక్ పేరుతో మరోసారి చెప్పే ఛాన్స్ వచ్చింది. ఇలాంటి ఛాన్స్ వచ్చినప్పుడు ఎవరైనా మొదటి సారి ఫలానా చోట తప్పు చేసాం అనుకున్నవి ..సరిచేసుకునేందుకు ప్రయత్నిస్తారు. కానీ మొదటి సారి అంతా ఫెరఫెక్ట్ గా చేసాను అని డైరక్టర్ ఫీల్ అయ్యినట్లున్నారు.

దాంతో తమిళంలో ఉన్న తప్పులు, స్క్రీన్ ప్లే సమస్యలు, తెలుగు రీమక్ వెర్షన్ లో మార్చే ప్రయత్నం చేయలేదు. తనే రెండు వెర్షన్స్ కు డైరక్టర్ అయినా యాజటీజ్ దింపేసారు. దాంతో మనకు ఇంతోటి దానికి  అస్సలు రీమేక్ చేయడం ఎందుకు? యాజటీజ్ డబ్బింగ్ చేసి వదిలినా సరిపోయేది కదా అనిపిస్తుంది.  అలాగే ఓటీటీలో ఒరిజినల్ వెర్షన్  “ఓ మై కడవులే” చూసేసిన వాళ్లకి  ఈ సినిమా కొత్త అనుభూతి ఏ మాత్రం ఇవ్వదు. కంటెంట్ ఏమిటో తెలియకుండా ఏ ఎక్సపెక్టేషన్స్ పెట్టుకోకుండా  తొలిసారి చూసే ఆడియన్స్ కు మాత్రం కొంతవరకు నచ్చతుంది. దానికి తోడు టైమ్ రివైండ్ కాన్సెప్టు ని రీసెంట్ గానే శర్వా…ఒకే ఒక జీవితం అంటూ చేసారు. అదీ తమిళ దర్శకుడు సినిమానే అనుకోండి.

హీరో మళ్లీ జీవితంలో వెనక్కి వెళ్లి తన జీవితాన్ని మార్చుకునేందుకు చేసే ప్రయత్నాల నేపథ్యంలో వచ్చే కొన్ని సీన్లు క్రేజీగా అనిపిస్తాయి. ముఖ్యంగా ఈ కథ ..తన భార్యపై తనకున్న ప్రేమను గుర్తించే వ్యక్తికి సంబంధించిది. మనం …జీవితంలో కొన్ని విషయాలను మాత్రమే నియంత్రించగలమని, మన జీవితంలోని వ్యక్తుల గురించి మనం చాలా తక్కువగా తెలుసుకుంటామని, అందువల్ల మనం చేసే పనులు వాటిని ఎలా మారుస్తాయో మనం ఓ ఎమోషన్ తో అవతలి వారి పట్లం  ఉండటం చాలా ముఖ్యం అని చెప్పే ఈ కథ  చాలా  తాత్వికమైనది. . అర్జున్ మరియు పాల్‌రాజ్ (అను తండ్రి, మురళీ శర్మ పోషించిన పాత్ర) ఉన్న ఒక సీన్ మనకు అదే చెబుతుంది.   సినిమా మొత్తానికి హైలైట్ గా అనిపించే ఈ ఎపిసోడ్ సెకండాఫ్ లో వస్తుంది. తాను మరోలా అర్థం చేసుకున్న హీరోయిన్ తండ్రికి సంబంధించిన నేపథ్యంలో.. అందులోని ఎమోషన్ మనని కదిలిస్తుంది. అయితే ఇదే మెలో డ్రామా ఎక్కువపోయి.. సినిమా మరీ స్లోగా నడుస్తున్న అనిపించేలా చేసింది. అది గమనించే..  క్లైమాక్స్ … కొంచెం సరదాగా..కాస్త హడావుడితో ముగించే ప్రయత్నం చేసారు.  మొత్తంగా ఈ సినిమా  టైంపాస్ వ్యవహారమే. ఎంటర్టైన్మెంట్ కు  ఢోకా లేదు. మరీ అద్బుతం  అనిపించదు కానీ.. ‘ఓకే’ బాగానే ఉంది  అనిపించే సినిమా ఇది.

