Emotional Engagement Emoji (EEE)

కాంతారా కన్నడ సినిమాకుఅన్ని చోట్లా పాజిటివ్ రివ్యూలు రావడంతో కాంతారాడ సినిమాను చూసేందుకు చాలా ఉత్సాహంగా ఉన్నారు. KGF బ్లాక్‌బస్టర్ తర్వాత కన్నడ సినిమాలు ఇటీవల తెలుగు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందుతున్నాయి. 777 ఛార్లీ, విక్రాంత్ రోనా విజయాలు ఉత్తమ ఉదాహరణలు. ప్రత్యేకమైన కంటెంట్‌తో తెలుగు ప్రేక్షకుల నుండి ప్రేమ, గౌరవం అందుకున్న జాబితాలో కాంతారా కూడా చేరాడు. తెలుగు హక్కులను గీతా ఆర్ట్స్‌పై అల్లు అరవింద్ సొంతం చేసుకున్నారు. ఈ చిత్రాన్ని గీతా ఫిలింస్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ ఆంధ్ర ప్రదేశ్ & తెలంగాణా రాష్ట్రాల్లో విడుదల చేసారు. ఇంతకీ అంత గొప్ప కంటెంట్ ఉన్న సినిమా యేనా..అసలు కథేంటి …సినిమాలో హైలెట్ విషయాలేంటో చూద్దాం.
స్టోరీ లైన్:
1847 ప్రాంతంలో ఈ కథ మొదలయ్యే ఈ కథలో కర్ణాటక రాష్ట్రంలో అడవిని అనుకుని ఉన్న ఓ ఊరిలో ప్రజలకు ఆ భూమిని కొన్నేళ్ల క్రితం రాజు రాసి ఇస్తాడు. అందుకు కారణం…సమస్త సంపదలు .. సుఖ సంతోషాలు ఉన్నప్పటికీ ఒక రాజుకి మనశ్శాంతి ఉండదు. మనశ్శాంతిని పొందడం ఎలా అనే విషయాన్ని అన్వేషిస్తూ బయల్దేరిన ఆ రాజుకి ఒక అడవిలో శిలారూపంలోని వారాహి దేవి కనిపిస్తుంది. ఆ రూపాన్ని చూడగానే ఆయన మనసులోని అశాంతి మాయమవుతుంది. ఆ అమ్మవారిని తన రాజ్యానికి తరలించి ఆరాధన చేస్తాననీ, అందుకు వారు ఏమి అడిగినా ఇస్తానని అక్కడి గిరిజనులతో అంటాడు. వారి కోరిక మేరకు తన రాజ్యంలో ఆ గిరిజనుల జీవనోపాధికి అవసరమైన భూమిని దానంగా ఇస్తాడు. అప్పటి నుంచి ఆ భూమినే నమ్ముకుని గిరిజనులంతా జీవిస్తుంటారు.
అయితే… తర్వాత తరాల్లో ఈ విషయాన్ని అర్దం చేసుకోకుండా ఆ రాజు కుమారుడు తండ్రి ఇచ్చిన వేలాది ఎకరాల భూమిని, ఆస్తిని తిరిగి తీసుకోవడానికి ప్రయత్నించి , కోర్టు మెట్లు కూడా ఎక్కుతాడు. అక్కడే ఆ మెట్ల మీద రక్తం కక్కుకుని మరణిస్తాడు. మరి కొన్నేళ్ల తర్వాత ఇప్పుడు ఆ దానం ఇచ్చిన భూమి రిజర్వ్ ఫారెస్ట్‌లో భాగమని, దానిని ఊరి ప్రజలు ఆక్రమించుకున్నారని ఫారెస్ట్ ఆఫీసర్ (కిశోర్) సర్వే మొదలెడతాడు. దాంతో ఆ ఊరి కుర్రాడు శివ (రిషబ్ శెట్టి)కి, ఫారెస్ట్ ఆఫీసర్‌కి గొడవలు మొదలు అవుతాయి.
ఇక వారాహీ దేవియే తమని కాపాడుకుతూ వస్తుందనే ఒక బలమైన నమ్మకం ఆ గిరిజనులలో ఉంటుంది. అందువలన ప్రతీయేటా అమ్మవారికి ‘కోలం’ అనే ఉత్సవాన్ని నిర్వహిస్తూ ఉంటారు. అడవి పందిని వేటాడకూడదని కొత్త తరాలవారికి గట్టిగా చెబుతుంటారు. అయితే శివ (రిషబ్ శెట్టి) మాత్రం తరచూ ఆ నియమాన్ని ఉల్లంఘిస్తూ ఉంటాడు. అడవి పందులను వేటాడి సొమ్ముచేసుకుంటూ ఉంటాడు.
