అమిగోస్ మూవీ రివ్యూ

Published On: February 10, 2023   |   Posted By:

అమిగోస్ మూవీ రివ్యూ

Emotional Engagement Emoji 

బింబిసార వంటి సూపర్ హిట్ తర్వాత కళ్యాణ్ రామ్ నటించిన సినిమా కావడంతో అమిగోస్ మీద అంచనాలు ఏర్పడ్డాయి. అందులోనూ బింబిసారలో కళ్యాణ్ రామ్ నెగిటివ్ షేడ్ రోల్ చేస్తే, ఇందులో విలన్ రోల్ చేశారు. ఇలా ఈ చిత్రం ట్రైలర్‌లో దర్శకుడు రాజేంద్ర రెడ్డి హింట్స్ ఇచ్చారు. సినిమాలో మరి ఆ సస్పెన్స్ ఎలా మైంటైన్ చేశారు? అసలు ఈ చిత్రం కథేంటి కళ్యాణ్ రామ్ కు మరో బింబి సార స్దాయి హిట్ దొరికినట్లేనా ?

స్టోరీ లైన్ :

బిజినెస్ చేసుకునే సిద్ధార్థ్‌ (కల్యాణ్‌రామ్‌) రేడియో జాకీగా పని చేసే ఇషికా (ఆషికా రంగనాథ్‌) తో ప్రేమలో ఉంటాడు. అది ముందుకు వెళ్లదు. అదే టైమ్ లో సిద్ధార్థ్‌ డోపెల్‌గ్యాంగర్ అనే వెబ్ సైట్ వల్ల తనలాగే మరో ఇద్దరు మంజునాథ్, మైఖేల్‌ ఉన్నారని తెలుసుకుని వాళ్లతో టచ్ లోకి వెళ్తాడు. గోవాలో సిద్దార్ వాళ్లను కలుసుకుంటాడు తక్కువ టైమ్ లోనే క్లోజ్ అవుతారు. అలాగే మంజు, మైఖేల్‌ సాయంతో సిద్ధార్థ్‌ తన ప్రేమను పెళ్లి పట్టాలెక్కిస్తాడు ఆ తర్వాత ఎవరు ఊరికి వారు బయిలుదేరతారు. కానీ అనుకోని విధంగా నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ ఆఫీసర్స్ మంజునాథ్‌పై కాల్పులు జరిపి అతన్ని తమ కస్టడీలోకి తీసుకుంటారు. అప్పుడే సిద్ధార్థ్‌కు మైఖేల్‌ గురించి ఓ షాకింగ్ విషయం తెలుస్తుంది. మైఖేల్‌ ఓ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అని, అతని పేరు బిపిన్‌ రాయ్‌ అని అర్దమవుతుంది. అలాగే అతడిని పట్టుకోవడం కోసమే ఎన్‌ఐఏ వాళ్లు హైదరాబాద్‌కు వచ్చారని కానీ ఒకే పోలికలతో ఉండటంతో బిపిన్‌ కావాలనే మంజుని ఇరికించి తప్పుకున్నాడని అర్దమవుతుంది. అలాగే తాను సమస్యల్లో చిక్కుకున్నట్లు గ్రహిస్తాడు. ఇంతకీ బిపిన్‌ రాయ్‌ ఎవరు? కావాలనే ఈ ఇద్దరి జీవితాల్లోకి అతను వచ్చాడా? బిపిన్ నుంచి వీరిద్దరూ ఎలా తప్పించుకున్నారు? అన్నది మిగతా కథ

విశ్లేషణ :

