F3 మూవీ రివ్యూ

Published On: May 27, 2022   |   Posted By:

F3 మూవీ రివ్యూ

F3: వెంకీ, వరుణ్‌ల ‘ఎఫ్‌3’ రివ్యూ

Emotional Engagement Emoji (EEE)

👍

లోకంలో పంచ‌భూతాలతో పాటు మరో భూతం ఉంది.. అదే డ‌బ్బు అనే కోణంలో ఈ సారి ఎఫ్ 3 రెడీ చేసారు. సీక్వెల్స్ కు ఎక్సపెక్టేషన్స్ అనే గండం ఉంటుంది. దాన్ని దాటటానికి శతవిధాలా ప్రయత్నం చేస్తూంటారు దర్శక,నిర్మాతలు. చాలా సార్లు దొరికిపోతూంటారు. అయితే ఈ సీక్వెల్ కు ఓ ప్లస్ ఉంది. అదే ఫన్. అది పండితే సీక్వెల్, ప్రీక్వెల్ అని పట్టించుకోకుండా టైమ్ సరదాగా కిల్ చేసుకోవటానికి జనం థియోటర్స్ కు వెళ్తూంటారు. ఫ్యామిలీలతో కలిసి చూసి సినిమాని నిలబెడతారు. అదే దర్శక,నిర్మాతల నమ్మకం. ఎఫ్ 3కు ఆ నమ్మకం నిజమైందా… ఎఫ్ 2 మాదిరిగానే అనిల్ రావిపూడి తన డిఫరెంట్ క్యారెక్టర్స్ తో అండ్ క్యారెక్టరైజేషన్స్ తో నవ్వించాడా?. క్వాలిటీ ఫన్ ఉందా లేక జోక్స్ తో కాలక్షేపం చేసేసాడా?. సినిమా కథ, హైలెట్స్ ఏమిటి.. వెంకీ -వరుణ్ ల లోపాలతో ఫన్ ఏ విధంగా ఎలివేట్ చేశాడు వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

Story line:

అప్పులు పాలైపోయిన వెంకీ (వెంకటేష్) కొత్త అప్పులు వెతుక్కుంటూ…అందుకు తగ్గ ప్లాన్స్ రెడీ చేసుకుంటూంటాడు. వరుణ్(వరుణ్ తేజ్) అత్యాశాపరుడు. ఓ పెద్ద డబ్బు ఉన్న అమ్మాయిని పడేసి సెటిల్ అయ్యిపోదామనుకుంటాడు. అందుకోసం మెహ్రిన్ ని లైన్ లో పెడతాడు. అయితే ఆమె కూడా డబ్బున్న ఓ ఇంట్లో పనిమనిషి. ఆమె ప్రేమ పొందటం కోసం వెంకీతో కలిసి అప్పులు చేస్తారు. అయితే ఆ తర్వాత అసలు నిజం తెలిసి తాను పూర్తిగా అప్పులు పాలయ్యానని తెలుసుకుంటాడు. ఇద్దరూ అప్పులు బారి నుంచి బయిటపడాలంటే ఏమిటి మార్గం అనుకున్నప్పుడు వారినో ప్రకటన ఆకర్షిస్తుంది. అది ప్రముఖ ఇండస్ట్రిలియస్ట్ ఆనంద్ ప్రసాద్ (మురళి శర్మ) తప్పిపోయిన తన కొడుకు కోసం ఇచ్చిన ప్రకటన. అది చూసి ఎవరికి వారే ఆయన ఇంటికి వెళ్లి ఆయన కొడుకుగా ఉంటూ ఆస్ది కొట్టేద్దామని ట్రై చేస్తారు. అయితే ఆయన తక్కువవాడా…తనదైన శైలిలో టెస్ట్ లు పెడతాడు.వాటిలో పాసవటానికి పోటీ పడతారు. చివరకు ఆయన ఓ బాంబు పేలుస్తాడు. అసలు తనకు కొడుకే లేడని.. మరి ఎందుకు ఆ ప్రకటన ఇచ్చారు. వెంకీ, వరుణ్ ల అప్పులు తీరాయా…చివరకు ఏమైంది వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Screenplay Analysis:

