లాల్ సింగ్ చడ్డా మూవీ రివ్యూ
అమీర్ ఖాన్ ‘లాల్ సింగ్ చడ్డా’ రివ్యూ
Emotional Engagement Emoji (EEE)
మెగాస్టార్ చిరంజీవి సమర్పణ, అమీర్ ఖాన్, కరీనా కపూర్, అక్కినేని నాగ చైతన్య నటీ నటులు వినగానే ఎంతో కొంత ఎట్రాక్షన్. అయితే టైటిల్ మాత్రం లాల్ సింగ్ చెడ్డా… తెలుగు డబ్బంగ్ అని అర్దమవుతోంది. పంజాబ్ కు చెందిన కధా అనే సందేహం. అయితే నెట్ లో తిరిగే జనాలకు స్పష్టంగా తెలుసు..ఈ సినిమా హాలీవుడ్ లో సూపర్ హిట్ అయినటువంటి ఫారెస్ట్ గంప్ సినిమా ఆధారంగా తెరకెక్కించారు. దాంతో ఓ వర్గం జనం…సినిమాకు వెళ్లినా వెళ్లకపోయినా… రిజల్ట్ ఏమిటి…వెళ్లదగిన సినిమాయేనా అని ఎంతో క్యూరియాసిటీ గా ఎదురు చూస్తున్నారు.ఇందులో నాగ చైతన్య కీలక పాత్రలో కనిపించటం కూడా మన తెలుగు వాళ్ల దృష్టి పడటానికి కొంతలో కొంత కారణైంది. ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో విడుదల చేసారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఎలా ఉంది….తెలుగులో వర్కవుట్ అయ్యే కథనా.,అసలు కాన్సెప్టు ఏమిటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
స్టోరీ లైన్…
ఈ కథ లాల్ సింగ్ చద్దా(అమీర్ ఖాన్) తనేంటో తాను తెలుసుకునే సెల్ఫ్ డిస్కవరీ ప్రయాణం. తన జీవితంలో ఎన్నో కష్ట,నష్టాలు, అవమానాలు ఎదుర్కొని విజేతగా నిలిచిన కథ ఇది. ఐక్యూ తక్కువ ఉన్న కుర్రాడు కావటం, వెన్నుముక బలం లేక నడవలేని తనం వంటివి చాలా బాధిస్తాయి. కానీ తన తల్లి,తన స్నేహితురాలు ప్రియ (కరీనా కపూర్) సాయింతో వాటిని జయిస్తాడు. అయితే తనకు అండగా నిలబడ్డ రూప…లాల్ కు జీవిత సహచారిణి అవుతుందా..మధ్యలో పరిచయం అయిన బాలరాజు (నాగచైతన్య) ఎవరు…అతనితో జర్నీతో లాల్ జీవితంలో వచ్చిన మార్పులు ఏమిటి….చివరకు లాల్ తన జీవితంలో ఏం తెలుసుకున్నాడు అనేదే ఈ సినిమా కథ.
విళ్లేషణ..
ప్రపంచ సినిమా ని చూసే దాదాపు ప్రతీ ఒక్కరూ Forrest Gumpకు ఫ్యాన్స్ అయ్యిపోతారు. ఎందుకంటే అలాంటి సినిమాలు అరుదుగా కనిపిస్తాయి. అసలు ఇలాంటి కథతో సినిమా ఎలా తీసారా అనే సందేహం వచ్చేస్తుంది. సినిమా తీసి ఒప్పించి…అస్కార్ అవార్డ్ లతో పాటు కలెక్షన్స్ వర్షం కూడా కురిపించుకున్నారు. ఇది ఓ కామెడీ అనికొందరు అంటారు..మరికొందరు డ్రామా అంటారు..అబ్బే అదేమీ లేదు ఇదో డ్రీమ్ అంటారు. ఇలా ఎవరికి నచ్చినట్లు అలా ఈ సినిమా కనిపిస్తుంది. అయితే అమీర్ ఖాన్ కు ఎలా కనిపించింది…అనేదే ఈ సినిమా. ఈ సినిమాని ఆయన Forrest Gump కు నకలు గానే చూసారు. అయితే ఇండియన్ వెర్షన్ గా మార్చేసేటప్పుడు మరింత ఫన్ కావాలని, ఎక్సప్రెషన్స్ తో మిస్టర్ బీన్ ని గుర్తు చేసారు. అలాగే ఈ సినిమా స్క్రీన్ ప్లే రాసే విషయంలో ఎలిమెంట్స్ ఎక్కువై….సినిమా లెంగ్త్ పెరిగిపోయింది. ..