సామజవరగమన మూవీ రివ్యూ

Published On: June 29, 2023   |   Posted By:

సామజవరగమన మూవీ రివ్యూ

Emotional Engagement Emoji


అల్లరి నరేష్ కామెడీల నుంచి తప్పుకున్నాక ఆ స్లాట్ ని ఫిల్ చేసేవాళ్లు రాలేదు. అడపాదడపా శ్రీవిష్ణు వంటివారు ప్రయత్నిస్తున్నారు. వరసగా యాక్షన్ సినిమాలు ట్రై చేసి మళ్లీ ఎంటర్టైన్మెంట్ దగ్గరకు వచ్చి ఆగిన శ్రీవిష్ణు చేసిన తాజా సినిమా ఇది. ఓ విభిన్నమైన పాయింట్ తో వచ్చిన ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. ఇంతకీ జనాలకు నచ్చటానికి ఈ సినిమాలో ఏముంది చిత్రం కథేంటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

స్టోరీ లైన్ :

ఏషియ‌న్ మ‌ల్టీప్లెక్స్‌లో ఉద్యోగం చేసే బాలు (శ్రీవిష్ణు) చాలా జాగ్రత్తపరుడు.మిడిల్ క్లాస్ మనిషి. అతనికు ఉన్న భాధ్యతల్లో ప్రధానమైనది తండ్రి ఉమా మహేశ్వ‌ర‌రావు (న‌రేష్‌)ను డిగ్రీ పాస్ అయ్యేలా చేయటం. ఎందుకంటే ఆయన డిగ్రీ పాసైతే కానీ తన తాతగారి నుంచి వచ్చే వారసత్వ ఆస్తి కోట్లు కలిసి రావు. కానీ ఆయన పాసవ్వడు. ఇదిలా ఉంటే తండ్రి ద్వారా పరిచయం అయిన స‌ర‌యు (రెబా మోనికా జాన్‌) ఇంట్లో పేయింగ్ గెస్ట్ గానూ , ఆ తర్వాత అతని గుండెల్లో పర్మెనెంట్ గెస్ట్ గానూ దిగుతుంది. ఇక ప్రేమ అధ్యాయం ముగిసింది. పెళ్లికు రెడీ అవ్వచ్చు అనుకున్న టైమ్ లో అతని బావ పెళ్లి బాలుకు ఓ విచిత్ర‌మైన స‌మ‌స్య తెచ్చిపెడుతుంది. అక్కడ నుంచి ఇద్దరి ప్రేమ ముందుకు వెళ్లే పరిస్దితి కనపడదు. అసలు ఆ స‌మ‌స్య ఏంటి? వీళ్ల ప్రేమ క‌థ ఎలా ముగిసింది? బాలు తండ్రి డిగ్రీ పాసయ్యాడా? లేదా? అన్న‌వి తెర‌పై చూసి తెలుసుకోవాలి

ఎనాలసిస్ :

ఈ సినిమా బలం అంతా రైటింగ్ లోనే ఉంది. అది బాణంలా దూసుకుపోయే డైలాగుల్లో ఉంది. ఎక్కడక్కడ వచ్చే స్పాంటినిటి ఫన్, ఇంటిలిజెంట్ డైలాగులతో సినిమా సాగిపోయింది. నిజానికి ఈ సినిమాలో పెద్దగా కథేమిలేదు. ఉన్న ఆ చిన్న కథ కూడా ఇంటర్వెల్ దాకా పలకరించదు. అక్కడ దాకా కేవలం తండ్రి,కొడుకుల మధ్య వచ్చే ఫన్, ఓ చిన్న లవ్ స్టోరిగా సాగుతుంది. అప్పట్లో వచ్చే జంధ్యాల, ఇవివి సినిమాల శైలిని గుర్తు చేస్తూ ముందుకు వెళ్తుంది. సినిమా పరంగా కొన్ని సినిమాటెక్ లిబర్టీస్ ని, లాజిక్స్ పక్కన పెట్టేస్తే సినిమా సాగుతున్నంత సేపు కడుపారా నవ్విచటమే ఈ రోజున సక్సెస్ కు కేరాఫ్ అయ్యింది. అందులోనూ కామెడీ కథలు ఈ మధ్యన పెద్దగా రాకపోవటం కూడా ఈ సినిమాకు కలిసొచ్చే అంశం. కథలో కొత్తదనం లేకున్నా అక్కడక్కడా తప్పస్తే ఎక్కడా బోర్ కొట్టనివ్వని స్క్రీన్‌ప్లేతో, డైలాగులతో మనం కనెక్ట్ అయ్యేలా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను రూపొందించారు. సెకండాఫ్ లో కాసేపు డ్రాగ్ అయినట్లు అనిపించినా మళ్లీ క్లైమాక్స్ కు వచ్చేసరికి సర్దుకుంటుంది. ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్టే నిబ్బా-నిబ్బీ, అమ్మాయిల ప్రేమ, మన కులం వంటి వాటి ద్వారా నవ్వించటమ కలిసొచ్చింది. మామూలుగా ప్ర‌తి సినిమాలో కొడుకు స‌రిగా చ‌దవ‌ట్లేదంటూ స‌తాయించే తండ్రుల్ని చూశాం. కానీ, ఇందులో వెరైటీగా కొడుకే తండ్రిని చ‌దువుకోమంటూ స‌తాయిస్తుంటాడు. తండ్రిని డిగ్రీ పాస్ చేయించేందుకు ర‌క‌ర‌కాల తిప్ప‌లు ప‌డటమే కలిసొచ్చింది.నవ్వించింది.

