సెన్సార్ లో నెరవేరిన కల మూవీ

Published On: January 25, 2024   |   Posted By:

సెన్సార్ లో నెరవేరిన కల మూవీ

రఫీ, కుసుమాంజలి, షఫీ, నాగినీడు, సుజాత రెడ్డి, వైభవ్, టి.ఎస్.రాజు ముఖ్య తారాగణంగా రూపొందిన చిత్రం నెరవేరిన కల. జాస్మిన్ ఆర్ట్స్ బ్యానర్ పై సయ్యద్ రఫీ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర పనులన్నీ పూర్తి చేసుకొని సెన్సార్ లో ఉంది. ఈ సందర్బంగా దర్శకుడు సయ్యద్ రఫీ చిత్ర విశేషాలను వివరిస్తూ.. తెలంగాణ ప్రాంతంలోని మారుమూల పల్లెల్లో మూడు తరాలనుండి ఎన్నో పోరాటాలు, బలిదానాలు చేసినా నెరవేరని కల ఇప్పుడు ఎలా నెరవేరిందో కళ్లకు కట్టినట్టు చూపే ఇతివృత్తమే ఈ చిత్ర కథాంశం. తరతరాల ఫ్యూడలిజం అంతమొందించే క్రమంలో జరిగిన పరిణామాలు ఎలాంటివి.. వాటిని ప్రజలు ఎలా ఎదుర్కొన్నారు అనే సన్నివేశాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని..ఆలోచింపజేస్తాయి. సినిమాలో ప్రతీ ఫ్రేమ్ లో వచ్చే సన్నివేశాలు ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతాయి. ఓ పత్రికలో నేను రాసిన కథనానికి స్పందించిన ఒక తండా వాసులు తమ గ్రామంలో చాలా కాలంగా నలిగి.. మరుగున పడిన ఓ జఠిలమైన సమస్యను నా దృష్టికి తీసుకొచ్చారు. ఎన్నో సార్లు ఈ సమస్యను పాలకుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయిందని నిరాశ చెందారు. ఆ తండా వాసుల ఆవేదన.. వారి సమస్య నన్ను బాగా కదిలించింది. ఆలోచింపజేసింది. అలాంటి సమస్యకు తెరరూపమే ఈ నెరవేరిన కల చిత్రం. షూటింగ్ తెలంగాణ రాక ముందు.. వచ్చాక జరిగింది. ఫలితంగా నటీనటులు.. వారి హావ భావాలు కట్టూ..బోట్టూ.. తెలంగాణ యాస..బాస అన్నీ సహజంగానే కనిపిస్తాయి, ఆనాటి..ఈనాటి జీవనవిధానం తెరమీద కళ్లకు కట్టినట్టు కనపడుతుంది. సామాజిక, రాజకీయ అంశాలను స్పృశిస్తూనే.. మానవసంబంధాలతో సమాజ మార్పు కోసం చేసే ప్రయత్నమిది. సామాజిక రాజకీయంలో వంద శాతం గొప్ప మార్పునకు పునాది వేయాలన్నదే మా లక్ష్యం. ప్రజలను చైతన్య పరుస్తూనే.. ప్రస్తుత రాజకీయాలకు దిశా నిర్ధేశం చేస్తూ రాజకీయ వ్యవస్థపై ఎక్కుపెట్టిన బాణం ఈ చిత్రం. ప్రజల్లో పోరాటపటిమ.. ప్రశ్నించే విధానం ఈ రెండింటినీ కలగలిపిన వైనం ఈ సినిమాలో ని సన్నివేశాలు మనకు కనిపిస్తాయి. నిర్మాణానంతర పనులన్నీ పూర్తి చేసుకొన్న ఈ చిత్రం ప్రస్తుతం సెన్సార్ లో ఉంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నా అని వివరించారు.

తారాగణం

రఫీ, కుసుమాంజలి, షఫీ, నాగినీడు, సుజాత రెడ్డి, వైభవ్, టి.ఎస్.రాజు

సాంకేతిక వర్గం :

సినిమాటోగ్రఫీ: వెంకట్అమర్
ఎడిటింగ్ : సెల్వకుమార్.టి
సంగీతం : రఫీ