పెద్దన్న మూవీ రివ్యూ

Published On: November 5, 2021   |   Posted By:

పెద్దన్న మూవీ రివ్యూ

రజనీకాంత్‌ ‘పెద్దన్న’ మూవీ రివ్యూ

Emotional Engagement Emoji (EEE) :  

 
👎
 
రజనీకాంత్ క‌థ‌ల్లో కొత్త పాయింట్ ఎవ‌రూ వెద‌కరు. బ‌హుశా రజనీకూడా… కొత్త‌గా ఏం చెబుదాం? అని ఆలోచించ‌డేమో…? ఉన్న ఆ క‌థ‌లోనే కాస్త మాసూ, కాస్త రొమాన్సూ… ఇంకాస్త వ‌యిలెన్సూ, మ‌రి చివ‌రాఖ‌రుకు కాస్త ఎక్స‌లెన్సూ మిక్స్ చేసిన ఇంట్రవెల్,క్లైమాక్స్  అందిస్తాడు. ఇవన్ని సరిగ్గా కుదిరితే…. సినిమా బ్లాక్ బ‌స్ట‌రు. లేదంటే అట్ట‌ర్ ఫ్లాప్‌. రజనీ సినిమాల్లో గత కొన్నేళ్లుగా ఇవి రెండే క‌నిపిస్తున్నాయి. మొదట్లో రజనీ నడిచిన దారి వేరు. గత కొన్నేళ్లుగా రజనీ చేస్తున్న సినిమా మాత్రం అదే. కాక‌పోతే.. కొన్నాళ్లుగా ఫామ్ లో లేడు. ఈ క్రమంలో మరోసారి మాస్‌, మ‌సాలా హంగామానే నమ్మకుని రజనీ మన ముందుకొచ్చాడు. లాజిక్కుల్ని రెండు గంట‌లు మ‌ర్చిపోయేలా చేయ‌గ‌ల‌గ‌డ‌మే… రజనీ విజ‌య ర‌హ‌స్యం అని చెప్దామనుకున్నాడు.  .ఈ సారి ఆ గేమ్ వర్కవుట్ అయ్యిందా… పే చేసిందా? ట్రైలర్,టీజర్ తో  ఈ సినిమాకి చేసిన ప్ర‌మోష‌న్‌, ఇచ్చిన హైప్‌… ఈ సినిమాని నిల‌బెడుతుందా?
 

స్టోరీ లైన్

రాజోలుకు చెందిన వీరన్న(రజనీకాంత్‌)కు చెల్లి కనకమహాలక్ష్మీ అలియాస్‌ కనకమ్‌(కీర్తి సురేశ్‌) బలహీనత,బలం. చిన్నప్పుడే తల్లి చనిపోవడంతో చెల్లిని గారాబంగా పెంచాడు. ఆమె కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా, తీయడానికైనా వెనకాడడు. ఆమెను అంత అపూరంగా పెంచుకుని, అద్బుతంగా పెళ్లి చేయాలనుకుని ఓ సంభందం చూస్తాడు. కానీ ఆమె మాత్రం ఆ పెళ్లి సంబంధం కాదని..  కలకత్తాకు తను ప్రేమించిన వాడితో పారిపోతుంది. అయితే కలకత్తాలో ఆమెకు అనుకున్న జీవితం లభించదు. ఆమెకు అక్కడ రకరకాల సమస్యలు ఎదురవుతాయి. ఇవి వీరన్న కు తెలుస్తాయి. మరికొద్ది గంటల్లో పెళ్లి ఉండగా తన పరువు తీసి చెల్లి పారిపోయినా ఆమెపై కోపం పెట్టుకోడు. చెల్లికి వచ్చిన సమస్యలను తీర్చటానికి కలకత్తా బయిలుదేరతాడు? ఆ క్రమంలో అనేక సమస్యలు,సవాళ్లు ఎదుర్కొంటాడు. అవేమిటి..చివరకు చెల్లిని ఆ సమస్యల నుంచి బయిటపడేసాడా… ఈ అన్నా చెల్లెళ్లు ఎలా కలిశారు అనేదే ‘పెద్దన్న’కథ.

