గమనం మూవీ రివ్యూ

Published On: December 11, 2021   |   Posted By:

గమనం మూవీ రివ్యూ

 

శ్రియ ‘గమనం’ మూవీ రివ్యూ

Emotional Engagement Emoji (EEE) 

 
👍  
 

గత కొంతకాలంగా  సినిమా కథ చెప్పే విధానం మారుతూ వస్తోంది. కొత్తగా ఆలోచించే వాళ్ల‌కు కొత్త దారులు దొరుకుతున్నాయి.  కావాలంటే.. కొన్ని చిన్న చిన్న క‌థ‌ల‌ు  క‌లిపి ఒకే సినిమాగా విడుద‌ల చేయొచ్చు. హిందీలో ఇలాంటి ప్ర‌య‌త్నాలు జ‌రిగాయి. ఇప్పుడు తెలుగులోనూ  ఆంథాల‌జీ చిత్రాలు వస్తున్నాయి. ఇంతకు ముందు యేలేటి మనమంతా, ఆ తర్వాత   `పిట్ట‌క‌థ‌లు` టైటిల్ తో ఒకటి వచ్చింది.  నెట్ ఫ్లిక్స్ లో విడుద‌లైన‌… తొలి తెలుగు ఆంథాల‌జీ ఇది. అది ఓటీటిలో రిలీజ్ అయ్యింది కాబట్టి వర్కవుట్ అయ్యిందా లేదా అనే విషయం తెలుసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ఇప్పుడు మరో  ఆంధాలజీ చిత్రం వచ్చింది. శ్రియ,నిత్యామీనన్ వంటి స్టార్స్ కనపడుతున్న  ఈ క‌థ‌ల్లో ఏముంది? ఆ క‌థ‌ల్ని చెప్పిన విధాన‌మెట్టిది?
 
 

స్టోరీ లైన్

గమనం మూడు కథల సమాహారం. హైదరాబాద్ లో జరిగే ఈ కథలు మూడు మూడు వేర్వేరు ప్రపంచాలను ఆవిష్కరిస్తాయి. వీటిన్నటిలోనూ కామన్ ఫాక్టర్ తమ కలలు పండించకోవటం చేసే ప్రయత్నం..కష్టం…నిష్టూరం. బస్తీ వాసి అయిన క‌మ‌ల (శ్రియ‌) కు విన‌ప‌డ‌దు. నెల‌ల పాప‌తో ఓ షావుకారు ద‌గ్గ‌ర బ‌ట్ట‌లు కుట్టుకుంటూ.. జీవినం సాగిస్తుంటుంది. ఆమె  భ‌ర్త‌.. దుబాయ్ లో ఉంటాడు. అతను ఎప్పుడొస్తాడా అని ఎదురు చూస్తుంటుంది. అతని మాటలు వినాలని అనేది ఆమె కోరిక.

ఇక అలీ (శివ కందుకూరి) కి క్రికెట్ అంటే ప్రాణం. ఎప్ప‌టికైనా జాతీయ జ‌ట్టులో ఆడాల‌నేది జీవితాశయం.త‌న ప‌క్కింటి అమ్మాయి జారా (ప్రియాంక జ‌వాల్కర్‌)తో ప్రేమ‌లో ప‌డ‌తాడు. ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకుంటారు. కానీ ఓ ఇబ్బంది. వేరోచోట అనాధలైన ఇద్ద‌రు వీధి పిల్లలు. వాళ్లు  కేకు కొనుక్కుని పుట్టిన రోజు సెలబ్రేట్ చేసుకోవాలనేది వారి కోరిక. ఆ ఖర్చు కోసం రూ.500 కావాలి. ఈ ముగ్గురి క‌థ‌.. ఓ వ‌ర్షం ప‌డిన రోజు  భారీ వరదలు వస్తే  అందులో ఎలాంటి మలుపులు తిరిగింది..చివరకు ఏమైంది… తెలియాలంటే గ‌మ‌నం చూడాలి.


