వాళ్ళిద్దరి మధ్య మూవీ రివ్యూ

Published On: December 17, 2022   |   Posted By:

వాళ్ళిద్దరి మధ్య మూవీ రివ్యూ

Emotional Engagement Emoji

ప్రముఖ దర్శకుడు వీఎన్ ఆదిత్య సినిమాలకు లవ్ స్టోరీలు బాగా తెరకెక్కించగలరనే ఓ బ్రాండ్. అయితే ఆయన గత కొంతకాలంగా సినిమాలు చేయటం లేదు. అయితే తాజాగా మరోసారి ఆయన ఓ లవ్ స్టోరీతో ముందుకు వచ్చారు. కాంటెంపరరీ లవ్ స్టోరిగా రూపొందింది అని చెప్పబడుతున్న ఈ సినిమా నేరుగా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ఎలా ఉంది. ఫన్ అండ్ రొమాంటిక్ కామెడీగా ఉండి సినిమా ప్రేక్షకులను అలరించేలా ఉందా.,కథేంటి వంటి విషయాలురివ్యూలో చూద్దాం.

స్టోరీ లైన్

వరుణ్(విరాజ్ అశ్విన్) ఉద్యోగ నిమిత్తం విదేశాలు వెళ్లిన కుర్రాళ్లు తల్లిదండ్రుల బాగోగులు చూసుకునేందుకు ఓ సంస్థని ఏర్పాటు చేస్తాడు. అన్వయ.కామ్ వెబ్ సైట్ ద్వారా ఈ సేవలు అందిస్తుంటాడు. ఊహించని విధంగా అతి తక్కువ టైమ్ లో కంపెనీకి మంచి పేరు వస్తుంది. ఆ క్రమంలో తన కంపెనీ పేరే కల అన్వయ (నేహా కృష్ణ) అనే NRI అమ్మాయితో పరిచయం ఏర్పడుతుంది. ఈమె తల్లిదండ్రులని వరుణ్ బాగా చూసుకోవడంతో ఆమె ఇంప్రెస్ అవుతుంది. అతను ఏమో ఆమెతో ప్రేమలో పడిపోతాడు. యూఎస్ నుంచి ఇండియాకు వచ్చిన ఆమెకు వరుణ్ ప్రపోజ్ చేస్తాడు. ఆ తర్వాత ఓ విషయంలో వారి ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. ఆ గొడవకు కారణం లోమా అని తెలుస్తుంది. అతని వల్లనే పెళ్లి చేసుకుందామనుకున్న వాళ్లి ద్దరూ విడిపోతారు. అసలు ఈ లోమ ఎవరు వీళ్లద్దిరి మధ్యలో దూరి ఎందుకు గొడవలు పెట్టాడు వాటిని పరిష్కరించుకుని ఇద్దరూ ఒక్కటయ్యారా లేదా,లోమ ని ఏం చేసారు అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ

