దర్శకుడు ఆర్ ఎ వెంకట్ ఇంటర్వ్యూ

Published On: November 3, 2023   |   Posted By:

దర్శకుడు ఆర్ ఎ వెంకట్ ఇంటర్వ్యూ

స్రవంతి రవికిశోర్ వంటి పెద్ద ప్రొడ్యూసర్ నా దీపావళి సినిమాతో తమిళంలోకి ఎంట్రీ ఇవ్వటం నాకెంతో గర్వంగా ఉంది చిత్ర దర్శకుడు ఆర్.ఎ.వెంకట్

ప్రముఖ నిర్మాత , స్రవంతి మూవీస్ అధినేత స్రవంతి రవికిశోర్ తొలిసారిగా తమిళంలో నిర్మించిన చిత్రం కిడ . తెలుగులో దీపావళి పేరుతో అనువదించారు.ఆర్.ఎ.వెంకట్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
పూ రాము, కాళీ వెంకట్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. జాతీయ, అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు అందుకున్న చిత్రమిది. దీపావళి పండగ సందర్బoగా నవంబర్ 11న తెలుగు, తమిళ భాషల్లో సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు ఆర్.ఎ.వెంకట్ మాట్లాడుతూ

మీ నేపథ్యమేంటి?
మాది తమిళనాడు మధురై జిల్లాలోని రామనాథపురం అనే గ్రామం. పుట్టి పెరిగిందంతా అక్కడే. చిన్న‌ప్పుడే నాన్న‌గారు చ‌నిపోయారు. తాత‌య్య‌, నాన్న‌మ్మ‌, అమ్మ వాళ్లే న‌న్ను పెంచారు.

సినిమా రంగంలోని ఎలా అడుగు పెట్టారు?
ద‌ర్శ‌కుడు కావాల‌నే ఆలోచ‌న ఎలా వ‌చ్చింది? సినిమా రంగంపై ఉన్న ఆస‌క్తితో 2003లో చెన్నై న‌గ‌రంలోకి అడుగు పెట్టాను. కానీ ఇక్క‌డ నాకు ఎవ‌రూ తెలియ‌దు. ఏం చేయాలో కూడా తెలియ‌లేదు. ఆ స‌మ‌యంలో ఓ ఫ్రెండ్ స‌హాయంతో, డైరెక్ట‌ర్ ఎళిల్ ద‌గ్గ‌ర ఆఫీస్ బాయ్‌గా చేరాను. అక్క‌డి నుంచే నా సినీ ప్ర‌యాణం ఆరంభ‌మైంది. నాలుగైదేళ్లు వ‌ర్క్ చేసిన త‌ర్వాత ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌ని చేయాల‌నే కోరిక‌తో మ‌రో డైరెక్ట‌ర్ ద‌గ్గ‌ర‌కు వెళ్లి అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా జాయిన్ అయ్యాను. అలా నా జ‌ర్నీలో ఓ కీల‌క మలుపు తీసుకున్న త‌ర్వాత కొన్నాళ్లు ప‌ని చేశాను. త‌ర్వాత అసోసియేట్ డైరెక్ట‌ర్‌గా ఎదిగాను. ఈ క్ర‌మంలో సినిమాను ఎలా తెర‌కెక్కిస్తారు. క్రాఫ్ట్స్ ఎలా ప‌ని చేస్తాయి. ద‌ర్శ‌కుడు ఎలా ఆలోచిస్తారు  ఇలాంటి విష‌యాల‌ను గ‌మ‌నిస్తూ,

