ఆడ‌వారి మాట‌ల‌కు అర్థాలే వేరులే చిత్రంకి ప‌ద‌మూడేళ్లు
 
ఆడవారి మాట‌ల‌కు అర్థాలే వేరులే` బాక్సాఫీస్ అర్థం ఒక్క‌టే.. `బ్లాక్ బ‌స్ట‌ర్`
 
తెలుగు వారి గుండెల్లో నిలిచిపోయిన సూప‌ర్ హిట్ ఫ్యామిలీ సినిమా `ఆడ‌వారి మాట‌ల‌కు అర్థాలే వేరులే` విడుద‌లై సోమవారం రోజు కి (ఏప్రిల్ 27)కి స‌రిగ్గా ప‌ద‌మూడేళ్లు. బాక్సాఫీస్ వ‌ద్ద 30 కోట్ల వ‌సూళ్లు సాధించి విక్ట‌రీ వెంక‌టేష్ కెరీర్ లో మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచింది. సెల్వ రాఘ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ సాయి దేవా ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై ఎన్.వి.ప్ర‌సాద్- శానం నాగ అశోక్ కుమార్ నిర్మించిన చిత్ర‌మిది. యువ‌న్ శంక‌ర్ రాజా సంగీతం.. బాల‌మురుగ‌న్ ఫోటోగ్ర‌ఫీ హైలైట్.
 
క్లాసిక్ `మిస్స‌మ్మ` సినిమాలో ఔనంటే కాద‌నిలే కాదంటే ఔన‌నిలే  పాట స్ఫూర్తి.. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఖుషీ సినిమాలోని పాట స్ఫూర్తితో ఎంపిక చేసిన టైటిల్ జ‌నాల‌కు చేరువైంది. టైటిల్ కి త‌గ్గ‌ట్టే అదే ఫిలాస‌ఫీతో తెర‌కెక్కిన చిత్ర‌మిది. వెంకీ అంత‌కుముందు చేయ‌ని పాత్ర‌నే లేదు. కానీ ప్రేమ‌క‌థ‌లు.. ఫ్యామిలీ ఎమోష‌న్స్ తో చేస్తే ఆ రేంజే వేరు. క‌ల్ట్ స్పెష‌లిస్ట్ సెల్వ రాఘ‌వ‌న్ ఓ స్టార్ హీరోతో తెలుగులో చేసిన ఏకైక సినిమా కూడా ఇదే. వెంకీ-త్రిష కాంబో ప్రేక్ష‌కుల‌కు విప‌రీతంగా న‌చ్చింది. అలాగే క‌ల‌ర్స్ స్వాతి పాత్ర‌.. అప‌రిప‌క్వ ప్రేమ క‌థ యూత్ ఆలోచ‌న‌ను ప్ర‌తిబింబించింది. వెంకీ- కోట కాంబినేష‌న్ సీన్స్ బాగా పండాయి. శ‌త్రువు-గ‌ణేష్- ఇంట్లో ఇల్లాలు-వంటింట్లో ప్రియురాలు.. చిత్రాల్లో ఆ ఇద్ద‌రి పాత్ర‌లు పోటాపోటీగా ఉంటాయి. ఇందులోనూ అలాగే కుదిరాయి. కోట ఉత్త‌మ క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా సంతోషం అవార్డ్ స‌హా ఎన్నో అవార్డులు అందుకుంటే.. వెంకీకి ఉత్త‌మ న‌టుడిగా నంది అవార్డుతో పాటుగా ఉత్తమ ప్రేక్షకాదరణ పొందిన పూర్తి వినోదాత్మక చిత్రంగా కూడా నంది అవార్డును 2007 సంవత్సరానికి గాను 2009వ సంవత్సరం అందుకున్నచిత్రమిది. ఇంకా ఉత్తమ నటుడిగా విక్టరీ వెంకటేష్ సంతోషం అవార్డ్ అందుకున్నారు. ఈ మూవీ ప‌లు భాష‌ల్లోకి రీమేకైంది. త‌మిళంలో యారాది నీ మోహిని.. క‌న్న‌డ‌లో అంతు ఇంతు ప్రీతి బంతు.. భోజ్ పురిలో మెహందీ ల‌గా కే ర‌ఖ్ నా.. ఒరియాలో ప్రేమ అందే అక్ష‌ర పేరుతో రీమేకై అక్క‌డా విజ‌యం సాధించింది.