బింబిసార మూవీ రివ్యూ
బింబిసార’ మూవీ రివ్యూ & రేటింగ్
Emotional Engagement Emoji (EEE)

కథ
క్రీస్తూపూర్వం 5వ శతాబ్దం నాటి రారాజు బింబిసార (కళ్యాణ్ రామ్). అతని పేరు చెప్తే సింహాసనం సైతం వణుకుతుంది. క్రూరత్వంలో పీహెడీ చేసినట్లు ఉంటాడు. నియంత నిత్యం జనాల ప్రాణాలతో ఆడుకుంటూంటాడు. అతను ఏం చెప్తే అది జరగాల్సిందే. తనకు అడ్డం వచ్చిన సొంత సోదరుడు దేవదత్త (కల్యాణ్ రామ్)నే బహిష్కరిస్తాడు. బింబిసార అనే గొప్ప చక్రవర్తి తనను తాను దేవుడిగా, రాక్షసుడిగా ప్రకటించుకుంటాడు. ప్రపంచాన్ని జయించాలని యుద్దాలు చేస్తుంటాడు. ఇదిలా ఉంటే ఆ రాజ్యంకు ఓ ప్రత్యేకత…అక్కడ ధన్వంతరి పురం ఆయుర్వేదంకు ప్రసిద్ది. గాయపడిన కొందరు శత్రు దేశాల సైనికులకు ధన్వంతరి పురం ఆశ్రమిచ్చి వారికి వైద్యం అందిస్తుంది. ఈ విషయం తెలుసుకున్న బింబిసార ధన్వంతరి పుర వాసులని దారుణంగా చంపేస్తాడు. ఆయుర్వేద గ్రంధాన్ని తన నిధిలో దాచేస్తాడు.
బింబిసారుడి రెచ్చిపోవటం చూసి తట్టుకోలేన కవల సోదరుడు దేవదత్త మళ్ళీ రాజ్యానికి వచ్చి ఎదురిస్తాడు. దీంతో బింబిసారుడు తన సోదరుడిని చంపేందుకు ప్రయత్నించగా.. ఈ ప్రయత్నంలో బింబిసారుడిని దేవదత్తుడు ఓ మాయాదర్పణంపై విసిరేస్తాడు. ఆ మాయాదర్పణ మహత్యంతో బింబిసారుడు ఇప్పటి మన కాలం 2022 లోకి వచ్చి పడతాడు. . వర్తమాన కాలంలోకి వచ్చిన బింబిసారుడుకి ఎదురైన అనుభవాలు ఏంటి? చివరకు బింబిసారుడు ఏమయ్యాడు? బింబిసారుడి నిధిలో వున్న ఆయుర్వేద గ్రంధం ఏమైంది… అనేది మిగతా కథ.
ఎలా ఉంది…
ముందే చెప్పినట్లు ఇలాంటి సినిమాలు హాలీవుడ్ లో బోలెడు వచ్చాయి. జనాలకు బాగా నచ్చాయి. మనం టైమ్ ని ఎలాగూ రివర్స్ చేయలేము. మనం టైమ్ తో పాటు భవిష్యత్ లోకి ప్రయాణించాల్సిందే. అయితే రివర్స్ చేసి వెనక నుంచి ఓ మనిషి ఈ కాలంలోకి వస్తే వింటానికే ఆసక్తిగా ఉంది కదూ. అదే ఈ సినిమాకు ప్లస్ అయ్యింది. బాహుబలి లాంటి కాస్ట్యూమ్స్ , ఆ కాలంలోకి తీసుకెళ్లే ప్రయత్నం ఖచ్చితంగా మనకు కొత్త ఎక్సపీరియన్స్ ని ఇస్తాయి. అలాగే కథ విషయంలోనూ డైరక్టర్ చాలా క్లారిటీగా ఉన్నారు. ‘ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్’ అనే ఒక్క క్యాప్షన్‌తో సినిమా కథను చెప్పేశారు. చరిత్రలో బింబిసారుడు ఎలా ఉన్నారనేది పెద్దగా మనకు తెలియకపోవచ్చు కానీ … ఈ సినిమాలో మాత్రం అత్యంత క్రూరుడిగా, మద గజ మహారాజుగా చిత్రీకరించారు. రాజ్యాన్ని తాను ఒక్కడే పాలించాలనే కోరికతో సొంత తమ్మున్ని సైతం చంపించే అన్నగా బింబిసారుడి పాత్రను ఆవిష్కరించటం ప్లస్ అయ్యింది. అలాంటి వ్యక్తి మారటం అనేది క్యారక్టర్ ఆర్క్ గా వర్కవుట్ అయ్యింది. కేవలం టైం ట్రావెల్ కాన్సెప్టుతో కాకుండా, సమాంతర ప్రపంచంలో సినిమా కథను నడపడం కలిసి వచ్చింది. ఇక్కడ రెండు టైమ్‌లైన్లలో, ఒకదానితో మరొకటి సంబంధం ఉండదు. అయితే దర్శకుడు దానిని ఎలా కనెక్ట్ చేసారనేది ఆసక్తికరమైన అంశంగా సినిమాని నెక్ట్స్ లెవిల్ కు తీసుకెళ్లింది. అలాగే ఇంటర్వెల్ తర్వాత సినిమా కథ మొత్తం వర్తమాన ప్రపంచంలో సాగుతుంది. బింబిసారుడే స్వయంగా ఇప్పటి మోడ్రన్ ప్రపంచానికి తగట్టుగా తనను మార్చుకోవడంతో, కథ మరింత ఇంట్రస్టింగ్ గా మారుతుంది.ఫ్యామిలీ డ్రామాతో వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్ కొంచె రొటీన్‌గానే అనిపిస్తాయి. కామెడీ బాగానే పండింది. ఓవరాల్ గా స్క్రిప్టుపై మరింత కసరత్తు చేసి ఉంటే ఇంకా బావుండేది అనిపిస్తుంది.