టెక్నికల్ గా…

ఈ రొమాంటిక్ కామెడీ కు బాగా ప్లస్ అయ్యింది. విధు అయ్యన కెమెరా వర్క్. ముఖ్యంగా కేరళ లొకేషన్స్ ను అద్భుతంగా చిత్రీకరించాడు .. ఎడిటింగ్ పరంగా కూడా ఓకే. అలాగే ఈ సినిమాకు మరో హైలెట్ డైలాగులు. ఆ భాధ్యతను మరో దర్శకుడు తరుణ్ భాస్కర్ తీసుకున్నారు. అవి చాలా నాచురల్ గా అనిపిస్తాయి. ఇక దర్శకుడు అశ్వత్ మారిముత్తు తమిళ నేటివిటిని తెలుగుకు తెచ్చే పని మాత్రమే పెట్టుకున్నాడు. కానీ తమిళ వెర్షన్ లోని  కథ,స్క్రీన్ ప్లే సమస్యలను సరిదిద్దుదామనుకోలేదు.   లియాన్ జేమ్స్ సంగీతం బాగుంది. గుండెల్లోన పాట నచ్చుతుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్  బాగున్నాయి.

నటీనటుల్లో ..

విశ్వక్ సేన్ నటన ఈ సినిమాని పూర్తిగా అడాప్ట్ చేసుకుని చేసారు.  తన కామెడీ టైమింగ్ సినిమాకి అతిపెద్ద ప్లస్ పాయింట్.  మిథిలా పాల్కర్ చాలా బాగా నటించింది.ఆమె నటన చూస్తుంటే ‘కలర్స్ స్వాతి గుర్తు చేసింది. మొదటి తెలుగు సినిమా అయినా బాగా చేసింది. లీడ్ పెయిర్ విశ్వక్ మరియు మిథిలా ల మధ్య కెమిస్ట్రీ  వర్క్ అవుట్ అయ్యింది. దేవుడి పాత్రలో వెంకటేష్ చాలా బాగా సెట్ అయ్యారు. ఆయన సీన్స్ కూల్ గా ఉన్నాయి.  రాహుల్ రామకృష్ణ  ఎప్పటిలాగే తన వంతు న్యాయం చేసారు.   మిగతా నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు చేసుకుంటూ పోయారు. హీరోయిన్స్ నుంచి గ్లామర్ ఆశించలేము.

ప్లస్ లు :

సినిమాటోగ్రఫీ
కథాంశం
లీడ్ పెయిర్

మైనస్ లు:
మీరా, అజయ్ లవ్ ట్రాక్
సెకండాఫ్ లో మరీ మెలోడ్రామాతో పిండటం

చూడచ్చా?

సరదాగా సాగే ఓ రొమాంటిక్ కామెడీ..ఈ పండగ సీజన్ కు మంచి ఆప్షన్.

నటీనటులు: విశ్వక్సేన్-మిథిలా పాల్కర్-ఆశా భట్-మురళీ శర్మ-రాహుల్ రామకృస్ణ-నాగినీడు-వెంకటేష్ కాకుమాను-విక్టరీ వెంకటేష్ (క్యామియో) తదితరులు
సంగీతం: లియాన్ జేమ్స్
ఛాయాగ్రహణం: విధు అయ్యన్న
మాటలు: తరుణ్ భాస్కర్
నిర్మాతలు: ప్రసాద్ వి.పొట్లూరి-దిల్ రాజు
రచన-దర్శకత్వం: అశ్వత్ మారిముత్తు
బ్యానర్లు: పీ వీ పీ సినిమా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
Run Time: 2 hr 27 Min
విడుదల తేది: 21/10/2022