

సుడిగాలి సుధీర్ కి మంచి ఫాలోయింగ్ ఉంది. జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయిన సుధీర్.. సినిమాల్లో ఫ్రెండ్ కేరెక్టర్లు చేసుకుంటూ.. హీరోగా చేసే స్థాయికి ఎదిగారు. తనదైన కామెడీ సెన్స్ తో అందరినీ నవ్విస్తూనే.. హీరోగా కూడా సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నారు.సాఫ్ట్ వేర్ సుధీర్, త్రీ మంకీస్, వాంటెడ్ పండుగాడ్ వంటి సినిమాల్లో హీరోగా నటించి మెప్పించారు. ఆ క్రమంలో ఇప్పుడు గాలోడు అనే మరో సినిమాతో మన ముందుకు వచ్చారు. ఈ సినిమాకు మరో ప్రత్యేకత ఏమిటంటే ఆయనే నిర్మాత కూడా. మరి అంతలా నమ్మి , తను స్వయంగా నిర్మాణ భాధ్యత వహించిన చిత్రం స్పెషాలిటీ ఏమిటి..అసలు ఈ చిత్రం కథ ఏమిటి, ఆయన అభిమానులను ఏ మేరకు మెప్పించింది వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
స్టోరీ లైన్
పల్లెటూరి కుర్రాడైన రాజు(సుడిగాలి సుధీర్) బీబత్సమైన ఆటిట్యూడ్, భయంకరమైన యారోగెంట్. పనీపాట లేకుండా ఊర్లో బేవర్స్ గా తిరుగుతున్న రాజుకు తన ఊళ్లో హద్దూ ,అదుపు ఉండదు. ఓ సారి పేకాటలో జరిగిన గొడవలో ఊరి ప్రెసిడెంట్ కొడుకుని కొట్టడంతో అతను చనిపోతాడు. పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో హైదరాబాద్‌కి వెళ్తాడు. అక్కడ కాలేజ్ స్టూడెంట్ శుక్లా (గెహానా సిప్పి) కంట్లో పడతాడు. ఆమెను సినిమాటెక్ గా ఓ ఆపద నుంచి కాపాడతాడు. దీంతో అతన్ని తన ఇంట్లోనే కార్ డ్రైవర్‌గా జాబ్ పెడుతుంది. ప్రేమలో పడుతుంది. అయితే ప్రేమ ముదిరి పాకాన పడే సమయంలో ఊర్లో సర్పంచ్ కొడుకు హత్య కేసులో జైలుకి వెళ్తాడు. చివరకి రాజు ప్రేమ పరిస్థితేంటి? జైలు నుంచి రాజు బయటకు రాగలిగాడా? అతని ప్రేమ, హత్య కేసులు ఎలాంటి మలుపులు తిరిగాయనేది మిగిలిన కథ.
ఎనాలసిస్ …
ఈ సినిమా కథ చదువుతూంటే ఇలాంటి కథలు, సినిమాలు ఇంకా వస్తున్నాయా అని సగటు ప్రేక్షకుడుకి సందేహం కలుగుతుంది. దాదాపు పదిహేను ఏళ్ల క్రితం ఇలాంటి ఫార్ములా, ఫార్మెట్ లో కథలు వచ్చేవి. ఐదు ఫైట్స్, ఆరు పాటలు, మధ్యలో కామెడీ ఇలా ఓ మీటర్ ప్రకారం నడుస్తూండేది. వీటిల్లో చెప్పుకోదగ్గ కథ ఉండదు. కానీ సినిమా నడిచిపోతూంటుంది. విలన్, హీరో, ఫైట్స్, హీరోయిన్, పాటలు అంటూ నానా రచ్చ జరుగుతూంటుంది. గత కొన్నేళ్లుగా ఆ స్కీమ్స్ ఆపేసారు. అయితే అప్పుడప్పుడూ ఇదిగో ఇలాంటి సినిమాలు మళ్లీ అప్పటి కథలు చెప్పటానికి ప్రయత్నిస్తున్నాయి. వాస్తవానికి ఇలాంటి కాలం చెల్లిన కథని చెప్పడం అంత తేలిక కాదు. ఇందులో కొత్తదనం చూపించడం ఒక పెద్ద సవాల్. అందుకే దర్శకులు ఇలాంటి కథలు చెప్పేటప్పుడు కొత్తకొత్త టెక్నిక్ లని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే ఈ దర్శకుడు అది కూడా అనవసరం అనుకున్నట్లున్నాడు. కథ పరంగా ఇదొక రెగ్యూలర్ మూవీనే. కొత్తదనం చెప్పడానికి ఏం లేదు. మాస్ యాక్షన్ కమర్షియల్ మూవీలు ఎలా ఉంటాయో అలానే సాగుతుంది. కాకపోతే సుధీర్ లాంటి అప్‌కమింగ్ హీరోకి శృతి మించిన ఎలివేషన్లే కాస్త ఇబ్బంది పెట్టే అంశాలు. ఓపెనింగ్ ఎలివేషన్లే మరీ ఓవర్‌గా అనిపిస్తుంటాయి.