నేర్చుకుంటూ వ‌చ్చాను.దీపావళి సినిమా క‌థ ఆలోచ‌న ఎలా వ‌చ్చింది?
సినిమా ఎంత గ్రాండియ‌ర్‌గా ఉన్నప్ప‌టికీ అందులో ఎమోష‌న్స్‌కే ప్రేక్ష‌కులు క‌నెక్ట్ అవుతారనే విష‌యాన్ని నేను న‌మ్ముతాను. ఓసారి స్నేహితుల‌తో క‌లిసి సినిమా చూస్తున్న క్ర‌మంలో నా మైండ్‌లో దీపావళి క‌థ‌కు సంబంధించిన ఆలోచ‌న పుట్టింది. ప‌ల్లెటూరు, అందులో మేక‌లు పెంచుకునే ఓ ముస‌లి వ్య‌క్తి, మ‌న‌వ‌డు, వారు ప్రేమ‌గా పెంచుకునే మేక పిల్ల  ఈ అంశాల‌ను క‌నెక్ట్ చేస్తూ ఎమోష‌న‌ల్‌గా ఓ క‌థను రాసుకున్నాను.

స్ర‌వంతి ర‌వికిశోర్‌ను ఎలా కలుసుకున్నారు?
దీపావళి క‌థ‌ను రాసుకున్న‌ప్పుడు దాని గురించి వేణు అని నాకు తెలిసిన నిర్మాత‌కు చెప్పాను. ఆయ‌న ఆ విష‌యాన్ని స్ర‌వంతి ర‌వికిశోర్‌గారికి చెప్పార‌ట‌. వెంట‌నే ఆయ‌న నాకు ట‌చ్‌లోకి వ‌చ్చి  పూర్తి క‌థ‌ను ఆడియో రూపంలో వివ‌రించి పంప‌మ‌న్నారు. పెద్ద హీరోల‌తో సినిమాలు చేసే నిర్మాతకు నా క‌థ ఏం న‌చ్చుతుంద‌నే చిన్న డౌట్ మ‌నసులో ఉండింది. అయినా కూడా ఆయ‌న అడిగారు కదా అని క‌థ‌ను నెరేట్ చేసి, ఆ ఆడియో ఆయ‌న‌కు పంపాను. ఆ మ‌రుస‌టి రోజే ఆయ‌న్నుంచి నాకు ఫోన్ వ‌చ్చింది. ఈ సినిమా మ‌నం చేస్తున్నామ‌ని ఆయ‌న అన్నారు. ఓ పెద్ద ప్రొడ్యూస‌ర్ అలా చెప్ప‌గానే నాకు నిజంగా షాకింగ్‌గా అనిపించింది. నేనైతే కొద్ది సేపు ఆ విష‌యాన్ని న‌మ్మ‌లేక‌పోయాను. నా ఆనందానికి మాట‌లు రాలేదు. ఎందుకంటే తెలుగులో ఎన్నో మంచి చిత్రాల‌ను, స్టార్స్‌తో మూవీస్ చేసిన ర‌వికిశోర్‌గారు త‌మిళంలో నా సినిమాతో నిర్మాత‌గా అడుగు పెట్టారు. ర‌వికిశోర్‌గారి తొలి త‌మిళ సినిమాకు నేనే డైరెక్ట‌ర్ అని చెప్పుకోవ‌టం ఎంతో గ‌ర్వంగా ఉంటుంది.