పెద్ద తెర,ఓటిటి తెర అని సినిమా వీక్షణం రెండుగా విడిపోయింది. కొన్ని సినిమాలు ఓటిటిలో చూడటానికి బాగుంటాయి. మరికొన్ని థియేటర్స్ లో బాగుంటాయి. ముఖ్యంగా థ్రిల్లర్స్, హారర్స్, సైకోపాత్ తరహా సినిమాలన్నీ ఓటిటిలోనే చూస్తున్నాం. ముఖ్యంగా చిన్న సినిమాలకు కేరాఫ్ ఎడ్రస్ గా మారింది ఓటిటి. పెద్ద సినిమాలు థియేటర్ లో సూపర్ హిట్టయ్యాక మాత్రమే ఓటిటిలోకి వస్తున్నాయి. ఆ క్రమంలోనే అందరూ కొత్తవారితో తీసిన ఓటిటి చిత్రం ఇది. అయితే ఈ సినిమా ప్రతీ విషయంలోనూ చిన్నగానే ఉండిపోయింది. డైరక్టర్ కు ఎంతో అనుభవం ఉన్నా ఎక్కడా ఆ దృష్టి పెట్టి తీసినట్లు అనిపించదు. కాకపోతే ఆయన అనుభవం సినిమాలో పెద్దగా విషయం లేకపోయినా ముందుకు వెళ్లటానికి పనికొచ్చింది. నిజానికి ఇలాంటి కాన్సెప్టులు కొత్తేమీ కాదు. ఎన్నో చూసేసాం. లవ్ టుడే లాంటి విభిన్నమైన కాన్సెప్టులు ఊపేస్తూంటే ఇంకా ఇలాంటి సినిమాలు తీస్తే ఏ జనరేషన్ టార్గెట్ చేద్దామనో అర్దం కాదు. లవ్ స్టోరీగా బాగానే ఉంది కానీ ఎప్పటి లవ్ స్టోరీ అని అడిగితే మాత్రం జవాబు చెప్పలేం. అదే డైరక్టర్ ఏ 1990లోనో జరిగే ప్రేమ కథ అంటే సరిపోయేది. ఇప్పుడు ఇంకా ఇగోలు ఆత్మల్లా బయిటకు వచ్చి కొట్టుకోవటం, తమ ప్రేమను చెడగొట్టుకోవటం కిక్ ఇవ్వదు. స్క్రిప్టు విషయంలోనే తడబడ్డ కథ ఇది. దాంతో మిగతా విభాగాలు ఎంత కష్ట పడ్డా కథకు తగ్గట్లే ఉండిపోయింది కానీ ముందుకు రాలేకపోయింది.ఏదైమైనా మనసంతా నువ్వే నేనున్నాను వంటి హిట్స్ ఇచ్చిన వీఎన్ ఆదిత్య నుంచి ఇలాంటి ఒక సినిమా వస్తుందని ఎవరూ అనుకోరు.

నటీనటుల్లో

కొత్తవాడైనా విరాజ్ అశ్విన్ హీరోగా, లోమ గా రెండు పాత్రల్లో బాగా చేసారు. ముఖ్యంగా లోమగా ఫెరఫెక్ట్ అనిపించాడు. హీరోయిన్ నేహా కృష్ణ నటన ప్రక్కన పెడితే బాగుంది. మిగిలిన నటీనటులు కూడా వాళ్ల పాత్రల పరిధి మేరకు నటించారు.

టెక్నికల్ గా

దర్శకుడుగా వియఎన్ ఆదిత్య జస్ట్ ఓకే అనదగ్గ చిత్రం. టెక్నికల్ గానూ బ్రిలియెన్సీ లేదు. సినిమా లెంగ్త్ ఎక్కువ అని ఫీలింగ్ వచ్చింది. స్క్రీన్ ప్లే బోర్ కొట్టింది. క్లైమాక్స్ కూడా రొటీనే. సినిమాటోగ్రఫీ బాగుంది. మధు స్రవంతి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. పాటలు జస్ట్ ఓకే. డైలాగులు అక్కడక్కడా బాగున్నాయి.

చూడచ్చా

పెద్ద గొప్ప ప్రేమ కథ అని చెప్పలేం కానీ జస్ట్ ఓకే సినిమా ఓ వీకండ్ కాలక్షేపానికి

నటీనటులు:

విరాజ్ అశ్విన్, నేహా కృష్ణ, వెంకట్ సిద్ధారెడ్డి, బిందు చంద్రమౌళి, సాయి శ్రీనివాస్ వడ్లమాని, జయశ్రీ రాచకొండ, శ్రీకాంత్ అయ్యంగార్, నిహారికా రెడ్డి, ప్రశాంత్ సిద్ది, సుప్రజ, కృష్ణ కాంత్, అలీ, భార్గవ్, రామకృష్ణ తదితరులు

సాంకేతిక వర్గం :

బ్యానర్: వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్
సంగీతం: మధు స్రవంతి
పాటలు: సిరాశ్రీ
కెమెరా: రాకేష్ కోలంచి
ఆర్ట్: జెకే మూర్తి
ఎడిటర్: ధర్మేంద్ర కాకరాల
స్క్రీన్ ప్లే: సత్యానంద్
మాటలు: వెంకట్ డి పతి
లైన్ ప్రొడ్యూసర్: శ్రావణ్ నిడమానూరి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సూరపనేని కిషోర్
నిర్మాత: అర్జున్ దాస్యన్
రన్ టైమ్: 135 నిమిషాలు
కథ, దర్శకత్వం: వీఎన్ ఆదిత్య
విడుదల తేదీ : డిసెంబర్ 16, 2022