భగీరథకు వంశీ ఎన్.టి.ఆర్. మహానంది గ్లోబల్ అవార్డు


సీనియర్ జర్నలిస్ట్ భగీరథ రచించిన 'మీర్జాపురంరాణి - కృష్ణవేణి ' పుస్తకానికి  వంశీ ఎన్.టి.ఆర్. మహానంది గ్లోబల్ అవార్డును  ప్రదానం చెయ్యడం ఎంతో సముచితంగా ఉందని సీనియర్ దర్శకుడు రేలంగి నరసింహారావు అన్నారు. 


హైదరాబాద్ శ్రీత్యాగరాయ గాన సభలో వంశీ  సంస్థ ఎన్ .టి .ఆర్. మహానంది గ్లోబల్ అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహించింది . 
బుధవారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమంలో రేలంగి నరసింహారావు ముఖ్య అతిధిగా పాల్గొని జర్నలిస్ట్ భగీరథ , నిర్మాత ఎన్ .ఆర్ . కృష్ణవేణి ని సత్కరించి...అవార్డును ప్రదానం చేశారు . 


ఈ సందర్భగా నరసింహారావు మాట్లాడుతూ, నందమూరి తారక రామారావు 103వ జయతి సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ , రచయిత భగీరథ గారిని ఎంపిక చేసిన వంశీ రామరాజును అభినందించారు . రామారావు గారితో అనేక ఇంటర్వ్యూ లు చేసిన భగీరథ గారు , వారి శతాబ్ది సందర్భగా 'శకపురుషుడు ', 'తారకరామం ' అనే అద్భుతమైన పుస్తకాలు వెలువరించారని నరసింహారావు చెప్పారు . రామారావు గారిని మనదేశం సినిమాతో పరిచయం చేసిన శ్రీమతి కృష్ణవేణి గారి జీవిత చరిత్రను కూడా భగీరథ రాశారని , ఆ గ్రంధమే 'మీర్జాపురంరాణి -కృషవేణి ' అని చెప్పారు .
కృష్ణవేణమ్మ కుమార్తె నిర్మాత అనురాధ గారిని ఎంపిక చెయ్యడం కూడా ఎంతో సముచితంగా ఉందని , ఈ సినిమాను  ఎమ్ .ఆర్ .ఏ. అనే సంస్థ నిర్మించింది . ఎమ్ .ఆర్ .ఏ . అంటే మేకా రాజ్యలక్ష్మి అనురాధ . అలా రామారావు గారిని  పరిచయం చెయ్యడంలో శ్రీమతి అనురాధాదేవి గారి పాత్ర కూడా ఉందని నరసింహారావు తెలిపారు .


వంశీ రామరాజు మాట్లాడుతూ .. భగీరథ గారితో ఐదు దశాబ్దాల నుంచి పరిచయం ఉంది , ఆయన జర్నలిజం , సాహిత్యంలో ఎంతో పేరు సంపాదించారని చెప్పారు . 
భగీరథ మాట్లాడుతూ .. 1980 జూన్ 1వ తేదీన అశోక్ నగర్ గ్రంధాలయంలో నేను రచించిన 'మానవత ' పుస్తకాన్ని మహాకవి శ్రీ శ్రీ గారు ఆవిష్కరించారు .అప్పటి నుంచి నా సాహిత్య ప్రస్థానం ప్రారంభమయ్యింది . ఇప్పటికి 19 పుస్తకాలు వ్రాశాను , 29 అవార్డులు వచ్చాయి , నంది , గద్దర్ , నేషనల్ అవార్డ్స్ , ఆస్కార్ అవార్డుల కమిటీల్లో పనిచేశానని చెప్పారు .
తాను  వ్రాసిన 'నాగలాదేవి ' పుస్తకాన్ని బళ్లారిలో శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో బిఎస్సీ విద్యార్థులకు పాఠ్య గ్రంథంగా ఉందని , తన సాహిత్య జీవితంపై హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో పరిశోధన జరుగుతుందని భగీరథ తెలిపారు .