గ్యానిధార్ మూవీ టీజర్ విడుదల
150 సంవత్సరాల క్రితం నిజాం నవాబుల పాలనలో గోర్ బంజారాల జీవితాల్లో చోటుచేసుకున్న యథార్థ సంఘటనలు, చారిత్రక ఆధారాల ప్రాతిపదికగా రూపొందుతున్న చిత్రం "గ్యానిధార్" (Gyaani Dhaar). సబ్‌టైటిల్ - ది లిబెరేటర్. జేకే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సోహన్‌లాల్ రాథోడ్, కేసుల బ్రదర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కేశునందన్ దర్శకుడు. తెలుగు, బంజారా (గోర్ బోలి), హిందీ మూడు భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం పోస్టర్, టీజర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి ప్రముఖ నటుడు, పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణ మూర్తి, ప్రముఖ స్టార్ కథా రచయిత వి. విజయేంద్ర ప్రసాద్, సీనియర్ దర్శకుడు వి. సముద్ర, ముంబైకి చెందిన ప్రముఖ దర్శకనిర్మాత సంజీవ్ కుమార్ రాథోడ్ ముఖ్య అతిథులుగా హాజరై టీజర్, పోస్టర్లను ఆవిష్కరించారు.
ప్రముఖ రచయిత వి. విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. "ఒకప్పుడు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, పర్షియా, కాబూల్ సరిహద్దుల వరకు దేశవ్యాప్తంగా అఖండమైన వ్యాపార సామ్రాజ్యాన్ని నడిపిన గొప్ప చరిత్ర బంజారాలది. రాజులకు సైతం అప్పు ఇచ్చేంతటి సంపద వారి దగ్గర ఉండేది. అక్బర్ కాలంలో 'మాలోకి' అనే వీరవనిత అక్బర్‌ను సైతం వాదనలో ఓడించి, బంజారాల వ్యాపార మార్గాలను మళ్లీ తెరిపించిన ఘనత ఈ జాతిది. ఇంతటి ఘనమైన ఇతిహాసం, వీరత్వం కలిగిన రాథోడ్స్, జవాన్స్, పవార్స్ వంటి బంజారాల పూర్వ వైభవం మళ్లీ రావాలి. వారు ఈ దేశాన్ని లీడ్ చేయాలి. ఈ సంస్కృతిని ప్రతిబింబిస్తూ వస్తున్న 'గ్యానిధార్' చిత్రం పెద్ద విజయం సాధించాలి" అని ఆకాంక్షించారు.
పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణ మూర్తి మాట్లాడుతూ.. "ఈ రోజు ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి, అలాగే మానవాళి కోసం, ధర్మం కోసం నిలిచిన గొప్ప పోరాట యోధుడు లకేషా బంజారా జయంతి. వీటన్నింటితో పాటు నిజాం నవాబుల రజాకార్ల అరాచకాలకు, దొరల రాజ్యానికి వ్యతిరేకంగా వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో తొలి అమరుడైన దొడ్డి కొమరయ్య వర్ధంతి కూడా ఈ రోజే. ఇంతటి చారిత్రాత్మకమైన రోజున 'గ్యానిధార్' టీజర్ విడుదల చేయడం దర్శకనిర్మాతలు తీసుకున్న అత్యంత గొప్ప నిర్ణయం. మూలవాసుల సంపద మూలవాసులకే చెందాలనే సిద్ధాంతంతో వస్తున్న ఈ సినిమా ఘన విజయం సాధించాలి" అని కోరారు.
