సన్నాఫ్ ఇండియా మూవీ రివ్యూ

Published On: February 18, 2022   |   Posted By:

సన్నాఫ్ ఇండియా మూవీ రివ్యూ

మోహన్ బాబు  ‘సన్ ఆఫ్ ఇండియా’ రివ్యూ  

Emotional Engagement Emoji (EEE)

👎

ఇటీవల కాలంలో మంచు మోహన్ బాబు తరచుగా వార్తల్లో నిలుస్తోంది.  అటు రాజకీయంగా, ఇటు సినిమాల పరంగా… రెండింటిలోనూ హల్చల్ చేస్తోన్న ‘కలెక్షన్ కింగ్’ పేరు, తాజాగా మరోసారి సినిమా పరంగా సందడి కు దిగింది. ఈ సందర్బంగా మీడియాలో మోతాదుకు మించి హంగామా జరిగింది. చాలాకాలం గ్యాప్ తర్వాత మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటించిన “సన్నాఫ్ ఇండియా” సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉంది…సినిమా ప్రేమికులకు నచ్చేదేనా…అసలు ఈ వయస్సులో ఇలాంటి యాక్షన్ సినిమా ఒప్పుకోవటం వెనక ఏదన్నా ప్రత్యేకమైన కారణం ఉందా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

స్టోరీ లైన్ ఆఫ్ ఇండియా

డ్రైవర్ బాబ్జీ  (మోహన్ బాబు) చట్టానికి చిక్కుండా కిడ్నాప్ చేస్తుంటాడు.  ఆ కిడ్నాప్ లలో సెంట్రల్ మినిస్టర్, డాక్టర్, రాష్ట్ర మంత్రి ఉండటంతో సంచలనం రేగుతుంది.  ఈ కేసును డీల్ చేందుకు ఎన్ఐఎ ఆఫీసర్ ఐరా(ప్రగ్యా జైస్వాల్)జీప్ లోంచి కాలు క్రిందపెడుతుంది. ఆ క్రమంలో అసలు ఆ కిడ్నాపర్ పేరు బాబ్జీనే కాదని… విరుపాక్ష అని తేలుతుంది. ఎందుకు ఇలా పేరు మార్చుకుని కిడ్నాప్ లు చేస్తున్నాడు…బాగుందని ఇదేమన్నా వృత్తిగా పెట్టుకున్నాడా అని ఎంక్వైరీ చేస్తే అతనికో ప్లాష్ బ్యాక్ ఉందని తెలుస్తుంది. అంతే కాదు అతను స్థాపించిన ప్రైవేట్ జైళ్లలో వాళ్ళు ముగ్గురు ఉన్నారని తేలుతుంది. విరూపాక్ష ప్లాష్ బ్యాక్ ఏమిటి..కిడ్నాప్ చేసి అతను చేస్తున్న డిమాండ్స్ ఏమిటి..చివరకు   విరూపాక్ష తను అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకున్నాడా వంటి విషయాలు ఊహించలేకపోతే తెరపైనే  చూడాలి.

ఎనాలసిస్..

ఇది ఓ ప్రయోగం అని దర్శకుడు మొదట నుంచీ చెప్తూనే వస్తున్నాడు. మోహన్ బాబుతో చేయటమే ప్రయోగం అని మనం అనుకుంటున్నాం. అది కాదు…సినిమా చూడటమూ ప్రయోగమే. ఎందుకంటే ఇది మోహన్ బాబు ఏకపాత్రాభినయం సినిమా. బడ్జెట్ కంట్రోలు అనుకుని చేసారో లేక నిజంగానే ప్రయోగం అనుకుని చేసారో ..ఇవేమీ కాదు..జనం తీస్తే ఎందుకు చూడరు అని ఆశించి చేసారో కానీ ఇది ప్రయోగమే. కాకపోతే జనం హర్షించని ప్రయోగం. థియోటర్ లో రెండు గంటల సేపు మోహన్ బాబు ఒక్కడినే చూడాలని ఆశించటం దుర్మార్గం. సూపర్ స్టార్ మహేష్ ఈ పాత్రను చేసినా భరించలేం. దానికి తగినట్లు సినిమాలో కథ …సినిమా పుట్టిన కాలం నాటిది. ఒకడు కిడ్నాప్ లు చేస్తున్నాడంటే దానికి ఓ ప్లాష్ బ్యాక్ ఉంటుందని ఇట్టే ఊహించేస్తాం. మోహన్ బాబు ఇంకా తన హీరోగా చేసినప్పటికి కాలంలో ఉన్నారనుకుంటాను. ఆయనకు బాగా నచ్చి ఉండచ్చు.