అయితే అతనికి ,అతని గూడానికి అండగా రాజ వంశీకులు, ఊరంతా దోరగా కొలిచే దేవేంద్ర (అచ్యుత్ కుమార్) ఉన్నాడని శివ నమ్ముతాడు. అయితే… దేవేంద్ర ..మేక వన్నె పులి. అతను ఏం చేశాడు? ఊరిలో దేవ నర్తకుడు గురవను చంపింది ఎవరు? అతడికి వచ్చే కలలు ఏమిటి..అవెందుకు భయపెడుతున్నాయి? ఊరిని, ఊరి ప్రజలను భగవంతుడు కాపాడుకున్నాడా? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
విశ్లేషణ:
కథగా చూస్తే భూమి కోసం … భుక్తి కోసం అనే ఆర్.నారాయణ మూర్తి సినిమాలా అనిపిస్తుంది. కానీ దాన్ని నడిపించిన విధానం సినిమాని నెక్ట్స్ లెవిల్ కు తీసుకెళ్లింది. అలాగే ఈ సినిమాలో కర్ణాటక తుళు జాతి వారి సంస్కృతి,సంప్రదాయాలను నిబద్దతో తీసిన తీరు మెప్పిస్తుంది. అలాగే ఈ కథలో దర్శకుడి తెలివిగా కలిపిన అంశం.. దైవత్వం. మొదటి పది నిమిషాల్లోనూ, క్లైమాక్స్ లోనూ వాటిని వాడుకొన్న విధానం అద్బుతం అనిపిస్తుంది. ఇక ఓ చిన్నపాటి అరుపుని కూడా ఈ కథలో ఓ పాత్రగా మలిచాడు దర్శకుడు. ఆ అరుపు ఎప్పుడొచ్చినా ప్రేక్షకుల్లో ఓ ఉలికిపాటు వస్తుంది. అంతేకాదు హఠాత్తుగా కనిపించే రూపం, వినిపించే శబ్దం థియేటర్‌ని గగుర్పాటు గురి చేస్తాయి. విష్ణు మూర్తి వరాహ అవతారాన్ని, పంది వేటని.. ఈ రెండింటికీ తెలివిగా కథలో మిక్స్ చేయడం అద్బుతంగా ఉంది. భగవంతుడుకి ఓ బలవంతుడు మధ్య జరిగే పోరాటంగా సినిమా కనిపిస్తుంది. భూమిపై గిరిజనుల హక్కుకి భంగం కలిగినప్పుడు వారాహీదేవి పూని శత్రు సంహారం చేయడం అనే అంశాలతో రిషబ్ శెట్టి ఈ కథను అల్లుకున్నాడు. కథ .,.. కథనాలు మొదటి నుంచి చివరి వరకూ పట్టుగానే సాగుతాయి. గిరిజనులుగా తెరపై చాలామంది ఆర్టిస్టులు కనిపించినప్పటకీ, ప్రధానమైన పాత్రలు మాత్రమే నాలుగే. ఆ నాలుగు పాత్రల మధ్య కథ ఆసక్తికరంగా నడపడంలో ఒక దర్శకుడిగా ఆయన సక్సెస్ అయ్యాడు. అలాగే స్క్రిప్టు కొంత లాగ్ గా అనిపిస్తుంది. సెకండాఫ్ లో రొటిన్ గా అనిపిస్తుంది. అయితే ప్రీ క్లైమాక్స్ నుంచి అసలు విషయం మనకు ఎరుకలోకి వస్తుంది. ఓ అద్బుతం తెరపైకి ఆవిష్కరించటానికి డైరక్టర్ కావాలనే ఇలా చేసాడని అర్దమవుతుంది. ఆ యాంగిల్ లో చూస్తే .. ఏ పాత్ర .. ఏ సన్నివేశం కూడా అనవసరమైనవిగా అనిపించవు.
టెక్నికల్ గా చూస్తే..