ఎనాలసిస్ …

కెరీర్ మొదటి నుంచీ దర్శకుడు శివ కు ఓ నమ్మకం. సరైన పాటలు, డైలాగులు, ఫైట్లు పడితే చాలు మాస్ జనాలు సినిమాకు ఎగబడి చూస్తారని. పైసా వసూల్ కు ఆ మాత్రం చాలని. ఆ నమ్మకాన్ని శౌర్యం, విశ్వాసం,వీరమ్,వేదాలం ప్రూవ్ చేసాయి. అందుకే కథ గురించి పెద్దగా పట్టించుకోరు. సీన్లు రిపీట్ అయినా ఏమీ లెక్క చెయ్యరు. పెద్దన్న అచ్చంగా ఇలాంటి సినిమానే. సినిమా కథ కొత్తదేమీ కాదు. గతంలో చూసిన అనేకానేక  సినిమాలు మిక్సీలో వేసి రుబ్బేసిన కథనే. అలా అని కథనం కూడా కొత్తదేం కాదు. రజనీ పాత సినిమాలు గుర్తుకు తెచ్చే సీన్లు అనేకం వున్నాయి. ఇంటర్వెల్ కు  ముందు వచ్చే ఫైట్ సీన్ అయితే అనేక సినిమాను గుర్తుకు తెస్తుంది. అయినా సరే రజనీకాంత్ కు నమ్మకం ఏమిటి అంటే అతను అంత పాత కథలతో వరసపెట్టి సక్సెస్ ఇస్తున్నాడు అని. కానీ ఈ సారి ఎవరి నమ్మకం వర్కవుట్ కాలేదు. సెంటిమెంట్ సీన్స్ బోర్ కొట్టేసాయి. మెలోడ్రామా గా మారి విసిగించేసాయి. ఫస్టాఫ్ ఏదో నడిచిపోయింది ,ఇక ఇంటర్వెల్ నుంచి అసలు కథ మొదలైపోతుంది అనుకుంటే..అలాంటివేమీ పెట్టుకోలేదని సెకండాఫ్ లో అర్దమవుతుంది.

దానికి తోడు ద్వితీయార్థం లో  రిపీట్ సీన్ల సమస్య మరీ ఎక్కువ. పైగా కథ కూడా అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది.సెకండాఫ్ కన్నా ఫస్టాఫే బాగుంది అనే ఫీల్ కలుగుతుంది. రెండో సగంలో కూడా కథ ఎక్కువగా లేకపోవడంతో వీలయినంత వరకు పాటలు, ఫైట్లు,యాక్షన్  తో నడిపి, క్లయిమాక్స్ కు తీసుకువచ్చారు. క్లయిమాక్స్ పండకపోవటంతో సినిమా పాస్ మార్కులు కూడా వేయించుకోలేకపోయింది. ఇదంతా క్రిటికల్ యాంగిల్ అనుకుని ఫ్యాన్ యాంగిల్ లో చూసినా  ఏముంది సినిమాలో  అంతా కలగూరగంప అనిపిస్తుంది. కానీ మాస్ ఆడియన్ యాంగిల్ లో రజనీ మార్కు డైలాగులు, రజనీ మార్కు ఓల్డ్ ఫన్, బిల్డప్ లు. సినిమాను రెండు గంటల పాటు చూసి ఎంజాయ్ చేసేయడానికి ఈ మాత్రం చాలు అనుకున్నారేమో. ఫైట్స్ చేసేస్తే  మాస్ కు పడుతుందని భావించేరేమో..అదీ కష్టమే అనిపిస్తుంది. ఏదైమైనా సింగిల్ లేయ‌ర్ క‌థ‌లెప్పుడూ ప్ర‌మాద‌మే. చెప్ప‌ద‌ల‌చుకున్న పాయింట్ బ‌ల‌హీనంగా ఉంటే, క‌థ ముందే తేలిపోతుంది. ఈ సినిమాకీ అదే ఎదురైంది. ప్ర‌తీ సీనూ… ఐదారునిమిషాల పాటు సుదీర్ఘంగా సాగుతుంటుంది. ఆ స‌న్నివేశాల‌కు భారీ భారీ డైలాగులు రాసేసి మనమీదకు వదిలేసారు.