ఈ సినిమా కథ ఇదే అని ఖచ్చితంగా చెప్పలేం…. కానీ సినిమా చూస్తున్నంత సేపు ఫుల్ టూ ఎంటర్ టైన్ మెంట్ గా అనిపించటమే లక్ష్యంగా పెట్టుకున్నారని అర్దమవుతుంది. కామెడీ సినిమాలకు క్యారక్టర్స్,క్యారక్టరైజేషన్స్ ,సిట్యువేషన్స్ మూల స్దంబాలు. కామెడీ సిట్యువేషన్ ఫెరఫెక్ట్ గా సెట్ అయ్యినప్పుడు వాటి నుంచి నాచురల్ గా పుట్టే ఒరిజనల్ డైలాగ్స్, స్పాంటినిటీ గా వచ్చే పంచ్ లు, ఎక్సప్రెషన్స్ స్క్రిప్టుకు జీవం పోస్తాయి. ఇవన్నీ అనీల్ రావిపూడికి తెలుసు అని ఆయన గత సినిమాలు ప్రూవ్ చేసాయి. ఇప్పుడు అదే ట్రై చేసారు. తొంబైల నాటి సినిమాల్లోని పాత్రలను తీసుకుని ఇప్పటి నేటివిటి అద్దే ప్రయత్నం చేసారు. కాసేపు నవ్వించారు. కొద్దిసేపు విసిగించారు. ఫైనల్ గా పైసా వసూల్ అనిపించారు. ఇక ఇలాంటి సినిమాల్లో ఓ సుఖం ఉంటుంది. ఓ ఇబ్బంది ఉంటుంది. పాత్రలకి మోటివ్ వుంటే, భావోద్వేగాలూ వుంటే..ఓ ట్రిక్కీ సిట్యువేషన్ లో పడేస్తే కథ పరుగెడుతుంది. ఆ పాత్రలను ఫాలో చేస్తే కావాల్సినంత ఫన్ దొరుకుతుంది. అప్పుడు ఆర్టిస్ట్ లకు , నటించడానికీ మెప్పించడానికీ అవకాశముంటుంది.ముఖ్యంగా ఇలాంటి కథలకు డ్రమెటిక్ కారణం బలంగా పడాలి. అప్పుడు కథలో పాత్రలకి ఓ బలమైన మోటివ్ ఏర్పడి వుండేది. ఇది అనుకున్న స్దాయిలో జరగలేదు. పాత్రలను లైట్ తీసుకున్నారు. ఈ క్రమంలో బాగానే నవ్వించారు కాదనలేం. కానీ కామెడీ పేరుతో కొన్ని చోట్ల పరిధి దాటి పోయిన పాత్రల చేష్టలు మితిమీరి పోయాయి కూడా. కొన్ని చోట్ల నవ్వించడానికి చేసిన ప్రయత్నం విఫలమైంది.

అలాగే సీక్వెల్ కాబట్టి ఒరిజనల్ లో పాత్రలు కంటిన్యుటీ కలిసి వస్తుంది. అయితే ఈ సారి పాత్రల టార్గెట్ మార్చారు. ఈ కథకు అవసరమైన క్యారక్టర్స్ ని , వాటి క్యారక్టరైజేషన్స్ ని, వాళ్ల నిత్య జీవిత వ్యవహాలను, కాన్సెప్ట్ నీ సెటప్ చేయడానికి కాస్త ఎక్కువ సమయం తీసుకున్నాడు. మెల్లిగా కథలోకి వచ్చారు. మరిన్ని పాత్రలు కలిపి కామెడీ కిచిడి మొదలెట్టారు. డబ్బు సంపాదించలేక…ప్రతీ ఫ్లాన్ ఫెయిల్ అవుతూ, అవసరాలు పెరిగిపోతూ… ఏం చేసినా దొరికిపోయే ప్రమాదంలో పడుతూ సాగే పాత్రలు నవ్వించాయి. డబ్బు కోసం ఇద్దరు ఫ్యామిలీ మ్యాన్స్ పడే ఇబ్బందుల ప‌రిణామ క్ర‌మాన్ని కూడా చాలా బాగా చూపించాడు. అయితే ఫస్టాఫ్ ఉన్నంత బాగా సెకండాఫ్ లేదు..,ఫన్ జనరేట్ కాలేదు. కాకపోతే కొన్ని ప్యారడీలతో నెట్టుకొచ్చే ప్రయత్నం చేసారు.

