ఖిలాడి మూవీ రివ్యూ

Published On: February 11, 2022   |   Posted By:

ఖిలాడి మూవీ రివ్యూ

Khiladi_m.jpg

ర‌వితేజ ‘ఖిలాడీ’ మూవీ రివ్యూ

Emotional Engagement Emoji (EEE)

👎

రవితేజ,రమేష్ వర్మ కాంబినేషన్ అనగానే వీళ్లిద్దరూ కలిసి గతంలో చేసిన వీరా గుర్తుకు వచ్చి వణుకు వస్తుంది. అయితే రీసెంట్ గా అదే రమేష్ వర్మ  ‘రాక్షసుడు’ లాంటి సక్సెస్ ఇవ్వటంతో మన బుర్రను సక్ చేయడనే నమ్ముతాం. దానికి తోడు రవితేజ కూడా ఫుల్ ఫామ్ లో ఉన్నాడని… ‘క్రాక్’తో నమ్మకం వచ్చింది. దీంతో ఖలాడీ ఏదో కొత్తదనం తెస్తుందని, రవితేజ కు మరో హిట్ ఇస్తుందని ఆశతో థియోటర్ కు వెళ్తాం. మరి మన నమ్మకాలను వీళ్లిద్దరూ కాపాడారా … ర‌వితేజ, ర‌మేశ్‌ వ‌ర్మ ఖాతాలలో మ‌రో హిట్ చేరిందా? ఈ సినిమా క‌థేంటి?

కథ

మర్డర్ కేసులో సెంట్రల్ జైల్లో ఉన్న మోహ‌న్ గాంధీ (రవితేజ)ని క్రిమినల్ సైకాలజీ స్టూడెంట్ పూజ (మీనాక్షి)కలుస్తుంది. తను ఏదో థీసెస్ డవలప్ చేస్తున్నానని అతని ప్లాష్ బ్యాక్ అడిగి తెలుసుకుంటుంది. తనను కొందరు కావాలని ఇరికించారని, పెద్ద పెద్ద పొలిటీషన్స్ ఆ కుట్ర వెనక ఉన్నారని చెప్తాడు. దాంతో జాలిపడ్డ పూజ..అతన్ని జైలునుంచి బయిటకు తెస్తుంది. అందుకోసం పెద్ద రిస్కే చేస్తుంది. అయితే బయిటకు వచ్చాక అతని గురించిన ఓ నిజం తెలిసి షాక్ అవుతుంది. అతనో ఇంటర్నేషనల్ ఖిలాడీ అని తెలిసి అదిరిపోతుంది. అతనికి పదివేల కోట్ల లాండరింగ్ తో లింక్ ఉందని తెలుస్తుంది. అప్పుడు ఆమె ఏం చేసింది…అసలు మోహన్ గాంధీ ఎవరు… రంగంలోకి దూకిన సిబీఐ ఆఫీసర్ భరద్వాజ (అర్జున్) పట్టుకోగలిగాడా వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

స్టోరీ ఎనాలసిస్ …

సాధారణంగా క్రైమ్ థ్రిల్లర్స్ చూడటానికి చాలా ఎగ్జైటింగ్ గా ఉంటాయి. సినిమాలో ఉండే పజిల్ మనని ఎడ్జ్ ఆఫ్ ది సీట్ కూర్చోబెడుతుంది.  టెన్షన్ ,సస్పెన్స్ సినిమాని రెండు వైపులా బాలెన్స్ తప్పకుండా కాపు కాస్తూంటాయి. అందుకు నేపధ్యం ఏదైనా ఉండచ్చు. అది క్రైమ్,పాలిటిక్స్ మరేదైనా కావచ్చు. ట్విస్ట్ లు, టర్న్ లతో మనని ఉక్కిరిబిక్కిరి చేయాలనుకుంటాం. కానీ అవే ట్విస్ట్ లు,టర్న్ లు విసిగిస్తే అదే ఖిలాడీ సినిమా. క్రైమ్ థ్రిల్లర్ గా మార్చాలనుకుని, సిల్లీ ట్విస్ట్ లను ముందేసుకుని, దానికి కమర్షియల్ గ్లామర్ అద్ది, మాస్ టచ్ ఇచ్చి ముందుకు వెళ్దామనుకుంటే ఆ సినిమా అటూ ఇటూ కాకుండా పోతుంది. ఈ సినిమాకు కావాల్సిన ఎగ్జైట్మెంట్, ఎటెన్షన్, సస్పెన్స్ కావాల్సినంత పుట్టలేదు. అందుకు కారణం …దర్శకుడు రాసుకున్న పూర్ స్క్రిప్టు అని మొహమాటం లేకుండా చెప్పాలి. ఇంటర్వెల్ దగ్గర పెట్టుకున్న ట్విస్ట్ …సినిమాని పైకి లేపకపోగా సెకండాఫ్ ని పూర్తిగా కిల్ చేసింది. రవితేజ నుంచి ఆశించే అంశాలు ఉంటాయి కానీ అవి సరైన ప్లేస్ లో కనపడవు. అలాగని క్లాస్ టచ్ ఉండదు. అమర్ అక్బర్ ఆంటోని, సారొచ్చారు చిత్రాలు ఈ కోవలోనే ఈ సినిమా చేరుతుంది. హీరో క్యారక్టర్ ఏకపక్షంగా యాక్షన్ చేసుకుంటూ పోతాడు. ఎక్కడా మనని ఇన్వాల్వ్ కానివ్వకపోవటంతో పూర్తి ప్యాసివ్ గా తయారై బోర్ కొట్టేస్తుంది. తెరపై భారీ యాక్షన్ ఎపిసోడ్స్ జరుగుతున్నా మనం ఏమీ కనెక్ట్ కాలేని విధంగా డిజైన్ చేసారు.