ఎనాలసిస్…

సాధారణంగా ఈ టైపు క‌థ‌ల్ని… ఓటీటీ ప్రేక్ష‌కుల్ని దృష్టిలో ఉంచుకుని డిజైన్ చేస్తారు. `అయితే ఈ నిర్మాతలు థియోటర్ కు తీసుకొచ్చారు.  ఒక్కో క‌థ‌లో ఒక్కో ఎమోష‌న్ ఉంటుంది. అందుకే… క‌థ‌లు జోన‌ర్లుగా విడిపోయాయి. కానీ అన్ని కథలని కలుపుతూ వర్షం వస్తుంది. అంతవరకూ మనకు ట్రైలర్ లోనే అర్దమవుతుంది. సినిమాలో ఇంకేదో ఉంటుందని భావిస్తాము. కానీ అంత సీన్ లేదని కాసేపటికే అర్దమవుతుంది. దానికి తోడు విపరీతమైన స్లో నేరేషన్. మురికివాడల జీవితాలను అత్యంత సహజంగా చూపించాలనే దర్శకురాలి తపన ..ఒక్కోసారి కథలో విషయం లేక విసిగిస్తుంది. మూడు కథలూ మొదట్లో ఎలా ప్రారంభం అయ్యాయో చివరి దాకా అలాగే ఉంటాయి.మార్పేమీ ఉండదు. అంటే జీవితాల్లో మార్పు ఉండదు అని చెప్పటానికి సినిమా తీసారేమో అని డౌట్ వస్తుంది. నిత్యామీనన్ పాత్ర ఎందుకు వస్తుందో..ఎందుకు వెళ్తుందో ఆ కథకుడుకే తెలియాలి. అంత అయోమయపు గెస్ట్ రోల్. ఓ చిన్న ఆఫ్‌బీట్ సినిమా చూసిన ఫీలింగ్ కూడా ఈ సినిమా క‌లిగించలేకపోయింది. అక్కడక్కడా ఆర్ట్ విభాగ‌పు ప‌నిత‌నం మెచ్చుకోవాలనిపిస్తుంది. అలాగే సహజత్వం కోసం మెథ‌డ్ యాక్ట‌ింగ్ ట్రై చేస్తూ కనపడతారు ఆర్టిస్ట్ లు.  వాళ్ల అతి స‌హ‌జ‌మైన న‌ట‌న‌తో కొంత ర‌క్తిక‌ట్టింది గానీ  అత్యంత బోరింగ్ గా సాగాయి ఎపిసోడ్స్.ఈ కష్టాలు,కన్నీళ్లు మనం ఎన్నో సార్లు తెరపై గత కాలపు సినిమాల్లో చూసినవే అని నిట్టూర్చటం తప్ప ఏమీ కనపడుదు. ఇంతోటి కథలకు స్క్రీన్ ప్లే ఎందుకు అనుకున్నారేమో ..అదీ ఎక్కడా మచ్చుకు కనపడదు. రన్ టైమ్ తక్కువైనా ఐదారు గంట‌ల సుదీర్ఘ ప్ర‌స్థానం ఈ ఆంథాల‌జీ అనిపిస్తుంది. అంతలా విసిగిస్తుంది.  దాదాపు మూడు కథలు ఎంతో కొంత అసంతృప్తికి గురి చేస్తాయి. అక్కడక్కడా  విగిసిగ‌స్తాయి.  ఎలా చూసినా మిక్స్డ్ ఫీలింగే.

టెక్నికల్ యాక్పెక్ట్ లో చూస్తే..

