రాజబాబు జయంతి వేడుక

Published On: June 16, 2022   |   Posted By:

రాజబాబు జయంతి వేడుక

రాజబాబు జయంతి ఎందరికో మార్గదర్శకం కావాలి” – తమ్మారెడ్డి భరద్వాజ

నటీనటులు చనిపోయిన తరువాత వారి జయంతిని పదిమందికి స్ఫూర్తిగా నిర్వహిం చడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని, నటుడు రాజబాబును ఇంతగా ప్రేమించే పిల్లలు ఉండటం అదృష్టమని నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ పేర్కొన్నారు.

క్యారెక్టర్ నటుడు రాజబాబు 65 వ జయంతి వేడుకలు హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో సోమవారం జరిగాయి

రాజబాబు కుమారులు రమేష్ చంద్ర, వీరన్న చౌదరి, కుమార్తె శ్రీదేవి, స్నేహితులు కాకాని బ్రహ్మం, నాగేశ్వర రావు, భగీరథ, నర్రా వెంకట్ రావు, సూర్య తేజ, రాజబాబు జయంతి వేడుకలను నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఆరుగురికి రాజబాబు స్మారక అవార్డులు, తొమ్మిది మంది పేద కళాకారులకు ఆర్థిక సహాయం అతిథుల ద్వారా అందించారు. ఈ సందర్భంగా భరద్వాజ మాట్లాడుతూ, రాజబాబు చాలా సౌమ్యుడు, అందరితో స్నేహపాత్రంగా ఉంటాడు, ఆయన మరణించిన తరువాత ఈ వేడుకను ఇంత ఘనంగా నిర్వహించడం ఆశ్చర్యంగా, ఆనందంగా ఉందని చెప్పారు.

తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి కార్యదర్శి కె .ఎల్ .దామోదర ప్రసాద్ మాట్లాడుతూ, స్వర్గస్తులైన వారిని స్మరిస్తూ కార్యక్రమాలు సంస్థలు ఎందుకు నిర్వహించవని మమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంటారు . ఆయా నటీనటుల కుటుంబ సభ్యులు ముందుకు వస్తే తాము చేయూత నిస్తామని, అందుకు రాజబాబు కుటుంబం ఆదర్శంగా నిలిచిందని చెప్పారు.. సినిమా రంగంలో ఇది చాలా మంచి సంప్రదాయమని, అందరూ ఆదర్శంగా తీసుకోవాలని సలహా ఇచ్చారు.
తెలుగు చిత్ర నిర్మాతల మండలి కార్యదర్శి తుమ్మల ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. గతం లో తామ సంతాప సభలు, జయంతి వేడుకలు నిర్వహించామని, అయితే ఇలాంటి స్పదన మాత్రం తానూ చూడలేదని చెప్పారు. రాజబాబు చనిపోయిన తరువాత ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు నిర్వహించిన ఈ వేడుక మాత్రం చాలా స్ఫూర్తి కలిగిస్తుందని, ఆయన పేరుతో స్మారక అవార్డులు ఇవ్వడంతో పాటు, పేద కళాకారులకు ఆర్ధిక సహాయం చెయ్యడం కూడా ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని చెప్పారు .

“మా ” ఉపాధ్యక్షులు డాక్టర్ మాదాల రవి మాట్లాడుతూ.. రాజబాబు మంచి స్నేహశీలి, ఆయనతో ఒకసారి పరిచయం అయితే ఎవరూ మర్చిపోలేరు. ఆయన జయంతి వేడుకలను ఇలా స్ఫూర్తిదాయకంగా నిర్వహించడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని అన్నారు.
దర్శకుడు ఉప్పలపాటి నారాయణ రావు , డాక్టర్ ఎమ్ .వినోద్ బాల, రామ్ జగన్, కృష్ణ భగవాన్, శ్రీమతి శివ పార్వతి, శివన్నారాయణ రాజబాబుతో తమకున్న అనుభవాలను పంచుకున్నారు .
రాజబాబు జయంతి వేడుకల కమిటీ అధ్యక్షుడు కాకాని బ్రహ్మం మాట్లాడుతూ.. తనకు రాజబాబు అత్యంత సున్నిత మిత్రుడని, అలాంటి మిత్రుడు ఇంత త్వరగా దూరమవుతాడని ఎప్పుడు అనుకోలేదని , రాజబాబు జయంతి వేడుకలను ప్రతి సంవత్సరం వారి కుటుంబ సభ్యుల సహకారంతో నిర్వహిస్తామని చెప్పారు.

సినిమా రంగంలో కోట్లు సంపాదించి పోయినవారు ఎందరో వున్నారు. అయితే వారి జయంతిని ఒక వేడుకలా జరుపుదామనే భావన చాలా మందిలో లేదు . రాజబాబు లాంటి చిన్న నటుడు ను గుర్తు చేసుకుంటూ ఆయన జయంతిని ఇలా ఘనంగా నిర్వహించిన వారి కుటుంబ సభ్యులను మనసారా అభినందిస్తున్న అని భగీరథ చెప్పారు. ఒక వారం రోజుల క్రితమే ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని అనుకున్నామని, ఇందుకు అందరూ సహకరించారని ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

అనంతరం శ్రీమతి శివ పార్వతి, శ్రీమతి సుహాసిని, శ్రీమతి సరోజినీ, రామ్ జగన్, శివన్నా రాయణ, గోపి నాయుడు లకు రాజబాబు స్మారక అవార్డులను భరద్వాజ, దాము, మాదాల రవి, ప్రసన్న కుమార్ ప్రదానం చేశారు.

పేద కళాకారులైన రమ్య చౌదరి, గోధురం మురళి, గోవా శర్మ, పొట్టి స్వామి, తెనాలి శకుంతల, తిరుపతి, కృష్ణవేణి, దుర్గ నాగేశ్వర రావు, లక్ష్మి తులసి కి ఒక్కొక్కరికి పదివేల రూపాయల ఆర్ధిక సహాయాన్ని రాజబాబు కుటుంబ సభ్యులు రమేష్ చంద్ర, వెంకన్న చౌదరి, శ్రీదేవి అందించారు.
జర్నలిస్ట్ రాంబాబు పుట్టినరోజు సందర్భంగా, తమ్మారెడ్డి భరద్వాజ, దాము ,ప్రసన్న కుమార్, మాదాల రవి, కాకాని బ్రహ్మం, రాజబాబు కుటుంబ సభ్యులు సత్కరించారు. సభకు ముందు రాజబాబు జీవిత పై ఓ లఘు చిత్రాన్ని ప్రదర్శించారు.