జై భీమ్ మూవీ రివ్యూ

Published On: November 2, 2021   |   Posted By:

జై భీమ్ మూవీ రివ్యూ

సూర్య ‘జై భీమ్’ రివ్యూ

 Emotional Engagement Emoji (EEE) : 

 👍

నిజ జీవితంలో జరిగిన కథను తెరకెక్కిస్తున్నారు. అదీ ఓటీటికు ఇస్తున్నారు అనగానే ఏ డాక్యుమెంటరీలాగ తీసారో సినిమా అనే డౌట్ వస్తుంది. అయితే హీరో సూర్య గత చిత్రం కూడా ఓటీటిలో రావటం, సక్సెస్ అవ్వటంతో ఈ సినిమా చూడాలనిపిస్తుంది. దానికి తోడు ఈ సినిమా ఓ కోర్టు రూమ్ డ్రామా కావటం జరిగింది. మనకు ఈ మధ్య కాలంలో తెలుగులో వరసగా నాంది, వకీల్ సాబ్ వంటి కోర్ట్ రూమ్ డ్రామాలు తెరకెక్కాయి. ఓ బాధికుడుతో కథ తో ఓ సినిమా, బాధితుల వైపు నిలబడ్డ లాయిర్ కథతో ఓ సినిమా వచ్చాయి. ఇప్పుడు అదే వరసలో బాధితుల తరుపున నిలబడ్డ ఓ నిజాయితీ గల లాయిర్ కథతో ఈ సినిమా వచ్చింది. ఎక్కడో అడవుల్లో మారుమూల ఉండే ఆదివాశీలు సైతం న్యాయం కోరుకుంటే అందించే వారు ఉన్నారు. న్యాయ వ్యవస్ధ ఇప్పటికీ ప్రజలకి ధైర్యాన్ని ,భరోసాని ఇస్తోంది అనే విషయాన్ని ఈ సినిమా చెప్పే ప్రయత్నం చేసింది. ఇంతకీ ఈ సినిమా కథేంటి…సూర్య వంటి స్టార్ ఇలాంటి క్యారక్టర్ ఎందుకు ఎంచుకున్నాడు..కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

స్టోరీ లైన్
ఆదివాసీ రాజన్న ( మణికందన్ ) ఎలుకల్ని , పాముల్ని పట్టడం… కూలీపని చేసుకోవటం వంటివాటితో జీవిస్తూంటాడు.  తన ప్రక్క ఊరి రాజాపురం ప్రెసిడెంట్ ఇంట్లో పాము దూరితే ..రాజన్నకి కబురు వస్తుంది. రాజన్న వెళ్లి పాముని పట్టుకుని దాన్ని తిరిగి అడవుల్లో వదిలేస్తాడు. ఆ మరుసటి రోజు ఆ ప్రెసిడెంట్ ఇంట్లో దొంగతనం జరుగుతుంది. రాజన్నమీదే అనుమానం వచ్చికేసు పెడతారు. దాంతో పోలీస్ లు రాజన్న ని పట్టుకెళ్లి దొంగతనం కేసు ఒప్పుకోమని బలవతం చేస్తారు. హింసిస్తారు. ప్రాణాలు తీయటం తప్ప అన్నీ చేస్తారు. ఈ క్రమంలో రాజన్న తో పాటు మరో ఇద్దరు ఆ స్టేషన్ నుంచి మాయమవుతారు. దాంతో రాజన్న బార్య  సినతల్లి ( జిమోమోల్ జోస్ ) కు ఏం చేయాలో అర్దంకాక, కోర్టుకు వెళ్తే తన భర్త ఎక్కడున్నాడో పోలీస్ లే వెతికి తీసుకువస్తారని లాయిర్ చంద్రు (సూర్య) ని కలుస్తుంది. చంద్రు ..ఆదివాశీలు తరుపున అర్ద రూపాయి కూడా ఆశించకుండా పోరాటం చేస్తూంటాడు. చుంద్రు ఈ కేసు టేకప్ చేస్తాడు. ఓ ప్రక్క పోలీస్ లు ఎలాగైనా ఈ కేసుని మూసేయాలని చూస్తారు. నయానా,భయానో కేసుని ఆపాలనుకుంటాడు. కానీ చంద్రు పట్టుదల ముందు, దీక్ష ముందు వారి ఎత్తుగడలు ఏమీ పనిచేయవు. ఈలోగా ప్రభుత్వం తరుపున  గవర్నమెంట్ అడ్వకేట్ జనరల్ (రావు రమేష్) సీన్ లోకి వస్తాడు. అక్కడ నుంచి కథ అనేక మలుపులు తీసుకుంటుంది. చివరకు రాజన్న ఏమయ్యాడు అని తేలుతుంది. చంద్రు కేసు గెలిచారా…ఈ కథలో ఐజీ పెరుమాళ్లు స్వామి (ప్రకాశ్ రాజ్) పాత్ర ఏమిటి? అనేవి వెండితెరపై చూడాల్సిన విషయాలు.

