
Emotional Engagement Emoji

మారిన ప్రేక్షకులు సినిమాలతో సమానంగా వెబ్‌సిరీస్‌లను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. దాంతో వీటిల్లో నటించేందుకు స్టార్ హీరోహీరోయిన్లు సైతం ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. ఈ నేపధ్యంలో హీరోయిన్ అంజలి గత కొన్నాళ్లుగా సినిమాలతో పాటుగా వెబ్‌సిరీస్‌లపై ఫోకస్ పెడుతోంది. ప్రస్తుతం మూడు సిరీస్‌లు చేస్తోంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ఝాన్సీ వెబ్‌సిరీస్ తాజాగా స్ట్రీమింగ్ మొదలైంది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వేదికగా అక్టోబర్ 27న విడుదల అయ్యింది. ఈ సీరిస్ ఎలా ఉంది.. కథేంటి…మన వాళ్లకు నచ్చే కంటెంట్ తో రూపొందిందా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
కథ:
గతం మర్చిపోయిన ఝాన్సీ (అంజలి), సంకీత్ (ఆదర్శ్ బాలకృష్ణ) తో సహజీవనంలో ఉంది. ఆమెకు తనెవరో , తన గతం ఏమిటో అసలు తెలియదు. గత ఆరేళ్లుగా ఝాన్సీ పేరుతో చెలామణి అవుతోంది. కేరళలో సంకీత్‌కు కనిపించటంతో . గతం మర్చిపోయిన ఆమెను తనతో పాటు తీసుకొచ్చి చాలా ప్రేమగా,జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. అయితే ఆమె జీవితం సజావుగా సాగదు. మధ్య మధ్యలో ఝాన్సీకి పీడకలలాంటి ఏవేవో ఘటనలు గుర్తుకు వస్తుంటాయి. ఆ ఘటనలు ఏమిటి…వాటికి ఆమె గతానికి ఉన్న రిలేషన్ ఏమిటి? గతం మర్చిపోవడానికి ముందు ఝాన్సీపై ఎటాక్ చేసిన మోడార్ (రుద్ర ప్రతాప్) ఎవరు? విదేశాల్లో మాఫియా డాన్ కాలేబ్ (రాజ్ విజయ్), అతనికి అండగా ఉంటున్న బార్బీ (చాందిని చౌదరి)కి, ఝాన్సీకి రిలేషన్ ఏమిటి? అసలు, ఝాన్సీ అసలు పేరేమిటి? గతం ఏమిటి? గతం తెలుసుకోవాలని చేసిన ప్రయత్నంలో ఝాన్సీ ఏం తెలుసుకుంది? ఏం చేసింది? అనేది వెబ్ సిరీస్ చూసి తెలుసుకోవాలి.
ఎలా ఉందంటే :
మహిత అనే ఒకసగటు మహిళ, ఝాన్సీ లా ఎలా మారిందో తెలియడమే ఈ కథ. మెమరీ లాస్, అంతుపట్టని గతం, వెంటాడే జ్ఞాపకాలతో సతమతమయ్యే మహిత జీవితం చుట్టూ కథ అల్లారు. మహిత జీవితంలో వర్తమానానికి, గతానికి మధ్య జరిగే సంఘర్షణకి దృశ్యరూపం “ఝాన్సీ” ని తెరకెక్కించారు. ఫామ్ లో ఉన్న అంజలి (Anjali), చాందిని చౌదరి (Chandini Chowdary) ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ కావటంతో ‘ఝాన్సీ’ (Jhansi Web Series) కు మంచి క్రేజే వచ్చింది. అదే సమయంలో అంజలి యాక్షన్ గెటప్, లుక్ ప్రేక్షకుల దృష్టిని బాగానే ఆకర్షించింది. మహిళల అక్రమ రవాణా (Women Trafficking), చిన్నారులపై అఘాయిత్యాలు, మాఫియా నేపథ్యంలో రూపొందింది. అయితే ఇది సినిమాకు అనుకున్న కథ అని కాస్త చూసిన తర్వాత అర్దమవుతుంది. ఇందులో కొత్తదనం ఏమీ లేదు.రొటీన్ గా సినిమాటెక్ గా సాగుతుంది. కాకపోతే కాస్తంత ఇంట్రస్ట్ మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. స్క్రీన్ ప్లే సరిగ్గా లేకపోవటంతో …చాలావరకూ సాగతీసిన ఫీలింగ్ వస్తుంది.
