గుర్తుందా శీతాకాలం మూవీ రివ్యూ

Published On: December 9, 2022   |   Posted By:

గుర్తుందా శీతాకాలం మూవీ రివ్యూ

Emotional Engagement Emoji

రీమేక్ లకు కాలం చెల్లిందంటూనే వరస పెట్టి రీమేక్ లు వదులుతున్నారు మన నిర్మాతలు. ఒక భాషలో సూపర్ హిట్టయిన ప్రతి చిత్రం మరో భాషలో వర్కవుట్ అయిపోతుందనే గుడ్డి నమ్మకంతో ముందుకు వెళ్తున్నారు. రీమేక్ లు కన్నా డబ్బింగ్ లే బాగుంటున్న నేపధ్యంలో లవ్ మాక్ టైల్ అనే ఫీల్ గుడ్ కన్నడ సినిమాను తెలుగులోకి రీమేక్ చేసి వదిలారు. వాస్తవానికి మనకు కన్నడ రీమేక్ సినిమాలు ఏమీ వర్కవుట్ కావటం లేదు. గతంలో వచ్చిన ముంగారు మలై (వాన) కిరిక్ పార్టీ (కిరాక్ పార్టీ) దియా (డియర్ మేఘా) సినిమాలు అన్ని డిజాస్టర్ అయ్యాయి. ఇప్పుడు వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది వర్కవుట్ అవుతుందా చూద్దాం.
స్టోరీ లైన్
దేవ్‌ అలియాస్‌ సత్యదేవ్‌ (సత్యదేవ్‌) రోడ్ ట్రిప్ కు వెళ్తూండగా ఓ ఇంజినీరింగ్ స్టూడెంట్ దివ్య(మేఘా ఆకాష్) కలుస్తుంది. ఆమెను రౌడీల నుంచి రక్షించగా ఇద్దరూ ఫ్రెండ్స్ అవుతారు. ఆ తర్వాత దేవ్ తన సొంత ఊరు మంగుళూరు వెళ్తున్నాడు అని తెలుసుకుని తన ఇంటి దగ్గర డ్రాప్ చేయమని అడుగుతుంది. ఆ జర్నీలో దేవ్ గురించి అతని ప్రేమ కథలు తెలుసుకోవాలనుకుంటుంది. ఆమె అప్పుడు దేవ్ మొదట్లో ఇష్టపడకపోయినా తర్వాత మెల్లిగా తన హృదయాన్ని ఆవిష్కరిస్తారు. తన టీనేజ్ నుంచి తన జీవితంలో చోటు చేసుకున్న ప్రేమ కథలు చెప్తాడు. అందులో తన జీవితంలోకి వచ్చిన ఇద్దరు అందమైన అమ్మాయిల గురించి చెప్తాడు. అమూల్య (కావ్య శెట్టి) తన తొలి ప్రేమ కథ, తర్వాత అది ఫెయిల్ అవటం, డిప్రెషన్ లోకి వెళ్ళటం ఆ తర్వాత నిధి (తమన్నా) తన జీవితంలోకి రావటం, ఆమెను వివాహం చేసుకోవటం, మళ్లీ అమూల్య తన జీవితంలోకి వచ్చే ప్రయత్నం చేయటం చివరకు ఏమైంది అనేది క్లైమాక్స్.
ఎలా ఉంది
టైటిల్ చూసి ఇదేదో పొయెటిక్ లవ్ స్టోరీ అని భ్రమపడి అదిరిపోయే ఫీల్ తో ముందుకు వెళ్తుందని భావిస్తే దెబ్బ తినటమే. ఈ సినిమా ఎక్కడా ఎలాంటి కుదుపులూ లేకుండా సినిమాలో ఏ మలుపులూ లేకుండా చాలా సాధారణంగా సాగిపోయి ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది. సినిమాలో హీరో తన ప్రేమ కథలు చెప్తూంటే వింటూన్న అమ్మాయి (మేఘా ఆకాష్) తెగ ఎగ్జైట్ అయిపోతూంటుంది. ఆమెను చూసి మనం షాక్ అవుతూంటాం. అక్కడ అంత మేటర్ ఏముందా అని మరీ ఖాళీగా ఉందేమో కాలక్షేపానికి వింటోంది అని సరిపెట్టుకుంటాం. అసలు మొదట్లో వచ్చే స్కూల్లో లవ్ స్టోరీతోనే చూసే మనం నీరుగారిపోతాం. అంత నీరసమైన రస విహీనమైన స్క్రిప్టు ఇది. సినిమాలో మెయిన్ పెయిర్ ఇద్దరి మధ్య ఎక్కడా ఎలాంటి మ్యాజికల్ మూమెంట్స్ జరగవు. ఇక తమన్నా లుక్స్ తన స్క్రీన్ ప్రెజెన్స్ ఇందులో చాలా తేడాగా అనిపిస్తుంది. ఏదైమైనా ఈ లవ్ స్టోరీలో సోల్ మిస్సయైందని అర్దమయ్యే సరికి ఆవలింతలువస్తాయి. ఇంక క్లైమాక్స్ మరీను. గీతాంజలిలాగ ట్రాజిక్ ఎండింగ్ ఇచ్చి మన గుండెలు బ్రద్దలు కొట్టేద్దామని ట్రై చేసాడు కానీ అదీ ఫలించలేదు.
టెక్నికల్ గా ఈ సినిమా స్క్రిప్టే చాలా కాలం క్రితం నాటిది అనిపిస్తుంది. తెలుగులో ఇలాంటివి వర్కవుట్ అయ్యే టైమ్ దాటేసింది. ఈ సినిమాలో డైలాగులు అక్కడక్కడా బాగున్నాయి. కాలభైరవ ఇచ్చి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. సాంగ్స్ జస్ట్ ఓకే. సినిమాటోగ్రఫీ డీసెంట్ గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఈ సినిమాకు తగ్గట్లున్నాయి. ఎడిటింగ్ సెకండాఫ్ లో బాగా లాగ్ ఉంది.
నటీనటుల్లో సత్యదేవ్ పెర్ఫామెన్ప్ మినహాయిస్తే సినిమాలో చెప్పుకోదగ్గ విషయాలేమీ లేవు. అయితే అతడి లుక్స్ స్క్రీన్ ప్రెజెన్స్ కి ప్రేమకథలు సెట్ కావు.
తమన్నా తన ఇమేజ్ పక్కన పెట్టి చేసింది ఏం ఫలితం వృధా. కావ్యా శెట్టికి జస్ట్ ఓకే. మేఘా ఆకాష్, సుహాసిని మణిరత్నం లు గెస్ట్ రోల్స్ టైప్.
చూడచ్చా
ఇంత చెప్పాక, చదివాక కూడా సినిమాలు చూడాలనుకుంటే మీరు ఖచ్చితంగా తమన్నా వీరాభిమానులు అయ్యింటారు.
నటీనటులు : సత్యదేవ్, తమన్నా, కావ్యా శెట్టి, మేఘా ఆకాష్, ప్రియదర్శి, సుహాసిని మణిరత్నం తదితరులు
కథ : కృష్ణ
మాటలు : లక్ష్మీ భూపాల
ఛాయాగ్రహణం : సత్య హెగ్డే
సంగీతం : కాల భైరవ
సమర్పణ : ఎం. ఎస్. రెడ్డి, చినబాబు
రన్ టైమ్ : 2h 21m
నిర్మాతలు : రామారావు చింతపల్లి, నాగ శేఖర్, భావ‌న ర‌వి
దర్శకత్వం : నాగ శేఖర్
విడుదల తేదీ: డిసెంబర్ 9, 2022