Reading Time: < 1 min

Why Two Directors? Hari Hara Veera Mallu

ఇద్దరు దర్శకులు ఎందుకు? “హరిహార వీరమల్లు”

 

జులై 24వ తేదీన విడుదల కాబోతున్న “హరిహర వీరమల్లు” చిత్రం పట్ల ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్, బాబీ డియోల్, సత్యరాజ్, కబీర్ బేడి లాంటి భారీ తారాగణంతో తెరకెక్కిన “వీరమల్లు” చిత్రాన్ని గమ్యం, వేదం లాంటి చిత్రాల దర్శకుడు క్రిష్ మరియు ఆక్సిజన్, రూల్స్ రంజన్ లాంటి సినిమాలను తీసిన జ్యోతికృష్ణ కలిసి డైరెక్ట్ చేశారు, కలిసి అంటే బాలీవుడ్ దర్శక ద్వయం అబ్బాస్ – మస్తాన్‌, రామ్‌సే బ్రదర్స్‌లా కాదు.

“హరిహర వీరమల్లు” చిత్రం 2020లో క్రిష్ దర్శకత్వంలో ప్రారంభమయింది. కానీ తరువాత కోవిడ్ కారణంగా షూటింగ్ నిరవధికంగా వాయిదా పడింది. ఆ విఘ్నాన్ని దాటగానే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా మారారు. ఆ తరువాత ఎన్నికలు రావటం, కూటమి ఘన విజయం సాధించటం, పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటి సీ ఎంగా అధికారం చేపట్టడం లాంటి పరిణామాలు చకచకా జరిగిపోయాయి. ఈ క్రమంలో దర్శకుడు క్రిష్ వేరే కమిట్మెంట్ల కారణంగా నిర్మాత, హీరోతో మాట్లాడి ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చేశారు. అప్పటికే కథ, కథనం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండటంతో హరిహరవీరమల్లు చిత్రాన్ని కంప్లీట్ చేసే బాధ్యతను నిర్మాత ఏ ఎం రత్నం తనయుడు, దర్శకుడు అయిన జ్యోతికృష్ణ తన భుజాలకు ఎత్తుకున్నారు.

ఓ దర్శకుడు మధ్యలో వదిలేసిన చిత్రాన్ని మరో దర్శకుడు పూర్తి చేయటం ఈ మధ్య కాలంలో జరిగిందా? అన్నది ఇంటరెస్టింగ్ పాయింట్. కొన్నేళ్ళ క్రితం గోపీచంద్ హీరోగా వచ్చిన “ఆరడుగుల బుల్లెట్” చిత్రాన్ని మొదట భూపతి పాండ్యన్ దర్శకత్వంలో మొదలైంది. కానీ కొన్ని కారణాల వలన సీనియర్ దర్శకుడు బి. గోపాల్ టేకోవర్ చేసుకుని సినిమాను పూర్తి చేశారు. అలాగే కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన “డెవిల్” చిత్రం కూడా నవీన్ మేడారం దర్శకత్వంలో మొదలు పెట్టి వంద రోజుల షూట్ తరువాత అభిప్రాయభేదాల వల్ల దర్శకుడు వైదొలిగాక నిర్మాత అభిషేక్ నామ చిత్రాన్ని పూర్తి చేశారు.

“హరిహరవీరమల్లు” ట్రైలర్‌కి వచ్చిన స్పందన చూస్తోంటే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.