అమీర్ లోగ్ చిత్రం నటి వేధా జలంధర్ మీడియా సమావేశం
‘అమీర్ లోగ్’ సినిమాలోని ప్రతీ కారెక్టర్‌కి ప్రాముఖ్యత ఉంటుంది - నటి వేధా జలంధర్
అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మాధవి రెడ్డి సోమ నిర్మించిన తొలి చిత్రం ‘అమీర్ లోగ్’. ఈ మూవీకి రమణా రెడ్డి సోమ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి మనోహర్ రెడ్డి మంచురి సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రంలో MC హరి, మనోజ్, శశిధర్ ప్రధాన పాత్రల్లో నటించగా.. వేధా జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయోగి కీలక పాత్రలు పోషించారు. రానా దగ్గుబాటి సంస్థ 'స్పిరిట్ మీడియా' ఈ మూవీని తెలుగులో ఆగస్ట్ 21న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోంది.
ఈ క్రమంలో ప్రమోషన్స్‌లో భాగంగా నటి వేధా జలంధర్ చిత్ర విశేషాల్ని పంచుకున్నారు. ఆమె చెప్పిన సంగతులివే..
*మీ జర్నీ గురించి చెప్పండి?*
నేను 2019లోనే కెరీర్ ప్రారంభించాను. నేను చేసిన ఓ రెండు సినిమాలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు వెళ్లాయి. కానీ అవి రిలీజ్ కాలేదు. ఆ తర్వాత నేను యాక్టింగ్ కోసం థియేటర్ కూడా నేర్చుకున్నాను. యాక్టింగ్ నేర్చుకోవడం, సినిమాలు చేస్తున్న ఈ జర్నీ నాకు ఎంతో నచ్చింది.
*మీ పాత్ర ఎలా ఉంటుంది?*
‘అమీర్ లోగ్’ సినిమాలో నా పాత్ర పక్కింటి అమ్మాయిలా ఉంటుంది. మహిళలకు స్పూర్తినిచ్చేలా నా కారెక్టర్ ఉంటుంది. మా అమ్మే నాకు స్పూర్తి. ఈ సినిమాలోని పాత్ర కూడా అలానే ఉంటుంది. ముక్కు సూటిగా ఉండటం, ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం అనేది మా అమ్మ నుంచే నేర్చుకున్నాను. ఈ కారెక్టర్‌లో కూడా ఇలానే ఉంటాను.
*‘అమీర్‌లోగ్’లో అవకాశం ఎలా వచ్చింది?*
‘తిమ్మరాజుపల్లి టీవీ’ చేసినట్టుగా మా దర్శకుడు రమణ గారికి తెలీదు. బషీర్ మాస్టర్ మాకు ఈ మూవీ ఆడిషన్స్ గురించి చెప్పారు. నేను ఆడిషన్‌కి వెళ్లాను. అక్కడ నేను బాగా పర్ఫామ్ చేయడంతో రమణ గారు వెంటనే ఓకే చెప్పారు.
*ఇప్పటి వరకు ‘అమీర్ లోగ్’ చూసిన వారు మీకు ఇచ్చిన కాంప్లిమెంట్స్ ఏంటి?*
‘అమీర్ లోగ్’ సినిమా చూసిన వారంతా నా పాత్ర గురించి మాట్లాడుకుంటారు. నా వర్క్ అందరికీ నచ్చుతోంది. నేను చేసింది ఒకటి, రెండు సినిమాలే అయినా అందరూ నన్ను గుర్తు పడుతున్నారు. పాత్రకు ప్రాధాన్యం ఉన్న చిత్రాలే చేయాలని అనుకుంటున్నాను. అందుకే ఆచితూచి పాత్రల్ని ఎంచుకుంటున్నాను.
*‘అమీర్ లోగ్’ చిత్రంలో బిర్యానీ గురించే ఎక్కువగా ఉంటుందట?*
‘అమీర్ లోగ్’ సినిమాలో బిర్యానీది మెయిన్ పాత్ర అని చెప్పుకోవచ్చు. కథలో ఆ ఎలిమెంట్ బాగా కుదిరింది. మా చిత్రం అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది.
