‘ఫలక్ నుమా దాస్’ సినిమా రివ్యూ

Published On: June 2, 2019   |   Posted By:
‘ఫసక్’ సుమా ! (‘ఫలక్ నుమా దాస్’ రివ్యూ)

రేటింగ్  :  1.5/5

హైదరాబాద్ ఓల్డ్ సిటీ  ఫలక్ నుమా ఏరియా కుర్రాడు  దాస్ (విశ్వక్ సేన్). దాస్ ఉంటున్న ఏరియా రౌడీ షీటర్ శంకరన్న. శంకర్  ఓ ప్రక్క తన గ్యాంగ్ తో దందాలు చేస్తూ మరో ప్రక్క ఫుట్ బాల్ టీమ్ తో అదరకొడుతూంటాడు. దాంతో ఎప్పటికైనా తాను శంకర్ అంతవాడిని అవ్వాలని కలలు కనటమే కాక, వాటిని నిజం చేసుకునే దిశగా చిన్నప్పుడే స్కూల్ పిల్లలతో కలిసి గ్యాంగ్ ని తయారు చేస్తాడు దాస్. అది చూసి శంకర్ ముచ్చటపడిపోతాడు. పెద్దయ్యాక దాస్ ఆ గ్యాంగ్ లోనే జాయిన్ అవుతాడు. అయితే ఓ రోజు తను ఆరాధించే శంకరన్న హత్య కు గురి అవుతాడు. 

దీంతో శంకర్ మనిషి పాండు (ఉత్తేజ్) దాస్ గ్యాంగ్ కి పెద్ద దిక్కుగా మారతాడు. దాస్ తన స్నేహితులతో కలిసి శంకర్  పేరు మీద మటన్ షాపు పెడతాడు. ఎదుటి గ్యాంగ్ దగ్గర గొర్రెల్ని కొని మటన్ వ్యాపారం చేస్తూంటారు. అయితే ఓ రోజు ఆ గ్యాంగ్ తో తేడాలొచ్చి బాంబు లేసుకునే దాకా వెళ్తుంది.   ఆ గొడవల్లో దాస్ వేసిన ఒక బాంబుకి అవతల గ్రూపు కు చెందిన ఒకడు చనిపోతాడు. దాంతో ఆ  హత్యకేసు దాసు మీద పడుతుంది.  దీంతో అతడి జీవితం తల్లకిందులవుతుంది.ఈ హత్య కేసులోంచి బయట పడాలంటే 20 లక్షలు కావాలి. ఈ డబ్బు కోసం ఫలక్ నుమా దాస్ గ్యాంగ్ ఏం చేసింది,   దీన్నుంచి అతను ఎలా బయటపడ్డాడు అన్నది మిగతా కథ.


ఎలా ఉంది…

అసలు ఓ చిన్న సినిమాకు, అదీ ఊరు పేరులేని హీరో సినిమాకు మంచి ఓపినింగ్స్ రావటం గొప్ప విషయం. అందులో ఫలక్ నుమా టీమ్ వందకు వందశాతం సక్సెస్ అయ్యింది. ట్రైలర్స్, టీజర్స్, పోస్టర్స్ తో చితక్కొట్టింది. అయితే అవి చూసి ఆవేశపడి థియోటర్ లోకి దూరినవాడిని తన చచ్చు కథనంతో చావ కొట్టింది. మళయాళంలో సూపర్ హిట్ అయిన  అంగమలి డైరీస్  కు రీమేక్ గా వచ్చిన ఈ సినిమా మన నేటివిటికు మార్చటంలో ఫెయిలైందనే చెప్పాలి. నేటివిటి అంటే కేవలం డైలాగులు, భాష, యాస మాత్రమే కాదు కదా. మన ప్రాంత ఆచారాలు, వ్యవహారాలు. మనుష్యులు మనుగడ…ఇక్కడ వైరుధ్యం సినిమాలో కనపడాలి. మనకు ఇక్కడ మటన్ మాఫియా లేదు. అలాగే కేరళలో అంగమలి అనే  ఓ ప్రాంతంలో జరిగిన కొన్ని సంఘటనలను  డాక్యుమెంటైజ్ చేసినట్లుగా తెరకెక్కించారు. ఇక్కడ అదే కథను తెలుగుకు తెచ్చేసరికి హీరోయిజం లేపాలని, హీరో పాయింటాఫ్ వ్యూ కు కన్వర్ట్ చేసుకుంటూ పోయారు. ఎప్పుడైతే ఈ ఇండీ ఫిల్మ్ ఇలా తన నైజం కోల్పోయిందో అప్పుడే అన్నీ కోల్పోయింది. కోల్పోయిన దాంట్లో ఏముంటుంది మన పైత్యం తప్ప. అదే మిగిలింది. చూసేవాడికి బోర్ కొట్టించింది. లేకపోతే ఇంటర్నేషనల్ గా అవార్డ్ లు తెచ్చుకున్న సినిమా ను రీమేక్ చేస్తూ ఆ సెన్సిబులిటీస్ ని వదిలేయటమేమటి.  ఓ కల్ట్ ఫిల్మ్ ని బి గ్రేడ్ సినిమా గా మార్చేసినందుకు దర్శకుడు, హీరో అయిన విశ్వక్సేన్ పై మనకు కోపం వస్తుంది.

టెక్నికల్ గా …

దర్శకత్వం ఏమంత గొప్పగా లేదు. సంగీతం సైతం సినిమాకు తగ్గట్లే ఏదో యాక్షన్ సినిమాకు ఇఛ్చినట్లే ఇచ్చారు. కాకపోతే హైదరాబాద్ పాతబస్తీ వాతావరణం కొంతవరకూ సినిమాలో తేగలిగారు. దాంతో ఆ ప్రాంతంతో టచ్ ఉన్నవాళ్ళు ఎంజాయ్ చేస్తారు. అయినా హైదరాబాద్ పోరలు..ఎప్పుడూ తాగుడు..తిరుగుడు, బూతులు  అన్నట్లుగా చూపెట్టుడు ఏంది..ఇజ్జత్ పోగొట్టడం కాకపోతే. ఇక సినిమాలో అందరికన్నా బాగా చేసింది పెళ్లి చూపులు’ దర్శకుడు తరుణ్ భాస్కర్. ఆ తర్వాత గ్యాంగ్ పెద్ద దిక్కుగా ఉత్తేజ్. బ్యాగ్రౌండ్ స్కోర్ యావరేజ్ . ఎడిటింగ్ చాలా దారుణం. కథకు అవసరం లేని చాలా సీన్స్ లేపేయవచ్చు.  సినిమాటోగ్రఫీ జస్ట్ ఓకే 
 
 

చూడచ్చా?

మీరు పక్కా హైదరాబాదీ అయితే అయితే ఈ సినిమా పెద్దగా బాధించదు.



తెర వెనక..ముందు

నటీనటులు :  విశ్వక్ సేన్, సలోనీ మిశ్రా, హర్షితా గౌర్, ప్రశాంతీ చారులింగా, తరుణ్ భాస్కర్, ఉత్తేజ్, అభినవ్  తదితరులు

సంగీతం: వివేక్ సాగర్, 

ఛాయాగ్రహణం : విద్యా సాగర్ 

బ్యానర్స్ : వన్మయి క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్, టెర్రనోవా పిక్సర్స్, మీడియా9 క్రియేటివ్ వర్క్స్ 

నిర్మాతలు : కరాటె రాజు, సందీప్, మనోజ్ 

దర్శకత్వం: విశ్వక్ సేన్