రంగ్ దే మూవీ రివ్యూ

Published On: March 26, 2021   |   Posted By:
రంగ్ దే మూవీ రివ్యూ

‘రాంగ్‘ లే: నితిన్ ‘రంగ్ దే’ రివ్యూ

Rating:2/5

నితిన్ కు హిట్ కావాలి, డైరక్టర్ వెంకీ అట్లూరి కూ అర్జెంటుగా హిట్ కావాలి..ఇద్దరూ డెస్పరేట్ గా ఉన్నారు. వీళ్లకు నేను తోడు వస్తా నంటూ కీర్తి సురేష్ కలిసింది. ఇంతకు మించి డెడ్లీ కాంబినేషన్ ఏముంటుంది. అంతే ప్రొడ్యూసర్ సరే అన్నారు. ఏం కథ అంటే…డైరక్టర్ కు కలిసొచ్చిన రొమాంటిక్ కామెడీ చేద్దామన్నారు. నితిన్ కూడా అలాంటి కథలు గతంలో చేసి ఉండటం, అవి హిట్ అవటంతో ఇంక ఆలోచించేదేముంది రంగంలోకి దూకేసారు. దేవిశ్రీప్రసాద్ ని, పీసీ శ్రీరామ్ నీ తీసుకొచ్చి అద్బుతం చేసి పారేయండిరా అబ్బాయిలూ అన్నారు ప్రొడ్యూసర్ ..సరే అని స్క్రిప్టు రాసేసి సినిమా తీసేసారు. షూటింగ్ లోనూ ఫుల్ గా ఎంజాయ్ చేసామన్నారు. ఇంతకీ మరి ఈ సినిమా చూసిన ప్రేక్షకుడు ఎంజాయ్ చేసాడా..సినిమా ఎలా ఉంది…కథేంటి…అనే విషయాలు రివ్యూలో చూద్దాం.

స్టోరీ లైన్

ప్రక్క ప్రక్క ఇళ్లల్లో పెరిగిన అర్జున్ (నితిన్‌), అనుప‌మ (కీర్తిసురేష్‌) ప్రెండ్స్ కాలేకపోతారు. అందుకు కారణం అనుపమ చిన్నప్పటినుంచీ చదువులో టాప్ , అర్జున్ ప్లాఫ్. దాంతో అర్జున్ వాళ్ల నాన్న (నరేష్) ఎప్పుడూ …కొడుకుని ..ఆ పిల్లను చూసి నేర్చుకోరా అని తిట్టిపోస్తూంటాడు. దాంతో అర్జున్ కు ఆమె అంటే ద్వేషం ఏర్పడిపోతుంది. అది వయస్సుతోపాటే  పెరిగి పెద్దవుతుంది. కానీ రివర్స్ లో అనుపమ మాత్రం అర్జున్ తో పూర్తి ప్రేమలో ఉంటుంది. అతని లేని జీవితాన్ని ఊహించుకోలేకపోతుంది. అతనితో తగువులు పడ్డా ఎంజాయ్ చేస్తూంటాడు. అలా టామ్ అండ్ జెర్రీలులాగ ఉన్న వీళ్లిద్దరు అనుకోని  పరిస్దితుల్లో పెళ్లి చేసుకుంటారు. అది అను స్కెచ్ అని భావించి ఆమెను దూరం పెడతాడు. కానీ అనుకోకుండా ఓ రాత్రి ఆమెతో కమిటైన అర్జున్…ఆమె ప్రెగ్నెంట్ అవటంతో కంగారుపడి అబార్షన్ చేయించుకోమంటారు. తనకు విడాకులు ఇవ్వమంటారు. అనుపమ మనస్సుని ఈ మాటలు చాలా బాధిస్తాయి. ఇక అర్జున్ మారడని డైవర్స్ కు సిద్దపడుతుంది. ఈ క్రమంలో కొన్ని సంఘటనలు జరుగుతాయి. దాంతో  వారిద్దరి ఇగోలు పక్కనపెట్టి ఎలా ఒక్కటవుతారు. ఆ సంఘటనలేంటి  అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.  

