మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ చరణ్ పాకాల ఇంటర్వ్యూ

Published On: December 27, 2023   |   Posted By:

మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ చరణ్ పాకాల ఇంటర్వ్యూ

బబుల్‌గమ్ మ్యూజిక్ చాలా కొత్తగా ఫ్రెష్ గా వుంటుంది. బబుల్‌గమ్ న్యూ ఏజ్ లవ్ స్టొరీ అందరినీ అలరిస్తుంది: మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ చరణ్ పాకాల

ట్యాలెంటెడ్ డైరెక్టర్ రవికాంత్ పేరేపు దర్శకత్వంలో రోషన్ కనకాల హీరోగా పరిచయం అవుతున్న చిత్రం బబుల్‌గమ్. మానస చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్, ట్రైలర్, పాటలు ట్రెమండస్ రెస్పాన్స్ తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మహేశ్వరి మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 29న విడుదల కానుంది. ఈ నేపధ్యంలో సంగీత దర్శకుడు శ్రీ చరణ్ పాకాల విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.

మీరు ఎక్కువగా థ్రిల్లర్స్ చేశారు కదా.. బబుల్‌గమ్ లాంటి న్యూ ఏజ్ లవ్ స్టొరీ చేయడం ఎలా అనిపించింది ?
చాలా ఎంజాయ్ చేశాను. నిజానికి ఇలాంటి ప్రేమకథలు, మాస్, కామెడీ, హ్యుమర్ వున్న చిత్రాలు చేయడానికి ఇష్టపడతాను. ఇప్పటివరకూ ఇచ్చింది ఇచ్చేశాను.. ఇకపై నన్ను నేను కొత్తగా ఆవిష్కరించడానికి ప్రయత్నం చేస్తాను అని ప్రీరిలీజ్ ఈవెంట్ లో కూడా చెప్పాను. అది బబుల్‌గమ్ తో మొదలైయింది.

ఇందులో హీరో డీజే కదా.. అలాంటి మ్యూజిక్ కోసం ప్రత్యేకంగా కసరత్తులు చేశారా?
చిన్నప్పటి నుంచి చాలా ఎలక్ట్రానిక్ మ్యూజిక్ విన్నాను. నేను గిటారిస్ట్ ని. నా ఫ్రెండ్స్ అందరూ దాదాపు డిజేలు. ఎలక్ట్రానిక్ మ్యూజిక్ లోనే చాలా లేయర్స్ వుంటాయి. వాటిపై చిన్నప్పటి నుంచి పరిశీలన వుంది. అయితే ఇప్పుడీ చిత్రంలో అలాంటి మ్యూజిక్ ఇచ్చే ఛాన్స్ వచ్చింది. క్యారెక్టర్ కు తగ్గట్టుగా మ్యూజిక్ చేయడం జరిగింది.

ఎలక్ట్రానిక్ మ్యూజిక్ లో లిరిక్స్ ని ఎలివేట్ చేయడం సవాల్ తో కూడుకున్న పని కదా ?
నిజమే. లిరిక్స్ ఎప్పిల్ గా చేయడానికి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. ట్యూన్ కంటే లిరిక్స్ ముఖ్యమని నమ్ముతాను. రవికాంత్ సింగర్ కూడా. ఇందులో ఈజీ పీజీ పాటని తనే రాశాడు, క్షణంలో తను రాసిన పాటకు ఇంటర్నేషనల్ అవార్డ్ కూడా వచ్చింది. తనకీ మ్యూజిక్ వచ్చు. ప్రతి విషయంలో చాలా కేర్ తీసుకున్నాం.

దర్శకుడు రవికాంత్ గారితో మీకున్న అనుబంధం గురించి ?
రవికాంత్ స్కూల్ డేస్ నుంచి తెలుసు. తన షార్ట్ ఫిలిమ్స్ కి నేనే మ్యూజిక్ చేశాను. క్షణం చేసినప్పుడు తనలో ప్రతిభ మరింతగా తెలిసింది. ఆ సినిమా పెద్ద విజయం సాధించింది. అలాగే మా కాంబినేషన్ లో వచ్చిన రెండో సినిమా కృష్ణ అండ్ లీలా కూడా మంచి విజయం సాధించింది. ఆ సినిమా ఓటీటీ లో విడుదలైనప్పటికీ మ్యూజిక్ కి చాలా పేరొచ్చింది. ఇప్పుడు బబుల్‌గమ్ లో కూడా అద్భుతమైన మ్యూజిక్ కుదిరింది.

రోషన్ కనకాల వర్కింగ్ స్టయిల్ ఎలా వుంది ?
రోషన్ చాలా డెడికేటెడ్, హంబుల్. తనలో చాలా ప్రతిభ వుంది. మంచి నటుడు, డ్యాన్సర్ కూడా. ఎమోషన్స్ ని చాలా చక్కగా పలికించాడు. తను డబ్బింగ్ చెప్పిన తీరు కూడా అద్భుతంగా వుంది.

చాలా విజయవంతమైన చిత్రాలు చేశారు కదా.. ఈ సక్సెస్ ఎలా ఎంజాయ్ చేస్తారు ?
ఆనందంగా వుంటాను. ప్రత్యేకంగా ఎంజాయ్ చేసే సమయం వుండదు. పని చేయడమే మన చేతిలో వుంది కానీ జయపజయాలు గురించి పట్టించుకోకూడదనే మనస్తత్వంతో వుంటాను.

బబుల్‌గమ్ చూసే వుంటారు కదా…ఎలా అనిపించింది ?
చాలా నచ్చింది. ఇప్పటివరకూ చూసిన మిగతా వారు కూడా చాలా ఇష్టపడ్డారు. మ్యూజిక్ పరంగా ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్, పాటలని ని చాలా ఎంజాయ్ చేశారు. ముఖ్యంగా రోషన్ ఎక్స్ ట్రార్డినరీ పెర్ఫార్మెన్స్ కి ఫిదా అయ్యారు.

బబుల్‌గమ్ ప్రొడక్షన్ హౌస్ గురించి ?
నిర్మాతలు చాలా సపోర్ట్ చేసారు. కావాల్సిన ప్రతిది ఎక్కడా రాజీపడకుండా సమకూర్చారు. చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. దేనికి వెనకాడలేదు.

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ లో సంగీతాన్ని చేసుకున్న వీలున్న ఈ యుగంలో ఒక రియల్ టైమ్ కంపోజర్ కి అది ప్రమాదమా ? ఉపయోగమా ?
ప్రతి రంగం అడ్వాన్స్ అవుతూనే వుంటుంది. ఎప్పటికప్పుడు టెక్నాలజీ పెరుగుతుంది. అయితే ఎంత ఏఐ అడ్వాన్స్ అయినప్పటికీ ఎమోషన్ కనెక్ట్ చేయాలంటే హ్యూమన్ టచ్ వుండాల్సిందే. పర్సనల్ కనెక్షన్ హ్యూమన్ టచ్ తోనే సాధ్యపడుతుందని నమ్ముతాను.

కొత్తగా చేస్తున్న సినిమాలు ?
సత్యభామ కి చేస్తున్నాను. గూఢచారి 2 స్టార్ట్ అవుతుంది.

ఆల్ ది బెస్ట్
థాంక్స్