పాయింట్ గా చాలా కొత్తగా అనిపించే ఈ కథ సరిగ్గా చేస్తే ఇంట్రస్టింగ్ గా నేఉండేది. కానీ పాయింట్ మాత్రమే కొత్తగా చూసుకుని మిగతాదందా పాత,రొటీన్ వ్యవహారంలోకి వెళ్లిపోయాడు డైరక్టర్. కథలోకి చాలా స్పీడుగా వెళ్లిన దర్శకుడు, అరే భలే కొత్తగా ఉందే అనిపించాడు. కానీ రాను రాను మెల్లిమెల్లిగా రొటీన్ లోకి జారిపోయాడు. ఇంట్రవెల్ ట్విస్ట్ సైతం ఊహించగలిగేలా చేసుకున్నాడు. సెకండాఫ్ లో బిపిన్ ప్లాష్ బ్యాక్ ఓపెన్ అయ్యాక ఇంకేమీ లేదనిపిస్తుంది. ఈ కథకు మరో యాంగిల్ అవసరం అనిపిస్తుంది. కేవలం హీరో,విలన్ కథగా చేసేయటంతో పెద్దగా కిక్ ఇవ్వదు. అలాగే విలన్, హీరో మధ్య జరిగే క్యాట్ అండ్ మౌస్ గేమ్ ని థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్, ఎత్తులు పైఎత్తులతో ఆసక్తికరంగా తీర్చదిద్దలేకపోయారు. ప్లాట్ చాలా సాదాసీదాగా,ప్రెడిక్టిబుల్ గా మారటంతో అంతకు ముందు ఓ కొత్త కథ చూస్తున్నాం అనే ఫీల్ మొత్తం పోతుంది. అప్పటికీ యాక్షన్ బ్లాక్ లతో కమర్షియల్ గా వైబులిటీ తెచ్చే ప్రయత్నం చేసారు కానీ అదీ ఫలించలేదు. ఏదైమైనా ఇలాంటి కథలకు కావాల్సిన కొత్త తరహా స్క్రీన్ ప్లే ఈ సినిమాకు సెట్ కాలేదు. కొత్త కథలకు స్క్రీన్ ప్లే మరింత కొత్తగా చెప్పాలిన అవసరం ఉంది. ఓటిటి రోజుల్లో ఎంతో ఇంట్రస్టింగ్ గా చెప్తే కానీ పెద్దగా ఏదీ వర్కవుట్ కావటం లేదు. ఈ సినిమా కూడా అదే సిట్యువేషన్ వెతుక్కుంటూ వెళ్లటం స్క్రిప్టు సమస్యే. దానికి తోడు సిద్ధార్థ్‌ లవ్‌ ట్రాక్‌ను తెరపైకి మధ్య మధ్యలో అడ్డుపడటం కూడా విసిగిస్తుంది.

టెక్నికల్ గా :

దర్శకుడుగా రాజేంద్ర రెడ్డి తొలి సినిమాతో మెప్పించలేకపోయారు. అతన్ని స్వయంగా రాసుకున్న స్క్రిప్టే దెబ్బ కొట్టింది. అయితే డైరక్టర్ గా నటీనటుల నుంచి మంచి అవుట్ ఫుట్ తీసుకున్నారు. ఇక ఇలాంటి యాక్షన్ థ్రిల్లర్స్ కు అవసరమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సైతం వర్కవుట్ కాలేదు. పాటలు సోసోగా ఉన్నాయి. ఎన్నో రాత్రులొస్తాయి రీమిక్స్ బాగున్నప్పటికీ దాని ప్లేస్‌మెంట్‌ సరిగ్గా లేదు. సౌందర్‌ రాజన్‌ కెమెరా వర్క్ మాత్రం నెక్ట్స్ లెవిల్ లో ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకు తగ్గ స్దాయిలో ఉన్నాయి. ఎడిటింగ్ మాత్రం ల్యాగ్ లును వదిలేసింది. డైలాగులు జస్ట్ ఓకే అనిపించాయి.

పెర్ఫార్మన్స్ :

రొటీన్ లో కొట్టుకుపోకుండా విభిన్నమైన చిత్రాలు చేస్తాడు అని కళ్యాణ్ రామ్ పై అభిమానులకు ఓ నమ్మకం. డాపుల్ గ్యాంగర్స్ (మనిషిని పోలిన మనుషులు) స్టోరీ నేపథ్యంలో తెరకెక్కిన అమిగోస్‌ లో కూడా బాగా చేసాడు. మూడు పాత్రల్లో వేరియేషన్స్ బాగా చూపించాడు.హీరోయిన్ అషికా రంగనాధ్ స్క్రీన్ ప్లెజన్స్ బాగుంది కానీ నటన లేదు. బ్రహ్మాజీ, సప్తగిరి వంటి సీనియర్స్ చేసుకుంటూ పోయారు.

బాగున్నవి :

కథకు మూలమైన ఆలోచన
కళ్యాణ్ రామ్ మేకోవర్
సినిమాటోగ్రఫీ

బాగోలేనివి :

సరైన స్క్రిప్టు లేకపోవటం
బోర్ కొట్టే లవ్ ట్రాక్

చూడచ్చా :

మరీ ఎక్కువ ఎక్సపెక్టేషన్స్ పెట్టుకోకుండా చూసేవారికి ఓకే అనిపిస్తుంది. అక్కడక్కాడా వావ్ అనిపిస్తుంది.

మూవీ డీటెయిల్స్ :

బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
నటీనటులు: నందమూరి కల్యాణ్ రామ్, అషికా రంగనాథ్, నితిన్ ప్రసన్న, బ్రహ్మాజీ తదితరులు
మ్యూజిక్: జిబ్రాన్
సినిమాటోగ్రఫి: సౌందరరాజన్
ఎడిటింగ్: తమ్మిరాజు
రచన, దర్శకత్వం: రాజేంద్ర రెడ్డి
నిర్మాతలు: వై రవిశంకర్, నవీన్ ఎర్నేని
రన్ టైమ్ : 139 మినిట్స్
రిలీజ్ డేట్: 10-02-2023