స్క్రీన్ ప్లే ఎనాలసిస్…

ప‌క్క‌ప‌క్క ఇళ్ల‌ల్లో పెరిగారు. చిన్న‌ప్ప‌ట్నుంచి ఒక‌రికొక‌రు బాగా తెలుసు అనగానే మనకు నువ్వే కావాలి సినిమా గుర్తు వస్తుంది. ఇద్దరూ ఆ సినిమాలో లోగానే బయిటకు కొట్టుకోవటం..ఆమె మనస్సు అతను అర్దం చేసుకోకపోవటం..చివరకు ఆమె పెళ్లికి రెడీ అవటం వంటివి ఈ సినిమా చూస్తూంటే గుర్తుకు వస్తాయి. దాంతో మనకు ప్రెష్ సినిమా చూసిన ఫీల్ రాదు. ఇక సెకండాఫ్ లో సెంటిమెంట్ కు ఎమోషన్స్ కు చోటు ఇచ్చి యూత్ ఏస్పెక్ట్ ని తగ్గించేసాడు డైరక్టర్, ఫ్యామిలీస్ వస్తారని ఆశతో చేసిన ఈ సెకండాప్ …సినిమాకే సమస్యగా మారుతుందని ఊహించి ఉండడు. అలాగని ఈ సినిమాలో కొత్తదనం లేదని కాదు.. ఇంజినీరింగ్ గ‌ట్టెక్కేందుకు హీరో చేసే ప్ర‌య‌త్నాలు, జీమ్యాట్ కోసం బ్ర‌హ్మాజీ దగ్గరకు వెళ్లి సక్సెస్ అవటం వంటి సీన్స్ కొత్తగా ఉండి పండాయి. ఇంటర్వల్ కూడా బాగుంది. అయితే ఆ స్దాయిలో సెకండాఫ్ లేదు.  సినిమా రన్ టైమ్ అయ్యిపోతోంది కాబట్టి హీరో ఉన్నట్లుండి మనస్సు మార్చుకోవటం కూడా కథకు అతకలేదు  వెన్నెల కిషోర్ ఫన్ ..సెకండాఫ్ లో ఓ మాదిరిగా నవ్వించింది.  అప్పటికీ అభిన‌వ్ గోమ‌టం, సుహాస్, బ్ర‌హ్మాజీ ప్ర‌థ‌మార్ధంలో న‌వ్వులు పండించారు. కానీ అవేమీ సినిమాని హిట్ ట్రాక్ లోకి తీసుకెళ్లలేకపోయాయి.  క్లైమాక్స్ కూడా తేలిపోయింది. ఏ హడావిడిలేకుండా డైరక్టర్ ముగించాలనుకున్నా ..సోసోగా ఉంది. సర్పైజింగ్ గా అయ్యితే మాత్రం లేదు.
 
టెక్నికల్ గా…

ఇక ఈ సినిమాకు మొదట మైనస్  దేవి శ్రీ ప్రాసాద్‌ సంగీతం. ఇలాంటి లవ్ స్టోరీలకు ప్రతి పాట ఆకట్టుకునేలా ఉండాలి. బ్లాక్ బస్టర్ కావాలి. కానీ మినిమం స్దాయిలో కూడా లేవు. ఇక  బ్యాక్‌ గ్రౌండ్‌ విషయానికి వస్తే జస్ట్ ఓకే అన్నట్లుంది. ఎందుకనో దేవి దృష్టి పెట్టలేదు. ఎడిటర్‌ నవీన్‌ నూలి మొహమాటపడి చాలా లాగ్ ఉంచేవారు.  పీసీ శ్రీరాం సినిమాటోగ్రఫి బాగుందని అని తప్ప వేరే మాట అనలేం. అయితే ఆ వర్క్ ని వాడుకునేటంత గొప్ప సీన్స్ ఈ సినిమాలో ఎక్కడున్నాయి.. సితారా ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్ వాల్యూస్ సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. స్క్రిప్టు వర్క్ లో రాణించలేకపోయిన వెంకీ అట్లూరి డైరక్షన్ కూడా అంత గొప్పగా ఏమీలేదు. సాదా సీదాగా ఉంది.  డైలాగులు కొన్ని బాగా పేలాయి.
 
నటీనటుల్లో  నితిన్ – కీర్తి కాంబినేషన్ కొత్తగా అనిపించింది . వీరిద్దరిలో కీర్తి సురేష్ బాగా చేసింది.  కాకపోతే కీర్తి బాగా స్లిమ్ అయ్యి అందం వాడిపోయింది.   హీరో తండ్రిగా న‌రేష్‌, హీరోయిన్ త‌ల్లిగా రోహిణి తమ పాత్రలకు ప్రాణం పోసారు. సెంకండాఫ్ కు రిలీఫ్  వెన్నెల కిషోర్ కామెడీనే.  
 
తెర వెనక..తెర ముందు

బ్యానర్: సితారా ఎంటర్‌టైన్‌మెంట్
నటీనటులు: నితిన్, కీర్తీ సురేష్, నరేష్, కౌసల్య, రోహిణి, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, వినీత్, అభినవ్ గోమటం, సుహాస్, గాయత్రి రఘురాం తదితరులు.
మ్యూజిక్: దేవీ శ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫి: పీసీ శ్రీరాం
ఎడిటింగ్: నవీన్ నూలీ  
రచన: వెంకీ అట్లూరి, పీ సతీష్ చంద్ర
దర్శకత్వం: వెంకీ అట్లూరి
నిర్మాత: సూర్యదేవర నాగ వంశీ
రన్ టైమ్ : 2 గంటల 10 నిముషాలు
రిలీజ్ డేట్: మార్చ్ 26, 2021