హే సినామిక మూవీ రివ్యూ

Published On: March 3, 2022   |   Posted By:

హే సినామిక మూవీ రివ్యూ

దుల్కర్ సల్మాన్ ‘హే సినామికా’ రివ్యూ

👎

రొమాంటిక్  డ్రామాలు తెలుగు తెరకు మంచి క‌మ‌ర్షియ‌ల్ పాయింట్లు. ముఖ్యంగా యూత్ ని ఈజీగా టార్గెట్ చేయటంలో వీటిని మించిన ఆయుధాలు లేవు. అందులోనూ యూత్ లోకి వెళ్లిపోయిన దుల్కర్ వంటి ఆర్టిస్ట్ ఉంటే.. క‌చ్చితంగా అది సక్సెస్ ఫుల్ జర్నీ అనిపిస్తుంది.  దాంతో  ఎవ‌రైనా క‌నెక్ట్ అయిపోతారు. అక్కడే నిర్మాత కూడా ఓకే చెప్పేసినట్లున్నాడు. అయితే ఇప్పుడున్న ఈ జనరేషన్ కు ఇలాంటి క‌థ‌ల్ని మెప్పించ‌డం ఆషామాషీ వ్య‌వ‌హారం కాదు. ఏ రొమాంటిక్ డ్రామా క‌థైనా ఒకేలా ఉంటుంది. ఆ గ్రాఫ్‌లో పెద్ద‌గా మార్పు ఉండ‌దు. అలాంటప్పుడు ప్ర‌తీ క‌థ‌నీ కొత్త‌గా చూపించ‌డం కత్తిమీద సామే. తలకు చుట్టుకునే పామే.  అందుకే రొమాంటిక్ డ్రామాలు అయితే సూప‌ర్ హిట్ అవుతాయి, లేదంటే ఎటూ కాకుండా  డిజాస్టర్ అయ్యిపోతాయి. ఇప్పుడు అలాంటి మ‌రో క‌థ వ‌చ్చింది. అదే  ఈ ‘హే సినామికా’ .  ఈ సినిమా టైటిల్ కు తగ్గట్లు రొమాంటిక్ గా ఉందా లేక ట్రైలర్ లా డల్ గా ఉందా..సినిమా ఎలా ఉందో చూద్దాం.Storyline:

అనగనగా ఓ జంట  ఆర్యన్ (దుల్కర్ సల్మాన్),మౌన (అదితిరావు). ప్రేమించి పెళ్లి చేసుకున్న వీళ్లకు రెండేళ్లకు మోజు తీరి మామూలు ప్రపంచంలో పడతారు. ఆర్యలో ఉన్న లోపాలు కనపడటం మొదలవుతాయి. ఆర్యన్ కాస్తంత క్రేజీ పర్శన్. తన భార్య అంటే పొసిసివ్ గా ప్రేమను ప్రదర్శిస్తూంటాడు. అతిగా బిహేవ్ చేస్తూ..వాగుతూంటాడు. అది తట్టుకోలేక మౌన విడాకులు తీసుకుందామనుకుంటుంది. అందుకు ఇలాంటి విడాకులను ఇప్పించటంలో రికార్డ్ లు క్రియేట్ చేసిన సైక్రాటిస్ట్ మలర్ (కాజల్)ని కలుస్తుంది. తన భర్తని ప్రేమలో పడేస్తే చాలు …ఆ వంక చూపెట్టి విడాకులు తీసుకుంటాను అని రిక్వెస్ట్ చేస్తుంది. సరే అని మలర్ రంగంలోకి దూసుకుంది. ఆర్యతో ప్రేమ నటించే ప్రాసెస్ లో తనే ప్రేమలో పడిపోతుంది. ఈ విషయం మౌనకు ఎలా తెలుస్తుంది. ఆర్య పరిస్దితి ఏమిటి…చివరకు ఏమైంది విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Screenplay Analysis:

ఈ సినిమా చూస్తూంటే మనకు ఆ రోజుల్లో వచ్చిన సినిమాలు వెంటనే గుర్తు వస్తాయి. ఇద్దరు పెళ్లాలు లేదా లవర్స్ మధ్య ఇరుక్కుపోయిన కథలే మన కళ్ల ముందు మొదులుతాయి. అయితే రోజులు మారాయనే విషయం గుర్తుకు వస్తుంది. దాంతో  ఈ సినిమా ఇప్పుడు మళ్లీ తీసారేంటి అప్పట్లో తీసిన ఏదన్నా సినిమా రీమేక్ అని కాసేపు డౌట్ వస్తుంది. ఇక మణిరత్నం ఓకే బంగారం చిత్రం పాట నుంచి తీసుకున్న ఈ టైటిల్ వినటానికి రొమాంటిక్ గానే ఉంది కానీ ..చూడ్డానికి లేదు. దుల్కర్  మెయిన్ లీడ్ కావ‌డం, ఇదో రొమాంటిక్  డ్రామా అవ్వ‌డంతో… అంద‌రి దృష్టీ ఈ సినిమాపై ప‌డింది. దానికి తోడు  సక్సెస్ పుల్  కొరియోగ్రాఫర్ బృందా మాస్టర్ దర్శకురాలిగా మారారు. అలాగే  ‘బాహుబలి’లో కిలికిలి భాష సృష్టికర్త మదన్ కార్కి కథ అందించారు. అంటే అబ్బో ఇందులో చాలా మేటర్ ఉందే అనిపిస్తుంది. కానీ సినిమా చూసాక…ఇదేంటిరా ఈ సినిమా ఇలా ఉంది అనిపిస్తుంది.

కెరీర్ లో ఎందరో స్టార్స్ తో పనిచేసిన బృంద మాస్టర్ అనుభవం,టాలెంట్ … డైరక్టర్ గా మారేసరికి ఇలా బలహీన పడిపోతుందని ఊహించలేం. తను ఎంచుకున్న కథ చాలా పాతిక,ముప్పై ఏళ్ల క్రితం నాటిదని ఆమె గ్రహించలేకపోయారు. ఇద్దరి హీరోయిన్స్ మధ్య నలిగిపోయే కథలు చాలా తెరపై నలిగిపోయాయి. స్టార్ కాస్టింగ్ కు స్టార్స్ ని తెచ్చుకోగలిగిన ఆమె స్టార్ రైటర్స్ ని స్క్రీన్ ప్లే రాయించుకోలేకపోయారు. సినిమాని కథే నిలబెడుతుందని అనుకోలేకపోయారు. అతి పురాతనమైన కథకు అత్యంత పురాతనమైన స్క్రీన్ ప్లే అద్దారు.

ప్రధాన పాత్రలో దుల్కర్  క‌నిపించగానే ఓ ఆస‌క్తి ఏర్ప‌డుతుంది. ఇక ఈ సినిమాకి ప‌ని చేసిన స్టార్ కాస్ట్‌, సాంకేతిక నిపుణ‌లు మామూలు  వాళ్లు కాదు. వాళ్లందరినీ చూసాక సినిమాకి వెళ్లాల‌నిపిస్తుంది. ఆడియ‌న్స్ ని థియేట‌ర్ వ‌రకూ తీసుకొచ్చే సత్తా ఉన్న సినిమా ఇది. కానీ కంటెంట్ ఈ స్టార్స్ ని మోయలేకపోయింది. థియోటర్ కు దుల్కర్ ని నమ్మి వ‌చ్చిన‌వాళ్లని కుర్చీల‌కు అతుక్కుని పోయేలా చేయ‌లేకపోయారు. ఈ విష‌యంలో మొహమాటం లేకుండా హే సినామికా  ఫెయిల్ అయ్యింది. క‌థ చాలా సాదా సీదాగా, నీర‌సంగా మొద‌ల‌వుతుంది. సర్లే ప్రారంభంలో ఇలా ఉందేమో..తర్వాత  తుఫానులా విరుచుకుపడుతుందేమో అనుకుంటాం..బృందా మాస్టర్ తన తొలి సినిమాతో ఏదైనా అద్భుతాలు సృష్టిస్తారేమో అని ప్రేక్ష‌కులు ఎదురు చూస్తుంటారు. కానీ.. శుభం కార్డు ప‌డేంత వ‌ర‌కూ అలాంటివేం జ‌ర‌గ‌కపోవటమే ఈ సినిమా స్పెషాలిటీ.