ఫెరఫార్మెన్స్ వైజ్…

రవితేజ ఏదో కొత్తదనం చూపాలని ప్రయత్నం చేస్తున్నాడు కానీ అతని యాంటిక్స్ అడ్డుపడుతున్నాయి. అలాగే సీన్స్ కూడా సపోర్ట్ చేయలేదు. రవితేజ మార్క్ రొటీన్ కామెడీ విసుగిస్తుంది. రాను రాను మొనాటని వచ్చేస్తోంది. ఇక హీరోయిన్స్ డింపుల్ హ‌య‌తి, మీనాక్షి చౌద‌రి గ్లామర్ కు పరిమితం అయ్యారు.  అన‌సూయ  కాస్త గ్లామ‌ర్ డోస్ పెంచే కార్యక్రమం పెట్టుకుంది.  జ‌న‌తా గ్యారేజ్‌, భాగ‌మ‌తి చిత్రాల ఫేమ్  ఉన్ని ముకుంద‌న్ ని వాడుకోలేదు. వెన్నెల కిషోర్  ఫన్ కి కూడా స్కోప్ క‌నిపించ‌లేదు. అర్జున్ పాత్ర అయితే పరమ రొటీన్.

టెక్నికల్ గా …

మొదటే చెప్పుకున్నట్లు సినిమాకు స్క్రిప్టే మైనస్ గా నడిచింది. ట్విస్ట్ లు ఎక్కువ అయ్యాయి. ఫైట్స్ ..గతంలో హాలీవుడ్ సినిమాల్లో చూసినవే. కాకపోతే స్టైలిష్ గా ఉన్నాయి. దేవిశ్రీ ప్ర‌సాద్ పాట‌లే ఉన్నంతలో కాస్త రిలీఫ్. డాన్స్ కంపోజీష‌న్‌, డ్ర‌స్సింగ్ స్టైల్స్ మాస్ కు పడతాయి  శ్రీ‌కాంత్ విస్సా డైలాగుల్లో విషయం లేదు.  కెమెరా వర్క్ బాగుంది. ఆర్ట్ డిపార్టమెంట్ కూడా చెప్పుకోదగిన స్దాయిలో పనిచేసింది. డైరక్షన్ మాత్రం స్టైలిష్ గా ఉంది కానీ ఎమోషన్స్ ని రిజస్టర్ చేయలేకపోయింది. నిర్మాణ విలువలు ఉన్నత స్థాయిలో ఉన్నాయి.

చూడచ్చా

ఇంత చెప్పాక కూడా ధైర్యం చేసారంటే మీరు రవితేజ వీరాభిమాని అయ్యిండాలి

ఎవరెవరు…

నటీనటులు: రవితేజ, మీనాక్షీ చౌదరి, డింపుల్ హయతి, అనసూయ, మురళీ శర్మ, ముఖేష్ రుషి, సచిన్ ఖేడేకర్, ఠాకూర్ అనూప్ సింగ్, రావు రమేష్ తదితరులు
పాటలు: శ్రీమణి
మాటలు: శ్రీకాంత్ విస్సా, సాగర్
సినిమాటోగ్రఫీ: సుజిత్ వాసుదేవ్, జీకే విష్ణు
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సమర్పణ: జయంతి లాల్ గడ
నిర్మాత: కోనేరు సత్యనారాయణ
దర్శకత్వం: రమేష్ వర్మ
Run Time:2 hr 34 Mins
విడుదల తేదీ: ఫిబ్రవరి 11, 2022