స్క్రిప్టు ఎనాలసిస్ ..

కొన్ని సినిమాల్లో కామెడీ ఉండదు, ఐటం సాంగ్ ఉండదు, ఫైట్స్ ఉండవు కానీ మనకి నచ్చేస్తాయి. తెరపై హీరో గెలుస్తూంటే మనమే గెలుస్తున్న ఫీలింగ్ వచ్చేస్తుంది. అలాంటి సినిమాలు అరుదుగా ఉంటాయి. ఈ సినిమా ఆ జాతిదే. మనజాతే . ఇందులో హీరో పాత్ర రాజన్న మనోడే, మన ఇంట్లో వాడే అనిపిస్తుంది. ఆదివాసి జాతి అని చిన్న చూపుతో పోలీసులు రాజ్య హింసకు పాల్పడుతుంటే మనకే ఎదురుతిరగాలినిపిస్తుంది. అందుకు కారణం కథలో ఉన్న గాఢత, పెయిన్ తో పాటు దాన్నే అంతే స్పష్టంగా మన మనస్సులోకి ఫ్రేముల వారిగా ఎక్కించే ప్రయత్నం చేసిన దర్శకుడు గొప్పతనం కనిపిస్తుంది. ”దెబ్బలు మూడు రోజులకు మానిపోతాయ్ .. కానీ దొంగ అనే ముద్ర జీవితాంతం వుండిపోతుంది”  లాంటి కొన్ని డైలాగులుకి అయితే విజిల్స్ వెయ్యాలనిపిస్తుంది.  పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించాలనే ఒత్తిడికి లోనవుతున్న పోలీసులు, న్యాయ వ్యవస్థ నుండి తమను తాము రక్షించుకునే వ్య‌క్తులు అణగారిన వర్గాల ప్రజలపై తప్పుడు కేసులు బనాయించటం గమనిస్తాము. ఓటీటి లో చూస్తున్నా మన ప్రక్కన ఎంత ఇంపార్టెంట్ ఫోన్ మ్రోగినా ఎత్తాలనిపించదు. సినిమా పూర్తయ్యాక కాసేపు మనస్సు కుదురుగా ఉండదు. పోలీస్ ల మీద కోపం వస్తుంది. మనం ఎలాంటి వ్యవస్దలో బ్రతుకుతున్నామో అనిపిస్తుంది. అన్ని భావాలు ఒకేసారి మనలో కలిగించటం అంటే మాటలు కాదు. అది ఆ స్క్రిప్టు గొప్పతనం, ఆ స్క్రీన్ ప్లే పనితనం అని చెప్పాలి. అయితే కోర్ట్ రూమ్ డ్రామా వల్లనో మరే కారణం వల్లనో కానీ కొన్ని సీన్స్ ఎంతకీ అయ్యినట్లు అనిపిచవు. సాగతీసినట్లు అనిపిస్తాయి. ఏదైమైనా వకీల్ సాబ్ లాంటి సినిమాని ఆదరించిన మనకు ఈ సినిమా అంతకు మించిన ఫీల్ ఇస్తుంది. మనకీ న్యాయ వ్యవస్దపై ,కొందరు లాయర్లపై గౌరవం కలిగిస్తుంది. సోషల్ మెసేజ్ తో తీసే సినిమాలు ఇలా బోర్ కొట్టకుండా తీయచ్చు అనే లెస్సన్ ని ఈ సినిమా అందిస్తుంది.  అంతకు మించి ఓ సినిమా సాధించే సార్దకత ఏముంటుంది?