కథ పాతగా అనిపిస్తుంది.. స్క్రీన్ ప్లే కూడా రొటీన్‌గానే అనిపిస్తుంది. దర్శకుడు రొటీన్ కథ అయినా ఇంకాస్త డ్రామా రాసుకోవాల్సింది. ‘ఎక్కడ డ్రామా మొదలౌతుందో అక్కడ లాజిక్ ముగుస్తుంది’ అనేది పాపులర్ నానుడి. ఈ సినిమా చూసినప్పుడు కూడా అదే విషయం గుర్తు వస్తుంది కానీ అక్కడక్కడా వచ్చే ట్విస్టులు, టర్న్‌లు మాత్రం మెప్పిస్తాయి. అసలు కథను సెకండాఫ్‌లోనే రివీల్ చేస్తారు. అయితే ప్రథమార్థంలో కాస్త బోరింగ్ అనిపిస్తుంది. ఇంటర్వెల్ లో ఇచ్చిన ట్విస్ట్ మరీ అంత ఎక్సయిటింగా వుండదు. అయితే తర్వాత ఈ కథలో అసలు సమస్య మొదలౌతుంది. ఎప్పుడైతే హీరో తండ్రి విలన్ గా మారతాడో, హీరో మంచితనంతో అందరి మనస్సు గెలుచుకుంటాడో..అక్కడే కథ గాడి తప్పింది. ఇక్కడే డ్రామాని నడపలేని అపరిపక్వత దర్శకుడిలో కొట్టించినట్లు కనిపించింది.
టెక్నికల్ గా చూస్తే..
డైరక్టర్ ఎంతసేపు…హీరోయిజాన్ని ఎలివేట్ చేయాలనే తపన తప్పితే మరో ఆలోచన ఉన్నట్టుగా అనిపించదు. హీరో ఎంట్రీ సీన్ నుండి ప్రతి సన్నివేశాన్నీ బిల్డప్ షాట్స్ తో నింపేశారు. ఎంటర్టైన్మెంట్ పంచాల్సిన చోట కూడా హీరోయిజాన్నే చూపించారు. నిర్మాణ విలువలు డీసెంట్ గా వున్నాయి. కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. పాటలు వినడానికి బావున్నాయి. నేపధ్య సంగీతం కూడా చక్కగా చేశాడు.
కమెడీ ఇమేజ్ ఉన్న సుడిగాలి సుధీర్ కు ఇది నప్పే పాత్ర కాదు.కానీ సుధీర్ తన లోటు లేకుండా బాగానే చేసారు. ఇక ‘చోర్ బజార్’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన గెహనా సిప్పి తెర మీద చూడటానికి బాగానే ఉంది. ఇతర ప్రధాన పాత్రలను సప్తగిరి, రవిరెడ్డి, ఆధ్య, అజయ్, శరత్, పృధ్వీరాజ్, సత్యకృష్ణన్ తదితరులు పోషించారు. ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ జడ్జి పాత్రలో కనిపించారు. మొత్తం సినిమాలో షకలక శంకర్ పాత్రే కాస్తంత వినోదాన్ని పంచేది.
చూడచ్చా?
లాజిక్, ఇంటెలిజెన్స్ ని ప్రేక్షకుడు పక్కన పెట్టేయాలి. అప్పుడే ఈ గాలోడు నచ్చుతాడు.
నటీనటులు: సుడిగాలి సుధీర్, గెహనా సిప్పీ, సప్తగిరి, షకలక శంకర్, పృథ్వీరాజ్ తదితరులు
ప్రొడక్షన్ బ్యానర్: సంస్కృతి ఫిల్మ్స్
నిర్మాత: పి. రాజశేఖర్ రెడ్డి
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పి. రాజశేఖర్ రెడ్డి
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సినిమాటోగ్రఫీ: రామ్ ప్రసాద్
Runtime:2hrs 8mins
విడుదల తేది: నవంబర్ 18, 2022