Analysis of its technical content

క్యారక్టర్స్,   వాటి ప్ర‌వ‌ర్త‌న‌, వాటిని తీర్చిదిద్దిన విధానం.. ఇవ‌న్నీ ఎనభైల నాటి రొమాంటిక్ కామెడీల ఫార్ములాలా అనిపిస్తే అది ప్రేక్ష‌కుల త‌ప్పు కాదు. దుల్కర్, కాజల్  పాత్ర‌ల్ని డిజైన్ చేసిన విధానం చూస్తుంటే బృంద మాస్టర్ ఏకాలంలో ఉన్నారా  అనిపిస్తుంది. ఇలాంటి కథలకు అవసరమైన  ప్రధాన  పాత్ర‌ల మ‌ధ్య కెమిస్ట్రీ అనేది బొత్తిగా లేదు. దుల్కర్  పాత్ర‌ని కాజల్ ఇష్ట‌ప‌డుతున్న‌ట్టు చూపించ‌డం, అదితిరావు దూరం అవ్వటం ఇవి మ‌రీ మెలోడ్రామాగా అనిపిస్తాయి. కథలో  రాను రాను క్యారక్టర్స్ బ‌ల ప‌డాలి. తమ ఆలోచనలను వ్యక్త పరచాలి..పరిస్దితులకు ఎదురుతిరగాలి కానీ.. ఈ సినిమాలో మాత్రం రివ‌ర్స్. సినిమా న‌డుస్తున్న కొద్దీ క్యారక్టరైజేషన్స్ దెబ్బ‌తింటాయి. డైరక్టర్ నడిపినట్లు ఎటు కావాలంటే అటు న‌డిచిపోతుంటాయి. ఈ విషయంలో దర్శకురాలిదే తప్పు. లవ్ స్టోరీలకు కెమెరా వర్క్, మ్యూజిక్ బాగుండుంది. అవి రెండు సోసోగా ఉన్నాయి. . ఈ సినిమాని షార్ప్ గా ఎడిట్ చేసి, రెండు గంట‌ల‌కు పరిమితం చేసి,బోర్ కొట్టే సీన్ల‌నీ లేపేసి ఉన్న‌ట్లైతే, క‌చ్చితంగా ఇంతకన్నా బెటర్ సినిమా చూసేవాళ్లం.

నటీనటులు చూస్తే…

దుల్కర్ పాత్ర‌ కొత్తగా ఉంది. ఆ పాత్ర కోసం ద‌ర్శ‌కుడు కొంచెం స్ట‌డీ చేశారు… బాగా డిజైన్ చేశాడు. దాంతో దుల్కర్ బాగానే చేసారనిపిస్తుంది. కానీ ఆ శ్ర‌ద్ధ మిగిలిన పాత్ర‌ల‌పై పెట్ట‌లేదు. ఈ క‌థ‌లో అత్యంత కీల‌క‌మైన కాజల్ పాత్ర‌నీ ఏదో అన్నట్లు ఫార్ములాగా న‌డిపించేశాడు.  దాంతో మిగతా పాత్రలు తేలిపోయాయి.

చూడచ్చా..
దుల్కర్ వీరాభిమాని అయితే తప్పించి ఈ సినిమాని చూడటం కష్టమే.

తెర వెనక..ముందు

నటీనటులు: దుల్కర్ సల్మాన్, కాజల్ అగర్వాల్, అదితి రావు హైదరి తదితరులు
సినిమాటోగ్రఫీ: ప్రీత జయరామన్
సంగీతం: గోవింద్ వసంత
నిర్మాణ సంస్థలు: జియో స్టూడియోస్, గ్లోబల్ వన్ స్టూడియోస్, వయాకామ్ 18 స్టూడియోస్
దర్శకత్వం: బృందా మాస్టర్
రన్ టైమ్: 2h 29m
విడుదల తేదీ: మార్చి 3, 2022