టెక్నికల్ గా..

దర్శకుడు గా  జ్ఞానవేల్ రాజ ఓ వాస్తవిక ప్రపంచాన్ని అద్భుతంగా ఆవిష్కరించాడు. అందుకు ఆర్ట్ డిపార్టమెంట్ సహకరించింది. ఎక్కడా డాక్యుమెంటరీ  ఫీల్ రాకుండా, స్క్రీన్‌ప్లే సమయానుకూలంగా తీర్చిదిద్దాడు.కథలో ఇరకని, అనవసరమైన రొమాన్స్ ట్రాక్‌లు మరియు పంచ్ డైలాగ్‌లు లేకుండా చూసుకున్నాడు. పాటలు కూడా క‌థ‌లో కలిసిపోయాయి. అయితే బడ్జెట్ మాత్రం ఓటీటి సినిమాకు తగ్గట్లుగా కంట్రోలు కనపడుతుంది.  ఎస్‌.ఆర్‌. కాదిర్‌ సినిమాటోగ్రఫీ, ఫిలోమిన్‌ రాజ్‌ ఎడిటింగ్‌ సినిమాని నిలబెట్టేసాయి.  షాన్‌ రొనాల్డ్‌ నేపధ్య సంగీతం సినిమాని నెక్ట్స్ లెవిల్ కు తీసుకెళ్లింది. డైలాగులు చాలా చోట్ల పాత్రల జీవితంలోంచి వచ్చి మాట్లాడినట్లు అనిపించాయి.

నటీనటుల్లో …అన్యాయానికి గురైన ఆదివాసీ దంపతులకు న్యాయం చేయడానికి కృషి చేసే న్యాయవాది పాత్రలో సూర్య జీవించారు.  ఈ చిత్రం ద్వారా అడిగే ప్రశ్నలు కచ్చితంగా మనలని ఆలోచింపజేస్తాయి.  అలాగే  గిరిజన దంపతులుగా నటించిన మణికందన్‌, లిజో మోల్‌ జోసేలు నిజంగానే వాళ్లను తీసుకొచ్చే చేయించారేమో అనిపిస్తుంది. ఓ గిరిజన మహిళ న్యాయం కోసం హైకోర్టు వరకూ వెళ్లిన తీరు ఆలోచన రేకెత్తిస్తుంది. డీజీపీ గా ప్రకాశ్‌రాజ్‌, రాజిషా విజయన్‌, రావు రమేశ్‌ తదితరులు తమ పాత్రల్లో చక్కగా నటించారు.  క్రూరమైన పోలీసుగా నటించిన నటీనటులు కూడా చ‌క్క‌ని ప్ర‌తభ క‌న‌బ‌రిచారని చెప్పాలి.

నచ్చినవి
నిజ జీవిత కథను స్క్రీన్ ప్లేతో సినిమాగా మలిచిన విధానం
సూర్య
సాంకేతికత నిపుణుల పనితనం

నచ్చనవి
స్లోగా నడిచే సీన్స్

చూడచ్చా

ఖచ్చితంగా మనం చూడాల్సిన సినిమా

ఎవరెవరు…

నటీనటులు: సూర్య, ప్రకాశ్‌రాజ్‌, రావు రమేశ్‌, రాజిష విజయన్‌, లిజోమోల్‌ జోసీ, మణికంఠన్‌ తదితరులు;
సంగీతం: షాన్‌ రొనాల్డ్‌;
ఎడిటింగ్‌: ఫిలోమిన్‌ రాజ్‌;
సినిమాటోగ్రఫీ: ఎస్‌.ఆర్‌.కాదిర్‌;
నిర్మాత: సూర్య, జ్యోతిక;
రచన, దర్శకత్వం: త.శె.జ్ఞానవేల్‌;
ఓటీటి: అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో
విడుదల తేదీ:02,నవంబర్ 2021.
రన్ టైమ్: 2 గంటల 45 నిముషాలు