అలాగే కథలో వచ్చే ఆ ట్విస్టులు కూడా కొత్తగా ఏమీ అనిపించలేదు. చాలా సినిమాల్లో చూసినవే. అళాగే దర్శకుడు చాలా ఫ్రీడమ్ తీసుకుని రాసుకున్న కథ ఇది. లాజిక్స్ వెతికితే చూడలేమని అర్దమవుతుంది. ఇలాంటి కథలో కీలకంగా నిలవాల్సిన పోలీసుల ప్రమేయం నామమాత్రం చేసేసారు. అలాగే వెబ్ సీరిస్ గా కన్నా సినిమా కథగానే మెప్పిస్తుందని మనకు సీరిస్ పూర్తి చేసాక వచ్చే నిట్టూర్పుతో అర్దమవుతుంది.అన్నిటి కంటే ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయి. సర్‌ప్రైజ్ చేసే రోల్స్ లేవు. తొలి మూడు ఎపిసోడ్స్ వరకు ఇంట్రస్టింగ్ గానే ఉంది. కానీ తర్వాత ఏం జరుగుతుందోననే ఆసక్తి పోయింది. చూసిన ,తెలిసిన కథను చెబుతున్నారనే అనిపిస్తుంది. కథలో కొత్త పాత్రలను పరిచయం చేస్తూ వెళ్లారు తప్ప…కంక్లూజన్స్ ఇవ్వలేదు. మెయిన్ ట్విస్ట్ కోసం సీజన్ 2 వచ్చే వరకు ఆడియన్స్ వెయిట్ చేయాలన్నట్లు ముగించారు.
టెక్నికల్ గా…
డైరక్షన్ అద్బుతం కాదు కానీ బాగుంది. స్క్రిప్టుని వెబ్ సీరిస్ కు అనుకుని చేస్తే బాగుండేది అనిపిస్తుంది. డైలాగులు అక్కడక్కడా బాగానే పేలాయి. యాక్షన్ ఎపిసోడ్స్ బాగా డీల్ చేసారు. ఇలాగే ప్రొడక్షన్ వేల్యూస్, శ్రీచరణ్ పాకాల నేపథ్య సంగీతం బావున్నాయి. ‘‘ఒక మనిషి జీవితంలో అన్నింటికంటే పెద్ద శిక్ష.. తనెవరో తనకే తెలియకపోవడం’’ ,‘‘నా ఫ్రెండ్స్ ఎవరో నాకు తెలియకపోయినా పర్వాలేదు. కానీ నా శత్రువు ఎవరో నాకు తెలియాలి’’ అంటూ వచ్చే డైలాగ్‌లు ఆకట్టుకున్నాయి.
నటీనటుల్లో…ఝాన్సీ గా అంజలి బాగాచేసింది. ఆ పాత్రలో డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. గతం ఏమిటో తెలుసుకోవాలనే తపన, సహ జీవనం చేస్తున్న వ్యక్తికి ఏమీ తెలియనివ్వకూడదని పడే మథనం బాగా ఎస్టాబ్లిష్ అయ్యింది , అన్నిటి కంటే ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్ బాగా చేసింది. చాందిని చౌదరి స్క్రీన్ మీద కనిపించింది కొద్ది సేపే. డిఫరెంట్‌గా ఉంది. ఆదర్శవంతమైన తండ్రి, భర్త తరహాలో పాత్రలో ఆదర్శ్ బాలకృష్ణ బాగా సెట్ అయ్యారు. ముమైత్ ఖాన్ లుక్, క్యారక్టర్ షాక్ ఇస్తాయి.
చూడచ్చా?
ఖచ్చితంగా చెప్పాలంటే …ఇదొక లేడీ గజినీ కథ! ఇదొక కమర్షియల్ ప్యాకేజ్డ్ వెబ్ సిరీస్! ఇలాంటి కథలు మీకు ఇష్టమైతే దీన్ని చూడవచ్చు.
నటీనటులు : అంజలి, ఆదర్శ్ బాలకృష్ణ, సంయుక్తా హొర్నాడ్, చాందిని చౌదరి, రాజ్ అర్జున్, రామేశ్వరి తాళ్లూరి, రుద్ర ప్రతాప్, ముమైత్ ఖాన్, దేవి ప్రసాద్ తదితరులు
రచన : గణేష్ కార్తీక్ (జీకే)
మాటలు : రామ్ వంశీకృష్ణ
ఛాయాగ్రహణం : ఆర్వీ
సంగీతం: శ్రీచరణ్ పాకాల
నిర్మాతలు : కృష్ణ కులశేఖరన్, కె.ఎస్. మధుబాల
దర్శకత్వం : తిరు
విడుదల తేదీ: అక్టోబర్ 27, 2022
ఓటీటీ వేదిక : డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
Runtime : 30-40 minutes per episode.
ఎన్ని ఎపిసోడ్స్ : ఆరు