పూరి మనని ఆ విద్యతో పడేస్తాడు

Published On: April 26, 2020   |   Posted By:

ఎన్టీఆర్ టెంపర్ సినిమాలో ఓ చోట పూరి జగన్నాథ్ కనపడతాడు గుర్తుందా…అదేనండీ..హీరోయిన్ పుట్టిన రోజు పూట…తాను హీరో వెహికల్ అదే పోలీస్ జీప్ లో బయిటకు రానని అంటుంది. బాయ్ ప్రెండ్ అంటే ఏ బైక్ మీదో తీసుకెళ్లి బర్తడే ట్రీట్ ఇవ్వాలని గోముగా అడుగుతుంది. అంతే మనవాడు ఉత్సాహం ఎక్కువై..వెంటనే అదే రోడ్డు మీద వెళ్తున్న ఓ బైక్ వేసుకుని వెళ్తున్న ఓ వ్యక్తి (పూరి జగన్నాథ్) ని ఆపి బైక్ తీసేసుకుని, సాయింత్రం స్టేషన్ కు వచ్చి తీసుకెళ్లమంటాడు. ఆ బైక్ పై హీరోయిన్ కాజల్ ని తీసుకుని బయిటకు తీసుకెళ్తాడు. అక్కడ విలన్ ప్రకాష్ రాజ్ తన వాళ్లతో ఆమెను కిడ్నాప్ చేస్తాడు. అప్పుడు ఎన్టీఆర్ వచ్చి సేవ్ చేసుకుని..తన గర్ల్ ప్రెండ్ ని ఎందుకు ఎత్తుకువచ్చారని నిలదీస్తాడు..అప్పుడు ప్రకాష్ రాజ్ మనిషి…ఆ బైక్ వెనక ఉందని ఎత్తుకొచ్చాను అంటాడు. ఆ బైక్ నీది అని తెలియదు అని చెప్తాడు. అంటే పూరి జగన్నాథ్ బైక్ కూడా కథలో భాగమనే కదా…కానీ పూరి కేవలం కొద్ది క్షణాలు పాటు కనపడే పాత్రే. అంతేకానీ సినిమాలో ఆ పాత్ర కానీ , ఆ బైక్ గానీ మరొకటి కానీ లింక్ తో కంటిన్యూ కాదు. అయితే ఈ విషయం మనకు మొదటి సారి టెంపర్ చూస్తున్నప్పుడు కనపడదు. ఎందుకంటే అది పూరి జగన్నాధ్ మ్యాజిక్. తన ప్లో తప్ప వేరే విషయం పట్టించుకునేటంత టైమ్ మనకు ఇవ్వదు. అదే అతని బలం…అదే అతని ఆయుధం. ఆయన ప్రతీ సినిమాని సరిగ్గా లోతుగా అబ్జర్వ్ చేస్తే మనకు ఆ విషయం అర్దమవుతుంది.

తెరపై ఓ మూడ్ ని, ఓ ప్లో ని తనదైన విజువల్ రిధమ్ తో క్రియేట్ చేయటమే ఓ సమర్దడైన డైరక్టర్ ప్రతిభకు కొలమానం అందులో పూరి జగన్నాథ్ మాస్టర్ డిగ్రీ చేసాడని అనిపిస్తుంది. అయితే కొందరికి ఆయన సినిమాలు నచ్చకపోవచ్చు…డైలాలుగు ఎక్కకపోవచ్చు. కానీ ఆయన రిధమ్ కు మాత్రం కనెక్ట్ కాకుండా ఉండలేదు. తెరపై సినిమాటోగ్రఫీ, సౌండ్ డిజైన్, ఎడిటింగ్, రైటింగ్, యాక్టర్స్ అన్ని ఓ రిధంలో పరుగెత్తించగలటమే ఆయన చేస్తున్న సినీ విన్యాసం. అన్ని ఒకే సింక్ లో ఉంటాయి. తెరపై తను చెప్పే నేరేషన్ ని సపోర్ట్ చేస్తూ , రైట్ ఎట్మాస్మియర్ క్రియేట్ చేయటమే ఆయన సృజనాత్మకత. అందుకే ఆయన సినిమాలు తెరపై చూస్తున్నంతసేపూ మన మెదుడు సీన్స్ మధ్యలోకి దూరదు. ఏ సందేహమూ రానివ్వదు. కళ్లు అప్పగిస్తాం. లాజిక్ లకు లాక్ వేసేస్తాం. అదే పూరి నమ్ముకున్న ట్రిక్, ప్రేక్షకులకు పెద్ద కిక్.

మరీ ముఖ్యంగా టైమింగ్, నేరేటివ్ ఆర్క్ పోగ్రస్ ని రిలేట్ చేసే పేస్… ఆయనకు రెండు ఆయుధాలు. సినిమాలో ఏమైనా లోపాలు ఉన్నా వాటిని మన మనస్సుకు తట్టనివ్వదు..పట్టనివ్వదు. మనకున్న అతి తక్కువ మంది డైరక్టర్స్ లో ఈ లక్షణం కనపడుతుంది. వేగంగా ఆలోచిస్తూ.., భావోద్వేగపరంగా ట్విస్ట్ చేస్తూ,హార్డ్ బాయిల్డ్ గా ఉండే హీరోలు మనకు పూరి సినిమాల్లో కనపడతారు. అలాగే ఆయన సినిమాల్లో క్యారక్టర్స్ మూవ్ మెంట్స్ ని ఫాలో చేసే కెమెరా టెక్నిక్ సైతం ఇలాంటి పేస్ కు కారణం అవుతూ వస్తోంది. ఆ పేస్ చాలా సార్లు.. ప్రేక్షకుల ని..సినిమాలో క్యారక్టర్స్ మైండ్ తో లాక్ చేసే కీ గా పనిచేస్తూ వస్తోంది. మళ్లీ ఆయన సినిమాలు దగ్గర పెట్టుకుని చూడండి..మీకు అర్దమవుతుంది.