స్టాండప్ రాహుల్ మూవీ రివ్యూ

రాజ్ తరణ్  `స్టాండప్ రాహుల్` రివ్యూ

👎

రాజ్ తరణ్ ఈ మధ్యకాలంలో  నటించిన గత మూడు చిత్రాలు `ఒరేయ్ బుజ్జి`..`పవర్ ప్లే`..`అనుభవించు రాజా` వర్కవుట్ కాలేదు. సరైన కథలు ఎంచుకోకపోవటం, కామెడీ టైమింగ్ మిస్ కావటం అతని సినిమాలకు శాపంగా మారాయి. ఉయ్యాల జంపాల నాటి జోష్ మాయమైంది. ఈ నేపధ్యంలో తను తాను మార్చుకుని ,గెటప్ లుక్ మార్చి ఈ సినిమా చేసాడు. ట్రైలర్స్,టీజర్స్ మల్టిప్లెక్స్ సినిమా అనిపించాయి. అయితే కొత్త టైటిల్, విజువల్స్ గొప్పగా ఉండటంతో ఉన్నంతలో బజ్ క్రియేట్ అయ్యింది. ఆ బజ్ ని హిట్ దిసగా సినిమా తీసుకెళ్లిందా…ఈ సినిమా కథేంటి…వర్కవుట్ అయ్యే కాన్సెప్టేనా?  వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

Storyline:

రాహుల్(రాజ్ తరణ్)కు స్టాండప్ కమిడియన్ అవ్వాలని కోరిక. కానీ అది అతని తల్లి (ఇంద్రజ)కు ఇష్టం ఉండదు. అతని తండ్రి (మురళిశర్మ) సినిమా  పిచ్చితో జీవితంలో మిగిలిపోతాడు. అలాగే తన కొడుకు కూడా అయ్యిపోతాడేమో అని భయం. దాంతో ఉద్యోగంలో సెటిల్ అవ్వమని కొడుకుని  పోరుతూంటుంది. మరో ప్రక్క రాహుల్ కు పెళ్లి అంటే భయం. తన తల్లి,తండ్రి విడిపోయారని , అలాగే తన జీవితంలోనూ జరుగుతుందని భయపడుతూంటాడు. ఈ క్రమంలో హైదరాబాద్ వచ్చిన అతను జాబ్ చేస్తూనే స్టాండప్ కమిడియన్ గా ట్రైల్స్ మొదలెడతాడు. మరో ప్రక్క  శ్రేయ (వర్ష బొల్లమ్మ) కలుస్తుంది. ఆమెతో ప్రేమలో పడతాడు.రాహుల్ కు పెళ్లి అంటే ఉన్న భయం గమనించి ఆమె సహజీవనానికి రెడీ అవుతుంది. ఈ క్రమంలో చోటు చేసుకున్న సంఘటనలు ఏమిటి..అవి రాహుల్ జీవితాన్ని ఏ విధంగా మార్చాయి. చివరకు రాహుల్  తన భయాలను అధిగమించాడా వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Screenplay Analysis:

సాధారణంగా  కథల్లో internal conflict ని ఎందుకు ఎంచుకుంటాం ?  అవి పాత్రలను చాలా రిలేట్ చేస్తూ మనకు దగ్గర చేస్తాయని, అలాగే క్యారక్టర్ పూర్తి ఆర్క్ ని మనకు అందిస్తాయని. క్యారక్టర్ బేసెడ్ కథల్లో ఎక్కువగా ఇది కనిపిస్తుంది. క్యారక్టర్ మనకు రిలేట్ కానప్పుడు దాన్ని పట్టించుకోము. అయితే internal conflict ని ఎంచుకున్నప్పుడు చాలా మంది  External conflict ని కూడా ఎంచుకుంటారు. అందరూ ఇంటర్నెల కాంప్లిక్ట్ కు కనెక్ట్ కాకపోతే  External conflict కు అయినా వర్కవుట్ అవుతుందని జాగ్రత్తపడతారు. అలాగే ఇంటర్నెల్ కాంప్లిక్ట్ కొన్ని  External conflict కు కూడా లీడ్ తీస్తుంది. తీయాలి అప్పుడే సంఘటనలు పుడతాయి. కథ ముందుకు వెళ్తుంది. జరిగినట్లు అనిపిస్తుంది. సాహిత్యంలో internal conflict ని ఈజిగా సస్టైన్ చేయగలం కానీ విజువల్ మీడియంకు వచ్చేసరికి హీరో తలలో జరిగే సంఘర్షణను సంఘటనల రూరంలో చూపెట్టకపోతే సమస్య. అదే ఈ సినిమాకు జరిగింది. కథలో ఏమీ జరిగినట్లు అనిపించదు. హీరో ఎంతసేపు మధన పడిపోతూంటాడు. అదేమీ మనకు పెద్ద సమస్యగా అనిపించదు. అనిపించేలా దర్శకుడు చేయడు. కుటుంబ సభ్యులతో సాన్నిహిత్యం ఉండదు. సహజీవనం చేస్తున్న లవర్ ని అర్దం చేసుకోడు. చివరకు తనే తను అర్దం కాడు. సమస్యే అర్దం కానప్పుడు దాని పరిష్కారం కోసం ఏమి ప్రయత్నిస్తాడు. డైరక్టర్ పాయింటాప్ లో మొదలైన ఈ కథ కొంతదూరం వెళ్లేసరికి హీరో అందిపుచ్చుకుని లీడ్ చేస్తే సినిమా వేరే విధంగా ఉండేది. స్క్రీన్ ప్లేలోనే సమస్య ఉన్నప్పుడు ఎవరేం చేసినా కలిసి వచ్చేదేమి ఉంటుంది.