తొలిసారి ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌ల‌ను చేప‌ట్టిన‌ప్పుడు మీకు ఎదురైన స‌వాళ్లేంటి?
నిజానికి నేను ద‌ర్శ‌కుడిగా తొలి సినిమా చేస్తున్నాన‌నే భావ‌న రాలేదు. ఎందుకంటే ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో నాకు ద‌శాబ్దానికి పైగా అనుభ‌వం ఉంది. ఎలా వ‌ర్క్ చేస్తార‌నే అవ‌గాహ‌న ఉండటంతో డైరెక్ష‌న్ చేసే స‌మ‌యంలో ఇబ్బంది ప‌డ‌లేదు. కానీ స్ర‌వంతి ర‌వికిశోర్‌గారు డైరెక్ష‌న్‌తో పాటు మ‌రో పెద్ద బాధ్య‌త‌ను అప్ప‌గించారు. అదే ప్రొడ‌క్ష‌న్ బాధ్య‌త‌ల‌ను చూడ‌టం. సినిమాలో న‌టీన‌టులు, టెక్నీషియ‌న్స్‌ను మాట్లాడ‌టం నుంచి వారికి రెమ్యున‌రేష‌న్స్ ఇచ్చే రెస్పాన్సిబిలిటీని అప్ప‌గించారు. ఎవ‌రికి ఎంత ఇవ్వాలో చెబితే నిమిషాల్లో ఆ డ‌బ్బులు ఆయ‌న ట్రాన్స్‌ఫ‌ర్ చేసేవారు. నేనెలా వ‌ర్క్ చేస్తున్నాన‌నే విష‌యాన్ని ఆ ప‌ర్య‌వేక్షిస్తుండేవారు. సినిమా గురించి ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకుంటుండేవారు. ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకున్నారు. ఆయ‌నంత పెద్ద నిర్మాత ఎలా అయ్యార‌నేది ఆయ‌న్ని ద‌గ్గ‌ర నుంచి చూసి మాట్లాడిన‌ప్పుడు, ఆయ‌న‌తో క‌లిసి ట్రావెల్ చేసిన‌ప్పుడు అర్థ‌మైంది. ఆయ‌న‌లాంటి ప్రొడ్యూస‌ర్స్ ఉంటే డైరెక్ట‌ర్‌కి ఓ కాన్ఫిడెంట్ ఉంటుంది.

దీపావళి సినిమాకు వ‌చ్చిన అవార్డ్స్, రెస్పాన్స్ గురించి చెప్పండి?
దీపావళి సినిమాను చేసిన త‌ర్వాత గోవా ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌కి పంపాను. అక్క‌డ ఆడియెన్స్ నుంచి స్టాండింగ్ ఓవేష‌న్ వ‌చ్చింది. త‌ర్వాత చెన్నై ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మూవీని స్క్రీనింగ్ చేశాం. అక్క‌డ సినిమాకు బెస్ట్ ఫిల్మ్‌, బెస్ట్ యాక్ట‌ర్ అవార్డ్స్ వ‌చ్చాయి. త‌ర్వాత మెల్‌బోర్న్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లోనూ స్క్రీనింగ్ చేస్తే స్టాండింగ్ ఓవేష‌న్ వ‌చ్చింది.

మీ ఫ్యామిలీ మెంబ‌ర్స్ రెస్పాన్స్ ఎలా ఉంది?
మా అమ్మ‌గారైతే దీపావళి సినిమా చూసిన త‌ర్వాత క‌న్నీళ్లు పెట్టుకున్నారు. ఎందుకంటే ఆమెకు వాళ్ల అమ్మ‌, నాన్న‌గుర్తుకొచ్చార‌ట‌. అదే విష‌యాన్ని నాకు చెప్పి ఎమోష‌న‌ల్ అయ్యారు. అలాగే గోవా స్క్రీనింగ్ జ‌రిగిన త‌ర్వాత ఒక మ‌హిళ వ‌చ్చి మీరు సినిమాను గొప్పగా తీశారు. నాకు నా తాతయ్య, అవ్వ వాళ్లు గుర్తుకొచ్చారు అని చెప్పి ఎమోష‌న‌ల్ అయ్యారు. అలాంటి అపూర‌మైన క్ష‌ణాల‌ను ఎన్నింటినో ఫేస్ చేశాను. అవ‌న్నీడైరెక్ట‌ర్‌గా నాకు మ‌ర‌చిపోలేని జ్ఞాప‌కాలు.