Analysis of its technical content:

స్క్రిప్టు పరంగా చూస్తే కాసేపు నవ్వించి చివర్లో డబ్బు గురించి కొంత మెసేజ్ ఇవ్వడానికి ప్రయత్నించాడు. జోక్స్ తో ప్రేక్షకులను ఆక‌ట్టుకునే ప్రయత్నం చేసాడు. సాయిశ్రీరామ్ సినిమాటోగ్రఫీ జస్ట్ అనిపించుకుంది. మరియు దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం గొప్పగా లేదు కానీ ఓకే. ఎడిటింగ్, ఆర్ట్ డిపార్టమెంట్ వంటి మిగిలిన విభాగాలు సినిమా అవసరాలకు అనుగుణంగా బాగానే కుదిరాయి.

నటీనటుల్లో …

వెంకటేష్, వరుణ్ తేజ్ కామెడీ ప్రేక్షకులను అలరిస్తుంది. రేచీకటితో బాధపడుతున్న వ్యక్తిగా వెంకటేష్.. నత్తితో వరుణ్ తేజ్ ఫన్ ను జనరేట్ చేశారు. ఈ మూవీలో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ హైలైట్ గా ఉంటుంది. గత చిత్రంలోని లేని కొత్త పాత్రల్లో సునీల్, సోనాల్ చౌహాన్, అలీ, మురళీ శర్మ, పూజా హెగ్డే తదితరులు నటించారు.

ప్లస్ లు, మైనస్ లు :

ఈ సినిమాకు వెంకటేష్, వరుణ్ తేజ్, సునీల్, ఆలీ కామెడీ టైమింగ్ లు ప్లస్ గా నిలిచాయని చెప్పాలి. వరస జోక్స్, ఫన్ డైలాగుతో సినిమాని నెట్టుకొచ్చే ప్రయత్నం చేసారు. బ్యాక్ టూ బ్యాక్ వచ్చే కామెడీ అక్కడక్కడా బోర్ కొట్టకుండా చేసినా ,ఫరవాలేదనిపిస్తుంది. అయితే సెకండాఫ్ లో కొన్ని స‌న్నివేశాలు సాగ‌దీత‌గా ఉండ‌టం విసిగిస్తుంది. అదేవిధంగా సినిమాకు సరైన కథ అంటూ లేదు. ఒకటి రెండు పాటలు మినహా మిగ‌తా పాటలు ఓకే అనిపించారు.

CONCLUSION:
ఫన్ కోసం ఓ సారి చూడచ్చు. లాజిక్ లు వెతికితే మాత్రం చూడటం కష్టమనిపిస్తుంది.

Movie Cast & Crew

బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
తారాగణం: వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా భాటియా, మెహ్రీన్ పిర్జాదా, రాజేంద్ర ప్రసాద్, సునీల్, సోనాల్ చౌహాన్ తదితరులు.
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
DOP: సాయి శ్రీరామ్
కళ: ఏఎస్ ప్రకాష్
ఎడిటింగ్: తమ్మిరాజు
స్క్రిప్ట్ కోఆర్డినేటర్: ఎస్ కృష్ణ
అదనపు స్క్రీన్ ప్లే: ఆది నారాయణ, నారా ప్రవీణ్
సమర్పకుడు: దిల్ రాజు
సహ నిర్మాత: హర్షిత్ రెడ్డి
నిర్మాత: శిరీష్
దర్శకుడు: అనిల్ రావిపూడి
రన్ టైమ్: 2h 28m
విడుదల తేదీ: 27 మే, 2022.