అఖండ విజయోత్సవ జాతర వేడుక

Image

 

మంచి సినిమాలను ఆదరిస్తారని మళ్లీ నిరూపించారు.. అఖండ విజయోత్సవ జాతర వేడుకలో నందమూరి బాలకృష్ణ

నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందిన హ్యాట్రిక్ మూవీ `అఖండ` డిసెంబర్ 2న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుదలై అద్భుతమైన కలెక్షన్స్ సాధిస్తోంది. ద్వారకా క్రియేషన్స్‌పై అఖండ చిత్రాన్ని మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మించారు. అఖండ సినిమా సక్సెస్ లో భాగంగా అఖండ విజయోత్సవ జాతర కార్యక్రమాన్ని గురువారం వైజాగ్‌లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అభిమానులు, ప్రేక్ష‌కులు భారీ సంఖ్య‌లో హాజ‌రై విజ‌య‌వంతం చేశారు.

హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘వైజాగ్‌తో నాకు చాలా అనుబంధం ఉంది. నా మొదటి సినిమా కూడా ఇక్కడే షూట్ చేశాను. ఈ సక్సెస్ మీట్ ఇక్కడ జరగడం ఎంతో సంతోషంగా ఉంది. బోయపాటి గారితో సరైనోడు, అఖండ సినిమాలు చేశాను. బాలయ్య గారితో శ్రీరామరాజ్యంలోనూ చేశాను. వరదరాజులు పాత్ర ఇలా ఉంటుందని, వస్తుందని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నాకంటే ఎక్కువగా నా మీద ఆయనకే నమ్మకం ఉంది. బాలయ్య గారితో నటించడం ఆనందంగా ఉంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒకే ఎనర్జీ ఉంటుంది. ఆయన్ను తలుచుకుంటే మాకు ఎనర్జీ వస్తుంటుంది. ఈ సినిమా విడుదలైనప్పుడు ఉదయం నుంచి పడుకోలేదు. అమెరికా నుంచి ఫోన్‌లు వస్తూనే ఉన్నాయి. ఎక్కడ చూసినా జై బాలయ్య అనే నినాదాలే వినిపించాయి. వరదరాజులు పాత్రను కూడా ప్రేమించినందుకు థ్యాంక్స్. విలన్‌గా చేస్తే ప్రేక్షకులు అంగీకరిస్తారా? లేదా? అనే అనుమానం ఉండేది. కానీ ఈ సినిమాతో నా మీద నాకు నమ్మకం పెరిగింది. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు బోయపాటి గారికి థ్యాంక్స్. కెమెరామెన్ రామ్ ప్రసాద్‌తో నేను హీరోగా ఐదు సినిమాలు చేశాను. ఇప్పుడు విలన్‌గానూ అద్భుతంగా శివుడే బాలకృష్ణ రూపంలో వచ్చినట్టుంది. ఏదో ట్రాన్స్‌లోకి వెళ్లినట్టు అనిపించింది. ఈ సినిమాలో ఏదో ఉంది. కమర్షియలే గానీ దేవుడు ఇంక్లూట్ అయిన సినిమా. సినిమా కాబట్టి అలా చేశాను పూర్ణ గారు సారీ. ప్రగ్యా గారు ఎంతో అద్భుతంగా నటించారు. ఇలాంటి సమయంలో సినిమాను రిలీజ్ చేయాలంటే నిర్మాతకు ధైర్యం కావాలి.  ఈ సినిమా ఆడాలని ప్రతీ ఒక్కరూ కోరుకున్నారు. అందుకే అందరి గుండెల్లో ఈ సినిమా నిలిచిపోయింది. సినిమా ఇండస్ట్రీ బతకాలి.. అన్ని సినిమాలను చూడండి’ అని అన్నారు.

