దర్శకుడు సత్యరాజ్, కథానాయకుడు రవితేజ ఇంటర్వ్యూ

Published On: March 5, 2024   |   Posted By:

దర్శకుడు సత్యరాజ్, కథానాయకుడు రవితేజ ఇంటర్వ్యూ

ప్రేక్షకులకు కొత్త అనుభూతినిచ్చే రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ రాజుగారి అమ్మాయి.. నాయుడుగారి అబ్బాయి : చిత్ర దర్శకుడు సత్యరాజ్, కథానాయకుడు రవితేజ

వెంకట శివ సాయి పిల్మ్స్ పతాకంపై మణికొండ రంజిత్ సమర్పణలో సత్యరాజ్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ.. ముత్యాల రామదాసు గారు మరియు నున్నా కుమారి గారు సంయుక్తంగా నిర్మించిన చిత్రం రాజుగారి అమ్మాయి.. నాయుడుగారి అబ్బాయి. నూతన తారలు రవితేజ నున్నా హీరోగా, నేహ జురెల్ హీరోయిన్ గా నటించారు. రామిశెట్టి వెంకట సుబ్బారావు, కలవకొలను సతీష్ సహ నిర్మాతలు. ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా మార్చి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో ముచ్చటించిన కథానాయకుడు రవితేజ ,దర్శకుడు సత్యరాజ్, చిత్ర విశేషాలను పంచుకున్నారు.

ఎంతో ఇంటెన్స్ గా ఈ చిత్ర కథ నడుస్తుంది.
హీరో రవితేజ నున్న

ఈ సినిమా చేసేటప్పుడు ఏమైనా ఇబ్బంది పడ్డారా?..
హీరో రవితేజ: రొమాంటిక్ సన్నివేశాల్లో కాస్త ఇబ్బందిపడ్డాను.
దర్శకుడు సత్య: కొంచెం కాదు చాలా ఇబ్బంది పడ్డాడు(నవ్వుతూ). హీరో, హీరోయిన్ మధ్య వచ్చే రొమాంటిక్ సాంగ్ బాగుంటుంది. ఆ సాంగ్ తరువాత హీరోయిన్ చనిపోవడం, ఆమె చివరిగా కలిసింది హీరోనే కావడంతో.. ఆమెను ఎవరు హత్య చేశారనే పాయింట్ తో ఎంతో ఇంటెన్స్ గా కథ నడుస్తుంది. రొమాన్స్ నుంచి ఒక్కసారిగా క్రైమ్ కి టర్న్ తీసుకుంటుంది.

నిర్మాత ముత్యాల రామదాసు గారు గురించి?
దర్శకుడు సత్య: నిర్మాత ముత్యాల రామదాసు గారు, పీఆర్ఓ వేణు గారు ఈ సినిమాని రెండు కళ్ళు లాంటి వారు. వారి వల్లే సినిమా ఇంతలా ముందుకు వెళ్తుంది. మొదట సతీష్ గారితో కలిసి మేము తక్కువ బడ్జెట్ తో చాలా చిన్న సినిమాగా ప్రారంభించాం. పదిరోజుల చిత్రీకరణ పూర్తయిన తర్వాత.. సినిమా చాలా బాగా వస్తుంది, ఎవరైనా సపోర్ట్ లభిస్తే బాగుంటుంది అనిపించింది. అలా ముత్యాల రామదాసుని సంప్రదించాం. ఆయన వచ్చాక సినిమా స్వరూపమే మారిపోయింది. ఎందరో మంచి మంచి ఆర్టిస్ట్ లు వచ్చి చేరారు. చిన్న సినిమా కాస్తా పెద్ద సినిమా అయిపోయింది.

