మట్టి కుస్తీ మూవీ రివ్యూ

Published On: December 3, 2022   |   Posted By:
మట్టి కుస్తీ మూవీ రివ్యూ
image.png
  రవితేజ నిర్మాణం  ‘మట్టి కుస్తీ’ రివ్యూ
 
 Emotional Engagement Emoji
👍
మీకు గుర్తుందో లేదో ఆ మధ్యన  రానా ‘అరణ్య’లో ప్రధాన పాత్రలో కనిపించిన విష్ణు విశాల్… ఆ తర్వాత ‘ఎఫ్ఐఆర్’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు.  రెండు సినిమాలు పెద్దగా వర్కవుట్ కాకపోయినా విష్ణు విశాల్  నష్టపోయిందేమీ లేదు. ఉన్నంతలో కొద్దో గొప్పో తెలుగు మార్కెట్ ని పట్టుకున్నాడు. ఇప్పుడు రవితేజ ని సీన్ లోకి తీసుకొచ్చి…’మట్టి కుస్తీ’ సినిమాతో తెలుగులోకి మరోసారి వచ్చారు. ఈసారి అయినా  విజయం అందుకున్నారా? లేదా?

స్టోరీ లైన్

అనగనగా ఓ అమ్మాయి …పేరు  కీర్తి (ఐశ్వర్య లక్ష్మీ). ఆమె ఓ  రెజ్లర్. బీఎస్సీ  కూడా చదివింది. చిన్న జుట్టుతో  స్టైలిష్‌గా ఉంటుంది. చెల్లెల్ని ఈవ్ టీజింగ్ చేసిన వాడ్ని  రోడ్డు మీద పరుగులు పెట్టించి మరీ కొట్టగల సత్తా ఆమె సొంతం. మరో ప్రక్క ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వీర (విష్ణువిశాల్‌)కి చిన్నప్పుడే అమ్మా,నాన్నా చనిపోయారు.  మామయ్య (కరుణాస్‌) పెంచి పెద్ద చేసాడు. . ఎనిమిదో తరగతి వరకే చదువుకున్న అతను ఊర్లో ఏ పనీ చేయకుండా బలాదూర్‌గా తిరుగుతూ ఉంటాడు.  వీరకి బాగా ఆస్తిపాస్తులున్నాయి..ఊరి నిండా గొడవలు ఉన్నాయి. అయితే అతనికి తన కాబోయే భార్య మీద కొన్ని ఆలోచనలు ఉన్నాయి.   ఆడపిల్లలు అణిగిమణిగి ఉండాలని, ఎక్కువ చదువుకుంటే సమస్యలు వస్తాయని ఆలోచిస్తూంటాడు.

దాంతో తనకు కాబోయే భార్య తనకంటే తక్కువ చదువుకోవాలని, జుట్టు పొడుగుండాలని వీర కండీషన్స్‌ పెడతాడు. ఈ క్రమంలో అలాంటి పిల్ల దొరక్క అతనికి పెళ్లి కాదు. మరో ప్రక్క రెజ్లర్ కావటంతో కీర్తికి పెళ్లికాదు. ఈ క్రమంలో వీరిద్దిరు ఒకటి  అయ్యే అవకాసం వస్తుంది.   కీర్తి బాబాయి… ఆంధ్రలోని చిన్ననాటి స్నేహితుడైన వీర మామయ్యని ఓ సందర్భంలో కలుస్తారు.  ఈ క్రమంలో పెళ్లి మాటలు వచ్చి..వీరిద్దరి పెయిర్ బాగుంటుదనే నిర్ణయానికి వస్తారు.

కీర్తి తక్కువ చదువుకుందని,నడుము కింద వరకు పొడవాటి జుట్టు ఉంటుందని అబద్దాలు చెప్పి వీర (విష్ణు విశాల్)కు ఇచ్చి పెళ్లి చేస్తారు. అయితే ఓ రోజు ఆమె రెజ్లర్ అనే విషయం బయిటపడుతుంది. పెళ్లి కోసం అబద్దాలు ఆడారనే సంగతి తెలిసిపోతుంది.  విడాకులకు వెళ్తారు. అక్కడ నుంచి వీరిద్దరి జీవితంలో ఏమి మార్పులు వచ్చాయి. చివరకు ఏమైంది. అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎనాలసిస్ …