టెక్నికల్ గా…

రజనీ సినిమాల్లో సాంకేతిక నిపుణుల ప‌నిత‌నం బాగా క‌నిపిస్తుంది. అందులోనూ దర్శకుడు శివ స్వతహాగా కెమెరామెన్ కావటంతో మరికాస్త ఎక్కువే ఉంది. అయితే వాళ్లెవరూ మనస్సు పెట్టి చేయలేదనిపిస్తుంది. ఇమ్మాన్ పాట‌ల్లో ఏవీ ఆక‌ట్టుకోలేదు. రీరికార్డింగ్ మాత్రం థియేట‌ర్ బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర‌వాత కూడా వెంటాడుతుంది. రజనీ ఎంట్రీ మాత్రం మాంచి జోష్ తో సాగుతుంది. ఈ సినిమాకి ప్ర‌ధాన‌బ‌లం.. రజనీ ఎనర్జీ.  సీన్ ఎలా ఉన్నా తను మాత్రం డ్రాప్ కాలేదు. ఈ వయస్సులోనూ ప్ర‌తీ సీన్ పేలే ప్రయత్నం చేసాడు. కాకపోతే ఆయన వల్ల కాలేదు. కలకత్తా నేప‌థ్యంలో స‌న్నివేశాల్ని చాలా క‌ల‌ర్‌ఫుల్ గా, జాయ్ ఫుల్ గా తెర‌కెక్కించాడు కెమెరామెన్‌. శివ తనే రాసిన క‌థ‌నీ, పాత్ర‌ల్ని.. తెర‌పై వీలైనంత మాసీగా చూపించే ప్ర‌య‌త్నం చేశాడు. పైన చెప్పిన‌ట్టు… లాజిక్కులు లేని సినిమా ఇది. నయనతార ఏదో ఉందంటే ఉంది లేదంటే లేదు. మీనా,కుష్బూలు ఎందుకు చేసారో వాళ్లకే తెలియాలి. జగపతిబాబు, అభిమన్యుసింగ్ అయితే విలన్స్ గా పాపం అనిపిస్తారు. ప్రొడక్షన్ వాల్యూస్ సూపర్బ్. కెమెరా వర్క్ కాకపుట్టిస్తుంది. ఎడిటింగ్ ఇంకాస్త లెంగ్త్ తగ్గిస్తే బాగుండును అనిపిస్తుంది. తెలుగు డబ్బింగ్ బాగుంది. కీర్తి సురేష్ చెల్లిగా బాగా చేసింది కానీ చెల్లిగా చూడలేము.

చూడచ్చా

రజనీ గ‌త సినిమాలు, అందులోని ఆయన క్యారక్టరైజేషన్, జీవితంపై ఉన్న ఫిలాస‌ఫీ.. ఇవ‌న్నీ మీకు బాగా న‌చ్చి, వాటిని మ‌రోసారి చూడాల‌నుకుంటే `పెద్దన్న` చూడొచ్చు. కొన్ని స‌న్నివేశాలు ఫ్యాన్స్ కి న‌చ్చేలా తీసారు. వాళ్లే ఈ సినిమాకి శ్రీ‌రామ‌ర‌క్ష‌. కానీ ఈ సారి వాళ్లూ హ్యాండ్ ఇచ్చేలా కనపడుతున్నారు.
 
 తెర ముందు వెనక..
సంస్థ‌: స‌న్ పిక్చ‌ర్స్‌,
న‌టీన‌టులు: ర‌జ‌నీకాంత్‌, కీర్తిసురేష్‌, న‌య‌న‌తార‌, మీనా, ఖుష్బూ, జ‌గ‌ప‌తిబాబు, ప్ర‌కాష్‌రాజ్ త‌దిత‌రులు;
 ఛాయాగ్ర‌హ‌ణం: వెట్రి,
సంగీతం: ఇమ్మాన్,
 కూర్పు: రూబెన్,
నిర్మాణం: క‌ళానిధి మార‌న్‌,
ద‌ర్శ‌క‌త్వం: శివ;
విడుద‌ల‌: డి.సురేష్‌బాబు, నారాయ‌ణ్‌దాస్ నారంగ్‌, దిల్‌రాజు;
విడుద‌ల తేదీ: 4-11-2021
రన్ టైమ్: 2 గంటల 43 నిముషాలు