మీ నిజ జీవిత స‌న్నివేశాలున్నాయా?
ఇది నా రియ‌ల్ లైఫ్ క‌థ కాదు  కానీ అందులోమా తాత‌, అవ్వ‌ల పాత్ర‌ల‌ను బేస్ చేసుకునే తాత‌య్య పాత్ర‌లో న‌టించిన పూ రాము, అవ్వ పాత్ర‌ల‌ను రాసుకున్నాను. పూ రాము గారు ఇప్పుడు మ‌న మ‌ధ్య లేరు. రీసెంట్‌గానే హఠాన్మ‌రణం చెందిన సంగ‌తి తెలిసిందే. కానీ డ‌బ్బింగ్ స‌మ‌యంలో సినిమా చూసిన ఆయ‌న చాలా బాగా తీశావ్ త‌మ్ముడు  ఇలాంటి సినిమా మ‌రోటి చేద్దాం అన్నారు. ఇక మా అమ్మ‌మ్మ‌తో అయితే నీ క్యారెక్ట‌ర్‌ను నా సినిమాలో వాడుకుంటున్నాన‌ని చెప్పేవాడిని. ఆమె కూడా ఎంతో సంతోష‌ప‌డేది. కానీ సినిమా అంతా సిద్ద‌మ‌య్యేస‌రికి ఆమె లేదు. క‌రోనా త‌ర్వాత ఆమె చ‌నిపోయారు. మ‌నం ప‌ల్లెటూర్ల‌కు వెళ్లిన‌ప్పుడు ఇలాంటి ఎమోష‌న్స్‌ను ద‌గ్గ‌ర‌గా చూస్తాం. దాన్ని చాలా మంది అనుభ‌వించి కూడా ఉంటారు. అలాంటి అనుభ‌వం నుంచే ఈ క‌థ పుట్టింది.

ఈ సినీ ప్ర‌యాణం ప్రారంభ‌మై ఇర‌వై ఏళ్లు అవుతున్నాయి  దాన్ని గుర్తుకు చేసుకుంటే మీకేమ‌నిపిస్తుంది?
అస‌లు సినిమా అంటే ఏంటో తెలియ‌కుండానే చెన్నై మ‌హానగ‌రంలో అడుగు పెట్టిన నేను ఇర‌వై ఏళ్ల త‌ర్వాత ద‌ర్శ‌కుడిగా మార‌టం అనేది క‌ల నిజ‌మైన‌ట్లు ఉంది. మాట‌ల్లో చెప్ప‌లేని ఎమోష‌న‌ల్ జ‌ర్నీ. ఈ ప్రయాణంలో ఎందరో నాకు స‌పోర్ట్‌గా నిలిచారు. వారంద‌రికీ నా థాంక్స్‌. అయితే ఇక్క‌డ మా అమ్మ‌గారి గురించి చెప్పాలి. ఎందుకంటే నేను సినిమాల్లోకి వ‌చ్చిన‌ప్పుడు చాలా మంది ఏంటి? మీ అబ్బాయి సినిమాల్లోకి వెళ్లాడ‌ట క‌దా!  ఎందుకు వెళ్లాడు? ఏదైనా ప‌ని చేసుకోవ‌చ్చుగా!  ఇలాంటి మాట‌ల‌ను మా అమ్మ‌తో ఊర్లో వాళ్లు అనేవాళ్లు. దానికి త‌గ్గ‌ట్లు నాకు పెద్ద‌గా సంపాద‌న లేదు. అయితే అమ్మ ఏనాడు న‌న్ను ఏమీ అన‌లేదు. ద‌ర్శ‌కుడిగా నా పేరు చూసిన త‌ర్వాత ఆమె ఎమోష‌న‌ల్ అయిన క్ష‌ణాల‌ను నేను మ‌ర‌చిపోలేను.

నెక్ట్స్ మూవీస్ ఏంటి?
ఎమోష‌న‌ల్ పాయింట్‌తోనే ఓ క‌థను సిద్ధం చేస్తున్నాను. స్రవంతి ర‌వికిశోర్‌గారికి లైన్ చెప్పాను. ఆయ‌న‌కు న‌చ్చింది. పూర్తి క‌థ‌ను సిద్ధం చేయ‌మ‌న్నారు. దాన్నొక స్టార్ హీరోతో చేసే ఆలోచ‌న‌లో ఉన్నాం. అయితే క‌థంతా పూర్త‌యిన త‌ర్వాతే నిర్ణ‌యం ఉంటుంది. ఆ వివ‌రాల‌ను త‌ర్వాత తెలియ‌జేస్తాం అంటూ ఇంట‌ర్వ్యూ ముగించారు దీపావళి మూవీ డైరెక్టర్ ఆర్.ఎ.వెంకట్