వెయ్యి అబద్దాలు ఆడి అయినా ఓ పెళ్ళి చేయాలనేది మన పాత సామెత. అలా ఓ చిన్న అబద్దం ఆడి ఓ జంటను కలిపాను అనుకుంటే అది మూన్నాళ్ల ముచ్చటే అవుతుంది. అయితే ప్రేమ,అనురాగం శాశ్వతమని డైరక్టర్ చెప్పదలగిచారు. ఆ దిసగా కథ నడిపించారు. సినిమా సరదాసరదాగా నడుస్తుంది. ఫన్ బాగానే ఉంటుంది. కానీ ప్రెడిక్టుబుల్ గా అనిపిస్తుంది.  తర్వాత ఏం జరిగుతుందో క్లైమాక్స్ ఏమిటో ఇంటర్వెల్ కే చెప్పేయగలం. అలాంటి స్క్రీన్ ప్లే ఈ సినిమాకు సొంతం. ఫస్టాఫ్ బాగానే గడిచిపోయినా సెకండాఫ్‌లో భార్య తనకంటే ఎక్కువ చదువుకుందని, రెజ్లర్‌ అని తెలిశాక హీరో ప్రవర్తనలో మార్పు వస్తుంది. వారిద్దరి మధ్యా సమస్యలు మొదలవుతాయి. ఆ ఊరి వాళ్లు కూడా వీర కంటే.. కీర్తినే ఎక్కువగా ప్రేమగా, గౌరవంగా చూస్తారు. దీంతో భర్తగా వీర ఇగో హర్ట్‌ అవటం…. భార్యపై గెలుపు సాధించడానికి వీర మట్టి కుస్తీలో పాల్గొంటాడు. చివరికి క్లైమాక్స్‌ ప్రేక్షకులు ఊహించిందే. అయితే చాలా సీన్స్ ఎంటర్టైన్మెంట్ తో నడపటం వల్ల బాగుందనిపిస్తుంది. అద్బుతం కాకపోయినా అలరిస్తుంది. ‘మట్టి కుస్తీ’ కామెడీతో రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో నడపటమే ఫన్.  మాస్ అంశాలతో కమర్షియల్ పంథాలో రూపొందించడం ఈ సినిమాకు కలిసివచ్చింది.

టెక్నికల్ గా చూస్తే…

డైరక్షన్ ఓకే అనిపిస్తుంది. అయితే ఫ్యామిలీస్ చూడదగ్గ సినిమాకు ఆ మాత్రం చాలనిపిస్తుంది. ఇక సంగీత దర్శకుడు జస్టిన్ ప్రభాకరన్ విసొంపైన పాటలు ఇచ్చాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓకే. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వేల్యూస్ చెప్పుకోదగ్గ స్దాయిలో ఉన్నాయి. సినిమాలో ఫన్ సీన్స్ కొన్ని బాగా పండాయి.  భర్తల్ని ఎలా గ్రిప్‌లో పెట్టుకోవాలో ఆడవాళ్లు.. భార్యల్ని ఎలా చెప్పు చేతల్లో పెట్టుకోవాలో మగాళ్లు మాట్లాడుకునే సీన్స్ బాగా నవ్విస్తాయి.

నటీనటుల్లో ….

ఐశ్వర్య లక్ష్మి నటిగా ఎప్పుడూ  ఎక్కువ మార్కులు సంపాదించుకుంది. ప్రక్కనున్న హీరోలను డామినేట్ చేయగలగటం ఆమె సొంతం.  అలాగే ఈ ప్రాజక్టు  కోసం ఆమె పడిన కష్టం, కసరత్తులు మెచ్చుకోబుద్ది వేస్తాయి. విష్ణు విశాల్ జస్ట్ ఓఖే. శత్రు, అజయ్ నెగిటివ్ రోల్స్ లో అలరించారు. “డాక్టర్” ఫేమ్ రెడ్ కింగ్స్లే కామెడీ టైమింగ్ చక్కగా నవ్విస్తుంది.

చూడచ్చా

సరదాగా ఓ వీకెండ్ కాలక్షేపానికి ఢోకా లేదనిపిస్తుంది. మరీ ఎక్కువ ఎక్సెపెక్ట్ చేస్తే మొహమాటం లేకుండా డొక్కలో తంతుంది.

ఎవరెవరు…

నటీనటులు : విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి, కరుణాస్, శ్రీజా రవి, అజయ్, శత్రు, మునీష్ కాంత్, కాళీ వెంకట్, రిడిన్ కింగ్ స్లే, హరీష్ పేరడీ తదితరులు
ఛాయాగ్రహణం : రిచర్డ్ ఎం నాథన్
సంగీతం : జస్టిన్ ప్రభాకరన్
నిర్మాతలు : రవితేజ, విష్ణు విశాల్
Runtime : 2 hours 24 minutes.
రచన, దర్శకత్వం : చెల్లా అయ్యావు
విడుదల తేదీ: డిసెంబర్ 2, 2022