Analysis of its technical content:

చిన్న సినిమా అయినా టెక్నికల్ గా మంచి స్టాండర్డ్స్ లోనే ఉంది. కెమెరా వర్క్ అయితే చాలా బాగుంది. సంగీతం కూడా లవ్ స్టోరీకి తగ్గ ఫీల్ తెచ్చింది. అయితే దర్శకుడుకు అనుభవ లేమీ బాగా కనిపించింది. అతను సినిమాని ఓ షార్ట్ ఫిల్మ్ లా ప్రెజెంట్ చేయటం, ఎక్కడా ఎమోషన్స్ రిజస్టర్ కాకపోవటం ఇబ్బందిగా అనిపిస్తాయి. అలాగే స్టాండప్ కామెడీ జోక్స్ పేలలేదు. అవి వచ్చినప్పుడల్లా బయిటకు వెళ్లిపోవాలనిపిస్తుంది. స‌హ‌జీనం అనే అంశాన్ని చాలా డిటైల్డ్‌గా ఇందులో చెప్పే ప్రయత్నం చేసారు. కానీ సహజీవనం కాన్సెప్టు పాతబడిపోయింది. అదీ వర్కవుట్ కాలేదు. స్క్రిప్టు సరిగ్గా ఉంటే మిగతావన్నీ కలిసిపోయేవి.

On Screen Performances:

రాజ్ తరణ్ నటుడుగా వంకపెట్టలేం. కాకపోతే అతని కామెడీ టైమింగ్ ఏమైందో అర్దం కాదు. సినిమా అంతా చాలా డల్ గా సాగుతుంది. వర్ష బొల్లమ్మ శ్రియగా చాలా ఇంప్రెసివ్ గా ఉంది. ఆమె ఎనర్జీ తెరపై ఉత్సాహాన్ని తెస్తుంది. కొన్ని సీన్స్ లో ఆమె రాజ్ తరుణ్ ని డామినేట్ చేసింది. మురళి శర్మ, ఇంద్రజ ..ఎప్పటిలాగే తమ సీనియార్టీతో లాక్కెళ్లిపోయారు. వెన్నెల కిషోర్ కామెడీ బాగుంది. ఫస్టాఫ్ లో ఫన్ బాగానే పేలింది కానీ సెకండాఫ్ లో అంత స్కోప్ లేదు.

CONCLUSION:
చూడచ్చా?
అర్జెంట్ గా చూసేయాలనిపించే సినిమా కాదు. ఓటిటి దాకా వెయిట్ చేయచ్చు అనిపిస్తుంది

Movie Cast & Crew

బ్యానర్: డ్రీమ్ టౌన్ ప్రొడ‌క్ష‌న్స్, హై ఫైవ్ పిక్చ‌ర్స్
నటీనటులు: రాజ్ తరుణ్, వర్షా బొల్లమ్మ, ‘వెన్నెల’ కిషోర్, ఇంద్రజ, మురళీ శర్మ తదితరులు
సంగీతం: స్వీకర్ అగస్తి
సినిమాటోగ్ర‌ఫి: శ్రీరాజ్ రవీంద్రన్
ఎడిటింగ్: రవితేజ గిరజాల
పాటలు: అనంత్ శ్రీరామ్,  కిట్టు విస్సాప్రగడ,రెహమాన్, విశ్వా
నిర్మాతలు: నంద్‌కుమార్ అబ్బినేని, భరత్ మగులూరి
దర్శకత్వం: సాంటో మోహ‌న్ వీరంకి
Run time: 2 గంటల రెండు నిముషాలు
విడుదల తేదీ: మార్చి 18, 2022