చిత్ర దర్శకుడు కేశునందన్ మాట్లాడుతూ.. "ప్రకృతి పరిరక్షణ కోసం బంజారాలు చేసిన వీరోచిత పోరాటాలు, నవాబుల కాలంలో వారు ఎదుర్కొన్న కష్టనష్టాల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించాం. ప్రముఖ రచయిత ప్రేమ్ సార్ అందించిన ఈ కథను ఎంతో సహజత్వంతో రూపొందించాం. చిత్రానికి సహజమైన అనుభూతిని తీసుకురావడం కోసం స్థానిక తండా ప్రజలను, బంజారా కమ్యూనిటీకి చెందిన విద్యావంతులను, నటీనటులను ఇందులో భాగస్వామ్యం చేశాం. కాకతీయ యూనివర్సిటీలో షూటింగ్ ప్రారంభించిన మొదటి రోజు ఎంత ఎమోషనల్‌గా ఉన్నానో, ఈ రోజు కూడా అంతే ఉద్వేగంగా ఉన్నాను. ఇందులో నా జీవితం, నా స్ట్రగుల్ ఉంది. బంజారా సమాజపు కష్టాలను, వారి గొంతుకను ప్రపంచానికి చాటిచెప్పే మాస్టర్‌పీస్ ఇది. మా చిత్రానికి ఆశీస్సులు అందించిన విజయేంద్ర ప్రసాద్ గారికి, నారాయణ మూర్తి గారికి, సముద్ర గారికి, సంజీవ్ కుమార్ గారికి నా పాదాభివందనాలు" అని తెలిపారు.
మహారాష్ట్రకు చెందిన ప్రముఖ దర్శకుడు, నిర్మాత సంజీవ్ కుమార్ మాట్లాడుతూ.. "ఇటీవలే నేను నిర్మించిన 'మహారాష్ట్ర ఫైల్స్' చిత్రంలోనూ బంజారా నేపథ్యం ఉంది. అది అక్కడ అద్భుతంగా ఆడుతోంది. ఇప్పుడు కేశునందన్ గారు 'గ్యానిధార్' చిత్రం ద్వారా బంజారా సినిమా ఇండస్ట్రీని సరికొత్త స్థాయికి తీసుకెళ్తున్నారు. దేశవ్యాప్తంగా బంజారాల జనాభా చాలా ఎక్కువ. వారి సంస్కృతిని, చరిత్రను ఈ చిత్రం ద్వారా ప్రజల ముందుకు తీసుకురావడం అభినందనీయం. ఈ చిత్ర యూనిట్‌కు నా హృదయపూర్వక శుభాకాంక్షలు" అన్నారు.
సీనియర్ దర్శకుడు వి. సముద్ర మాట్లాడుతూ.. ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా హోస్ట్ చేసిన నటుడు లోహిత్ కుమార్ (KCR సినిమాలో తండ్రి పాత్రధారి)కు, చిత్రంలో 'నాయక్' పాత్ర పోషించిన జయసింగ్, సూర్య, సాంబయ్యలతో పాటు చిత్ర యూనిట్‌కు మరియు మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
నిర్మాతలు, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు మాట్లాడుతూ.. తండా నుంచి నగరానికి వచ్చి జీవనశైలి మార్చుకుంటున్న నేటి తరం.. తమ తండా గొప్పతనాన్ని, సంస్కృతిని మర్చిపోకూడదనే ఉద్దేశంతోనే, సామాజిక బాధ్యతతో ఈ చిత్రాన్ని నిర్మించామని, ప్రేక్షకులందరూ ఈ సినిమాను ఆదరించాలని కోరారు.
చిత్ర సాంకేతిక వర్గం:
బ్యానర్: జేకే ప్రొడక్షన్స్
నిర్మాతలు: సోహన్‌లాల్ రాథోడ్, కేసుల బ్రదర్స్
ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: ఎ. ధనలక్ష్మి, జి. వెంకటేశ్వర్లు, బి. చిన్న బాబు
దర్శకత్వం: కేశునందన్
కథ: ప్రేమ్
సంగీతం: కళ్యాణ్ కీస్
DOP: మహి మడియన్ ఎమ్ఎమ్, విజయ్.జి
ఎడిటర్: నేమగ శ్రీనివాస్ రావు
పిఆర్ఓ: కృష్ణప్రసాద్ (కేపీ)