తోడేలు తెలుగు మూవీ రివ్యూ

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తన డిస్ట్రిబ్యూషన్ సంస్థ నుంచి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన కాంతార మూవీ ఎంత పెద్ద హిట్ చిత్రమో తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఆయన డిస్ట్రిబ్యూట్ చేస్తూ రిలీజ్ చేసిన చిత్రం తోడేలు. హిందీలో భేదియా గా రూపొందిన ఈ చిత్రం ట్రైలర్ తెలుగువారికి బాగా నచ్చింది. దాంతో చాలా మంది ఈ సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఫన్, ఎమోషన్, హారర్ ఎలిమెంట్సో తో వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం..
స్టోరీ లైన్ :
కాంట్రాక్టర్ భాస్కర్(వరుణ్ ధావన్) అరుణాచల్ ప్రదేశ్‌లోని ఓ అటవీ ప్రాంతంలో రోడ్డు వేసే కాంట్రాక్ట్ దక్కించుకుంటాడు. అయితే అక్కడ ఆదివాసీల నుంచి వ్యతిరేకత ఎదురౌతుంది. అయితే వాళ్లను ఎలాగైనా నయోనో, భయోనో, డబ్బు ఇచ్చో ఒప్పించాలని ఫిక్స్ అయ్యి,అందుకోసం ప్రయత్నాలు మొదలెడతాడు. అయితే ఊహించని విధంగా అక్కడ భాస్కర్ తోడేలు కాటుకు గురవుతాడు. ట్రీట్మెంట్ కోసం వెటర్నరీ డాక్టర్ అనైక (కృతీసనన్)దగ్గరకు వెళ్తాడు. ఆ రోజు నుంచీ భాస్కర్ ప్రతిరోజు రాత్రి తోడేలుగా మారిపోతాడు. అప్పట్నుంచి రోడ్డు వేయడానికి సహకరిస్తున్న ఒక్కొక్కళ్లూ చనిపోతుంటారు. ఆ ఊళ్లో వైరస్ కలకలం మొదలవుతుంది. అసలు భాస్కర్ని తోడేలు ఎందుకు కరిచింది? ప్రతి రోజు రాత్రి ప్రత్యేకించి కొంతమందిని మాత్రమే చంపడానికి కారణమేంటి? తన బాడీలో ఉన్న తోడేలుని బయటకు పంపించడానికి ఎలాంటి ప్రయత్నాలు భాస్కర్ చేస్తాడు? వెటర్నరీ డాక్టర్ అనైక పాత్ర ఏమిటి? అనైకతో భాస్కర్ ప్రేమ ఏమైంది అసలు ఆమె ఎవరు? రోడ్డు నిర్మాణం పూర్తైందా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
స్క్రీన్ ప్లే విశ్లేషణ:
ప్రకృతిని నాశనం చేసేందుకు ప్రయత్నం చేస్తే దేవుడు అడ్డుకుంటాడనేది రీసెంట్ గా కాంతారా సినిమాలో చూశాం. ఇదీ అలాంటి కథే ఈ సారి దుష్ట శక్తులను జంతువుల రూపంలో దేవుడు వచ్చి బుద్ది చెప్పే కార్యక్రమం ఈ సినిమాలో జరుగుతుంది. ఇదేమీ కొత్త పాయింట్ కాదు. కానీ డైరక్టర్ ఇంట్రస్టింగ్ గా ఈ సినిమాని నడిపించేందుకు థ్రిల్స్,ఫన్ తో కూడిన స్క్రీన్ ప్లేను ఎంచుకున్నాడు. అయితే ఈ క్రమంలో ప్రెడిక్టబులిటీ గా కథ మారిపోయింది. రెగ్యులర్ సినిమాలు చూసే ప్రేక్షకుడి ఊహకి అందేలా కథ, కథనం సాగింది. అయితే క్లైమాక్స్ కు వచ్చేసరికి మాత్రం దాన్ని సరిదిద్దుకున్నాడు. కొత్తగా ఏ మాత్రం ఊహించని విధంగా మలవగలిగాడుడు. సీరియస్ ఎలమెంట్స్ ని సైతం కూడా బోర్ కొట్టించకుండా ఫన్నీగా చూపించారు. విజువల్స్, గ్రాఫిక్స్ వర్క్ చాలా బాగున్నాయి. అరుణాచల్ అడవి అందాలు, తోడేలు విన్యాసాలు ప్రేక్షకులను అలరిస్తాయి.
