తెలుగు సినీ పాత్రికేయ చరిత్ర పుస్తాకావిష్కరణ

Published On: October 9, 2023   |   Posted By:

తెలుగు సినీ పాత్రికేయ చరిత్ర పుస్తాకావిష్కరణ

తెలుగు సినీ పాత్రికేయ చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించిన మెగాస్టార్ చిరంజీవి

భారతీయ తొలి సినిమా పత్రిక విశేషాలు మొదలుకుని ఆ తర్వాత పరిణామ క్రమంలో పనిచేసిన అలనాటి సినీ జర్నలిస్టుల నుంచి నేటి సినీ జర్నలిస్టుల వరకు సమాచారాన్ని శోధించి, సేకరించి సీనియర్ సినీ జర్నలిస్ట్ వినాయకరావు రచించిన తెలుగు సినీ పాత్రికేయ చరిత్ర పుస్తకాన్ని మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించారు.

హైదరాబాద్ లోని తన నివాసంలో జరిగిన కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి ఈ పుస్తకాన్ని విడుదల చేశారు.

ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ, నా కెరీర్ మొదట్నుంచి సినీ రచయితలు, జర్నలిస్టులతో నాకు విడదీయలేని అనుబంధం ఉంది. జర్నలిస్టుల పెన్నుకు ఉన్న పవర్ అంతాఇంతా కాదు. దాని ద్వారా ఎంత మంచి అయినా చెప్పొచ్చు. అయితే ఒక్కోసారి వాస్తవానికి దూరంగా కొందరు జర్నలిస్టులు రాసిన వార్తలు దుమారం సృష్టిస్తుంటాయి. నా మటుకు నేను కూడా కొన్ని వార్తల కారణంగా కలత చెందిన సందర్భాలు లేకపోలేదు. ఎప్పుడో వచ్చిన ఆ వార్తల తాలూకు ప్రభావం నేటికీ వెంటాడుతూనే ఉండటం బాధాకరం. మరోవైపు నా తప్పులను ఎత్తిచూపి, వాటిని నేను సరిదిద్దుకునేందుకు ప్రేరణ కలిగించిన గుడిపూడి శ్రీహరి వంటి జర్నలిస్టులు ఎంతోమంది లేకపోలేదు. అందుకే పెన్ను పవర్ కలిగిన జర్నలిస్టులు వాస్తవాలను ప్రతిబింబిస్తూ బాధ్యతగా ముందుకు సాగినపుడు ఎందరికో స్ఫూర్తిదాయకమవుతుంది అంటూ తన జీవితంలో తాను ఎదుర్కొన్న రెండు ఘటనలను ఈ కార్యక్రమంలో ఉదహరించారు.

అలాగే తన మాటలలో రచయితల గురించి కూడా చిరంజీవి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూనేను దర్శక, నిర్మాతలతో కూర్చుని మాట్లాడినప్పటికీ, అంతకన్నా ఎక్కువగా రచయితలతో కూర్చుని సంభాషిస్తుంటాను. గతంలో గొల్లపూడి, జంధ్యాల, సత్యమూర్తి, సత్యానంద్ వంటి వారితో తరచూ సంభాషించేవాడిని. అదే అలవాటు నేటికీ ఉంది. రచయితలకు, జర్నలిస్టులకు నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంది. సందర్భానుసారం వారి గౌరవాన్ని మరింత ఇనుమడింప చేయాలన్న సంకల్పంతో వారి ఇళ్ల వద్దకే వెళ్లిన సందర్భాలు అనేకం ఉన్నాయి అని అన్నారు.

ఇంకా చిరంజీవి మాట్లాడుతూ, జర్నలిస్ట్ వినాయకరావు
ఏ పుస్తకం రాసినా కూలంకషంగా చర్చిస్తూ, లోతుల్లోకి వెళ్లి రాయడం ఆయనకు అలవాటు..అలాగే అరుదైన ఫోటోలు సేకరిస్తుంటాడు. ముందు తరాలను దృష్టి లో పెట్టుకుని అతను చేసే ప్రయత్నం అభినందనీయం..ఎన్టీఆర్ గారి గురించి, దాసరి గారి గురించి, కృష్ణ గారి గురించి , నా గురించి ఎన్నో అరుదైన పుస్తకాలు రాశాడు. ఇలాంటి వాళ్ళు పుస్తకాలను రాసే ప్రయత్నాన్ని మానుకోకూడడు. నేను కూడా ఈ పుస్తకాన్ని కొంటున్నాను అని అన్నారు.

పుస్తక రచయిత, సీనియర్ జర్నలిస్ట్ వినాయకరావు మాట్లాడుతూ, నేను రాసిన పన్నెండవ పుస్తకం ఇది. జర్నలిస్టులగా మన చరిత్రను మనం ఎందుకు చెప్పుకోకూడదు అన్న ఆలోచన నుంచి పుట్టిన పుస్తకం ఇది. టాకీ కాలం మొదలైనప్పట్నుంచి నాటి సినీ జర్నలిస్టుల మొదలుకుని నేటి సినీ జర్నలిస్టుల వరకు సమాచారాన్ని ఇందులో అందించాను. బి.కె. ఈశ్వర్, ట్రేడ్ గైడ్ వెంకటేశ్వరరావు వంటి వారు నాకు ఎంతో సహకారాన్ని అందించారు. ఈ పుస్తకాన్ని తీసుకుని రావడానికి నాలుగేళ్లు పట్టింది. సమాచార సేకరణ కోసం ఊళ్లు పట్టుకుని తిరిగి, కుటుంబానికి సమయం వెచ్చించలేక ఎంత కష్టపడ్డా, తగిన ప్రోత్సాహం లభించకపోవడం వల్ల ఇక నుంచి పుస్తకాలు రాయకూడదని నిర్ణయించుకున్నాను అని అన్నారు.
దీనిపై వెంటనే చిరంజీవి స్పందిస్తూ, మీ లాంటి వాళ్లు పుస్తకాలు రాయడం ఆపకూడదు. నిరాశ పడవద్దు. తప్పకుండా ఆర్థిక భారం పడకుండా స్పాన్సర్స్ దొరుకుతారు. మీ మాటను వెనక్కి తీసుకోవాలి అని చిరంజీవితో పాటు అక్కడ ఉన్న జర్నలిస్టులు పట్టుబట్టడంతో వినాయకరావు తన మాటను వెనక్కి తీసుకుని మరో కొత్త పుస్తకానికి పూనుకుంటానని అన్నారు.

ఈ కార్యక్రమానికి సీనియర్ జర్నలిస్ట్ ప్రభు స్వాగతం పలుకగా వినాయకరావు రాసిన వివిధ పుస్తకాలను వివరిస్తూ, ఈ పుస్తక విషయాలను మరో సీనియర్ జర్నలిస్ట్ రెంటాల జయదేవ్ సభలో ప్రస్థావించారు. చిరంజీవి ఇంటి ప్రాంగణంలో ఆహ్లాదభరిత వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.