ఒరిజనల్ కన్నా రీమేక్ …లెంగ్త్ ఎక్కువ. దాదాపు 22 నిముషాలు ఎగస్ట్రా ఉందంటే అర్దం చేసుకోవచ్చు. ఫారెస్ట్ గంప్ లో … Tom Hanks ఐక్యూ తక్కువ వాడిలా ఉంటాడే కానీ తింగరోడులా ఉండడు. అలాగే 1950-80 మధ్య జరిగిన అమెరికా చరిత్రను తన దృష్టి కోణంలో చూపెడతాడు. ఇక్కడ ఇండియన్ వెర్షన్ లో భారతీయ చరిత్రలో జరిగిన ఇందిరాగాంధీ హత్య, మండల్ కమిషన్, సిక్కుల ఊచకోత, అద్వానీ రథయాత్ర, ముంబై బాంబు పేలుళ్ల సంఘటనలతో కథను అల్లుకొన్న తీరు బాగుంది. కాని చిత్రం ఏమిటంటే…సినిమా కథకూ ఈ ఎపిసోడ్స్ కు లింక్ ఉన్నట్లు మనకు అనిపించకపోవటం. అంటే బ్యాక్ గ్రౌండ్ జరగాల్సిన సీన్స్ డైరక్ట్ అయ్యి..అసలు కథను అడుక్కు తోసేసాయి అన్నమాట. కార్గిల్ యుద్ధంలో కాపాడిన పాక్ మిలిటెంట్ మహ్మద్ ఎపిసోడ్‌కు ముంబై బాంబు పేలుళ్లను లింక్ చేయడం కూడా అంతే. ‘లైఫ్ వాజ్ లైక్ ఏ బాక్స్ ఆఫ్ చాక్లెట్స్ .. యూ నెవర్ నో.. వాట్ యూ ఆర్ గోయింగ్ టు గెట్’అనే విషయం చుట్టూ అల్లిన కథ ఇది..మనకు పానీపూరీలుగా మారిపోయింది.
టెక్నికల్ గా…
దర్శకుడు అద్వైత్ చందన్…అప్పటి సినిమాని ఇప్పటి మన తరానికి తగిన ఇండియన్ సినిమాగా మలచలేకపోయారు. చాలా గందరగోళం కనిపిస్తుంది కథలో. ఇండియన్ ఫ్లేవర్ సినిమాలో కనపడినా మన హృదయాలను తాకదు. ముఖ్యంగా క్లైమాక్స్ సినిమాని బాగా నీరసపరిచేసింది. సత్యజిత్ పాండే కెమెరా వర్క్ సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. కార్గిల్ ఎపిసోడ్స్, లడఖ్, పంజాబ్‌లో చిత్రీకరించిన సీన్స్ బాగున్నాయి. ఎడిటర్‌గా హేమంత్ సర్కార్ మొహమాట పడి చాలా సీన్స్ వదిలేసారు. తనుజ్ టికు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ప్రీతమ్ పాటలు బాగోలేవు. అమీర్ ఖాన్, వయాకామ్, పారమౌంట్ బ్యానర్ నిర్మాణ విలువలు జస్ట్ ఓకే అన్నట్లున్నాయి.
నటీనటుల్లో ….
ఒరిజనల్ సినిమా Forrest Gump తో పోల్చి చూస్తే అమీర్ ఖాన్ కాస్తంత అతి చేసినట్లు అనిపిస్తుంది. తన మెధడ్ యాక్టింగ్ తో కొంత విసిగిస్తాడు. అలాగే ఇలాంటి ఎక్సప్రెషన్స్ గతంలో చాలా ఇచ్చి ఉన్నాడు. కొన్నిసీన్స్ లో పీకేను గుర్తుకు తెస్తాడు. నాగ చైతన్య గెస్ట్ రోల్ గా కనిపించినా అతనికి కలిసొచ్చే పాత్ర అయితే కాదు. అభిమానులకి నిరాశ కలుగుతుంది. లాల్ గర్ల్ ఫ్రెండ్ గా హీరోయిన్ కరీనా కపూర్ ఓకే. ప్రీ-క్లైమాక్స్ పోర్షన్స్ లో ఆమె నటన బాగుంది. నటి మోనా సింగ్ తన తల్లి పాత్రలో చాలా బాగా చేసింది.
చూడచ్చా….
Forrest Gump చూడకపోతే ఈ సినిమా ఫరావాలేదనిపిస్తుంది. చైతూ ఫ్యాన్స్ మాత్రం పనిగట్టుకుని వెళ్లాల్సిన ఫిల్మ్ అయితే కాదు
బ్యానర్లు : వైయకామ్ స్టూడియోస్, పారామౌంట్ పిక్చర్స్, ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్
నటీనటులు: అమీర్ ఖాన్, షారుక్ ఖాన్, నాగచైతన్య, కరీనా కపూర్, మోనా సింగ్, మానవ్ విజ్ తదితరులు
సమర్పణ :మెగాస్టార్ చిరంజీవి
సంగీతం: తనుజ్ టికు, ప్రీతమ్
ఛాయాగ్రహణం: సేతు
భారతీయ చిత్రానుకరణ: అతుల్ కుల్ కర్ణి
ఎడిటింగ్: హేమంతి సర్కార్
నిర్మాతలు: ఆమిర్ ఖాన్, కిరణ్ రావు, జ్యోతి దేశ్ పాండే, అజిత్ అంధారే
Runtime:2h 39m
విడుదల తేదీ: 11/08/2022