సాంకేతికంగా ఈ సినిమా కన్నడ చిత్రసీమ స్థాయిని పెంచేలా ఉంది. ముఖ్యంగా సౌండ్ డిజైనింగ్ అద్బుతం. ఓ రకమైన అరుపు.. సినిమా మొత్తం వినిపిస్తూ హాంట్ చేస్తుంది. థియేటర్ నుంచి బయటకు వచ్చాక కూడా ఆ అరుపు వెంటాడుతుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా వరకూ కథని నడిపించింది. డైరక్టర్ గా రిషబ్‌కు ఎక్కువ మార్కులు పడతాయి. విజువలైజేషన్ అద్బుతంగా చేయబట్టే… థియేటర్లో ఆడియన్స్‌పై ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తోంది.
‘కాంతార’ సినిమా ప్రారంభమే మనల్ని కొత్త ప్రపంచంలోకి తీసుకు వెళ్లేందుకు సరపడ సరంజామాతో రెడీ అవుతుంది. అందుకు వాళ్లు ఎంచుకున్న నేటివిటీ, సంగీతం, సినిమాటోగ్రఫీ. ఓ రకంగా కన్నడ సంప్రదాయాల్లోంచి పుట్టిన కథ ‘కాంతార’. దేవ నర్తకుడి ఆహార్యం ఆశ్చర్య పరుస్తుంది. అందుకు వాళ్లు పడ్డ కష్టం మనకు కనపడుతుంది. ప్రతి పాత్ర కథలో నుంచి పుట్టకు వచ్చినవే, కథకోసం పనిచేసేవే. కామెడీ కోసం సెపరేట్‌గా ట్రాక్స్, క్యారెక్టర్స్ రాయలేదు. అడవి గ్రామాల్లో పాత్రలు ఎలా ఉంటాయి? ఎలా ప్రవర్తిస్తాయి? అనేది చూపిస్తూ నవ్వించారు. అటవీ నేపథ్యాన్ని, పురాణ గాథను మిళితం చేసిన తీరు బావుంది. అందుకు అన్ని విభాగాలు అత్యుత్తమంగా పనిచేసాయి.
నటీనటుల్లో …హీరోగా రిషబ్ శెట్టి మాస్ కి ఎంత దగ్గరగా వెళ్లాలో అంత దగ్గరగానూ వెళ్లాడు. యాక్షన్ సీన్స్ లో విజృంభించాడు. క్లైమాక్స్ సీన్ లో వారాహీ అమ్మవారు ఆవహించినట్టుగా ఆయన అద్భుతంగా చేశాడు. సప్తమి గౌడ పాత్రకి తగినట్టుగా కనిపించింది. అలాగే దొర పాత్రలో అచ్యుత్ కుమార్ .. ఫారెస్ట్ ఆఫీసర్ పాత్రలో కిశోర్ చాలా నేచురల్ గా నటించారు. అజనీశ్ లోకనాథ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి హైలైట్.
క్లైమాక్స్ లో రిషబ్ శెట్టి విశ్వరూప విన్యాసం చేశాడని ఒప్పుకుని తీరాలి. చాలా పెద్ద ఎపిసోడ్ అది. ఆ పదిహను ,ఇరవై నిమిషాల్లోనూ.. వన్ మాన్ షోనే. కేవలం అరుపులతోనే హడలగొట్టాడు రిషబ్ అంటే అతిశయోక్తికాదు. ఆ సన్నివేశాల్లో విజువలైజేషన్, సౌండ్ డిజైనింగ్, నేపథ్య సంగీతం.. ఇవన్నీ ఈ రోజు పెరిగిన టెక్నాలిజినీ వాడుకున్న తీరు అబ్బుర పరుస్తుంది.
చూడచ్చా?
థియేటరికల్ ఎక్స్‌పీరియన్స్ అని వింటూంటాం కదా ..అదేంటో స్పష్టంగా తెలియాలంటే.. కచ్చితంగా ఈ సినిమాని, ఆ చివరి పది నిమిషాల కోసం అయినా తెరపై చూడాల్సిందే.
నటీనటులు : రిషబ్ శెట్టి, సప్తమి గౌడ, కిశోర్, అచ్యుత్ కుమార్, ప్రమోద్ శెట్టి, షానిల్ గురు, మానసి సుధీర్, స్వరాజ్ శెట్టి తదితరులు
ఛాయాగ్రహణం : అరవింద్ ఎస్. కశ్యప్
సంగీతం: బి అజనీష్ లోక్‌నాథ్
తెలుగులో విడుదల : అల్లు అరవింద్ (తెలుగులో)
నిర్మాత : విజయ్ కిరగందూర్
రచన, దర్శకత్వం : రిషబ్ శెట్టి
Runtime : 2 hrs 30 min
విడుదల తేదీ: అక్టోబర్ 15, 2022 (తెలుగులో)