మీరు నటనలో శిక్షణ ఏమైనా తీసుకున్నారా?
హీరో రవితేజ: నటనలో శిక్షణ అయితే ఏమీ తీసుకోలేదు. తమిళ సినిమా చేసినప్పుడు కూడా ప్రత్యేకంగా ఏమీ నేర్చుకోలేదు. స్వతహాగా నేర్చుకుంటూ, దర్శకుల సలహాలు పాటిస్తుంటాను. ఈ సినిమాలో దర్శకుడు సత్య నా నుంచి ఆయనకు కావాల్సిన నటనను బాగా రాబట్టుకున్నారు.

హీరో నటన పట్ల మీరు సంతృప్తి చెందారా?
దర్శకుడు సత్య: నూటికి నూరు శాతం నేను సంతృప్తి చెందాను. రామదాసు గారు కూడా రష్ లో అతని నటన, మా మేకింగ్ చూసే.. ఈ సినిమాకి సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చారు.

సంగీత దర్శకుడు రోషన్ గురించి?
దర్శకుడు సత్య: పెద్ద సినిమాలకు సంగీతం ఎలా ఉంటుందో ఆ స్థాయిలో ఇచ్చాడు. రవితేజ గారి సినిమాలకు థమన్ సంగీతం ఇచ్చినట్టు ఇచ్చాడు. నేపథ్య సంగీతం అయితే మణిశర్మ గారి స్థాయిలో ఉంటుంది.

ఈ చిత్రం ప్రేమ కథతో కూడిన క్రైమ్ థ్రిల్లర్
దర్శకుడు సత్య రాజ్

మీకు సినిమాలపై ఆసక్తి ఎలా కలిగింది?.. రాజుగారి అమ్మాయి నాయుడుగారి అబ్బాయి ప్రయాణం ఎలా మొదలైంది?
దర్శకుడు సత్య: మాది అమలాపురం. మా దగ్గర ఎన్నో సినిమాలు తీస్తుంటారు. అలా నాకు సినిమాల మీద ఆసక్తి కలిగింది. ఈ సినిమా కథ వచ్చేసి ఏడాది క్రితం జబర్దస్త్ బాబీ మేమంతా కలిసినప్పుడు ఈ స్టోరీ లైన్ చెప్పాను. విన్న అందరూ బాగుంది అన్నారు. ఒక వారం రోజుల్లో మొత్తం డెవలప్ చేసి చెప్పిన తర్వాత వాళ్ళకి చాలా బాగా నచ్చింది. ఇది సినిమాగా చేస్తే బాగుంటుంది అనుకున్న తర్వాత హీరోని కలవడం జరిగింది. తర్వాత నిర్మాతలను, సంగీత దర్శకుడు రోషన్ ను కలిశాను. రోషన్ నాకు మంచి స్నేహితుడు. అతనికి కథ బాగా నచ్చి, వెంటనే ట్యూన్స్ ఇచ్చాడు. అక్కడి నుంచి అలా ప్రొడక్షన్ మొదలైంది.

ఇది కులాల నేపథ్యంలో తీసిన సినిమానా? టైటిల్ అలా పెట్టడానికి కారణమేంటి?
దర్శకుడు సత్య: సినిమాలోని రెండు పాత్రలను ఆధారం చేసుకుని ఈ టైటిల్ పెట్టడం జరిగింది. రెండు కుటుంబాల మధ్య జరిగే ఇంటెన్స్ స్టోరీ ఇది. ఎక్కడా కులాల ప్రస్తావన ఉండదు. ఈ సినిమా కథ ఎంత కొత్తగా ఉండబోతుంది అనేది మీకు స్క్రీన్ మీద చూస్తే అర్థమవుతుంది.

హీరోగా రవితేజనే ఎందుకు ఎంచుకున్నారు?
దర్శకుడు సత్య: రవితేజ నాకు ఎప్పటి నుంచో స్నేహితుడు. ఆ గ్రామీణ నేపథ్యానికి, ఆ పాత్రకి అతను సరిగ్గా సరిపోతాడు అనిపించింది. పైగా ఈ కథకి కొత్త నటుడు అయితేనే బాగుంటుంది. కథ వినగానే రవితేజ కూడా ఈ సినిమా చేయడానికి ఎంతో ఆసక్తి చూపించాడు.