ఈ కథ వాస్తవానికి దూరంగా ఉన్న ఫిక్షన్ కథే. మనిషి తోడేలుగా మారడం అనేది సినిమాటిక్‌గా అనిపిస్తుంది. అయితే డైరక్టర్ బిలీవుబులిటీ తేవటానికి చేసిన ప్రయత్నంతో చాలా సీన్స్ పండాయి. ముఖ్యంగా ఈ సినిమాకు ఎంచుకున్న నేపధ్యం అయిన అరుణాచల్ ప్రదేశ్ ఈ సినిమాకి కొత్త లుక్ ఇచ్చింది. మొదట సీన్స్ తోనే ప్రేక్షకుల్ని జిరో అడవుల్లోకి తీసుకెళ్ళటంతో ఉత్కంఠగా అనిపిస్తుంది. హీరోని తోడేలు కరవడం నుంచి అసలు కథ మొదలవుతుంది. తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠ ప్రతి సీన్లో ఉంటుంది. ఫస్టాఫ్ సరదాగా గడిచిపోయినా సెకండాఫ్ లోనే సమస్య వచ్చి పడింది. అక్కడ కథ ఆగిపోయి,రిపీట్ అయ్యిన ఫీలింగ్ వస్తుంది. దాంతో చాలా సీన్స్ సాగదీతగా అనిపిస్తాయి. ఫస్టాఫ్ స్థాయిలో ఆసక్తిని రేకెత్తించలేకపోయారు. ఇక ఇలాంటి కథలకి ఎమోషన్స్ చాలా కీలకం. అవి అనుకున్న స్దాయిలో పండించకపోవటం సినిమాకి మైనస్.
టెక్నికల్ గా ఈ సినిమాకు ఉన్న పెద్ద ప్లస్ సినిమాటోగ్రాఫర్ జిష్ణు భటాచార్య. ఆయన విజువల్స్, టేకింగ్ సినిమాని నెక్ట్స్ లెవిల్ కు తీసుకెళ్లాయి. వి.ఎఫ్.ఎక్స్ టీం పనితనం కూడా బాగుంది. లిమిటెట్ బడ్జెట్లో అద్భుతమైన అవుట్ పుట్ ఇచ్చారనే చెప్పాలి. పాటలు గొప్పగా లేవు డైరక్టర్ అమర్ కౌశిక్ ఓ మామూలు స్టోరీ లైన్ ని అసాధారణంగా ప్రెజంట్ చేసే ప్రయత్నం చేసాడు. అయితే ఈ క్రమంలో లాజిక్స్ వదిలేసాడు. ఎడిటింగ్ బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగా రిచ్ గా ఉన్నాయి. డబ్బింగ్ కూడా బాగా చెప్పించారు.
నటీనటుల్లో తోడేలు కరిచిన వ్యక్తిగా, తోడేలులాగ మారటంలో వరుణ్ ధావన్ ఎనర్జీ, స్క్రీన్ ప్రెజన్స్ మాములుగా లేవు. పెర్ఫార్మెన్స్ కూడా అదరకొట్టాడు. తోడేలుగా మారి భయపెడుతూ థ్రిల్ చేశాడు. ఎమోషనల్ సీన్స్ లో ఆకట్టుకున్నాడు. కృతి సనన్ నటిగా జస్ట్ ఓకే. ఆమె స్క్రీన్ ప్రెజన్స్, లుక్ బాగోలేదు. లీడ్ పెయిర్ కెమెస్ట్రీ కూడా వర్కవుట్ కాలేదు. కమెడియన్ అభిషేక్ బెనర్జీ సింగిల్ లైనర్స్ బాగున్నాయి. రాజ్ కుమార్ రావు & శ్రద్ధాకపూర్ క్యామియోలు కలిసి రాలేదు.
చూడచ్చా?
కొత్త కాన్సెప్టు ఓ సారి చూడచ్చు నిరాశపరచదు. ఎక్కువ ఎక్సపెక్ట్ చేయకపోతే బాగుందనిపిస్తుంది.
నటీనటులు: వరుణ్ ధవన్
కృతిసనన్
దీపక్ డోబ్రియాల్
అభిషేక్ బెనర్జీ
పాలిన్ కబక్
సంగీతం: సచిన్ జిగర్;
ఛాయాగ్రహణం: జిష్ణు;
కూర్పు: సంయుక్త కాజా;
రచన: నీరేన్ భట్;
నిర్మాత: దినేశ్ విజన్;
నిర్మాణ సంస్థ: మద్దోక్ ఫిలింస్, జియో స్టూడియోస్;
దర్శకత్వం: అమర్ కౌశిక్;
తెలుగులో విడుదల: గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్;
వ్యవధి:2 గంటల 26 నిముషాలు
విడుదల తేదీ: 25 నవంబర్ 2022