ఆర్టిస్ట్ ల ఫెరఫార్మెన్స్ :

బాక్సాఫీస్ బాలు పాత్ర‌లో శ్రీవిష్ణు చెలరేగిపోయాడు. ముఖ్యంగా కామెడీ టైమింగ్ ఫెరఫెక్ట్ గా కుదిరింది. అలాగే శ్రీవిష్ణు తర్వాత ఎక్కువ సీన్స్ ఉన్నవి న‌రేష్ కే. ఆయన కెరీర్‌లో ఉమా మ‌హేశ్వ‌ర‌రావు పాత్ర ఎంతో ప్ర‌త్యేకంగా గుర్తుండిపోయేలా చేసారు. స‌ర‌యు గా రెబా మోనికా అందంగా ఉంది. శ్రీకాంత్ అయ్యంగార్‌, సుద‌ర్శ‌న్‌, వెన్నెల కిషోర్‌, ర‌ఘుబాబు  ఇలా ప్ర‌తి ఒక్క‌రూ తెర‌పై క‌నిపించినంత సేపూ నవ్విస్తూనే ఉన్నారు.

టెక్నికల్ గా :

కథలో చాలా లేయ‌ర్లు అల్లుకున్నా అన్నిటికీ సరైన న్యాయం చేయటం కలిసొచ్చింది. ప్రొడ‌క్ష‌న్ వాల్యూస్ బాగున్నాయి. నిర్మాత‌లు అవసరమైన మేరకు ఎక్క‌డా వెనుకంజ వేయ‌లేదు.గోపీసుంద‌ర్ అందించిన పాటల్లో గొప్పవి లేవు కానీ చూస్తున్నంతసేపు ఓకే అనిపిస్తాయి. తెర‌పై అనుభ‌వ‌జ్ఞులైన ఆర్టిస్ట్ లు క‌నిపించ‌డం వ‌ల్ల‌… చాలా మామూలు సీన్లు కూడా పండాయి. కామెడీ సీన్స్ అయితే నెక్ట్స్ లెవిల్ కు వెళ్లిపోయాయి. అక్క‌డ‌క్క‌డ కొన్ని లైట‌ర్ వే మూమెంట్స్  ఎమోష‌న్స్‌  ఫ్యామిలీ ఆడియ‌న్స్‌కి కనెక్ట్ అవుతాయి. ఈమ‌ధ్య కుటుంబ స‌మేతంగా చూసేలా సినిమాలు రావ‌డం లేదు. ఈ త‌రుణంలో  సామజవరగమన చత్రం కాస్త ఊర‌ట నిస్తుంది. నందు స‌విరిగాన డైలాగులు బాగున్నాయి. రామ్ రెడ్డి కెమెరా వర్క్ డీసెంట్‌గా ఉంది.ఫ్యామిలీ ఆడియ‌న్స్‌, వాళ్ల అభిరుచులే ఇలాంటి చిత్రాలకి శ్రీ‌రామ ర‌క్ష‌.

చూడచ్చా :

ఈ వీకెండ్ ఖచ్చితంగా మంచి కాలక్షేపం ఫ్యామిలీస్ తో వెళ్లి రావచ్చు

నటీనటులు:

శ్రీవిష్ణు, రెబా మోనికా జాన్, నరేష్, సుదర్శన్, శ్రీకాంత్ అయ్యంగార్, వెన్నెల కిశోర్, రాజీవ్ కనకాల, రఘు బాబు, దేవి ప్రసాద్, ప్రియా తదితరులు

సాంకేతికవర్గం :

కథ: భాను భోగవరపు
మాటలు: నందు సవిరిగాన
సంగీతం: గోపీ సుందర్
ఛాయాగ్రహణం: రామ్ రెడ్డి
దర్శకత్వం: రామ్ అబ్బరాజు
సమర్పణ: అనిల్ సుంకర
నిర్మాత: రాజేష్ దండ
రన్ టైమ్ : 124 మినిట్స్
విడుదల తేదీ: జూన్ 29, 2023