గ్రామీణ నేపథ్యంలో ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చాయి.. మీ సినిమాలో ఉన్న కొత్తదనం ఏంటి?
దర్శకుడు సత్య: ఇది విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే కథ అయినప్పటికీ ఇదొక క్రైమ్ థ్రిల్లర్. గోదావరి గ్రామీణ నేపథ్యంలో సాగే సినిమాలు అంటే ప్రేమ కథ, ప్రకృతి అందాలు విందు వంటివి ఉంటాయి. అయితే మా సినిమాలో ఆ అందాల విందుతో పాటు క్యూట్ లవ్ స్టొరీ, అలాగే క్రైమ్ ఉంటుంది.

ఈ కథ పూర్తిగా కల్పితమా లేక వాస్తవ సంఘటనల ఆధారంగా రాసుకున్నారా?
దర్శకుడు సత్య: నేను ఒకసారి కేరళ నుంచి హైదరాబాద్ కి వస్తున్నప్పుడు.. కొందరు అక్కడ జరిగిన ఒక సంఘటన గురించి మాట్లాడుకుంటున్నారు. ఆ ఘటన కులాల గురించి జరిగింది. ఒక ఊరే తగలబడిపోయింది. అయితే నేను దానిని అమలాపురం నేటివిటీకి తగ్గట్టుగా మలుచుకున్నాను.

రవితేజ గారు మీరు ఈ ప్రాజెక్ట్ లోకి ఎలా వచ్చారు?
హీరో రవితేజ: నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. నటుడిగా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నాను. ఇప్పటికే తమిళ్ లో ఒక సినిమా చేశాను. అది విడుదల కావాల్సి ఉంది. ఈ సినిమా విషయానికొస్తే.. దర్శకుడు సత్య నాకు బాగా తెలుసు. ఈ సినిమా చేద్దాం అనుకుంటున్నాను అంటూ ముందుగా ట్యూన్స్ వినిపించి, ఆ తర్వాత కథ చెప్పాడు. కథ వినగానే కచ్చితంగా ఈ సినిమా చేయాలి అనిపించింది. హీరోగా మొదటి చిత్రం యాక్షన్ ఫిల్మ్ చేస్తే ప్రేక్షకులు ఆదరిస్తారా లేదా అనే సందేహం ఉంటుంది. కానీ ఇది మంచి కంటెంట్ ఉన్న థ్రిల్లర్ సినిమా. ఇలాంటి సినిమా చేస్తే ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకంతో వెంటనే అంగీకరించాను.

క్రైమ్ థ్రిల్లర్ జానర్ ను ఇష్టపడేవారు ఎందరో ఉంటారు. మరి మీరు ప్రమోషన్స్ లో ఇది క్రైమ్ థ్రిల్లర్ సినిమా అని ఎందుకు చెప్పడంలేదు?
దర్శకుడు సత్య: టైటిల్, పోస్టర్ల వల్ల మాత్రమే ఇది ప్రేమ కథా చిత్రం అనే భావన కలుగుతుంది. కానీ టీజర్, ట్రైలర్ చూస్తే ఇది క్రైమ్ థ్రిల్లర్ సినిమా అని అర్థమైపోతుంది. కథలో పెద్ద ట్విస్ట్ ఉంటుంది. అది ప్రచార చిత్రాల్లో ఎక్కడా రివీల్ కాకుండా జాగ్రత్త పడుతున్నాం. అది స్క్రీన్ మీదే ఆడియన్స్ కి పెద్ద సర్ ప్రైజ్ లా ఉండాలని ప్లాన్ చేస్తున్నాం. ఇప్పటివరకు ప్రచార చిత్రాల్లో ఎక్కడా చూపించని ఒక పాత్ర సినిమాలో ఉంటుంది. సినిమా చూసినప్పుడు మీకు అది సర్ ప్రైజ్ ఇస్తుంది.