పూర్ణ మాట్లాడుతూ.. ‘అఖండ విజయం మాది. ఇది ప్రేక్షకుల విజయం. అందరి అభిమానులు ఈ సినిమాను చూసి హిట్ చేశారు. ఇలాంటి మంచి పాత్రను ఇచ్చినందుకు బోయపాటి గారికి థ్యాంక్స్. ఇలాంటి పెద్ద సక్సెస్‌ను నా పదహారేళ్ల కెరీర్‌లో చూడలేదు. శ్రీకాంత్ గారు నన్ను  భయపెట్టినా కూడా మీ అందం ముందు ఆ భయం తెలియలేదు. బాలయ్య గారి గురించి చెప్పేందుకు మాటలు చాలడం లేదు. సాష్టాంగ నమస్కారం చేస్తాను. ఇంత కంటే ఎక్కువ చెప్పలేను. ఈ సినిమా, అఘోర పాత్ర నన్ను వెంటాడింది. మీలాంటి వారితో పని చేయడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. మీ నుంచి ఎంతో నేర్చుకున్నాను. బాలయ్య బాబుకు ఎవ్వరూ దిష్టి పెట్టకూడదు’ అని అన్నారు.

స్టన్ శివ మాట్లాడుతూ.. ‘మీరేం చేస్తారో నాకు తెలీదు. ది బెస్ట్ ఉండాలి. హిట్ అవ్వాలని అన్నారు. ఈ సినిమా హిట్ అవుతుందని నాకు ముందే తెలుసు. సినిమాలో ఫైట్ ఎలా ఉండాలి.. ఆ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలో చెప్పే దర్శకుడే బోయపాటి శ్రీను. బాలయ్య గారు సెట్ మీదకు వచ్చాక.. వందశాతం కాదు వెయ్యి శాతం యాక్షన్ చేశారు. అందుకే ఇంత పెద్ద హిట్ అయింది. ఈ ఫైట్స్‌కు తమన్ సంగీతం ఎంతో ముఖ్యం’ అని అన్నారు.

ప్రగ్యా జైస్వాల్ మాట్లాడుతూ.. ‘ఈ చిత్రంలో భాగస్వామిని అయినందుకు ఎంతో ఆనందంగా ఉంది. శరణ్య పాత్రపై ప్రేమను కురిపిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఇంత పెద్ద ప్రాజెక్ట్‌లో నాకు అవకాశం ఇచ్చినందుకు బోయపాటి గారికి థ్యాంక్స్. బాలకృష్ణ సర్‌తో పని చేయడం ఎంతో సరదాగా ఉంది. ఆయనతో ఉన్నన్ని రోజులు కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉన్నాను. థియేట్రికల్ రిలీజ్ కోసం ఇన్ని రోజులు సినిమాను ఆపినందుకు నిర్మాతకు థ్యాంక్స్’ అని అన్నారు.

నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘మీరు ఇచ్చిన ఈ సక్సెస్‌ను గుండెల్లో భద్రంగా దాచుకుంటాం. మున్ముందు ఇసుమింత కూడా లోపం లేకుండా తీసేందుకు ప్రయత్నిస్తాం. ఆ తరువాత పైన ఆ పరమ శివుడు. కింద మీరు (ఆడియెన్స్). మీరు ఎలాంటి ఫలితాన్ని ఇచ్చినా కూడా స్వీకరిస్తాం. ఇప్పటికీ థియేటర్లో జాతర నడుస్తోంది. ఇంకా ముందు కూడా ఇలానే ఉంటుందని అనుకుంటున్నాను. ఈ సినిమాను చూసి ఎంతో మంది ప్రేరణ పొందుతున్నారు. బాలయ్య గారిని చాలా దగ్గరి నుంచి చూశాను. దగ్గరి నుంచి ప్రతీ ఒక్కరూ జీవితాంతం అభిమానిగానే మారుతారు. ఎదుటి వాళ్ల మెప్పు పొందాలని బాలయ్య గారు ప్రయత్నించరు. నేను కూడా అలానే ఉండాలని నిర్ణయించుకున్నాను. ఆయన విల్ పవర్ గురించి మాటల్లో చెప్పలేని. సినిమాల్లో హీరోలకు బిరుదులుంటాయి. నా తరుపున మా డైరెక్టర్ బోయపాటి గారికి మాస్ కా బాప్ అనే టైటిల్ ఇవ్వాలని అనుకుంటాను. కమర్షియల్ సినిమాను హిట్ అందరూ చేస్తారు. కానీ సక్సెస్ కంటే ఎక్కువగా రెవిన్యూ తీసుకొచ్చే దర్శకుల్లో బోయపాటి ఒకరు. ఒక్క టీజర్‌తోనే సినిమా మీద అంచనాలు పెంచే సత్తా ఉన్న దర్శకుడు తమన్. మనసు పెట్టి పని చేసిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్. అఖండ.. అఖండమైన విజయం సాధించింది. మున్ముందు రాబోయే పెద్ద సినిమాలను కూడా ఆదరించి విజయవంతం చేయాలి. పెద్ద సినిమాలు పెద్ద స్క్రీన్ నుంచి దూరమయ్యే పరిస్థితి ఉంది. మీరు సినిమాలను ఆదరించాలి.’ అని అన్నారు.

బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. ‘సినిమాను గెలిపించిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు. వైజాగ్‌లో ఓ సక్సెస్ మీట్ చేయాలని ఇక్కడకు వచ్చాం. మంచి జరిగితే లోపల దేవుడికి కృతజ్ఞతలు చెబుతాం. కానీ మీలాంటి ప్రేక్షకులకు ఇక్కడకు వచ్చి చెప్పుకోవాలి. సినిమాలు సక్సెస్ అవ్వడం, వేదికల మీదకు రావడం కామన్. కానీ ఈ రోజు ఈ సక్సెస్ మీట్ చేయడానికి ఓ ప్రత్యేకమైన కారణం ఉంది. ప్రేక్షకులకు థియేటర్లకు బంధం తెగిపోయింది. హారతలు, కోలహాలం ఉంటుందా? లేదా? అని అందరూ అనుకుంటూ ఉన్నారు. కానీ ఓ మంచి సినిమాను తీస్తే పెద్ద హిట్ చేస్తామని ప్రేక్షకులు నిరూపించారు.  సినిమా ఆడితే డబ్బు రావడం వేరు. కానీ ఈ సినిమాను హిట్ చేసి ఇండస్ట్రీకి ధైర్యాన్ని ఇచ్చారు. మీరు హిట్ చేసింది సినిమాను కాదు. ఇండస్ట్రీని. అందుకే మీకు థ్యాంక్స్ చెప్పాను. ఎవరైనా ఓ కారెక్టర్  చేస్తుంటే ఎగ్జైట్ అవుతుంటారు. కానీ బాలయ్య ఓ పాత్రను వేస్తే ఆ పాత్రే ఎగ్జైట్ అవుతుంది. మాస్ అంటే అరిచి చెప్పేది కాదు. మంచి చెప్పి అరిచేలా చేసేదే మాస్. అలానే ఈ సినిమాలో మంచి చెప్పినా, దేవుడి గురించి చెప్పినా , ధర్మం చెప్పినా, వాక్ శుద్ది, ఆత్మ శుద్ది ఉన్నవాళ్లే చెబితేనే జనాల్లోకి వెళ్తుంది. అవన్నీ ఉన్న వారే బాలయ్య. అందుకే ఈ చిత్రం ఇంత పెద్ద సక్సెస్ అయింది. హీరో శంఖం పూరిస్తే విలన్‌కు వినిపిస్తుంది. కానీ అఖండ శంఖం పూరిస్తే ప్రపంచమంతా వినిపించింది. విడుదలైన ప్రతీ చోటా నీరాజనాలు పట్టారు. జై బాలయ్య, జై అఖండ, జై బోయపాటి అన్నారు. అలాంటి వ్యక్తితో ఒక్క సినిమా చేయడమే అదృష్టం. అలాంటిది నేను మూడు సినిమాలు చేశాను. సింహను హిట్ చేశారు.. లెజెండ్‌ను నెత్తి మీద పెట్టుకున్నారు.. ఇప్పుడు గుండెల్లో పెట్టుకున్నారు. ఇది పూర్వ జన్మ సుకృతం. ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. అదేంటని తరువాత ఓపెన్ చేస్తాను. బాలయ్య ఇంత బాగా కనిపించడం కోసం ఎంతో మంది కష్టపడ్డారు. సినిమాలో చేస్తావా? అని ప్రగ్యాను అడిగాను. వెంటనే ఓకే చెప్పింది. ఈ సినిమాను మొదటి చూసింది తమన్. అద్భుతమైన ఆర్ఆర్ ఇచ్చారు.  ఈ సినిమాలో ప్రకృతి, పసిబిడ్డ, పరమాత్మను గౌరవిస్తే భావితరాలన్నీ బాగుంటాయ్ అని చెప్పాం. అది మన హైందర ధర్మం. దాన్ని చెప్పాం. సక్సెస్ కొట్టాం. శివుడే ఈ సినిమాను మీరూపంలో హిట్ ఇచ్చాడు. మేం తీసుకున్నాం. భగవంతుడు ఇచ్చిన హిట్. పరిశ్రమకు ఊపిరిలాంటి హిట్. సినిమాను గెలిపించారు.. పరిశ్రమను గెలిపించారు. మంచి సినిమాలు మీ ముందుకు వస్తే మీరు గెలిపిస్తారు. గెలిపించాల్సిన బాధ్యత మీ మీద ఉంది’ అని అన్నారు.

నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘సినిమాను ఇంత విజయవంతం చేసిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్. అఖండ టైటిల్ ఎలా ఉందని బోయపాటి గారు అడిగారు. చాలా బాగుంది.. దీంతోనే ముందుకు వెళ్దామని అన్నాను. సింహ, లెజెండ్ తరువాత చేస్తున్న సినిమా కాబట్టి కాస్త భయం ఉంటుంది. కానీ ఒక సినిమా అయిన తరువాత మళ్లీ వాటి గురించి ఆలోచించను. మా ఇద్దరి మధ్య మాకు విశ్వాసం ఉంటుంది. నానుంచి ఏం కావాలో ఆయనకు తెలుసు. ఆయన నా నుంచి ఏం ఆశిస్తుంటారో నాకు తెలుసు. బోయపాటి గారు నాకు ఇంత వరకు ఏ సినిమా కథ కూడా పూర్తిగా చెప్పలేదు. ఆయనకు నా మీద అంత విశ్వాసం ఉంది. అభిమానులు నా నుంచి ఎప్పుడూ ఏమీ ఆశించరు. వెలకట్టలేనిది అభిమానం. విజయాల్లో అందరూ పాలుపంచుకుంటారు. కానీ అపజయాల్లో నా వెంటే ఉన్నారు. మంచి సినిమా తీస్తే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదిరిస్తూనే వస్తున్నారు. తిరణాళ్లకు వెళ్లినట్టు సినిమా థియేటర్లకు వెళ్లి సినిమాను ఆదరించారు. మంచి సినిమాలను ఆదరిస్తారని మళ్లీ నిరూపించారు. ఇది మా విజయమే కాదు. చలనచిత్ర విజయం.  శ్రీకాంత్, జగపతి బాబు, నితిన్ మెహతా ఇలా అందరూ ఎంతో బాగా నటించారు. ప్రగ్యా జైస్వాల్‌కు టాలెంట్‌తో పాటు అందం కూడా ఉంది. అభిమానులను ఎలా రెచ్చగొట్టాలో.. థియేటర్లో రచ్చ రచ్చ చేయించాలో బోయపాటికి, నాకు తెలుసు. స్టన్ శివ మంచి ఫైట్స్ కంపోజ్ చేశారు. ఆయన చెప్పినట్టుగా.. దర్శకుడు కూడా ఓ ఫైట్ మాస్టర్. మంచి సినిమా కోసం ప్రేక్షకులు ఎదురుచూశారో.. మేం కూడా ఎదురుచూశాం. మా నిర్మాతలు కూడా ఎదురుచూశారు. కానీ మా నిర్మాత ఎప్పుడూ భయపడలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా సినిమాను విడుదల చేసినందుకు నా కృతజ్ఞతలు. ఎక్కడా రాజీ పడకుండా సినిమాను నిర్మించినందుకు నా తరుపున, నా అభిమానుల తరుపున కృతజ్ఞతలు. ఇలాంటి వేడుకలు మనం ఇంకా జరుపుకోవాలి. మనం అంటే పరిశ్రమను. మంచి సినిమాలను ఆదరించాలి. అఖండ సినిమాను ఘన విజయం చేసిన ప్రతీ ఒక్కరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను’ అని అన్నారు.