కానీ చూసే జనం, ఇప్పటి జనరేషన్ కదా. వాళ్లకేం అవసరం ఉందని అనుకోలేదు. ఆ మధ్యన  తమిళంలో ఓ సినిమా వచ్చి బాగా పేరు తెచ్చుకుని, అవార్డ్ లు తెచ్చుకుంది. ఆ సినిమా పేరు…ఒత్త సెరుప్పు సైజ్ 7. ఆ సినిమా నుంచి ప్రేరణ పొందారేమో . కానీ ఆ సినిమా రీమేక్ రైట్స్ తెచ్చుకుని చేసినా కొద్దిలో కొద్ది బాగుండేది. ఈ సినిమాలో అలాంటి విషయం ఏమీ లేదు. ఎండింగ్ అయితే లాయ‌ర్ల‌కు, డాక్ట‌ర్ల‌కు సొంతగా ప్రైవేట్ ప్రాక్టీస్ ఉండ‌గా, తాను కూడా నేర‌స్థుల‌ను శిక్షించ‌డానికి త‌న సొంత‌జైలు ఏర్పాటు చేశానంటాడు హీరో. దాంతో అత‌ని అభిప్రాయాన్నిజ‌నం అభినందిస్తూండ‌గా క‌థ ముగియటం చూస్తే ఇంకా దారుణం అనిపిస్తుంది. మోహ‌న్ బాబుకు ఉన్న ఎస్సెట్ ఆయ‌న గొంతు. ఈ సినిమాలో దాన్ని దుర్వినియోగం చేసారు. కుప్పలు తెప్పలు డైలాగులు చెప్పించి విసుగెత్తించారు.  సినిమాకు సరైన కథకానీ, స్క్రీన్ ప్లే కానీ ఏమీ లేకుండా సినిమా తీయటం, దాన్ని చూడటం ఎంత మోహన్ బాబు వీరాభిమానికు అయినా కష్టమే.

మోహన్ బాబు,మిగతా నటులు

ఈ సినిమా మొదలు,చివర..మధ్యలో మొత్తం మోహన్ బాబే. అందులో సందేహం లేదు. ఆయన డబ్బులు పెట్టి,కథా చర్చల్లో పాల్గొని, స్క్రీన్ ప్లే రాసుకుని, నటించారు. ఆయన తప్ప ఇలాంటి ప్రయోగం చేసే ధైర్యం ఈ వయస్సులో ఎవరికీ లేదు. లుక్ పరంగా గత చిత్రం గాయిత్రి కన్నా బెస్ట్. కాకపోతే వయస్సు మీద పడిందని స్పష్టంగా తెలిసిపోతోంది. కాస్ట్ మీద చెప్పిన డైలాగ్స్ అద్బుతంగా ఉన్నాయి ఎన్ని ఉంటేనే అసలైన స్క్రిప్టు లేక ఆయన నటన , మిగతా టాలెంట్స్ పనికిరాకుండా పోయాయి. ఇక ఈ సినిమాలో మిగతా ఆర్టిస్ట్ లు చాలా మంది ఉన్నా ఎవరికీ అవకాసం లేదు. అసలు కనపడరు. ప్రయోగం పేరట చాలా చోట్ల బ్లర్ చేసేసారు. కేవలం డైలాగులే వినిపిస్తాయి.  కాబట్టి    ఆలీ, బండ్లగణేశ్, సునీల్, వెన్నెల కిషోర్, శ్రీకాంత్, రాజారవీంద్ర , తనికెళ్ళ భరణి ఇంతమంది ఉన్నా లేనట్లే.

టెక్నికల్ గా …

డైరక్టర్ గా రత్నబాబు సినిమాని డీల్ చేయలేకపోయారు. ముసలి సింహాం లాంటి మోహన్ బాబు ఆయన్ని తినేసారు అనిపించింది. కాకపోతే రైటర్ గా కొన్ని చోట్ల బాగుందనిపించుకున్నారు. ఎడిటింగ్ కూడా ఇంకా షార్ప్ గా చెయ్యచ్చు. 1గంట 25 నిమిషాలు కూడా ఎక్కువ అనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ దారుణంగా ఉన్నాయి. కెమెరా వర్క్ సోసోగా లాగేసారు. ఇళయారాజా మార్క్ లేకుండా ఆయన సంగీతం సాగింది.

చూడచ్చా

చూడటము చాలా కష్టం. మోహన్ బాబుని చాలా కాలం అయ్యింది కదా తెరపై చూసి, అని ఆవేశపడితే తప్ప భరించలేం

తెర వెనక..ముందు

బ్యానర్‌: 24 ఫ్రేమ్స్‌, ఫ్యాక్టరీ, శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌;
నటీనటులు : మోహన్ బాబు, మీనా, పోసాని కృష్ణమురళి, రవిప్రకాశ్, శ్రీకాంత్, రాజారవీంద్ర, సుప్రీత్ రెడ్డి, నరేశ్, ఆలీ, సునీల్, వెన్నెల కిషోర్, ప్రగ్యా జైస్వల్, బండ్ల గణేశ్ తదితరులు.
సంగీతం : ఇళయరాజా
సినిమాటోగ్రఫీ : సర్వేష్ మురారి
నిర్మాణం : లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్
నిర్మాత : మంచు విష్ణు
స్క్రీన్ ప్లే : యం. మోహన్ బాబు
మాట‌లు: సాయినాథ్ తోట‌ప‌ల్లి, డైమండ్ ర‌త్న‌బాబు
దర్శకత్వం : డైమండ్ రత్నబాబు
రన్ టైమ్: 1గంట 25 నిమిషాలు
విడుదల తేదీ: 18-02-22