టెక్నికల్ గా…
ఇలాంటి కథలకు విజువల్ ఎఫెక్ట్స్, సినిమాటోగ్రఫీ అద్భుతంగా పండితేనే నిలబడతాయి. మాగ్జమం కష్టపడ్డారు. అయితే బాహుబలి స్దాయి మాత్రం ఆశించకూడదు. కొన్ని చోట్ల బింబిసార కోట ఆర్టిఫిషియల్‌గా కనిపించటం గమనించవచ్చు. కొన్ని సీన్లు, విజువల్స్ ఇతర సినిమాల్లో చూసిన ఫీలింగ్ కలుగుతుంది. సెకండాఫ్‌లో వచ్చే ఫైటింగ్ సీన్స్ చాలా స్టైలిష్‌గా అదిరిపోయాయి. బింబిసారుడిని ఎలివేట్ చేసే డైలాగ్‌లు ఆకట్టుకుంటాయి. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కీలకంగా నిలిచింది. ఆర్ట్స్, కాస్ట్యూమ్స్ డిపార్టమెంట్ కష్టం తెరపై కనపడుతుంది. అలాగే డైరక్టర్ కొత్తవాడైనా ఇలాంటి భారీ ప్రాజెక్టుని ఎక్కడా తడబడకుండా డీల్ చేసారు. కళ్యాణ్ రామ్ నిర్మాతగా ఎప్పుడూ బాగానే ఖర్చుపెడుతూ వస్తున్నారు.
కళ్యాణ్ రామ్ మొదటిసారి తనలోని పూర్తి స్దాయి నటుడుని వెలికి తీసారు. బింబిసార, దేవదత్త పాత్రలతో పాటు, నేటి కాలంలో మోడ్రన్ బింబిసార పాత్రలో కూడా ఆయన మమేకమైపోయారు. . కానీ హీరోయిన్స్ కే అసలు స్క్రీన్ స్పేస్ దొరకలేదు. కేథరిన్ త్రెసా సినిమా మొత్తానికి కేవలం పది నిమిషాలు మాత్రమే అంటే అతిశయోక్తి కాదు అలాగే సంయుక్త మీనన్ పాత్రకు కూడా అంత ప్రాధాన్యమేమీ లేదు. శ్రీనివాసరెడ్డి , బ్రహ్మజీ, చమ్మక్ చంద్ర తమ పాత్రల పరిధి మేరకు అక్కడక్కడ కామెడీ పండించారు.
చూడచ్చా?
మనకు టైమ్ ట్రావెల్ సినిమాలు రావటం లేదని భావించేవారు ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేయచ్చు. పక్కా మాస్ సినిమా
ప్లస్ లు:
టైమ్ ట్రావెల్ నేపధ్యం
కళ్యాణ్ రామ్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
మైనస్ :
కొన్ని సీన్స్ తేలిపోవటం
సరైన పాటలు లేకపోవటం
తెర ముందు..వెనుక
బ్యానర్: ఎన్.టి.ఆర్ ఆర్ట్స్
నటీనటులు: కల్యాణ్ రామ్, కేథరీన్ థ్రేసా, సంయుక్త మీనన్, ప్రకాశ్ రాజ్, వివాన్ భటేనా, అయ్యప్ప పి శర్మ తదితరులు
సినిమాటోగ్రఫీ: చోటా కె నాయుడు
విజువల్ ఎఫెక్ట్స్: అనిల్ పాడురి
సంగీతం (బ్యాక్ గ్రౌండ్): ఎం.ఎం. కీరవాణి
ఎడిటింగ్: తమ్మి రాజు
సంగీతం (పాటలు): చిరంతన్ భట్, వరికుప్పల యాదగిరి, కీరవాణి
నిర్మాత : హరికృష్ణ. కె
కథ, దర్శకత్వం, స్క్రీన్‌ప్లే: వశిష్ఠ
Runtime: 2 hours 26 minutes.
విడుదల తేది: ఆగస్టు 5, 2022