*సింక్ సౌండ్‌తో వర్క్ చేయడం గురించి చెప్పండి?*
నేను ఇది వరకే సింక్ సౌండ్‌తో ఓ ఫీచర్ ఫిల్మ్‌కి చేశాను. మనం ఎంత ప్రొఫెషనల్‌గా ఉన్నా.. చుట్టు పక్కల ఉన్న సౌండ్స్ కూడా రికార్డ్ అవుతుంటాయి. సెట్‌లో చాలా కష్టంగా అనిపిస్తుంది. కానీ ఈ చిత్రానికి అందరూ అద్భుతంగా సహకరించారు. బస్తీ వాళ్లు కూడా మాకు ఎంతో సపోర్ట్ చేశారు. రమణ గారి అత్త గారి ఏరియానే కాబట్టి మరింత ఎక్కువగా సహకరించారు (నవ్వుతూ).
*ఆరేళ్లలో ఒకటి, రెండు చిత్రాలే బయటకు వచ్చాయన్న బాధ ఏమైనా ఉందా?*
ఎన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి అనే నంబర్ కంటే.. మనల్ని ఆడియెన్స్ ఎంతలా యాక్సెప్ట్ చేశారు.. ఎలాంటి పాత్రల్ని ఎంచుకుంటున్నాం అనేదే ముఖ్యం అని నేను భావిస్తాను. అందుకే నా ఈ ఆరేళ్ల జర్నీలో నేను చేసిన పాత్రలు నాకు సంతృప్తినిచ్చాయి. మనం చేసిన వాటిలో ఎన్ని రిలీజ్ అవుతాయ్ అన్నది మన చేతుల్లో ఉండదు.
*మ్యూజిక్ గురించి చెప్పండి?*
స్మరణ్ గారి మ్యూజిక్ వల్ల మా చిత్రం పది మెట్లు పైకి ఎక్కినట్టు చెప్పుకోవచ్చు. ఆయన మాకు అద్భుతమైన సంగీతాన్ని అందించారు. మేం సీన్స్‌లో చూపించలేని ఎమోషన్స్‌ని ఆయన బీజీఎంతో చెప్పారు. ఆయన మ్యూజిక్ మా సినిమాకి కీలకం.
*‘అమీర్ లోగ్’లోని ప్రధాన పాత్రధారుల గురించి చెప్పండి?*
‘అమీర్ లోగ్’ సినిమాలోని ప్రతీ కారెక్టర్‌కి ఇంపార్టెన్స్ ఉంటుంది. అన్ని పాత్రలకు ఆడియెన్స్ కనెక్ట్ అవుతారు. హరి, మనోజ్, శశిలతో కలిసి నటించడం ఆనందంగా ఉంది. సెట్లో అందరం కలిసి సరదాగా షూటింగ్ చేశాం.
*టెక్నికల్ టీం గురించి చెప్పండి?*
రమణరెడ్డి గారు మా అందరినీ ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు. ప్రతీ సీన్ ఎలా ఉండాలి.. ఎలా కావాలి అన్నది క్లియర్‌గా వివరించేవారు. మేం డెమో షూట్ కూడా చేశాం. మాధవి రెడ్డి గారు పుట్టి పెరిగిన ఏరియాలోనే షూటింగ్ చేశాం. అక్కడ మా అందరినీ బాగా చూసుకున్నారు. మా డీఓపీ గారు తక్కువ మాట్లాడతారు, పని అద్భుతంగా చేస్తారు.
*స్పిరిట్ మీడియా టీం, ఇతర సెలెబ్రిటీలు సినిమా చూసిన తర్వాత ఇచ్చిన కాంప్లిమెంట్స్ గురించి చెప్పండి?*
మా సినిమాని స్పిరిట్ టీం చూసి అభినందించింది. మా ప్రీమియర్ చూసిన వీఎన్ ఆదిత్య గారు కూడా చాలా మెచ్చుకున్నారు. రెగ్యులర్ పాత్రల్లా కాకుండా అందరికీ కనెక్ట్ అయ్యే పాత్రలా ఉందని ఆయన అన్నారు. రమణ గారి రైటింగ్, మా పర్ఫామెన్స్‌కి సింక్ అయిందని అన్నారు.
*భాష, యాస వల్ల ఏమైనా సమస్య వస్తుందా? అందరికీ అర్థం అవుతుందా?*
భాష, యాసతో మా సినిమాకి ఎలాంటి సమస్య రాదు. ఎమోషన్ అనేది అందరికీ కామన్. ఎక్కడైనా ఎమోషన్ అనేది ఒకేలా ఉంటుంది. మా చిత్రం అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా, అన్ని ప్రాంతాల వారిని మెప్పించేలా ఉంటుంది.