తొలి చిత్రానికి దర్శకురాలిగా త‌ను ఇలాంటి సాధార‌ణ‌మైన క‌థ‌ని ఎంచుకుంటారని అస్స‌లు అనుకోం. క‌థ‌కేం గానీ, దాన్ని రియాలిటీకి ద‌గ్గ‌ర‌గా తెరకెక్కించిందామె. క్లైమాక్స్ ఎమోషన్ త‌ప్ప ఇంకేం ఎక్స్‌పెక్ట్ చేయ‌కూడ‌దు.  బ‌హుశా అవార్డ్ ల కోసం తీసిన సినిమా..అందుకు..స్లోనేరేషన్,అతి సహజత్వం ప్ర‌మాణాలు అవే అని భ్ర‌మ‌ప‌డి ఉంటారు. దర్శకురాలు..  మూడు నిస్సహాయ పాత్రల చుట్టూ అల్లుకున్న కథ.. కథనాలు.. గమనాన్ని ప్రేక్షకులను హత్తుకునేలా చేయటంలో ఫెయిలైంది. మహానగరంలో పేదల జీవితాలు ఎలా ఉంటాయో కళ్ళకు కట్టినట్లు చూపించలేకపోయింది. అలాగే భారీ వర్షాలు వస్తే బస్తీల్లో పేదల బతుకు ఎలా ఛిద్రం అవుతుందో చెప్పాలనుకుంది కానీ ఫలించలేదు.

ప్రతి జీవి.. జీవితంలో ఎదురయ్యే ఆటు పోట్లను ఎదుర్కొని జీవితాన్ని సార్థకం చేసుకోవాలని ఓ స్ఫూర్తి దాయక “గమనం” చూపించాలనే ప్రయత్నంమాత్రం దర్శకురాలు సుజనా రావు ని మెచ్చుకునేలా చేస్తుంది. ఈ సినిమాకు ఇళయరాజా వంటి గొప్ప సంగీత దర్శకుడు పనిచేసినా,  బుర్రా సాయిమాధ‌వ్ లాంటి మాటల రచయిత పనిచేసినా ఫలితం లేకుండా పోయింది. వారి సృజన వృధా అయ్యింది. . జ్ఞాన‌శేఖ‌ర్ కెమెరా వ‌ర్క్ బాగుంది. ఆయ‌నే ఈ సినిమాకి నిర్మాత …నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటుల విషయానికి వస్తే..ఇన్నాళ్లూ అంటే గత కొన్నేళ్ల దాకా.. తన గ్లామర్ తోనే మెప్పించిన శ్రియా.. ఈ మూవీతో తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించింది. ముఖ్యంగా క్లైమాక్స్‌ సీన్‌లో అద్బుతం చేసింది. అలాగేక్రికెటర్ అవ్వాలని ఆశ పడే ముస్లిం యువకుడు అలీ పాత్రలో శివ కందుకూరి మెప్పించాడు. హీరోయిన్ గా ప్రియాంక జవాల్కర్‌ ఓకే. వీధి బాలురుగా నటించిన ఇద్దరు చిన్నారులు మంచి ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నారు.

బాగున్నవి

శ్రియ నటన
 కెమెరా వర్క్

బాగోలేనివి :
డెడ్ స్లో నేరేషన్

చూడచ్చా :
కమర్షియల్ కోణం లో ఏమాత్రం  ఆలోచించకుండూ చూస్తే నచ్చచ్చు.

బ్యానర్ : క్రియ ఫిల్మ్ కార్ప్, కలి ప్రొడక్షన్స్
నటీనటులు : శ్రియా సరన్, శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్, నిత్యా మీనన్, చారు హాసన్  తదితరులు
సంగీతం : ఇళయరాజా
కెమెరా :జ్ఞానశేఖర్ వి.ఎస్
నిర్మాతలు: రమేష్ కురుటూరి, వెంకీ పుష్పదపు, జ్ఞానశేఖర్ వి.ఎస్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సుజనా రావు
ఎడిటింగ్ : రామ కృష్ణ అర్రం
విడుదల : 10-12-2021
రన్ టైమ్  : 1 గం 57 నిముషాలు